సుఖీభవ సులోచనమ్మ!


Wed,May 22, 2019 02:50 AM

అసలే పట్టణం. ఆపై అపార్టుమెంటు కల్చర్. ఎవ్వరేమైపోతే మనకేంటి అనుకునే కాలం. కాంక్రీటు భవంతులు, నాలుగు గోడల మధ్యే ప్రేమానుబంధాలు. అయితే వీటన్నింటి మధ్య ఒక స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం అక్కడుంది. పచ్చదనం పరుచుకున్న ఆ బృందావనంలో కడుపునిండా అన్నం పెట్టే సులోచనమ్మ ఉన్నది. ఆ తల్లి వాత్సల్యం స్వచ్ఛమైనది. ఆ అమ్మ ప్రేమ అనంతం. సమయమేదైనా ఆకలి తీర్చే ప్రేమతత్వం ఆ సులోచనమ్మ సొంతం. అమ్మా.. అని పలుకరిస్తే.. సొంతబిడ్డలెక్క చూసుకుంటది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. వేలాది మంది ఆకలి తీర్చింది సులోచనమ్మ. ఆ అమ్మను జిందగీ పలుకరిస్తే.. ముందు నువ్ తిను బిడ్డ అంటూ వడ్డించి, తిన్న తర్వాతే మాట్లాడింది.
Amma
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గొర్రెపల్లికి చెందిన ఏనుగు శ్రీనివాసరావు, రాధమ్మ దంపతుల కుమార్తె సులోచనమ్మ. ఉన్నత కుటుంబం కావడంతో దేనికీ లోటు ఉండేది కాదు. 1970లలోనే గొర్రెపల్లి చుట్టుపక్కల గ్రామాలకు శ్రీనివాసరావు, రాధమ్మలు అండగా ఉండేవారు. వర్షాలకు, వరదలకు నష్టపోయిన వారిని ఆదుకునేవారు. నిత్యం రైతులకు తోడుగా నిలుస్తూ, ఆర్థిక సాయం చేసేవారు. తమ ఇంటికి ఎవరొచ్చినా కడుపు నిండా అన్నం పెట్టిన తర్వాతే పంపేవారు. వారి కూతురు సులోచనమ్మ ఆ సేవాగుణాన్ని వారసత్వంగా పొందారు. 1978లో మణికొండ వేదకుమార్‌తో వివాహమయ్యాక తన సేవల్ని మరింత విస్తరించారు. వేదకుమార్ తల్లిదండ్రులు భూపతిరావు, చంద్రమ్మలు కూడా దాతృత్వానికి మారు పేరు. వీరు కూడా ఉన్నత కుటుంబం కావడంతో ఆ కాలంలోనే భూములు, స్థలాలు విరాళంగా ఇచ్చారు. వందకు పైగా పేద జంటలకు వివాహాలు జరిపించారు. తల్లిదండ్రులు, అత్తమామల స్ఫూర్తితో ఎన్నో మంచి పనులు చేస్తున్నారు సులోచనమ్మ. సాయమంటూ ఎవ్వరొచ్చినా కాదనకుండా ఇస్తున్నారు. అనాథ పిల్లలకు, వృద్ధులకు ప్రతీ ఏటా బట్టలు పంపిణీ చేస్తున్నారు. వృద్ధాశ్రమాలకు, అనాథాశ్రమాలకు ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రతీ ఎండాకాలం తైద అంబలి(పెరుగుతో చేసింది) పంపిణీ చేస్తున్నారు.

జై తెలంగాణ నినాదం కోసం..

2010లో హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం రగులుతున్న సమయమది. తెలంగాణ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. ఒక పొద్దు కడుపు మాడ్చుకున్నా.. సాయంత్రమో, రాత్రికో సులోచనమ్మ వారి కడుపు నింపేవారు. ఒక్కసారి వందల మందికి భోజనాలు పెట్టేవారు. సులోచనమ్మ ఇంటి దగ్గర తృప్తిగా తిని.. ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఉదయం వస్తే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వస్తే భోజనం ఎప్పుడూ సిద్ధంగా ఉంచేవారు సులోచనమ్మ. ఇలా 2010 నుంచి 2014 వరకూ 50 వేల మందికి పైగా ఆకలి తీర్చారు. ఇలా మలిదశ ఉద్యమంలో భాగస్వాములయ్యారు సులోచనమ్మ దంపతులు. నాలుగేండ్లుగా ఆమె ఉద్యమకారులకు అమ్మగా.. అండగా నిలిచారు. ఏ రాత్రయినా అమ్మ దగ్గరికెళ్తే అన్నం పెడుతుందనే భావన అప్పుడు ఉద్యమకారుల్లో ఉండేది.
Amma1

తమ భూముల్లో పండించినవే!

అన్నం ఉచితంగా పెట్టినా, పండ్లు, కాయగూరలు దానం చేసినా.. అవన్నీ పండించేది వారి సొంత భూముల్లోనే. వారు నాటి నుంచి నేటి వరకు చేస్తున్నది సేంద్రియ వ్యవసాయమే. ప్రజ్ఞాపూర్‌లోని తమ భూమిలో పూర్తిగా సేంద్రియ, సంప్రదాయ వ్యవసాయం చేయిస్తున్నారు. అన్ని రకాల కూరగాయలు, చిరుధాన్యాలు పండిస్తున్నారు. రసాయనాలు లేకుండా అన్నిరకాల పండ్లు పండిస్తున్నారు. వారం వారం వెళ్లి సరిపడా కూరగాయల్ని తీసుకొస్తారు. స్వయంగా ఆమే వాటిని వండుతారు. ఆకలి అని వచ్చిన వారి కడుపు నింపుతారు. తమ తోటలో పండిన కూరగాయలను, పండ్లను అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు పంపిస్తారు. ఇప్పటికీ ఇంటికోసమైనా, బయటివాళ్లకోసమైనా కుండ నీటినే వాడుతున్నారు. నలుగురి ఆకలి తీర్చుతూ, అమ్మలా ప్రేమను పంచుతూ ఆత్మసంతృప్తి పొందుతున్నారు సులోచనమ్మ.

అభాగ్యులకు చేయూత: చిన్నతనం నుంచి వృద్ధాప్యం వచ్చేంత వరకూ సేవాగుణాన్ని మానలేదు సులోచనమ్మ. వృద్ధులకు, అనాథ చిన్నారులకు తన వంతుగా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఐదేండ్ల నుంచి వృద్ధులకు, అనాథలకు ప్రతీ ఏటా బట్టలు పంపిణీ చేస్తున్నారు. పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఆహారం పంపిస్తున్నారు. స్థానికులకు ఏ సమస్య వచ్చినా కూడా సులోచనమ్మే పెద్దదిక్కు. నెల నెలా వృద్ధులు తమ ఇంటికొచ్చి భోజనం చేసి దీవించి వెళ్తుంటే.. దేవుళ్లు దీవించి వెళ్తున్నట్లుగా అనిపిస్తుందని అంటున్నారు సులోచనమ్మ. ఇప్పటికీ రోజుకు 18 గంటలు వాళ్లింట్లో పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. ఆమే స్వయంగా ఇంట్లో భోజనాన్ని తయారు చేసి, తన చేత్తోనే వడ్డిస్తున్నారు. కడుపు నిండిన వారి కళ్లలో ఆనందాన్ని చూసి తన కడుపు నింపుకుంటున్నారు.

బాలారణ్యంలో పాఠాలు!: నేటి తరం పిల్లలకు కూరగాయలు ఎక్కడ పండుతాయో తెలియదు. ఎలా పండిస్తారో తెలియదు. ప్రస్తుతం మనం తింటున్న కూరగాయలు ఎలా కలుషితం అవుతున్నాయో కూడా తెలియదు. వీరికి ప్రాక్టికల్‌గా సాగు పద్ధతుల్ని చూపించాలనుకున్నారు సులోచనమ్మ. 2008 నుంచి ప్రతినెలా పిల్లల్ని తమ వ్యవసాయ క్షేత్రమైన బాలారణ్యంలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పటికీ ఎడ్లను, నాగలిని ఉపయోగించి వారి భూమిలో వ్యవసాయం చేయిస్తున్నారు. పొలం దున్నే విధానాన్ని, వరి నాటే ప్రక్రియను, ఇంకుడు గుంతలు వాటిపై అవగాహన.. ఇలా అన్ని అంశాలపైన పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలకు వనభోజనాల మాదిరిగా కూడా ఈ విజ్ఞానయాత్ర ఉపయోగపడుతున్నది. పల్లె సంస్కృతి, పక్షులు, జంతువులను అక్కడి వాతావరణాన్ని పిల్లలకు పరిచయం చేస్తున్నారు సులోచనమ్మ.
Amma2

అందులోనే నాకు సంతృప్తి..

ఉద్యమ సమయంలో కొంతమందికైనా అన్నం పెట్టాననే సంతృప్తి మిగిలింది. ఆకలి అని వచ్చిన వారికి ఇప్పటికీ లేదనకుండా కడుపు నింపుతా. అందులోనే నాకు సంతృప్తి ఉన్నది. పిల్లలకు వ్యవసాయం గురించి చెప్పాలి. ఐదేళ్ల కింద కూరగాయలు ఎక్కడ పండుతాయి అని ఒక పిల్లాడినడిగితే షాపులో పండుతాయి అన్నాడు. ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పటి నుంచి బాలారణ్యానికి పిల్లల్ని తీసుకెళ్తున్నాం. మన సంస్కృతి, సంప్రదాయం, వ్యవసాయం అన్నింటినీ పిల్లలకు పరిచయం చేస్తున్నాం. నేను చేసే ప్రతీ పనిలో నా భర్త వేదకుమార్ సహకారం ఉంటుంది. ఆయన ప్రోత్సాహం వల్లే ఇదంతా చేస్తున్నా.
- మణికొండ సులోచన

అది 1995వ

సంవత్సరం అక్టోబర్ మాసం. వర్షాల తర్వాత వచ్చే వరదలకు చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్ మూసీ కాల్వ కంపు కొడుతున్నది. అక్కడ ఆశ్రయం లేక కాల్వ ఒడ్డుపైనే తలదాచుకున్న కుటుంబాలున్నాయి. వారి పరిస్థితి గందరగోళం, అయోమయం. పాత చీరెలు, దుప్పట్లు అడ్డుపెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు వారు..మహిళలకు, పిల్లలకు కట్టుకునేందుకు సరైన బట్టలు లేవు. ఒంటిమీదున్నవీ చిరిగినవే. చీకటిపడితే భయం. వెలుతురే లేని ఆ ప్రాంతానికి ఆహారాన్ని అందించడానికి వచ్చారు వేదకుమార్ (సులోచన భర్త). ఆకలితో అలమటిస్తున్న ఆ అభాగ్యులు.. అన్నం కోసం ఒక్కసారిగా ఎగబడ్డారు. గిన్నెల్లో పట్టుకొని, ఆవురావురుమంటూ తింటున్నారు. ఆయనవెంట వచ్చిన సులోచన ఆ దయనీయ దృశ్యాలను చూసి కన్నీరు పెట్టారు. అప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయం.. వేలాది మంది అన్నార్థుల కడుపు నింపింది. నాటి నుంచి నేటి వరకూ వారింట్లో రోజుకు 18 గంటలు పొయ్యి వెలుగుతూనే ఉన్నది. ఆకలంటూ వచ్చిన వారికి స్వయంగా తానే వండి కొసరి కొసరి వడ్డిస్తున్నది సులోచనమ్మ.

- పడమటింటి రవికుమార్
- గడసంతల శ్రీనివాస్

1185
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles