ఫేస్‌బుక్ అడ్డా.. పేదల పెద్దబిడ్డ


Wed,September 11, 2019 01:01 AM

లైక్‌లు, షేర్లు, కామెంట్లు. సామాజిక మాధ్యమాల్లో యువత ఎక్కువ సమయం వెచ్చించేది వీటికే. కానీ కొందరు వీటిద్వారా మంచి కూడా చేస్తుంటారు. లైకులే కాదు పక్కోడి సమస్య గ్రహించిన వారికి ఎన్నో వెతలు.. మరెన్నో కన్నీటి కథలు కనిపిస్తాయి. గూడు లేక కొందరు.. శరీరాన్ని తింటున్న అనారోగ్యంతో ఇంకొందరు. చదువు కొనలేక ఫీజులు కట్టలేనివారు మరికొందరు. ఆపతిలో ఉన్న కొందరికైనా సోపతిగా నిలువాలనుకున్నాడొక సేవకుడు. దాతల ద్వారా కొంతమందికైనా విద్య, వైద్యం, గృహం అందించేందుకు కృషి చేస్తున్నాడు. కష్టాన్ని కళ్లకు కడుతూ.. సాయాన్ని సమానంగా పంచుతున్న రేణికుంట రమేశ్ పరిచయమిది.
r-ramesh
అది 2015. కరీంనగర్ జిల్లా ధర్మపురి సమీపంలోని బుర్దేశ్‌పల్లి. మెదడు సంబంధిత వ్యాధితో ఎనిమిదేళ్ల చిన్నారి బాధపడుతున్నది. ఆమె పేరు వైష్ణవి. వాళ్ల కుటుంబం ఒక్కరోజు పనిమానేస్తే తెల్లారి పస్తులుండాల్సిందే. చిన్నారి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నది. ఉన్న ఆస్తులన్నీ అమ్మి వైద్యం చేయించినప్పటికీ తల్లిదండ్రులకు మిగిలింది నిరాశే. శస్త్రచికిత్సకు రూ.3 లక్షలు అవసరం. పేరున్న చోటల్లా చేయిచాపారు. చివరికి దేవుడిపై భారం వేసి ఊరుకున్నారు. ఆనోటా ఈ నోటా విషయం ధర్మపురికి చెందిన జీవిత బీమా సంస్థ ఏజెంట్ రేణికుంట రమేశ్ చెవిన పడింది. కేవలం మూడు లక్షల కోసం పసిపాప నవ్వులు మాయమవ్వాలా? ఇల్లూ, ఇల్లూ తిరిగైనా ఇంటికో వంద రూపాయలు జమచేసైనా వైద్యం అందించి ఆ చిన్నారి మొఖంలో నవ్వును చూడాలకున్నారు.


మొదటి పోస్ట్

2015 ఆగష్టు 6: వైష్ణవి పూర్తి ఆరోగ్య పరిస్థితిని గమనించారు రమేశ్. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. ఆ వెంటనే వైష్ణవి అనారోగ్యం, కుటుంబ పరిస్థితిపై సాయం చేయాలని ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టారు. రమేశ్ అక్షరాల్లో నిజాయితీ కనిపించడంతో మంచి స్పందన వచ్చింది. వేల మంది ఆ పోస్టును షేర్ చేశారు. స్థానికులు, తెలుగు రాష్ర్టాలకు చెందిన ఎన్నారైలు స్పందించారు. రెండు నెలల్లోనే రూ.9 లక్షల 6 వేలు జమయ్యాయి. విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లింది. తెలంగాణ ప్రభుత్వం వైష్ణవికి ఉచితంగా వైద్యం అందించింది. దాతల ద్వారా జమ అయ్యిన మొత్తంలో కొంత నగదును ఆ చిన్నారి చదువు కోసం ఇచ్చారు. మిగతా నగదును వైష్ణవి పేరుమీద ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. దాతల సహాయం ద్వారా ఒక పసిపాప ప్రాణమైతే నిలబడింది. కానీ రమేశ్ పాత్ర ఇంతటితో ముగిసిపోలేదు.

రెండు నెలల అనంతరం..

వైష్ణవికి సాయమందిన విషయాన్ని సైతం రమేశ్ ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఆ తర్వాత స్థానికులు, ఎన్నారైలు ఫోన్ చేసి ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ఆపొద్దు. ఇలాంటి వారెందరో ఉన్నారు. వారందరినీ గుర్తించండి. వారికి మేం సాయమందిస్తాం అని రమేశ్‌తో అన్నారు. ఆ తర్వాత విద్య, వైద్యంలో ఎంతోమందికి సాయం అందించారు. ఏడాదిన్నర క్రితం ధర్మపురి మండలం బూర్గుపల్లె గ్రామానికి చెందిన సౌదాని కొమురక్క వ్యాధి (Guillain Barre syndrome) బారిన పడింది. కాళ్లు, చేతులు, మాట పడిపోయింది. విషయం తెలుసుకున్న రమేశ్ ఎన్నారై మిత్రుల సాయంతో రూ.1.26 లక్షలు సాయం అందించారు. 19 నెలల చికిత్స అనంతరం ఆమె పూర్తిగా కోలుకున్నది. ప్రస్తుతం కూలీ పనులకు వెళ్తున్నది. ఇలా ఎంతోమందికి వైద్యం అందించడంలో సాయం చేశారు రమేశ్.

నీడను ఇచ్చేందుకు..

మొదటి ఇల్లు 2016లో కట్టించారు. ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందిన బూదమ్మ భర్త మరణించడంతో ఆమె పాకలో ఉంటున్నది. ఆమెకు నీడనిచ్చేందుకు రమేశ్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. స్పందించిన చిరంజీవి అభిమానులు హైదరాబాద్‌కు చెందిన జీవీ దుర్గారావు మిత్రులు ఇల్లు కట్టించారు. ముడతలు పడ్డ మొఖంలో నవ్వు చూశాం.. ఆమె చివరి ప్రయాణం వరకు ఆనందంగా ఉంటే మాకదే చాలు అని వారన్న మాటలు ఇప్పటికీ తనకు గుర్తున్నాయని రమేశ్ చెబుతుంటారు. ఇలా అనేకమంది పేదల ముఖాల్లో చిరు నవ్వును చూస్తున్నారు రమేశ్, తెలుగు రాష్ర్టాల ఎన్నారైలు.

అర్హులను గుర్తిస్తారిలా...

రమేశ్ ఫేస్‌బుక్‌లో పెడుతున్న పోస్టులకు విపరీతమైన స్పందన వస్తున్నది. తమకు సాయం అందించాలని చాలామంది ఆయనను సంప్రదిస్తున్నారు. ఆపదలో ఉన్నాం ఆదుకోండి అని ఎవరు అడిగినా రమేశ్ ముందు ఎంక్వైరీ చేస్తారు. పూర్తిగా పేదలు, సాయం అందుకోకపోతే వేరే మార్గం లేదు అని నిర్ధారించుకున్నాక ప్రతినెల మొదటి వారం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్తారు. నిజమే అని నిర్ధారించుకున్న తర్వాత ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తారు. బాధితుల బ్యాంకు ఖాతా వివరాలను ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తారు. దాతలు నేరుగా బాధితుడి అకౌంటులో డబ్బులు జమచేస్తారు. వైద్యం కోసమైతే ఆసుపత్రి బిల్లులను బట్టి చెల్లిస్తారు. విద్యా సంబంధిత సాయమైతే ఇన్‌స్టిట్యూషన్ పేరు మీద డీడీ తీసి ఇస్తారు. ఇంటి నిర్మాణం కోసమైతే ప్రత్యేకంగా తన బృందంతో ఇల్లు నిర్మించి ఇస్తారు. ఆ తర్వాత సాయం చేసిన వారి వివరాలు, ఎంత సాయం చేశారు, ఎవరెవరికి సాయం అందింది అనే విషయాలన్నీ ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తారు.

r-ramesh2

40 రోజుల్లో ఇల్లు

ఇంటి నిర్మాణ పనులు చూసుకునేందుకు రమేశ్‌కు ఓ బృందం ఉంది. ఇందులో ప్లంబర్, పెయింటర్, మేస్త్రీ, కూలీలు ఉంటారు. సేకరించిన విరాళాలతో లబ్ధిదారు భూమిలోనే ఇంటి పనులు ప్రారంభిస్తారు. ఈ పనులన్నీ రమేశ్ దగ్గరుండి పర్యవేక్షిస్తారు. ఇంటికి పునాది వేసిన రోజు నుంచి గృహ ప్రవేశం చేసేంత వరకు పనులు దగ్గరుండి చూసుకుంటారు. ఇంటి నిర్మాణం మొత్తం 40 రోజుల్లో పూర్తవుతుంది. జిల్లా అధికారుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా గృహప్రవేశం కూడా జరిపిస్తారు. వీరు కట్టించే ఇంట్లో రెండు గదులు, బాత్రూం, లెట్రిన్ ఉంటాయి. ఇతరుల ఇండ్ల నిర్మాణాల్లో సైతం పూర్వపు లబ్ధిదారులకు కూలీ కల్పించి కొందరికి ఉపాధినందిస్తున్నారు.

r-ramesh3

తెలుగు ఎన్నారైల సేవ మరువలేనిది!

నాకున్న పరిధిలో సమస్యను గుర్తించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నా. పరోక్షంగా పేదలకు చేయూతనందిస్తున్నాననే సంతృప్తి మిగులుతున్నది. తెలుగు రాష్ర్టాల ఎన్నారైలు చేస్తున్న సేవ మరువలేనిది. జగిత్యాలకు చెందిన సత్యసాయి అభయహస్తం సభ్యుల ప్రోత్సాహం ఎంతో ఉంది. స్థానికులు, మిత్రుల సాయంతో పేదల ముఖాల్లో చిరునవ్వును చూస్తున్నా. సేవల్ని మరింత విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాం. మాతో కలిసి నడుస్తున్న ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
- రేణికుంట రమేశ్, ధర్మపురి

21 ఇండ్ల నిర్మాణం

2015 నుంచి ఫేస్‌బుక్ వేదికగా రమేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పోస్ట్ చేస్తున్నారు. ఆయన పోస్టుకు స్పందించి తెలుగు ఎన్నారైలు, దాతలు లక్షల్లో విరాళాలు అందిస్తున్నారు. వీరంతా కలిసి ప్రతి నెల ఒకటి లేదా రెండు కుటుంబాలకు సాయం అందిస్తుంటారు. నాలుగేండ్లలో ఇప్పటివరకు 20 ఇండ్లు నిర్మించి ఇచ్చారు. ప్రస్తుతం మరొక ఇంటి నిర్మాణం ముగింపు దశలో ఉన్నది. ఇప్పటి వరకు ఎన్నారైల ద్వారా రూ. 79 లక్షల విరాళాలు వచ్చాయి. మొత్తం 59 కుటుంబాలకు విద్య, వైద్యం, గృహ సాయం అందింది. ఫేస్‌బుక్ పోస్ట్‌లతో సంబంధం లేకుండా తమ పుట్టినరోజు, వివాహ వేడుకల సందర్భంగా పశ్చిమగోదావరి, జగిత్యాల, హైదరాబాద్‌కు చెందిన దాతలు పేదలకు ఇండ్లు కట్టించి ఇచ్చారు. ఇలా ఇప్పటి వరకు ఎనిమిది ఇండ్లు కట్టించారు.

-పడమటింటి రవికుమార్

1894
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles