సరికొత్త సాగులో విజయవంతం!


Thu,September 12, 2019 04:50 AM

aquaponics-farm
ఆరోగ్యకరమైన కూరగాయలను అందించడంతోపాటు, మహిళలకు ఉపాధి కల్పించడానికి ఈ మహిళ శ్రీకారం చుట్టింది. అందుకోసం ఉద్యోగాన్నే వదిలేసింది. నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లోని గృహిణులకు సరికొత్త వ్యవసాయ విధానాలను పరిచయం చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచుతున్నది.


కేరళలోని కోజికోడ్‌కు చెందిన రేఖ రష్మిక అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి తక్కువ స్థలంలో ఎక్కువగా పండించే విధానాలను పరిచయం చేస్తున్నది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసిన రేఖకు వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగింది. ఉద్యోగాన్ని వదిలేసిన రేఖ ఆక్వాపోనిక్ వ్యవసాయ విధానం గురించి అన్వేషించడం మొదలు పెట్టింది. అందుకోసం చాలామంది రైతులను కలిసి వారు అనుసరిస్తున్న విధానాల గురించి తెలుసుకున్నది. యూట్యూబ్, గూగుల్లో అందుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది. అన్నపూర్ణ ఆక్వాపోనిక్స్ పేరుతో తన ఇంటిపైన ఉన్న ఖాళీ స్థలంలో చేపల పెంపకంతోపాటు, ఆరోగ్యకరమైన పంటలను సాగు చేయడం ప్రారంభించింది. రేఖ రష్మిక 40 వేల లీటర్ల వాటర్ ట్యాంకులో 4 వేల టిలాపియ జాతి చేపలను పెంచింది. ఆ ట్యాంకుకు మరికొన్ని పైపులను అనుసంధానం చేసింది. అనుసంధానం చేసిన పైపులకు చిన్న రంధ్రాలు పెట్టి, వాటి నుంచి ఆకు కూరలకు ఆ నీరు అందేలా ఏర్పాటు చేసింది. అలా కొద్దిరోజులకే రేఖ అత్యధిక ఫలసాయాన్ని సాధించింది. ఈ విధానంలో ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడలేదు.

తక్కువ స్థలంలో.. తక్కువ నీటితో రెండు మూడురెట్ల ఫలసాయాన్ని పొందవచ్చు. దీనినే ఆక్వాపోనిక్స్ పద్ధతి అంటారు. ఈ విధానం ద్వారా పెరట్లోనూ, ఇంటిపై ఉన్న ఖాళీ స్థలంలోనూ ఎటువంటి పంటలు పండించుకోవచ్చో గృహిణులకు అవగాహన కల్పిస్తున్నది రేఖ. అందుకోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ సరికొత్త విధానాలతో ఆర్గానిక్ పంటలతోపాటు, ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తున్నది. ఆమె చేస్తున్న సరికొత్త విధానంతో ఎక్కువ లాభాలుండడం వల్ల కేరళలోని పలు నగరాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారంతా ఇప్పుడు ఆక్వాపోనిక్స్ పద్ధతినే అనుసరిస్తున్నారు. రేఖ చేస్తున్న సేవలను గుర్తించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు ఉత్తమ మహిళా రైతు పురస్కారాన్ని అందించింది.

394
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles