కొత్త ఉద్యోగి.. ఈ ఐదు చెయ్యి!


Sat,July 27, 2019 12:37 AM

అసలే కొత్త ఉద్యోగం.. నెల రాగానే చేతికొచ్చే జీతంతో స్నేహితులతో సినిమాలు, షికార్లలో మునిగిపోతుంటారు. నవతరం ఉద్యోగుల్లో కొందరు పొదుపు చేయడాన్ని పెద్దగా పట్టించుకోరు. కొందరు తెలివైనవారు మాత్రం.. జీతాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ జీవితంలో నిలదొక్కుకోవడానికి ప్రాధాన్య తనిస్తారు. అందుకే, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే..
ముందు నుంచీ ఆర్థిక ప్రణాళికల్ని పక్కాగా రచించుకోవాలి. ఈ నేపథ్యంలో, ప్రతీ కొత్త ఉద్యోగి ఐదు అంశాలపై కచ్చితంగా దృష్టి సారించాలి. అప్పుడే, ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదురైనా సమర్థంగా అధిగమిస్తారు.

job-employee
జీతం రాగానే దేనికెంత ఖర్చు పెట్టాలో ముందుగా రాసుకోవాలి. చెల్లించాల్సిన అద్దె, సరుకులు, ఆఫీసుకు రానుపోను ఖర్చలు, కొనాల్సిన వస్తువుల గురించి ముందే ఓ జాబితా సిద్ధం చేసుకోవాలి. కొన్ని చిల్లర ఖర్చులను మనలో చాలామంది పెద్దగా పరిగణనలోకి తీసుకోరు. కానీ, నెల చివరికి వచ్చేసరికి అవే పెద్దగా కనిపిస్తుంటాయి. అందుకే, కొత్త ఉద్యోగులెప్పుడూ జీతం వచ్చిన తొలి రోజుల్లో తమ నెలవారీ ఖర్చుల గురించి తప్పకుండా రాసుకోవాలి. ఎక్కడెక్కడ ఎంతెంత సొమ్ము ఖర్చు చేస్తున్నామనే విషయంపై దృష్టి సారించాలి.


అప్పులు వద్దే వద్దు..

ఉద్యోగంలో చేరిన తర్వాత స్నేహితులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడమో లేదా ఖరీదైన ఎలక్ట్రానిక్ ఉపకరణం కొనడమో చేయకూడదు. మన దేశంలో సుమారు 85 శాతం ట్రావెల్ లోన్ దరఖాస్తులు కొత్త ఉద్యోగంలో చేరిన వ్యక్తుల నుంచే రావడం గమనార్హం. కాకపోతే, ఉద్యోగం చేరిన కొన్నాళ్లకే రుణాలెక్కువ తీసుకోవడం కరెక్టు కాదని గుర్తుంచుకోండి. వ్యక్తిగత రుణం తీసుకుంటే ఏటా 20 నుంచి 24 శాతం దాకా వడ్డీ చెల్లించాలి. క్రెడిట్ కార్డులను ఇష్టం వచ్చినట్లు వినియోగిస్తే మరింత భారమవుతుందని గుర్తుంచుకోవాలి. క్రెడిట్ కార్డుల్ని వినియోగించేవారు గడువు తేదిలోపే సొమ్ము చెల్లించాలి. లేకపోతే, మీరు బకాయి పడ్డ సొమ్ము మీద అదనంగా కొంత వడ్డీ కట్టాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. బకాయి పడ్డ సొమ్ముతో బాటు మళ్లీ కొత్తగా క్రెడిట్ కార్డును వినియోగించడం వల్ల.. నెలసరి సొమ్ములో దాదాపు నలభై శాతం ఇవి కట్టడానికే సరిపోవచ్చు.

* (30 శాతం కంటే అధిక మొత్తం చెల్లింపుల కోసం వినియోగించకూడదు)

మీరేం చేయాలంటే?

జీతం బ్యాంకులో పడగానే కొంత మొత్తాన్ని అలాగే ఉంచుకోవాలి. వచ్చే 3 నుంచి 4 ఏండ్లలో కారు కొనాలని ఉన్నా, ఉన్నత చదువులకు వెళ్లాలన్నా.. హైబ్రిడ్ ఫండ్లలో మదుపు చేయాలి. గుడ్డిగా పొదుపు చేయడం కంటే.. మీ లక్ష్యానికి తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.

అత్యవసర నిధి అవసరమే..

అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం అత్యంత కీలకమైన విషయమని గుర్తుంచుకోవాలి. ఉద్యోగంలో చేరిన కొన్నాళ్లకే మీరు తీసుకున్న వాహనంతో సమస్య వచ్చినా, ఖరీదైన మొబైల్ ఫోనుకు మరమ్మతులు చేయించాల్సి వచ్చినా కష్టమే కదా! పైగా ఉద్యోగం కోల్పోయినా, ఆరోగ్య సమస్యలు తలెత్తినా ఎలాంటి అప్పులు చేయకుండా పరిష్కరించుకునేలా ఉండాలి. ప్రస్తుతమున్న ఉద్యోగం వదిలేసి కొత్త కోర్సులో చేరి సరికొత్త ఉద్యోగంలో చేరాలని భావించేవారి సంఖ్య పెరుగుతున్నది. ఇలాంటి వారంతా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే ఈ ఏర్పాటు అత్యవసరమే.

మీరేం చేయాలంటే?

మీ నెలసరి ఖర్చుల్లో మూడు నుంచి ఆరు నెలలు ఖర్చును తట్టుకునేలా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అప్పులు చెల్లించడం, అద్దెలు కట్టడం వంటివాటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా అధిగమించడానికి హీనపక్షం రెండు నుంచి మూడు నెలల ఖర్చును అట్టి పెట్టుకోవాలి.

బీమా పాలసీ కీలకమే!

మీరు ఉద్యోగంలో చేరిన కొత్తలోనే జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు తీసుకుంటే ప్రీమియం తక్కువుంటుందని గుర్తుంచుకోండి. ఈ సమయంలో తక్కువ ప్రీమియం పాలసీ తీసుకోవడం కంటే సరైన పాలసీని ఎంచుకోవడం అన్నివిధాల ఉత్తమం. మీపై ఆధారపడిన వారు లేకపోతే ఎల్‌ఐసీ పాలసీలు తీసుకోకపోవడమే మేలు. అవసరం లేకుండానే పాలసీలు తీసుకోవడం వల్ల కొత్త బరువు అని గుర్తుంచుకోవాలి. మీరు విద్యారుణం చెల్లిస్తుంటే మాత్రం.. అంతే మొత్తానికి టెర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవడం అన్నివిధాల మేలు. విద్యారుణం సాయంతో కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తులు, ముందుగా ఆ రుణాన్ని చెల్లించడానికి ప్రాధాన్యమివ్వాలి. ఇది మంచి రుణమే అయినప్పటికీ, వడ్డీ చెల్లించడం కొంత ఇబ్బందికరమైన విషయమనే చెప్పాలి. పైగా, విద్యారుణం తీసుకున్నవారు చేసే వడ్డీ చెల్లింపులపై సెక్షన్ 80 ఈ కింద పన్ను రాయితీ లభిస్తుంది. పైగా, ఇది కేవలం ఎనిమిదేండ్లు మాత్రమేనని గుర్తుంచుకోవాలి.

మీరేం చేయాలంటే?

పన్ను ఆదాయాన్ని పొందేందుకు యువకులకు ఎండోమెంట్ పాలసీలను ఎంచుకోవచ్చు. వీటి ద్వారా మూడు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. బీమా, పన్ను ఆదా, సంపద సృష్టికి ఉపకరిస్తాయి. సంప్రదాయ పాలసీల కంటే 5-6 శాతం ఆదాయం తక్కువొస్తుందని గుర్తుంచుకోవాలి. కొత్త ఉద్యోగులకు అప్పులు పెద్దగా ఉండవు. పైగా, చేతికొచ్చే జీతమూ మెరుగ్గానే ఉంటుంది. కాబట్టి, అప్పు తిరిగి చెల్లించడం కష్టమేం కాకపోవచ్చు. కాకపోతే, ఇదే సమయంలో పెద్ద రుణాలు తీసుకోకుండా జాగ్రత్తపడటం అన్నివిధాల ఉత్తమం.

పన్ను ఆదా తెలుసా..

ఏడాదికి రూ. 5 లక్షలు ఆర్జించేవారు ఎలాంటి పన్ను చెల్లించనక్కర్లేదు. కొత్తగా ఉద్యోగంలో చేరినవారంతా అధిక శాతం ఇదే విభాగంలోకి వస్తారు. అందుకే, ఏడాదికి రూ.6 నుంచి 7 లక్షలు ఆదాయాన్ని ఆర్జించేవారు.. పన్ను ప్రణాళికలపై మెరుగైన రీతిలో దృష్టి సారించాలి. ఆదాయాన్ని రూ.5 లక్షల్లోపు ఉండేలా చూసుకోవడం ఉత్తమం. కేవలం పన్ను ఆదా కోసమే మదుపు చేయకుండా అధిక రాబడిని అందించే ఫండ్ల పై దృష్టి సారించండి. ముక్కూమొహం లేని వ్యక్తులు చెప్పే పొదుపు సలహాలు తీసుకోవద్దు. నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో మదుపు చేస్తే అరవై ఏండ్లలోపు సొమ్ము తీసుకోవడానికి వీలు ఉండదు. అదే, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాల్లో మదుపు చేస్తే పన్ను ఆదా అవుతుంది. అధిక రాబడి లభిస్తుంది. ఇదే సమయంలో పీపీఎఫ్ మీద తక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి, ఈక్విటీల్లో అదిక శాతం సొమ్మును మదుపు చేయాలి.

మీరేం చేయాలంటే?

కొన్ని సంస్థలు ఉద్యోగులకు పన్నురహిత చెల్లింపులకు అవకాశాల్ని ఇస్తాయి. ఈ క్రమంలో వాటిని ఎలా వినియోగించాలో తెలుసుకోవాలి. ఉదాహరణకు, కొన్ని సంస్థలు పలు షోరూములు, సూపర్ మార్కెట్లలో వినియోగించేందుకు ఆహార కూపన్లను అందిస్తాయి. సెక్షన్ 80సీసీడీ (2) కింద ఎన్‌పీఎస్ లాభాన్ని అందుకోవడమో చక్కటి ప్రత్యామ్నాయం.

job-employee2

ఇదీ ముఖ్యమే!

కెరీర్ ప్రారంభంలో చేతికొచ్చే సొమ్ము ద్వారా జీవితాన్ని ఆస్వాదించాలని యువత కోరుకోవడం సహజమే. ఎందుకంటే, ఈ వయసులో బాధ్యతలు పెద్దగా ఉండవు. అందుకే, చేతికి ఎంత సొమ్ము వస్తే అంత మొత్తాన్ని ఖర్చు చేయాలని కొందరు భావిస్తారు. ఇలాంటి వారంతా నెలసరి బిల్లుల్ని చెల్లించి, అత్యవసర నిధికి కొంత సొమ్మును పక్కన పెట్టేసిన తర్వాత.. దాదాపు 8 నుంచి 10 శాతం సొమ్మును నియంత్రణలో లేని ఖర్చు కోసం దాచి పెట్టుకోవాలి. ఇదే సొమ్ముతో వీలైతే బూట్లు కొనుక్కోవడం, కన్సర్ట్‌కు వెళ్లడం వంటివి చేయడం ఉత్తమం.

మీరేం చేయాలంటే?

ఆర్థికంగా ఎలాంటి బాధ్యతలు లేనిపక్షంలో, మీ వద్ద ఉన్న సొమ్మును ఖర్చు చేయండి. కాకపోతే, ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకూడదు. క్రెడిట్ కార్డులను వినియోగించవద్దు. కొత్తగా ఉద్యోగంలో చేరిన తర్వాత వచ్చే జీతంతో వీలైనంత వరకూ ఉన్నదాంట్లో ఖర్చు చేయడం ఉత్తమం. అంతేతప్ప, అలా జీతం రాగానే ఇలా జల్సాలకు ఖర్చు చేయడం కరెక్టు కాదు.

394
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles