పసందుగా.. పన్నీర్!


Thu,September 12, 2019 04:58 AM

panner
వెజిటేరియన్స్‌కి టాప్ లిస్ట్‌లో ఉండేది.. నాన్‌వెజిటేరియన్స్‌నీ కట్టి పడేసేది.. ఏదైనా ఉందంటే.. అది కచ్ఛితంగా పన్నీరే. నార్త్ ఇండియన్సే కాదు.. సౌత్ ఇండియన్స్ కూడా.. పన్నీర్ ప్రేమికులే అంటే అతిశయోక్తి కాదేమో..పైగా కొవ్వు కరిగించే శక్తి పన్నీర్‌కి ఉందని ఒక అధ్యయనం చెబుతున్నది.. దీంతో పన్నీర్ ఇష్టపడే వారి సంఖ్య మరింత పెరిగింది.. అందుకే ఆ స్పెషల్ పన్నీర్ వంటకాలు మీరూ టేస్ట్ చేయండి..
panner1

పన్నీర్ పులావ్

కావాల్సినవి :
పన్నీర్ : 200 గ్రా.
నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్
కారం : 2 టీస్పూన్స్
పచ్చిమిర్చి : 6
అల్లం, వెలుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్
గరం మసాలా పొడి : అర టీస్పూన్
కొత్తిమీర : చిన్న కట్ట
బాస్మతీ రైస్ : 200 గ్రా.
యాలకులు : 2
లవంగాలు : 2
దాల్చినచెక్క : 2
టమాటాలు : 2
ఉల్లిగడ్డ : 1
ధనియాల పొడి : ఒక టీస్పూన్
పుదీనా : 4 రెమ్మలు
పెరుగు : ఒక కప్పు
బిర్యానీ ఆకు : 2
ఉప్పు, నూనె : తగినంత

తయారీ :
బాస్మతీ రైస్‌ని కడిగి పెట్టుకోవాలి. ఒక పెద్ద గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. దీంట్లో యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ఇందులో టమాటా ముక్కలు వేసి మగ్గించాలి. ఇప్పుడు ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, ఉప్పు, పెరుగు వేసి రెండు నిమిషాలు ఉడికించాలి. తర్వాత పన్నీర్ ముక్కలు, బాస్మతీ రైస్ వేసి జాగ్రత్తగా కలుపాలి. ఇందులో తగినంత నీరు పోసి కలుపాలి. కొత్తిమీర, పుదీనా వేసి సన్నని సెగపై 15నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. అంతే.. వేడి వేడి పులావ్ మీ ముందుంటుంది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది.
panner2

పన్నీర్ వేపుడు

కావాల్సినవి :
పన్నీర్ : 200 గ్రా.
శనగపిండి : 2 టేబుల్‌స్పూన్స్
కరివేపాకు : 2 రెమ్మలు
ఉల్లిగడ్డ : 1, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్
పచ్చిమిర్చి : 4, పచ్చిమిర్చి పేస్ట్ : ఒక టీస్పూన్
ధనియాల పొడి : అర టీస్పూన్
కారం : పావు టీస్పూన్
గరం మసాలా పొడి : అర టీస్పూన్
కొత్తిమీర : చిన్న కట్ట
ఉప్పు, కారం : తగినంత

తయారీ :
పన్నీర్‌ని డైమండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. దీంట్లో శనగపిండి, ఉప్పు వేసి, కొంచెం నీరు పోసి నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఉల్లిగడ్డను ముక్కలుగా కట్ చేసి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిగడ్డ పేస్ట్, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసనపోయే వరకు వేయించాలి. దీంట్లో పచ్చిమిర్చి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పొడి, కారం, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఇవి వేగాక.. పై నుంచి పచ్చిమిర్చి చీలికలు చేసి వేయాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కలిపి ఒక నిమిషం వేగనిచ్చి దించేయాలి. రోటీతో తింటే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది.

panner3

చుక్కకూర పన్నీర్

కావాల్సినవి :
పన్నీర్ : 200 గ్రా., పచ్చిమిర్చి : 6,అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, చుక్కకూర : 4 కట్టలు, జీలకర్ర : అర టీస్పూన్, ఉల్లి పేస్ట్ : ఒక కప్పు, ధనియాల పొడి : అర టీస్పూన్, కారం : పావు టీస్పూన్, గరం మసాలా పొడి : పావు టీస్పూన్, కొత్తిమీర : ఒక కట్ట , పసుపు : పావు టీస్పూన్, క్రీమ్ : 2 టీస్పూన్స్, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :
చుక్కకూర శుభ్రం చేసి, సన్నగా తరిగి పెట్టుకోవాలి. పన్నీర్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కడాయిలో నూనె పోసి జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, ఉల్లి ముద్ద వేసి దోరగా వేయించాలి. దీంట్లోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి. ఇప్పుడు సన్నగా తరిగిన చుక్కకూర వేసి సన్నని సెగపై మగ్గనివ్వాలి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా పొడి, ధనియాల పొడి, కారం వేసి కొంచెం సేపు ఉడికించాలి. ఆ తర్వాత పన్నీరు ముక్కలు వేసి కలుపాలి. రెండు నిమిషాలు సన్నని సెగపై ఉంచాలి. ఇందులోనే కొంచెం నీరు పోసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. చివరగా ఫ్రెష్ క్రీమ్ వేసి ఒక నిమిషం ఉంచి దించేయాలి. దీన్ని రైస్‌తో పాటు సర్వ్ చేస్తే యమ టేస్టీగా ఉంటుంది.
panner4

నీలగిరి పన్నీర్

కావాల్సినవి :
పన్నీర్ : 200 గ్రా.
పెరుగు : 2 టీస్పూన్స్
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : అర టీస్పూన్
ఆవనూనె : అర టీస్పూన్
గరం మసాలా పొడి : పావు టీస్పూన్
చాట్‌మసాలా : చిటికెడు
కొత్తిమీర : 2 కట్టలు
పుదీనా : ఒక కట్ట
పచ్చిమిర్చి : 4, ఉల్లిగడ్డ : 1
టమాటా : 1, క్యాప్సికం : 1
ధనియాల పొడి : పావు టీస్పూన్
నూనె : అర టీస్పూన్
నెయ్యి : అర కప్పు
ఉప్పు : తగినంత

తయారీ :
కడాయిలో నూనె పోసి కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి దోరగా వేయించి చల్లార్చాలి. దీన్ని పేస్ట్‌లా చేసుకోవాలి. పన్నీర్‌ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో పెరుగు వేసి.. అందులో పుదీనా పేస్ట్, అల్లం, వెల్లుల్లి పేస్ట్, ఆవనూనె, చాట్‌మసాలా, గరం మసాలా పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ ముక్కలు వేసి గంట పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఒక్కొక్క పన్నీర్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, టమాటా ముక్కలను చువ్వలకు గుచ్చాలి. వీటిని పెనం మీద నెయ్యి వేసి నాలుగు వైపులా తిప్పుతూ దోరగా వేయించాలి. మింట్ చట్నీతో వీటిని తింటే ఆ టేస్టే వేరు.

panner5

456
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles