విద్యను కానుకగా ఇస్తున్నది!


Sun,August 11, 2019 01:48 AM

రోడ్డుపైన, ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర భిక్షమెత్తుకునే చిన్నారులను చూస్తూనే ఉంటాం. వారిపై ఉన్న జాలితో కొందరు తోచినంత భిక్షమేస్తుంటారు. మరికొందరు ఏవైనా వస్తువులు కానుకగా ఇస్తారు. మరికొందరు వారి ఆకలిని తీర్చుతారు. ఆ వయసులో ఆ పిల్లలకు అవి సరిపోతాయి. మరి వారి భవిష్యత్? జీవితాంతం అలా అడుక్కోవడమేనా? వారికి చదువు చెప్పి ప్రయోజకులను చేస్తే.. వారే మరికొందరికి ఆదర్శమవుతారు. ఓ మంచి సమాజం ఏర్పడుతుంది. సరిగ్గా ఇదే ఆలోచన చేసింది హైమంతి.
Haimanthi-Sen
అది ముంబయి సమీపంలోని కండివలి రైల్వేస్టేషన్. ఆ స్టేషన్ సమీపంలోని స్కైవాక్(నడకదారి) పక్కనే ఉంది ఓ మురికివాడ. అందులోని వారంతా నిరుపేదలే. పైగా మద్యానికి బానిసలైన తల్లిదండ్రులే ఉన్నారు. పిల్లలను బడికి పంపకుండా వాళ్ల అవసరాలు తీర్చడం కోసం భిక్షగాళ్లుగా మార్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ చిరిగిన దుస్తులతో, ముఖానికి మట్టితో భిక్షమెత్తుకునేవారు పిల్లలు. వారిలో కొందరు గంజాయి, సిగరెట్‌కు అలవాటుపడ్డారు. మరికొందరు ఆకలి తీర్చుకోవడం కోసం దొంగతనాలు చేస్తూ బాల నేరస్థులుగా మారుతున్నారు.


అయితే అదే స్కైవాక్‌ను దాటి ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళుతుంది హైమంతి సేన్. చాలాకాలం నుంచి వారిని గమనిస్తున్నది. ఆ పిల్లలు రోడ్డుపైన వచ్చిపోయేవారి వెంట పడుతూ డబ్బులు అడగడం చూసేది. కొందరు చీదరించుకుంటే కొందరు భిక్షమేసేవారు. మరికొందరు అన్నం పెట్టి ఆకలి తీర్చేవారు. ఇక రోజంతా వాళ్లు చేసే పని అదే. ఈ పరిస్థితిని గమనించిన హైమంతికి చాలా బాధ కలిగింది. ఇలాంటి హానికర, అనారోగ్యకర వాతావరణంలో పెరుగుతున్న పిల్లల్ని చూసి చలించిపోయింది. దేశంలో విద్యాహక్కును వినియోగించుకోలేని ఇలాంటి పిల్లలను ఆదుకోవాలనుకునేవారు ఎంతోమంది ఉన్నా, వారికి ఎందుకు విద్య దూరమైందోనని ఆలోచించింది. ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడానికి ఆ పిల్లల కుటుంబాల్ని కలవడానికి వెళ్లింది.. తన వెంట కొందరు పిల్లల్ని తీసుకెళ్లి వీళ్లను స్కూళ్లలో ఎందుకు చేర్చలేదు అనడంతో మేము చేర్పించాం.. వాళ్లే స్కూల్‌కి వెళ్లకుండా తిరుగుతున్నారని చెప్పారు కుటుంబ సభ్యులు.

ఆ సమాధానంతో సంతృప్తి చెందని హైమంతి అప్పుడే ఓ గొప్ప ఆలోచన చేసింది. అయితే రోజుమార్చి రోజు నేను ఇక్కడకు వచ్చి పిల్లలకు చదువు చెబుతాను అన్నది. అయితే ఆ తల్లిదండ్రులు మాత్రం పిల్లలకు చదువుతోపాటు బట్టలు, భోజనం కూడా పెట్టాలని షరతు పెట్టారు. ఆ షరతును సున్నితంగా తిరస్కరించిన హైమంతి.. వారి చదువు చెబుతూ.. కళలు, చేతివృత్తులు, ఇతర నైపుణ్యాలు నేర్పుతాను అని చెప్పింది. అలా.. ఒకటికి రెండుస్లారు ఆ పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి పిల్లలను బడికి పంపేందుకు సంసిద్ధులను చేసింది. స్కైవాక్ మీద, రోడ్ల పక్కన, ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర భిక్షమెత్తుకునే చిన్నారులను చేరదీసి వారిని బడికి పంపింది.

ప్లాన్ జునూన్

హైమంతి సేన్ స్థానిక బడిలో చేర్పించిన పిల్లలు సరిగా బడికి వెళ్లకుండా మళ్లీ భిక్షమెత్తేవారు. స్కూల్‌కు వెళ్లి సంప్రదిస్తే.. పిల్లలు స్కూళ్లో సరిగా ఉండలేకపోతున్నారు. వారి వాల్ల మిగతా పిల్లలకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వారిని తీసుకెళ్లండి అంటూ యాజమాన్యం సమాధానం ఇచ్చింది. దీంతో ఈ పిల్లల్ని తానే స్వయంగా సరిచేయాలని నిర్ణయించుకున్నది హైమంతి. పిల్లలకు శిక్షణ ఇస్తూ, క్రమక్రమంగా బడిపై ఆసక్తిని పెంచాలని నిశ్చయించుకున్నది. ఆఫీస్ ముగిశాక రోజూ గంటపాటు పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించింది. ఇందుకోసం జునూన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించింది. కండివలి రైల్వేస్టేషన్ స్కైవాక్‌నే పిల్లలకు పాఠాలు చెప్పేందుకు వేదికగా చేసుకున్నది. అలా ప్రతి రోజూ పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించింది హైమంతి.

జునూన్‌తో కనిపించిన మార్పు!

వీధిబాలలను ఉత్తమపౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ముందుకొచ్చిన హైమంతిని చాలామంది గమనించారు. ఆ స్కైవాక్ పై వెళ్లే కొంతమంది యువతకు ఆమె సంకల్పం నచ్చింది. తన ఆశయం నచ్చిన కొందరు యువతీయువకులు ఆ ఎన్జీవోలో వలంటీర్లుగా చేరారు. అప్పటి నుంచి జునూన్ సేవలు ఒక ప్రణాళికాబద్ధంగా సాగుతున్నాయి. ప్రతి శని, ఆదివారాలు పిల్లలకు డ్యాన్స్, కళలు, ఇతర నైపుణ్యాలు, చేతివృత్తులపై శిక్షణ ఇస్తారు. మంగళ, గురు, శుక్రవారాల్లో స్కూళ్లలోని పాఠాలు చెబుతారు. బుధవారం మాత్రం పిల్లలు ఈ టీచర్లు చేసే వీధి నాటకాలను చూస్తారు. ఆసక్తి ఉన్న కొందరు పిల్లలు అందులో పాల్గొంటారు. జునూన్ వల్ల పిల్లల్లో చాలా మార్పు వచ్చింది.

Haimanthi-Sen2

లక్ష్యం దిశగా హైమంతి సేన్..

హైమంతి సేన్ ఉన్నత లక్ష్యాన్ని అర్థం చేసుకున్న చిన్నారులు చక్కగా చదువు నేర్చుకుంటున్నారు. ఆయా కళల్లో బాగా రాణిస్తున్నారు. జుజూన్ ఎన్జీఓ ద్వారా చదువు నేర్చుకున్న పిల్లలంతా చక్కగా ఇంగ్లిష్‌లో మాట్లాడుతున్నారు. అక్షరాలు, పదాలు, నంబర్లు చకచకా చెప్పేస్తున్నారు. అన్ని సబ్జెక్టుల్లో రాణిస్తున్న పిల్లలను కార్పొరేట్ పాఠశాలల్లో చదివించేందుకు చర్యలు తీసుకుంట్నుది హైమంతి. అయితే చెడు వ్యసనాలకు బానిసలైన నలుగురైదుగురు పిల్లలు మాత్రం మళ్లీ స్టేషన్‌బాట పట్టారు. అయినా వెళ్లిన వారిలో కూడా పరిపూర్ణమైన మార్పు కోసం నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నది హైమంతి. భవిష్యత్తులో పిల్లలందరూ తన ఆశయాన్ని గెలిపిస్తారని నమ్మకంతోనే ఆమె పనిచేస్తున్నది.

-జెస్సీ తోటపల్లి

826
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles