హ్యాకర్ల పాలిట యముడు!


Tue,June 11, 2019 11:47 PM

ఏదైనా చిన్న అవకాశం దొరికితే వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటారు హ్యాకర్స్. క్షణాల్లోనే వెబ్‌సైట్స్‌ను హ్యాక్ చేస్తూ.. బాధితుల నుంచి కోట్ల రూపాయాలు గుంజుతుంటారు. డేటా దొంగించి నానా తిప్పలు పెడుతుంటారు. ఒక్కోసారి డేటా నాశనం చేస్తూ, వైరస్‌లు, స్పామ్‌లు సృస్టిస్తూ రకరకాలుగా ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఇక నుంచి హ్యాకర్ల ఆటలు సాగవు. వారి పాలిట యముడిలాంటి సాఫ్ట్‌వేర్ వచ్చేసింది. సమాచార సంరక్షణకు వజ్రాయుధంగా మారింది.
Blockchain1సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రధానమైన సవాలు హ్యాకింగ్. దీని వల్ల జరిగే నష్టం మాటల్లో చెప్పలేనిది. లెక్కల్లో అందనిది. ఈ హ్యాకింగ్ నుంచి తప్పించుకోవడానికి, హ్యాకర్ల భారిన పడకుండా ఉండటానికి ఎప్పటికప్పుడు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఎక్కడో ఓ చోట పంజా విసురుతూనే ఉన్నారు హ్యాకర్స్. ఈ నేపథ్యంలో వారి మైండ్ బ్లాంక్ అయ్యే సాఫ్ట్‌వేర్ వచ్చేసింది. అదే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ. వైరస్, హ్యాకింగ్, స్పామ్, బగ్ వంటి ఎన్నో రకాల చికాకుల నుంచి రక్షించడానికి వజ్రాయుధంలా వచ్చేసింది. తక్కువ ఖర్చు, పారదర్శకత, వేగం, కచ్చితత్వం దీని ప్రత్యేకతలు. అందుకే ఇది అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నది.

ఒక్కో లావాదేవీ.. ఒక బ్లాక్

బ్లాక్ అంటే ఒక భాగం. ప్రతి లావాదేవీ.. అందులో భాగమైన వారందరి వివరాలు ఒక్కో బ్లాక్‌గా ఏర్పడతాయి. ఒకవేళ ఈ బ్లాక్‌లో ఉన్నవారితో ఇంకో లావాదేవీ జరిగిందనుకోండి. అది మునుపటి బ్లాక్‌కు అనుబంధంగా ఇంకో ప్రత్యేకమైన బ్లాక్‌గా ఏర్పడుతుంది. ఇలా బ్లాక్‌లన్నీ వరుసగా ఒక చెయిన్ మాదిరిగా ఏర్పడతాయి. మొత్తం చెయిన్లో ఎక్కడ మార్పులు జరిగినా.. అది ఆ లావాదేవీ నమోదైన బ్లాక్‌లో రీ ఎంటర్ అవుతుంది. పది నిమిషాలకు ఒకసారి బ్లాక్‌లోని వివరాలు నెట్‌వర్క్‌లో ఉండే అందరి కంప్యూటర్లలోకి చేరి.. లావాదేవీలన్నీ సక్రమంగా ఉన్నదీ లేనిదీ సరిచూసుకుంటాయి. ఈ క్రమంలో ఎక్కడ తేడా వచ్చినా ఆ విషయాన్ని నెట్‌వర్క్‌లో ఉన్న వారందరికీ తెలియజేస్తాయి. ఒక నెట్‌వర్క్ పరిధిలో వేల నోడ్స్ ఉంటాయి. దీనివల్ల మోసం అనేది అసాధ్యం. బ్లాక్ చెయిన్ వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పబ్లిక్ బ్లాక్ చెయిన్. అంటే.. అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వాలు, ప్రజలకు సంబంధించిన లావాదేవీలను నమోదు చేసుకునేందుకు ఏర్పాటు చేసుకునేది. రెండోది ప్రైవేట్. కంపెనీలు, వ్యక్తులు, సంస్థలు ఏర్పాటు చేసుకునేది.

గ్రూపుల ఆధీనంలో సమాచారం

ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో ఎంతమందైనా సమాచారం ఎంటర్ చేయవచ్చు. సరిచేయవచ్చు. అప్డేట్ చేయవచ్చు. అయితే ఆ సమాచారమంతా ఒకేచోట కేంద్రీకృతమై ఉండదు. మిలియన్ల కంప్యూటర్లలో ఉంటుంది. ఒక్కరి కంట్రోల్లో ఉండదు. ఒక గ్రూప్ యూజర్ల ఆధీనంలో ఉంటుంది. దీంతో హ్యాకర్లకు ఈ సమాచారాన్ని నాశనం చేయడం కుదరదు. వినడానికి అద్భుతంగా అనిపించినా ఇది నిజమే. అదే బ్లాక్ చెయిన్ ప్రత్యేకత. ఈ టెక్నాలజీలో డేటా (సమాచారం) అంతా బ్లాకులుగా నిక్షిప్తం అవుతుంది. అవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. అందుకే దీన్ని బ్లాక్ చెయిన్ అంటారు. పాత సమాచారం ఉంటుంది. సరికొత్త డేటా అప్‌డేట్ అవుతుంటుంది. దానిని మార్చడం, తొలగించడం తేలిక కాదు. లావాదేవీలన్నీ బ్లాక్‌లో ఎన్‌క్రిప్ట్ అవుతూ ఒక బ్లాకుగా మారి.. కంప్యూటర్ నెట్‌వర్క్‌లో స్టోర్ అవుతాయి.

భద్రతకు మారుపేరు

ప్రస్తుత మార్కెట్లో సమాచార నిల్వ కోసం పలురకాల డేటా స్ట్రక్చర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే బ్లాక్ చెయిన్ వీటన్నింటి కంటే భిన్నమైనది. దీనికి కేంద్రీకృత (సెంట్రలైజ్డ్) డేటాబేస్ ఉండదు. వినియోగదారులకు ఒకరకంగా, పర్యవేక్షకులకు మరో విధమైన యాక్సెస్ ఉంటుంది. ఒకవేళ హ్యాకర్లు ఈ సమాచారం మార్చాలని ప్రయత్నిస్తే నెట్‌వర్క్‌లో ఒక బ్లాక్‌లో మార్చినప్పటికీ మిగిలినవి ఆ మార్పును అనుమతించవు. అంటే అన్ని బ్లాక్‌లు ఒకేసారి మార్చాల్సి ఉంటుంది. ఇది అసాధ్యం. ఒక బ్లాక్ సమాచారాన్ని ఛేదించినంత మాత్రాన.. మిగతా సమాచారం తెలుసుకోవడం సాధ్యం కాదు. దాదాపు అసంభవం అని చెప్పాలి. ఈ ఎన్క్రిప్షన్ కంప్యూటర్ నుంచి కంప్యూటర్‌కు జరుగుతుంది. ప్రోగ్రామర్‌కి కానీ, చౌర్యం చేసేవారికి కానీ పూర్తి సమాచారం లభించదు. అందువల్లే బ్యాంకులు, ట్రేడింగ్ కంపెనీలు, బీమా సంస్థలు, ఆసుపత్రులు తదితరాలన్నీ దీనిపై దృష్టి సారిస్తున్నాయి.
Blockchain

మన దేశంలో బ్లాక్ చెయిన్

బిట్‌కాయిన్ల గురించి తెలుసు కదా..! వాటి కోసమే ఈ టెక్నాలజీ వచ్చింది. సటోషీ నకమోటో పేరుతో కొందరు అజ్ఞాత టెకీలు దీన్ని అభివృద్ధి చేశారు. బ్లాక్ చెయిన్ టెక్నాలజీని మన దేశంలో తొలిసారిగా 2008లో క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్‌లో ఉపయోగించారు. మన నీతి ఆయోగ్ ఈ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నది. ఎస్బీఐ 2019 ఆర్థిక సంవత్సరం చివరిలోగా దీన్ని వినియోగించుకోవడానికి సన్నాహాలు చేస్తున్నది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) బ్లాక్ చెయిన్ ఉపయోగించి టెలిమార్కెటింగ్, స్పామ్ కాల్స్ నివారించడానికి సన్నద్ధమవుతున్నది. ఇండియా ట్రేడ్ కనెక్ట్ పేరుతో ఇన్ఫోసిస్ 7 ప్రైవేటు బ్యాంకులతో జతకట్టింది. ఇది బ్లాక్ చెయిన్ ఆధారిత ట్రేడ్ నెట్‌వర్క్. Moneta Go బ్లాక్ చెయిన్ సొల్యూషన్ ఇప్పటికే భారత్‌లో సేవలు ఆరంభించింది. eMudhra బ్లాక్ చెయిన్ ఆధారిత స్మార్ట్ కాంట్రాక్టు సొల్యూషన్లను మనదేశంలో అందిస్తున్నది. ఫైనాన్షియల్, సెక్యూరిటీ మార్కెట్లో బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఉపయోగించడానికి ఆర్బీఐ, సెబీ కృషి చేస్తున్నాయి. బ్లాక్ చెయిన్ సేవలను ఇక్కడ విస్తృతం చేయడానికి ప్రైవేటు సంస్థ బ్లాక్ చెయిన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటైంది.

ఉపయోగాలు ఇవీ..

బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అన్ని రంగాలకూ ఉపయోగకరమే. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నుంచి ప్రభుత్వాలను నిర్ణయించే ఓటింగ్ వరకూ అన్నింటిలోనూ దీన్ని ఉపయోగించొచ్చు. ఇది పారదర్శకత, నమ్మకాన్ని కలిగిస్తుంది. మోసాలకు తావుండదు. అందరి అంగీకారంతోనే ఏ వ్యవహారమైనా నడుస్తుంది. అధికారులు, లేదా రాజకీయ పార్టీల ఇష్టాయిష్టాలతో పని లేకుండా సంక్షేమ పథకాలు ప్రభుత్వాల నుంచి నేరుగా లబ్ధిదారులకు అందుతాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి సంబంధించిన స్మార్ట్ కాంట్రాక్టును ఉపయోగించుకొని ఆస్తి కొనుగోలు చేస్తే దానికి సంబంధించిన అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి. సమాచార భద్రతకు ఢోకా ఉండదు. కొన్న వ్యక్తి ఎవరో.. అమ్మిన వారు ఎవరో కూడా తెలియదు. షాపింగ్‌తో మొదలు.. టెక్నాలజీని ఉపయోగించే ఏ రంగంలోనైనా బ్లాక్ చెయిన్ ఉపయోగపడుతుంది.
Blockchain2

బ్లాక్ చెయిన్ డిస్ట్రిక్ట్‌గా తెలంగాణ

ప్రస్తుతం బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వైపే ప్రపంచమంతా చూస్తున్నది. ఈ క్రమంలో తొలి బ్లాక్ చెయిన్ డిస్ట్రిక్ట్‌గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం టెక్ మహీంద్రా సంయుక్తంగా దేశంలోనే తొలి బ్లాక్ చెయిన్ డిస్ట్రిక్ట్‌ను నెలకొల్పడానికి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ఏర్పాటయ్యే సంస్థలు, స్టార్టప్‌లకు రాయితీలు, భూములు, నిధులను ప్రభుత్వం ఇవ్వనున్నది. తెలంగాణలో నూతన ఆవిష్కరణలకు అగ్ర తాంబూలం ఇస్తున్న ప్రభుత్వం.. ఇటీవల బ్లాక్ చెయిన్ ముసాయిదాను విడుదల చేసింది. 2025 నాటికి గ్లోబల్ జీడీపీలో 10 శాతం బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆక్రమించనున్నదని, 2030 నాటికి బ్లాక్ చెయిన్ ఏటా 3 లక్షల కోట్ల డాలర్ల వ్యాపారాన్ని సృష్టించనుందని నిపుణుల అంచనా. అన్ని రంగాల సంస్థలకు ఈ టెక్నాలజీ ప్రయోజనకరంగా మారడంతో రాబోయే రోజుల్లో బ్లాక్ చెయిన్ టాప్ పొజిషన్‌లోకి రావచ్చు. అది కూడా ఎంతో దూరంలో లేదు.

2879
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles