వ్యాధులతో.. పిల్లలు భద్రం


Mon,August 12, 2019 11:43 PM

పిల్లలకు జలుబు చేసినా ఆందోళనే. అది జలుబేనా? లేక ఏదైనా విష జ్వరమా? అనే భయం. పిల్లల స్పెషలిస్ట్‌కు చూపించాలా? అందుబాటులో ఉండే డాక్టర్‌కు చూపించాలా? సమస్య ఏంటి? చికిత్స ఏంటి? వంటి విషయాలపై అవగాహన ఉంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు. ఇది వ్యాధుల సీజన్. ఏయే వ్యాధులు పిల్లలను వేధిస్తాయి? వాటికి పరిష్కారాలేంటి తెలుసుకుందాం.
vaccination-to-child

ఈ సీజన్‌లో వ్యాధులన్నీ కట్టగట్టుకొని అదును కోసం ఎదురుచూస్తుంటాయి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా పిల్లలపై దాడి చేసి తీవ్ర అనారోగ్యానికి గురిచేస్తాయి. అపరిశుభ్రత వల్ల కొన్ని వ్యాధులు వస్తే.. అజాగ్రత్త వల్ల ఇంకొన్ని వస్తాయి.

ఎలాంటి వ్యాధులు?

డయేరియా, టైఫాయిడ్, కామెర్ల వంటి వ్యాధులు అపరి శుభ్రమైన నీటివల్ల సంక్రమిస్తాయి. డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా వంటివి దోమకాటు వల్ల వస్తాయి. ఈ సీజన్ దోమల సంతతి పెరుగడానికి అనుకూలమైంది. నీటిని.. ఆహారాన్ని కలుషితం చేయడంలో, వ్యాధులను కలిపించడంలోనూ దోమలది పెద్ద పాత్రే. వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండటం, ఎండ తక్కువగా వస్తుండటంతో బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభిస్తుంటాయి. ఇవన్నీ కలిసి మూకుమ్మడిగా దాడి చేయడంతో పిల్లలు వ్యాధుల బారిన పడుతున్నారు. రోజురోజుకూ బాక్టీరియా, వైరస్‌ల వల్ల కలిగే వ్యాధులు పెరిగిపోతున్నాయి.

కారణమేంటి?

జలుబు వంటి చిన్నపాటి సమస్యతో ఈ వ్యాధులు ప్రారంభం అవుతాయి. తర్వాత అవి ముదిరి శ్వాస సంబంధ వ్యాధులకు దారితీస్తుంటాయి. కారణమేంటి? అంటే.. రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న పిల్లల్లో కనిపించే మరొక తీవ్రమైన ఆరోగ్య సమస్య డయేరియా. దీనినే విరేచనాల వ్యాధి అంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రతీ సంవత్సరం ఐదేండ్లలోపు పిల్లలు 1,67,000 మంది విరేచనాల సమస్య వల్ల చనిపోతున్నారు. అంటే.. ఇది ఎంత తీవ్రమైన వ్యాధో అర్థం చేసుకోవచ్చు. అపరిశుభత్ర వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొన్నది.

ఎలా గుర్తించాలి?

చిన్నపాటి ఆరోగ్య సమస్యలే అయినా లక్షణాలు ఎలా మారుతున్నాయో గుర్తించాలి. మార్పులకు అనుగుణంగా చికిత్స చేయిస్తే సమస్యను ప్రాథమిక స్థాయిలోనే పరిష్కరించవచ్చు. ఉదాహరణకు డెంగ్యూ వ్యాధి ప్రారంభ లక్షణాలు సాధారణ వైరల్ జ్వరాల లక్షణాల మాదిరిగానే కనిపిస్తాయి. అయితే మనం ఏమనుకుంటాం? మామూలుగా వచ్చే జ్వరమే అయి ఉండొచ్చు అనుకుంటాం. కానీ డెంగ్యూ వల్ల వచ్చిన జ్వరంతో శరీరమంతా కాలిపోతుంది. వణుకు కూడా పుడుతుంది. ఎముకలు, కీళ్లు, కళ్లు నొప్పిగా ఉంటాయి. కళ్లు, ముఖం ఎర్రబారుతాయి. శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి. ఆయాసంగా అనిపిస్తుంది. ఆకలిగా ఉండదు. మూత్రం తగ్గిపోతుంది. వాంతులవుతాయి. మలంలో రక్తం వస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌కు చూపించాలి.

జాగ్రత్త ముఖ్యం

చికిత్స ఎలాగూ ఉంటుంది కదా అని దేనినీ నిర్లక్ష్యం చేయొద్దు. చికిత్స దాక ఎందుకు? అసలు సమస్య ఎందుకు తెచ్చుకోవాలి? అని ఆలోచిస్తే ఏ సమస్యా దరిచేరదు. ఈ సీజన్‌లో వాతావరణం అస్థిరంగా ఉంటుంది. కొన్ని రోజులు బురదగా.. మరికొన్ని రోజులు దుమ్ముగా ఉంటుంది. కాబట్టి పిల్లలను వేడినీటితో స్నానం చేయించడం మంచిది. వాతావరణం బాగా చల్లగా ఉంటే వేడినీటిలో ముంచిన శుభ్రమైన బట్టతో శరీరమంతా తుడువాలి. మొత్తంమీద చర్మం శుభ్రంగా, పొడిగా ఉండేట్లు చూసుకోవాలి. పసిపిల్లలను దోమతెరలో పడుకోబెట్టాలి. పొగవల్ల పిల్లలు అలర్జీకి గురవుతారు కాబట్టి దానికి దూరంగా ఉండాలి.

వాక్సినేషన్

పసిపిల్లల ఆరోగ్యం కాపాడుకోవడంలో ముఖ్యమైనది వాక్సినేషన్. ముఖ్యంగా అంటువ్యాధుల నుంచి రక్షించుకోవడానికి వ్యాక్సిన్స్ చాలా ఉపయోగపడుతాయి. టైఫాయిడ్, ఇన్‌ఫ్లూయెంజా, రోటావైరస్ డయేరియా, హెపటైటిస్ -ఎ వంటివి వ్యాక్సిన్ ద్వారానే తగ్గిపోతాయి. డెంగ్యూ వ్యాధికి కూడా వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్నారు. పిల్లల స్పెషలిస్ట్‌ను కలిస్తే ఏ సమయంలో.. ఏ వ్యాక్సిన్ ఇవ్వాలో సిఫార్సు చేయగలుగుతారు. వీటిని డాక్టర్ సలహామేరకు వాడాల్సి ఉంటుంది.

ఆలస్యం చేయొద్దు

vaccination-to-child2
పిల్లల్లో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించినా ఆలస్యం చేయొద్దు. తప్పనిసరిగా చిల్డ్రన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాలి. అది వ్యాధి అవునో లేదో తెలుసుకోవడం కోసం రక్తపరీక్షలు చేయించాలి. ఉదాహరణకు డెంగ్యూవ్యాధే అనుకుందాం. రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య వేగంగా తగ్గిపోతుంది. ఎర్రరక్త కణాల సంఖ్య తగ్గిపోతుంది. అది డెంగ్యూ అని డాక్టర్ నిర్ధారించిన తర్వాత ఆలస్యం చేయొద్దు. పిల్లలు చురుకుగా ఉండి, సాధారణ స్థాయిలో తింటున్నా కూడా డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స జరిగితే ఏ వ్యాధి అయినా నయం అవుతుంది.
srinivas

114
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles