అమ్మపాలు.. అమృతం!


Tue,August 6, 2019 12:57 AM

అమ్మ జన్మనిస్తుంది. ఆడిస్తుంది.. పాడిస్తుంది.. ఆరోగ్యవంతమైన జీవితాన్నిస్తుంది. సృష్టి ధర్మంగా పాలు ఇస్తుంది. ఆ పాలు ఆకలి మాత్రమే తీర్చేవి కావు. ఆప్యాయత.. ప్రేమ.. అనురాగం.. కరుణ కలబోసిన అమృతం లాంటివి. ఆరోగ్యపరంగా చూస్తే తల్లిపాలల్లో మంచి పోషకాలు ఉంటాయి. బిడ్డ భవిష్యత్ కోసం.. ఆరోగ్య భరోసా కోసం అమ్మ ఇచ్చే పాలు.. జీవితాంతం మురిపాలు అందిస్తాయి. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అమృతం లాంటి అమ్మపాల ప్రాధాన్యం గురించి తెలుసుకుందాం.
mother-baby
తల్లిపాల గొప్పదనం గురించి అందరికీ తెలుసు. కానీ పాలు ఇవ్వాలంటే వెనకడుకు వేస్తున్నది నేటి తరం. ఎందుకు అంటే? ఏమో.. అసలు కారణమైతే చెప్పరు కానీ బిడ్డకు పాలివ్వడం పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. గత పదేళ్ల కాలంగా అయితే ఈ ధోరణి ఎక్కువవుతున్నదని అంటున్నది నేషనల్ హెల్త్ సర్వీస్. వెనకటి రోజుల్లో ఆడవాళ్లు పెద్దగా చదువుకోకపోయినా బిడ్డకు మాత్రం ఐదేండ్ల వరకు పాలు ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఉన్నతంగా చదివి అన్నీ తెలిసినవాళ్లే పిల్లలకు పాలు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. కానీ.. తల్లిపాలు అనేవి సృష్టిధర్మం. అవి ఆకలి మాత్రమే తీర్చేవి కావు. అమృతంలాంటివి. కాబట్టి తల్లి పిల్లలకు పాలు ఇవ్వాల్సిందే.

తల్లిపాలు ఎందుకు?

బిడ్డ ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఉపయోగపడుతాయి. శరీరానికి ఎంత బరువు అవసరమో అంతే బరువు పొందేలా తల్లిపాలు ప్రభావం చూపిస్తాయి. పిల్లలకు విరేచనాలు సక్రమంగా అవుతాయి. తల్లిపాలకు తొందరగా జీర్ణమయ్యే గుణం ఉంటుం ది. వీటిలో పుష్కలమైన ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్, కాల్షియం, పొటాషియం లభిస్తాయి. పుట్టిన 4-5 గంటల నుంచే తల్లిపాల ద్వారా ఇవన్నీ సమపాళ్లలో అందడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుంది. పైగా ఎలాంటి ఇన్ఫెక్షన్లను కలిగించవు. ముర్రుపాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే శిశువు మోకాళ్లు వంకరలు తిరుగుతాయి.

ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలా కాకుండా ముర్రుపాలు తాగిస్తే వైరస్ ఇన్ఫెక్షన్లు, అలర్జీ దరిచేరవు. ప్రొటెక్టివ్ యాంటీబాడీస్ తల్లిపాలల్లో ఉండటం వల్ల శిశువులో వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. తల్లిపాలు తాగితే ఆస్తమా రాదు. తల్లితో మానసిక అనుబంధం ఏర్పడుతుంది. ఊబకాయం, డయాబెటీస్ నుంచి రక్షణ లభిస్తుంది. మలబద్ధకం సమస్య ఉండదు. విటమిన్స్ అందుతాయి. తెలివి తేటలు బాగుంటాయి. కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ ఉంటుంది.

ఎంతకాలం ఇవ్వాలి?

వెనకటి రోజుల్లో అయితే బిడ్డకు ఏడేండ్ల వయసొచ్చే వరకు కూడా తల్లులు పాలు ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అలా ఇవ్వడం వీలు కాకపోతుండండొచ్చు. కాబట్టి ఐదేండ్ల వరకు ఇవ్వొచ్చు. శిశువుకు మొదటి ఆరు నెలలు ఇతర ద్రవ, ఘన పదార్థాలు ఏవీ ఇవ్వకుండా కేవలం తల్లిపాలు అయితే కచ్చితంగా ఇవ్వాలి. ఆ తర్వాత నుంచి తల్లిపాలతోపాటు ఘన పదార్థాలు తినిపిస్తూ సుమారు రెండేండ్ల వరకైనా పాలు ఇవ్వాలి. తల్లి దగ్గర పాలు లేకపోవడం.. ఆరోగ్యం సహకరించకపోవడం వంటి కారణాలు ఉంటే కనీసం ఒక సంవత్సరం అయినా పాలు ఇస్తేనే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే రెండేండ్లు అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తున్నది. రెండేండ్లు వచ్చేసరికి శిశువుకు కావాల్సిన పోషకాలు ఇతర ఆహారాలలో అందుతాయి కాబ ట్టి పాలు ఇవ్వడం తగ్గించినా నష్టమేమీ లేదని డబ్ల్యూహెచ్‌ఓ చెప్తున్నది.

ఇవ్వకపోతే?

తల్లిపాలు బిడ్డకు వరం లాంటి వి. వాటిని పిల్లలకు అందివ్వకపోతే వారి జీవితం ప్రమాదంలో పడొచ్చని చెప్తున్నది యూనిసెఫ్ సర్వే. ఈ సర్వే ప్రకారం తల్లిపాలు తక్కువగా తాగే పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎదుగుదల లోపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 76 దేశాల్లో యూనిసెఫ్ ఈ అధ్యయనం చేసింది. దీని ప్రకారం సుమారు 7 కోట్ల 80 లక్షల మంది శిశువులకు పుట్టిన గంటలో కూడా పాలు అందడం లేదు. పుట్టిన 4-5 గంటల్లో కూడా పాలు ఇవ్వకపోవడం వల్ల 33% పిల్లలు చనిపోతున్నారు. పుట్టిన 24 గంటల్లో కూడా తల్లిపాలు బిడ్డకు అందకపోతే మరణించే ప్రమాదం రెట్టింపు అవుతుంది.

అసహజ ప్రసవాలే కారణమా?

యునిసెఫ్ రిపోర్ట్ ప్రకారం తల్లిపాల గురించి ఇండియాలో అవగాహన చాలా తక్కువగా ఉంది. ఆఫ్రికా ప్రజల్లో బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల 65% అవగాహన ఉంటే ఇండియాతో పాటు తూర్పు ఆసియా దేశాల్లో కేవలం 32%గా ఉన్నట్లు పేర్కొన్నది. బ్రెస్ట్‌ఫీడింగ్ పట్ల అవగాహన ఉన్న దేశాల్లో ఇండియా 56వ స్థానంలో ఉన్నది. శ్రీలంక ఈ జాబితాలో మొదటిస్థానంలో ఉండటం గమనార్హం. అయితే దీనికి కారణం కూడా చెప్పారు. ఆపరేషన్ వల్ల జరిగే ప్రసవాల సంఖ్య పెరిగిపోవడం వల్లే బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల అవగాహన ఉండటం లేదని పరిశోధకులు చెప్తున్నారు. ఆపరేషన్ వల్ల ప్రసవాలు గతంలో కంటే ఇప్పుడు 20% పెరిగాయి.

mother-baby2

పోతపాలు మంచివేనా?

ఏ పాలూ.. తల్లిపాలతో సమానం కావు. చాలామంది ఆవుపాలు తాగిస్తున్నామనే భరోసాతో ఉంటుంటారు. కానీ ఆవుపాలల్లో కాల్షియమ్, సోడియం, క్లోరైడ్ స్థాయిలు ఎక్కువ అవడంతో అవి బిడ్డ కిడ్నీ మీద ప్రభావం చూపే ప్రమాదముందని గ్రహించడం లేదు. ఇంకో ఆప్షన్ పోతపాలు. అయితే సహజరీతుల్లో విటమిన్‌లు, ఖనిజాలు లభించడం కాకుండా కృత్రిమ పద్ధతిలో యాడ్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. పోతపాలు తాగే పిల్లల్లో ఇన్ఫెక్షన్లు, విరేచనాలు ఎక్కువగా వస్తాయి. మలబద్ధకం, ఊబకాయం వంటి సమస్యలు అధికం. కడుపు నొప్పి, అలర్జీలూ కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పోతపాలను నమ్ముకోవడం కాకుండా తల్లిపాలను పట్టడమే శ్రేయస్కరం.

వీనింగ్ అంటే?

బిడ్డకు ఆర్నెళ్ల తర్వాతే ప్రత్యామ్నాయ ఆహార పదార్థాలు అలవాటు చేయాలి. బిడ్డను పాల నుంచి ఇతర ఘన పదార్థాలకు అలవాటు చేయడాన్ని వీనింగ్ అంటారు. తల్లి పాలల్లో కార్బోహైడ్రేట్స్ 7.1%, ఫ్యాట్స్ 4.5%, ప్రొటీన్స్ 0.9%, మినరల్స్ 0.2%, బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన డైజెస్టివ్ ఎంజైమ్స్, హార్మోన్లు, విటమిన్లు, యాంటీ బాడీస్, లింఫోసైట్స్ ఉంటాయి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ తల్లిపాలను తప్పనిసరిగా తాగించాలని సూచిస్తున్నది.

పాలల్లో ఉండే హార్మోన్లేంటి?

బిడ్డ ఆకలి గమనించగానే ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ హార్మోన్‌లు తల్లిపాలలో ఉత్పత్తి అవుతాయి. ప్రొలాక్టిన్.. పిట్యూటరీ గ్రంథి ముందు భాగం నుంచి విడుదల అవుతుంది. ఇది రొమ్ములో పాలు ఉత్పత్తి అవడానికి తోడ్పడుతుంది. ఆక్సిటోసిన్ హార్మోన్.. పిట్యూటరీ గ్రంథి వెనకభాగం నుంచి విడుదల అవుతుంది. ఇది పాలు నాళాల నుంచి బయటకు రావడానికి ఉపయోగపడుతుంది.

ముర్రుపాలు తాగకపోతే?

బిడ్డ పుట్టిన తొలి మూడురోజుల్లో వచ్చే పాలు తప్పకుండా తాగించాలి. అవి బిడ్డ భవిష్యత్‌కు ఎంతో మంచివి. వీటిని ముర్రుపాలు అంటారు. ముర్రుపాలలో కొలోస్ట్రమ్ అనే పదార్థం ఉంటుంది. ఇది చిక్కటి పసుపు పచ్చటి ద్రవం. ముర్రుపాలలో అధికశాతం ప్రొటీన్లు ఉంటాయి. ఇవి బిడ్డకు బలాన్ని, రోగ నిరోధక శక్తిని కలిగిస్తాయి. ఆరోగ్యవంతమైన బాలింత నుంచి రోజుకు సుమారు 600 మిల్లీలీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. కాబట్టి తల్లి సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. పాలు, ఆకుకూరలు, పళ్లు, పప్పులు, గుడ్లు, చేపలు కలిగిన పరిశుభ్రమైన సమతల ఆహారం తీసుకోవాలి. సమృద్ధిగా మంచినీళ్లు తాగాలి. టమాట, ఉల్లి, క్యాబేజీ కుటుంబానికి చెందినవి తేలికగా జీర్ణం కావు కాబట్టి వీటిని తగ్గించుకోవాలి.

ఎలాంటి సమస్యలుంటే ఇవ్వొద్దు?

రొమ్ము మీద చీము గడ్డలు ఉన్నప్పు డు, టీబీ వ్యాధి తీవ్రంగా ఉంటే, క్యాన్స ర్ మందులు వాడేటప్పుడు, యాంటీ థైరాయిడ్, రేడియేషన్ మందులు వాడేటప్పుడు, జబ్బుగా ఉన్నప్పుడు బిడ్డకు పాలు ఇవ్వకూడదు. రిట్రాక్టెడ్ నిపుల్స్, క్రాక్డ్ నిపుల్స్ వంటి సమస్యలు ఉన్నవాళ్లు గర్భిణిగా ఉన్నప్పుడే ఈ సమస్యలను గుర్తించి, జెంటిల్ మసాజ్, బ్రెస్ట్ పంప్ ట్రాక్షన్‌తో సమస్యను తగ్గించుకోవాలి.

తల్లికి ప్రయోజనాలుంటాయా?

బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల బిడ్డ ఆరోగ్యంతో పాటు తల్లి ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఈ రోజుల్లో 80% గర్భసంచి సమస్యలు వస్తున్నాయి కదా. అయితే తల్లి సక్రమంగా పాలు ఇవ్వడం వల్ల గర్భసంచి సమస్యలు రావు. ప్రసవం అయిన కొద్ది కాలానికే అది ముడుచుకొని సాధారణ పరిమాణానికి వస్తుంది. అధిక రక్తస్రావం జరుగదు. పాల ద్వారా ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదలవ్వడం వల్ల తల్లికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. పాలివ్వడం వల్ల ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవడంతో ప్రసవం తర్వాత ఊబకాయం రాకుండా నిరోధిస్తుంది. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ప్రమాద శాతం తగ్గుతుంది. గుండె సమస్యలు, మధుమేహం వచ్చే అవకాశాలు కూడా తగ్గుతాయి.

-దాయి శ్రీశైలం

anusha-kommini

111
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles