క్రెడిట్‌కార్డు తిరస్కరణ?


Sat,July 27, 2019 12:33 AM

నగదురహిత లావాదేవీలకు ప్రాధాన్యత పెరగడంతో.. అధిక శాతం మంది క్రెడిట్ కార్డుల పట్ల మొగ్గు చూపుతున్నారు. జాగ్రత్తగా వాడుకుంటే క్రెడిట్ కార్డును మించిన ప్రత్యామ్నాయం మరోటి లేదని కొందరు భావిస్తారు. ఈ క్రమంలో ఎలాగైనా క్రెడిట్ కార్డు తీసుకోవాలని ప్రయత్నిస్తారు. కాకపోతే, కొన్ని సందర్భాల్లో పలు బ్యాంకులు క్రెడిట్ కార్డును మంజూరు చేయడానికి తిరస్కరిస్తున్నాయి.
CREDIT-CARD
మీ పేరిట ఇప్పటికే ఒక క్రెడిట్ కార్డు ఉంటే ఇబ్బంది లేదు. కాకపోతే, అంతకుమించి తీసుకుంటానంటే కష్టమే. మీకు రుణభారం పెరుగుతుందని భావించి క్రెడిట్ కార్డు ఇవ్వడానికి బ్యాంకులు తిరస్కరిస్తాయి. ఇలా జరగకూడదంటే? క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునే ముందే వీలైనంత త్వరగా రుణాన్ని తీర్చివేయాలి. ఇదివరకే రెండు లేదా అంతకంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉండి, అధిక బ్యాలెన్స్ పరిమితి ఉంటే మీరు ఆర్థిక నిర్వహణలో నిర్లక్ష్యం చూపుతున్నారని బ్యాంకులు భావిస్తాయి. మీ క్రెడిట్ కార్డు వినియోగపు నిష్పత్తి 50 శాతం కన్నా ఎక్కువగా ఉన్నా మీ క్రెడిట్ కార్డు దరఖాస్తును బ్యాంకు ఆమోదించదు.


క్రెడిట్ రిపోర్ట్‌పై విచారణ

మీరు ఏ రకమైన రుణానికి దరఖాస్తు చేసుకున్నా బ్యాంకు క్రెడిట్ స్కోరును తనిఖీ చేస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం మీ క్రెడిట్ వివరాల్లో నమోదు అవుతుంది. తరచుగా క్రెడిట్ స్కోరు తనిఖీలుంటే మీకు క్రెడిట్ కార్డు ఇవ్వడానికి బ్యాంకు ఆసక్తి చూపకపోవచ్చు. దీని బారిన పడకుండా ఉండాలంటే సాధ్యమైనంత వరకు క్రెడిట్ స్కోరు తనిఖీల మధ్య కనీసం నాలుగు నెలల మధ్య వ్యత్యాసం ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు తనిఖీలు తగ్గించుకోవడం వలన క్రెడిట్ కార్డు పొందవచ్చు. క్రెడిట్ కార్డును ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయి. నిబంధనల్లో సూచించిన విధంగా నెలవారీ ఆదాయ పరిమితిని కలిగి ఉండాలి. వారు ఇచ్చిన నిబంధనలకు మీ ఆదాయ స్థాయి సరిపోకపోతే మీ దరఖాస్తు తిరస్కరణకు గురి కావచ్చు.

రుణ చెల్లింపుల్లో నిర్లక్ష్యమా?

మీరు క్రెడిట్ కార్డు రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనప్పుడు లేదా సేవలను వినియోగించడంలో 3 నుంచి 6 నెలలు నిలిపేసినప్పుడు బ్యాంకులు మీకు నోటీసులు పంపేందుకు ఆస్కారం ఉంటుంది. అయినప్పటికీ మీరు చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహిస్తే మీ కార్డును డిఫాల్ట్‌గా పరిగణిస్తారు. ఇదంతా క్రెడిట్ రిపోర్టులో నమోదవుతుంది. దీని ద్వారా మీ క్రెడిట్ కార్డు దరఖాస్తును తిరస్కరించవచ్చు. అందుకే మీరు క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకునే 6-12 నెలల ముందు వరకు ఎలాంటి డిఫాల్ట్ లేకుండా చూసుకోవాలి. అలా చేస్తే మీ క్రెడిట్ కార్డు దరఖాస్తుకు ఆమోదం పొందేందుకు అవకాశాలు మెరుగుపర్చుకోవచ్చు.

372
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles