ఎవరెస్టంత లక్ష్యం వీరిది!


Tue,May 21, 2019 08:03 AM

Evrest
ఎన్ని అవమానాలు, ఎన్ని అడ్డంకులు.. ఎన్ని ఛీత్కారాలు, ఎన్ని చీదరింపులు.. అవేవీ వీరి ప్రయత్నానికి ఆటంకం కాలేదు. శిఖరమంత లక్ష్యం ముందు అవన్నీ చిన్నబోయి వీరికి తలొంచాయి. ఆ అవమానాలనే ఆయుధాలుగా, ఛీత్కారాలనే చప్పట్లుగా మలుచుకున్న ధీరవనితలు ఈ గిరిజన బిడ్డలు. కడుపు నింపుకోవడానికి కట్టెలమ్మిన ఆ అడవి బిడ్డలు.. నేడు దేశం గర్వించే స్థాయికి చేరుకోబోతున్నారు. మారుమూల అడవి నుంచి ఆకాశమంత ఎవరెస్ట్ వరకూ వీరి ప్రయాణం అనన్య సామాన్యం. త్వరలోనే ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించబోతున్న ఆ గిరిజన బిడ్డలను జిందగీ పలుకరిస్తే.. తమ కష్టాల యాత్రను కళ్లకు కట్టినట్లు వివరించారు.

జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం, దానిని సాధించడం.. ఇవే గొప్ప విషయాలు అనుకుంటారు చాలామంది. కానీ.. ఆ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చేసే యుద్ధం, మానసిక సంఘర్షణల ప్రయాణమే చాలా గొప్ప అంటుంటారు విజేతలు. అలాంటి ప్రయాణమే వీరిది. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఈ అక్కాచెల్లెళ్లు(వరసకు) ఎన్నో బాధలు పడ్డారు. అవమానాలు ఎదుర్కొన్నారు. నా అనుకున్నవారు అండగా నిలువక పోయినా వెనుకడుగు వెయ్యలేదు. చివరి వరకూ పోరాడుతూనే ఉన్నారు. ఇన్నాళ్లూ సమాజంతో చేసిన పోరాటం ఒక ఎత్తయితే.. ఇప్పుడు క్లిష్టపరిస్థితులతో చేసే చివరి యుద్ధం మరో ఎత్తు. వీరు గెలిస్తే.. తమ తెగ గిరిజనులు గెలిచినట్లే. ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేని తమ ఇంటి ఆడబిడ్డలు గెలిచినట్లే. ఆదరణ కరువైన ప్రతి ఆడబిడ్డ్డా గెలిచినట్లే. అందుకే కంటికి కనిపించని శత్రువుతో వీరు తుది యుద్ధం చేస్తున్నారు. ఎవరెస్ట్ ఎక్కి, జెండా పాతడానికి పయనమయ్యారు.

అడవిబిడ్డలకు అరుదైన అవకాశం

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని మారుమూల గిరిజన గ్రామం భీమన్‌గొంది. ఈ గ్రామానికి చెందిన మడావి కన్నిబాయి, కొలాం కొఠారి గ్రామానికి చెందిన మడావి కల్పన అక్కాచెళ్లుళ్లు (పెద్దమ్మ, చిన్నమ్మ పిల్లలు). సాహసం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చదువుకునే రోజుల నుంచే ఆటల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచారు. గుట్టలు ఎక్కడం, దిగటం, లోతైన నీటిలో దిగటం, పరుగు పందెంలో రాణించడం వీరికి సహజసిద్ధంగా వచ్చాయి. అందుకే వీరిద్దరూ ఎవరెస్ట్ పర్వతం ఎక్కేందుకు ఎంపికయ్యారు. ఈ ఇద్దరు గిరిజన యువతులు పలు సాహస ప్రదర్శనల్లో పాల్గొని రాష్ట్రవ్యాప్త గుర్తింపు పొందారు. ఫలితంగా హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్ వీరిద్దరినీ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడానికి ఎంపిక చేసింది. దేశవ్యాప్తంగా 20 మందికి అవకాశం వస్తే తెలంగాణ నుంచి ఈ ఇద్దరు అడవి బిడ్డలకు ప్రాధాన్యం దక్కింది.

ఇద్దరిదీ కట్టెలమ్మి బతికిన నేపథ్యం

కన్నిబాయి ఇంటి నుంచి పొలానికి 47 కిలోమీటర్లు ప్రయాణం. అదికూడా అడవిలోనే. ఎక్కడో మారుమూల గ్రామం నుంచి చెట్లు, పుట్టలు, గుట్టలు, రాళ్లు రప్పలు దాటుకొని 47 కిలోమీటర్లు వెళ్లి, అక్కడ వ్యవసాయం చెయ్యాలి. అంత కష్టపడి పండించిన పంట.. చేతికొచ్చేసరికి మిగిలేది శూన్యమే. మరి ఇల్లు గడవాలంటే ఆ అడవి బిడ్డలకు ఒక్కటే కట్టెలు కొట్టడమే ఉపాధి. ఆర్థిక ఇబ్బందులను తట్టుకునేందుకు అదొక్కటే మార్గం. తండ్రి అడవులకు వెళ్లి కట్టెలు కొట్టుకొస్తే.. ఆ మోపులను దగ్గర్లోని టౌన్‌లో అమ్మేవాళ్లు కన్నిబాయి కుటుంబం. రోజుకు 12 కట్టెల మోపులు అమ్మేవారు. అప్పట్లో ఒక కట్టెల మోపునకు కేవలం ఐదు రూపాయలే వచ్చేవి. వాటిని అమ్మగా వచ్చే డబ్బుతో ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకునేవారు. కుటుంబం గడవడానికి ఊర్లో 500 ఆవులు, గేదెలు మేపింది కన్నిబాయి. బతకడానికి తప్పు చెయ్యకుండా.. ఏ పనైనా చేసుకోవచ్చు అనేది అప్పటి నుంచే అవగాహన చేసుకున్నది. ఇప్పుడు కన్నిబాయిని చూసి ఆ ఊరి ప్రజలంతా సంతోషపడుతున్నారు.

ఇక చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది కల్పన. ఇటీవల తల్లి కూడా చనిపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడింది. ఇల్లు గడవడం కోసం తోబుట్టువులతో కలిసి కట్టెలు అమ్మేది. నలుగురు సంతానంలో కల్పన చిన్నది. ఆసిఫాబాద్‌లో చదువుకున్నది. తను కూడా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్‌లో ప్రావీణ్యం సంపాదించింది. తల్లి చనిపోయిన తర్వాత తోబుట్టువులు చేరదీయకపోవడంతో హాస్టల్‌లోనే ఎక్కువగా గడిపేది. ఈ క్రమంలో కల్పనను అక్కున చేర్చుకున్నది కన్నిబాయి. సాహస క్రీడల గురించి కల్పనకు వివరించింది. ఆమెను పోటీలకు సిద్ధం చేసి గెలిచేలా ప్రోత్సహించింది కన్నిబాయి. ఆ కసితో ఎన్ని అడ్డుంకులు ఎదురైనా వాటిని దాటుకుంటూ ఎవరెస్ట్ ఎక్కేందుకు ఎంపికైంది కల్పన.

12 యేండ్ల నుంచే పోరాటాలు

కన్నిబాయికి చిన్నప్పటి నుంచి ధైర్యం ఎక్కువ. ఆరు నుంచి పదో తరగతి వరకు ఆసిఫాబాద్ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నది కన్నిబాయి. ఏడో తరగతి చదువుకుంటున్నప్పుడు సెలవులకు ఇంటికి వచ్చింది. ఆ సమయంలో వేరే తెగకు చెందినవారు కన్నిబాయి కుటుంబానికి చెందిన భూమిని కబ్జా చేశారు. దీంతో తల్లిదండ్రులు రోడ్డునపడ్డారు. ఈ క్రమంలో ధైర్యం చేసిన కన్నిబాయి, ఆ వయసులోనే తల్లిదండ్రుల నుంచి సమాచారం సేకరించి, సర్వేనంబర్లు తీసుకొని, ఆ వివరాలన్నీ ఓ లెటర్ రూపంలో రాసింది. అప్పటికి 12 యేండ్ల వయసున్న కన్నిబాయి తల్లిని వెంటబెట్టుకొని చాలా ధైర్యంగా భీమన్‌గొంది నుంచి ఉట్నూర్ ఐటీడీఏకు చేరుకున్నది. అక్కడ పీఓ ఎవరో తెలియకుండానే. ఆయనతోనే మాట్లాడింది. కేవలం రెండు రోజుల్లోనే సమస్య పరిష్కరించుకున్నది. ఈ క్రమంలో ఇంటికి వచ్చిన కన్నిబాయికి తన తెగవారి నుంచి ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఎవరు చెబితే చేస్తున్నావ్? నువ్ మా తెగకు పుట్టిన అమ్మాయివి కావు? ఇంతధైర్యం ఎక్కడిది? అంటూ ఇబ్బంది పెట్టేవారు. అయినా వాటిని లెక్కచెయ్యకుండా అప్పటి నుంచి ఎక్కడ సమస్య ఉన్నా.. అక్కడికి వెళ్తూ గిరిజన మహిళలపాలిట ఆశాజ్యోతిగా మారింది కన్నిబాయి.

గిరిజనుల కోసం సొసైటీ

ఒకవైపు చదువు కొనసాగిస్తూనే గిరిజనుల అభ్యున్నతి కోసం కొలాం సీవీటీసీ మహిళా డెవలప్‌మెంట్ వెల్ఫేర్ సొసైటీని రిజిస్టర్ చేయించింది కన్నిబాయి. దాని ద్వారా వారి తెగ గిరిజనులకు ఎన్నో పనులు చేయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 45 పథకాలు, కార్యక్రమాలకు సంబంధించి గిరిజనుల్లో అవగాహన కల్పించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 5 మండలాల్లోని గిరిజనులకు 150 పట్టాభూములు వచ్చేలా పోరాడింది కన్నిబాయి. మూడు మండలాల్లోని కరంట్ లేని గిరిజన గ్రామాల్లో.. ఐటీడీఏ పీఓతో మాట్లాడి విద్యుత్ సౌకర్యం కల్పించింది. బడి మానేసిన పిల్లలను బడులకు పంపించడం. తల్లిదండ్రులతో మాట్లాడడం, వారికి చదువుపై కౌన్సెలింగ్ ఇవ్వడం వంటి ఎన్నో మంచి పనులు చేసింది. తన సొసైటీలో అక్క కల్పనను చేర్చుకొని ఎన్నో అభివృద్ధి పనుల్లో భాగస్వామిని చేసింది.
Evrest1

కచ్చితంగా సాధిస్తాం

మామీద నమ్మకం పెట్టుకున్నవారు చాలామంది ఉన్నారు. వారి ఆశలు అడియాశలు కానివ్వం. మామీద నమ్మకంతో ఐటీడీఏ అధికారులు చాలా ఖర్చు చేస్తున్నారు. ఉట్నూర్ ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్య, దిలీప్‌కుమార్, అడ్వెంచర్ క్లబ్ నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నారు. వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా నాన్న ఆశయం నెరవేర్చాలి. మాకు సహకారం అందించిన వారిందరికీ థ్యాంక్స్. మా లాంటి వారికి ఇలాంటి అవకాశం దొరకడం చాలా ఆనందంగా ఉంది. మా తెగకు చెందిన ఆడపిల్లలు బయటికి రారు, చదువు గురించి పెద్దగా తెలియదు. వారిని మా దారిలోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం. కచ్చితంగా లక్ష్యాన్ని సాధిస్తాం.
- మడావి కన్నిబాయి
Evrest2

అవకాశం వచ్చిందిలా..!

చిన్నప్పటి నుంచే కొండలు, గుట్టలు, చెట్లు ఎక్కడంలో చాలా ముందుండేవారు కన్నిబాయి, కల్పన. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్ అన్నింటిలోనూ ప్రతిభ చూపేవారు. కన్నిబాయి కబడ్డీలో రాష్ట్రస్థాయి క్రీడాకారిణి. జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ప్రథమ, ద్వితీయ బహుతులు గెలుచుకున్నది. జూనియర్‌గా ఉన్నప్పుడే సీనియర్ కబడ్డీల్లో ఆడేది కన్నిబాయి. నెహ్రూ యువకేంద్రం ఆదిలాబాద్ నుంచి వచ్చిన పేపర్ ప్రకటనతో వీరి ప్రస్థానం మలుపు తిరిగింది. అడ్వెంచర్ క్లబ్ ద్వారా సాహస క్రీడలకు మొదటి ప్రయత్నంలోనే ఎంపికైంది కన్నిబాయి. వాటర్ ర్యాపింగ్ పోటీలకు వైజాగ్ వెళ్లింది. ఈ క్రమంలో తన సోదరి కల్పనను ప్రోత్సహించి పోటీలకు తీసుకెళ్లింది. వైజాగ్‌లో జరిగిన పోటీల్లో కన్నిబాయి రెండో స్థానంలో, కల్పన మూడో స్థానంలో నిలిచారు. అలా ఇద్దరూ ఎవరెస్ట్ ఎక్కేందుకు ఎంపికయ్యారు.

- డప్పు రవి

337
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles