విలన్‌గా సిద్ధమే


Sun,May 26, 2019 01:47 AM

కడుపుబ్బ నవ్వించడం.. హృదయాలను బరువెక్కించి ఏడిపించడం.. ఈ రెండింటినీ సమతూకంతో అవలీలగా చేయగల అరుదైన నటుల్లో అల్లరి నరేష్ ఒకరు. అల్లరి నరేష్ సినిమాలంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను మనసారా నవ్వించే ఈ యువ కథానాయకుడు గమ్యంలో గాలి శీనుగా, శంభో శివ శంభోలో మల్లిగా హృదయాన్ని స్పృశించే పాత్రల్లో నటుడిగా తనలోని మరో కోణాన్ని చూపించాడు. మంచి పాత్రలు లభిస్తే నటనాపరంగా తనకు తిరుగులేదని మహర్షిలోని రవి పాత్రతో మరోసారి నిరూపించుకున్నాడు ఈ అల్లరోడు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన మహర్షిలో రవిశంకర్ పాత్రలో భావోద్వేగభరితమైన నటనతో అందరి ప్రశంసలూ అందుకుంటున్న అల్లరి నరేష్‌తో నమస్తే తెలంగాణ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.
Naresh

నటుడిగా మహర్షి సినిమా ఎలాంటి సంతృప్తినిచ్చింది?

కామెడీ సినిమాలు చేయడం వల్ల విజయాలతో పాటు మరో నాలుగు కొత్త సినిమాల్లో అవకాశాలు వస్తాయి. కానీ మహర్షి మాత్రం నటుడిగా నాకు గౌరవాన్ని తీసుకొచ్చింది. సినిమాలో రైతు సమస్యలపై పోరాటం నా పాత్రతోనే మొదలవుతుంది. ఆ సన్నివేశాల్లోని ఎమోషన్స్‌తో ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. నటుడిగా వినోదమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న సీరియస్ పాత్రలు కూడా చేయగలననే నమ్మకాన్ని ప్రేక్షకులతో పాటు దర్శకుల్లో కలిగించింది. ఆ పేరును ఈ సినిమా తీసుకొచ్చింది.

సోలో హీరోగా సాధించిన విజయంతో పోలిస్తే ఈ సక్సెస్‌కు ఉన్న తేడా ఏమిటని అనుకుంటున్నారు?

ఈ సినిమా వల్ల నా చిత్రాలకు ఓవర్సీస్ మార్కెట్ పెరుగుతుంది. కామెడీ హీరో ఇమేజ్‌ను మార్చుకునే అవకాశం దొరుకుతుంది. గమ్యం, శంభో శివ శంభో తర్వాత అలాంటి సినిమాలు ఎందుకు చేయడం లేదని చాలామంది ఇప్పటికీ అడుగుతుంటారు. అయితే నా దగ్గరకు వచ్చే పదిమంది నిర్మాతల్లో తొమ్మిది మంది కితకితలు, బెండు అప్పారావు లాంటి సినిమాలు కావాలని అడుగుతుంటారు. డిమాండ్ సైప్లె సూత్రం ప్రకారం నిర్మాతలకు ఏది కావాలో దానిని అందించాల్సిందే. ఈ సినిమాతో నటుడిగా నన్ను నేను నిరూపించుకునే అవకాశం దొరికింది.

ద్వితీయార్ధంలో మీ పాత్ర మహేష్‌బాబు క్యారెక్టర్‌పై ఆధిపత్యం చెలాయించిందని చెబుతున్నారు. నిజమా?

కథలోని ప్రధానాంశం నా పాత్రతో ముడిపడి ఉంటుంది. నాకు ఎదురైన సమస్యను మహేష్‌బాబు తనదిగా ఏ విధంగా స్వీకరిస్తాడు? ఊరి ఉనికి ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో నా ద్వారా ఆ సమస్యపై ఎలా పోరాడాడు అన్నది ఈ చిత్ర ఇతివృత్తం. సినిమాలో నా పాత్రకు ఎక్కువ సంభాషణలుంటే మహేష్ మాత్రం వింటూ ఆ సమస్యలను పరిష్కరించడానికి మార్గాలేమిటో ఆలోచిస్తూ కనిపిస్తారు. మహేష్‌బాబు కథతో పాటు దర్శకుడిని నమ్మి ఈ సినిమా చేశారు. అంతేకానీ నరేష్ కంటే నా పాత్రకే ఎక్కువగా ప్రాధాన్యం ఉండాలని ఆలోచించలేదు.

ఇంతకు ముందు గమ్యం, శంభో శివశంభో చిత్రాల్లో కూడా మీరు ఈ తరహా పాత్రలు చేశారు? కానీ, ఆ తర్వాత మళ్ళీ అలాంటి పాత్రలు చేయలేకపోయారు అందుకు కారణమేమిటి?

గమ్యం సినిమా తర్వాత చాలెంజింగ్ పాత్రలతో కూడిన కథలు చాలా వచ్చాయి. కానీ, అన్ని గమ్యంలో చేసిన గాలి శీను పోలికలతో ఉండడంతో వాటిని తిరస్కరించాను. కథలను వినిపించడానికి నా దగ్గరకు వచ్చే వాళ్లంతా నేను నటించిన అన్ని సినిమాలు చూసుంటారు. నన్ను ఫలానా రీతిలో చూపించాలి, జనాలు ఇలా చేస్తేనే చూస్తారనే ఊహలతో వస్తారు. అవుటాఫ్ బాక్స్ కథలు చెప్పేవాళ్లు మన దగ్గర చాలా తక్కువగా ఉన్నారు. గమ్యం, శంభో శివ శంభోలో పాత్రల గురించి వినగానే ఇవి మనం చేయాల్సిందే అనిపించింది. ఆ తర్వాత అలాంటి కథలు కొన్ని వచ్చాయి. కానీ, ఆ పాత్రలతో పెద్దగా కనెక్ట్ కాలేకపోయాను.

సహాయనటుడి పాత్రలో కనిపించడం వల్ల హీరోగా అవకాశాలు తగ్గుతాయని అనుకుంటున్నారా?

అలాంటిదేమీ లేదు. మహర్షి సినిమాలో నటించాను కదా.. అని ఓ పది సీన్లతో కూడిన సాధారణ పాత్రను ఇవ్వాలని ఎవరూ అనుకోరు. నా పాత్రకు ప్రాముఖ్యం లేకపోతే దర్శకనిర్మాతలు పిలవడం లేదు. ఆ నమ్మకాన్ని తెచ్చుకోవడం ఆనందంగా ఉంది. సోలో హీరోగా మాత్రమే నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. మల్టీస్టారర్‌తో పాటు మంచి క్యారెక్టర్స్ వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విలన్‌గా కూడా అవకాశం వస్తే నటిస్తాను.

ఒకప్పుడు ఏడాదికి వరుసగా నాలుగైదు సినిమాలు చేశారు. ఇప్పుడు మాత్రం సినిమాల వేగాన్ని తగ్గించారు?

గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఆరు కథలు విన్నాను. అవేవీ నచ్చలేదు. వేరే హీరోలతో చేసిన ఆ సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. విజయాల సంఖ్య పెంచుకుంటూ పోవాలి.. కానీ, పరాజయాల సంఖ్య కాదు. రోజు బిజీగా ఉండాలనే కారణంతో షూటింగ్ చేయకూడదు. కథాంశాల ఎంపికలో నేను కొన్ని తప్పులు చేశాను. సుడిగాడు తర్వాత నవ్వించాలనే నియమాన్ని పెట్టుకొని సినిమాలు చేశాను. సినిమా చూసి నవ్వుకున్నవారంతా కథలను మాత్రం గుర్తుపెట్టుకోలేకపోయారు. అలా కాకుండా కథలో ఇమిడిపోయే కామెడీతో సినిమాలు చేయాలనే సమయం తీసుకున్నాను.

సుడిగాడు తర్వాత మీ మార్కెట్‌కు మించి బడ్జెట్‌తో సినిమాలు చేయడం వల్లే వైఫల్యాలు ఎదురయ్యాయనే విమర్శలు వినిపించాయి?

సుడిగాడు తర్వాత యముడికి మొగుడు చేశాను. బడ్జెట్ ఎక్కువవుతుందని తెలిసే ఆ సినిమాను మొదలుపెట్టాం. అందులో గంట ఇరవై నిమిషాల గ్రాఫిక్స్ ఉంటాయి. దానివల్లే బడ్జెట్ పెరిగింది. ఓ సినిమాకు ఎంత అవసరమో అంతే ఖర్చుపెట్టాం తప్పితే నా బడ్జెట్ పెరిగింది కాబట్టి కావాలని ఖర్చుచేయలేదు. నాణ్యత కోసం ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి సినిమాకు బడ్జెట్ పెరిగింది.

మహర్షి సినిమా సక్సెస్ మీ ఆలోచన దృక్పథంలో మార్పులేమైనా తీసుకొచ్చిందా?

ప్రేమకథలు కాకుండా నా వయసుకు తగ్గ పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. నాకు ఓ కూతురుంది. ఇప్పడు కూడా లవ్‌స్టోరీస్ చేయడం సరికాదని అనిపిస్తుంది. రియల్‌లైఫ్‌కు దగ్గరగా ఉండే పాత్రలు చేయాలనుంది.
Naresh2

ఈ సినిమాలో వ్యవసాయం నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో నటిస్తున్న సమయంలో మీ నిజజీవితంలోని సంఘటనలు ఏమైనా గుర్తొచ్చాయా?

నేను పుట్టేటప్పటికే తాతయ్య భూములన్నీ అమ్మేశారు. నాన్న ఉన్నప్పుడు ఎప్పుడైనా ఊరికి వెళుతున్నప్పుడు అక్కడున్న భూముల్ని చూపిస్తూ ఇవి మనవేనని, ఆ తర్వాత అమ్మేశామని చెప్పేవారు. మా తాతయ్య అప్పులు తీసుకొచ్చి పంటలు వేయడం వల్ల భూమి మొత్తం పోయి ఇల్లును కోల్పోయే పరిస్థితి వచ్చింది. మా భూములకు ఎక్కువ రేట్లు ఉండడంతో అవి అమ్మేసి వేరే చోట తక్కువ ధరలో రెండెకరాలు కొన్నారు. మా తాతయ్యకు నలుగురు కొడుకులు. పిల్లలను పెంచడానికి ఆ రెండెకరాల భూమి సరిపోకపోవడంతో నాన్న బతుకుదెరువు కోసం వ్యవసాయంపై ఇష్టం ఉన్నా ఆ మమకారాన్ని కాదనుకొని చెన్నై వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఊళ్లో కొన్న భూముల కంటే పట్టణాల్లో కొన్న వాటికే ఎక్కువ డబ్బులొస్తాయి. కానీ, నాన్న మాత్రం వ్యవసాయం చేసుకోవడానికి కొంతైనా భూమి ఉండాలని చెబుతుంటారు. అలాగే ఈ సినిమాలో మహేష్‌బాబు ఓ సందర్భంలో సీఈవో రిషికుమార్‌లా కాకుండా కె.రిషికుమార్ సన్నాఫ్ కె. సత్యనారాయణలా మాట్లాడుతున్నానని డైలాగ్ చెబుతారు. ఆ డైలాగ్‌లో సత్యనారాయణ అన్న పేరు వినగానే అదోలా అయిపోయాను. రోమాలు నిక్కబొడిచాయి.

మనం తినే వాటిని మనమే పండించుకోవాలనే ఆలోచనలు మీకు ఉన్నాయా?

దివంగత నిర్మాత రామానాయుడుని చూసి ఆ లక్షణాన్ని నేర్చుకున్నాను. తన స్టూడియోలోనే ఆయన కూరగాయలు పండించేవారు. అలాగే ప్రకాష్‌రాజ్‌తో పాటు చాలామంది నటులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా మరో రెండుమూడేళ్ల తర్వాత పట్టణ పరిసరాల్లో భూమి కొనుక్కొని పంటలు పండించాలని ఉంది. మనది అన్న భావనలో ఓ తృప్తి, ఆనందం ఉంటుంది.

నటుడిగా ప్రత్యేకంగా ఫలానా పాత్రలు, సినిమాలు చేయాలనే కోరికలు ఉన్నాయా?

తమిళంలో విజయ్ సేతుపతి కథను నమ్ముకొని సినిమాలు చేస్తున్నారు. నిజ జీవితాలకు దగ్గరగా స్నేహితుల జీవితాల్లో జరిగినట్లుగా ఆయన కథాంశాలు ఉంటాయి. హీరోయిజం కనిపించదు. అలాంటి పాత్రలు నాకు చేయాలనుంది. యాక్షన్ కాకుండా ఫీల్‌గుడ్, ఎమోషనల్ కథాంశాలతో సినిమాలు చేయాలనుకుంటున్నాను.

సాధారణంగా మల్టీస్టారర్ సినిమాలు అనగానే తెలుగు ఇండస్ట్రీలో రకరకాల నిర్వచనాలుంటాయి. హీరోగా యాభైకి పైగా సినిమాలు చేసిన మీరు నటించిన మహర్షి సినిమాను మల్టీస్టారర్ అని అనుకోవచ్చా?

అలా అనుకోవద్దు. హీరోల మార్కెట్‌పై మల్టీస్టారర్ సినిమా ఆధారపడి ఉంటుంది. గమ్యం సినిమాలో హీరోగా తొలుత శర్వానంద్ పేరు పడుతుంది. ఆ తర్వాత నా పేరు వస్తుంది. కథ మొత్తం శర్వానంద్ పాత్ర చుట్టే తిరుగుతుంది. ఈ సినిమాలో కూడా కథ, సమస్య నాదే అయినా దానిని పరిష్కరించేది మాత్రం మహేష్‌బాబు పాత్రనే. తన జీవితాన్ని వదులుకొని నా కోసం వస్తాడు. అందుకే ఈ సినిమాలో నా పాత్రను ఓ క్యారెక్టర్‌గానే ఫీలవుతున్నాను తప్పితే మల్టీస్టారర్ అనుకోవడం లేదు.

మీ కుటుంబసభ్యులకు ఈ సినిమా చూపించారా?

అందరూ చూశారు. ముఖ్యంగా మా అమ్మకు ఈ సినిమా గురించి ముందు చెప్పలేదు. సినిమా చూసే ముందు నిన్ను చంపేస్తారా అని అడిగింది. అదే సందేహాన్ని నా భార్య వ్యక్తం చేసింది. అదేమీ లేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. చనిపోయే సన్నివేశాల్లో నిన్ను చూడలేకపోతున్నాం. అలాంటివి ఒప్పుకోవద్దని అమ్మ ఎప్పుడూ చెబుతుంది. గమ్యం తర్వాత అలాంటి సినిమాలు చేయవద్ద్దని అన్నది. ఈ సినిమాలో నన్ను చంపడానికి ప్రయత్నించే సన్నివేశం వస్తున్న సమయంలో అమ్మతో పాటు నా భార్య కళ్లు మూసుకున్నారు. మా వారందరికి ఈ సినిమా నచ్చింది. కానీ, పర్సనల్‌గా నేను తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యారు.

ఈ సినిమా చూసి మీ సతీమణి ఏమన్నారు?

తనకు బాగా నచ్చింది. కామెడీ కంటే నేను సీరియస్ రోల్స్ బాగా చేస్తానని నా భార్య నమ్ముతుంది. కామెడీ చేయడమే చాలా కష్టమని తనతో నేనూ ఎప్పుడూ చెబుతుంటాను.
Naresh1

దర్శకత్వం చేసే ఆలోచన ఉందా?

ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. రెండు పడవల ప్రయాణం కష్టం. ఇప్పుడే నటుడిగా కెరీర్ మళ్లీ ఊపందుకున్నది. దానిని ఇలాగే కొనసాగించాలనుకుంటున్నాను. రెండు మూడు సంవత్సరాల తర్వాత దర్శకత్వం గురించి ఆలోచిస్తాను.

చిన్నతనంలో వేసవి సెలవుల్ని ఎలా ఎంజాయ్ చేసేవారు?

చిన్నతనంలో వేసవి సెలవులు వస్తే నాన్నతో కలిసి సినిమా షూటింగ్‌లకు వెళ్లేవాణ్ణి. నాన్న సినిమాలతో నిరంతరం బిజీగా ఉండేవారు. పండుగలు, పుట్టినరోజులకు కూడా ఇంట్లో ఉండేవారు కాదు. అవుట్‌డోర్ షూటింగ్‌లు, చిత్రీకరణల కోసం విదేశాలకు వెళ్లినప్పుడు మమ్మల్ని వెంట తీసుకెళ్లేవారు. నా వేసవి జ్ఞాపకాలన్నీ నాన్న సినిమాలతోనే ముడిపడి ఉన్నాయి.

సినిమాలు కాకుండా మీ ఇష్టాలేమిటి?

గతంలో ఇంట్లో కంటే ఎప్పుడూ బయటే తిరుగుతూ ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు బయటకు వెళ్లడం పూర్తిగా మానేశాను. షూటింగ్ లేకపోతే ఇంటికే పరిమితం అవుతాను. నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్‌లు చూస్తుంటాను. వాటి వల్ల సమయం వృథా అవుతుందని అనుకోవడం లేదు. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకోవడంతో పాటు వాటిని ప్రేక్షకులు ఎందుకు ఇష్టపడుతున్నారో తెలుసుకోవచ్చు. క్రికెట్, సినిమా ఇవీ తప్ప నా ప్రపంచం పెద్దది కాదు.

2276
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles