ఆస్‌బెస్టాస్‌తో ఊపిరితిత్తులకు ప్రమాదమా?


Mon,September 2, 2019 01:01 AM

నా వయసు 45 ఏండ్లు. చాలాకాలంగా పొడి దగ్గు సమస్యతో బాధపడుతున్నాను. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారుతున్నది. డాక్టర్‌కు చూపిస్తే లంగ్‌లో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. మందులు వాడినా ఫలితం లేదు. మా ఇంటికి దగ్గర్లో ఒక ఆస్‌బెస్టాస్ సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. దానితో ఊపిరితిత్తులు పాడవుతాయా? దయచేసి తెలుపగలరు.
-జి. రామారావ్, నల్లగొండ

Counselling
మీ ఇంటికి దగ్గర్లో ఉన్న ఆస్‌బెస్టాస్ సిమెంట్ కంపెనీ మీ అనారోగ్య పరిస్థితికి కారణం. గాలిలోని ఆస్‌బెస్టాస్ ఖనిజ ధాతువుకు సంబంధించిన పీచు పదార్థాన్ని మీరు గత కొన్నేండ్లుగా పీల్చడం వల్ల అది ఊపిరితిత్తులు, కడుపులోకి చేరి మీసో థీలియోమా అనే జబ్బుకు కారణమయ్యాయి. దీనిని ఆస్ట్‌బెస్టాస్ క్యాన్సర్ అంటారు. గనులు, పరిశ్రమలు లేదా ఆ పదార్థం కలిగి ఉన్న పరిశ్రమల్లో దీర్ఘకాలికంగా పనిచేసేవారికి ఈ తరహా జబ్బులు సోకుతున్నాయి. ఇది ఊపిరితిత్తులకు చుట్టూ ఆవరించి ఉండే కణజాలం పొరను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. మీరు చెప్పే లక్షణాలను బట్టి మీకు ఈ వ్యాధి సోకిందేమో అనే అనుమానం కలుగుతున్నది. ఆలస్యం చేయకుండా పల్మనాలజిస్ట్‌ను లేదా థోరాసిక్ సర్జన్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోండి. సమస్య తీవ్రతను బట్టి మెడిసిన్.. కీమోథెరఫీ.. రేడియేషన్‌లాంటి చికిత్స పద్ధతులు వినియోగిస్తారు. మీకు జబ్బు ఉందని పరీక్షల ద్వారా బయటపడినప్పటికీ అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఈ జబ్బుకు ప్రాథమిక దశలోనే ఉన్నారు. వైద్యరంగంలో వచ్చిన అధునాతన.. సాంకేతిక పరిజ్ఞానంతో మీ సమస్యను పరిష్కరించవచ్చు.

-డాక్టర్ బి. హరికిషన్
-ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్
-యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

363
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles