విటమిన్ ఢీ


Tue,May 21, 2019 01:35 AM

విటమిన్లు.. ఆరోగ్యానికి ఆయువులాంటివి.. అన్ని విటమిన్లు సమపాళ్లలో ఉంటేనే ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది. కానీ చాలామందికి విటమిన్ల లోపం ఓ సమస్యగా మారుతున్నది. అందులో ప్రధానమైనది.. ఎముకలగూడు లాంటి శరీరాన్ని దృఢంగా.. సజీవంగా ఉంచడంలో విటమిన్-డి ఉపయోగపడుతుంది. మరి.. డీ విటమిన్ లోపం వల్ల ఏ సమస్యలు వస్తాయి? అది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దానిని ఎలా అధిగమించాలి? తెలుసుకుందాం.
vitamin-d

ఎంత ఎండ అవసరం?

విటమిన్-డీ సూర్యరశ్మి ద్వారా వస్తుంది. అయితే ఏ సమయంలో వస్తుంది? ఎంత అవసరం అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. రోజూ ఒక గంట పాటు సూర్యరశ్మి తగిలితే విటమిన్-డి లోపం పరిష్కారం అవుతుంది. ఉదయం లేదా సాయంత్రం సూర్యరశ్మి అయితే మేలు. నోటి ద్వారా తీసుకునే మాత్రలు కూడా విటమిన్-డి లోపాన్ని అధిగమించడానికి దోహదపడతాయి.

ప్రస్తుత రోజుల్లో జీవనశైలి ఆరోగ్య సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి. ఉద్యోగం.. కెరీర్ పరుగులో ముందుంటున్నారు కానీ.. చుట్టూ ఆరోగ్య సమస్యల్ని పోగు చేసుకుంటున్నామనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. అలాంటి జీవనశైలి ఆరోగ్య సమస్యల్లో ఒకటి విటమిన్-డీ లోపం.

మౌనిక.. మెడికల్ డివైజ్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరింటి వరకుఆఫీస్ డ్యూటీ. ఎండకు ఎండేది లేదు.. వానకు తడిసేది లేదు. ఏసీ జీవితం హాయిగా ఉంది. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు గమనిస్తే ఆమెకు తెలియకుండానే ఆరోగ్యానికి హాని జరుగుతున్నది. ఒక సంవత్సరంగా ఆమె అసలు సూర్యుడినే చూడలేదట. కాళ్లు.. చేతులు నొప్పి లేస్తున్నాయని సంప్రదించింది. పరీక్షలు చేసి విటమిన్-డీ లోపం ఉన్నట్లు నిర్ధారించాం.

స్వప్న.. కార్పొరేట్ హాస్పిటల్‌లో నర్స్‌గా పనిచేస్తుంది. ఉద్యోగంలో చేరిన తర్వాత ఆమె చాలా బలహీనంగా తయారైంది. హాస్పిటల్‌లోనే పనిచేస్తున్నా సమస్య తెలుసుకోలేకపోయింది. పని ఒత్తిడి వల్ల అలా అవుతున్నానేమో అనుకున్నది తప్పితే ఇదొక ఆరోగ్య సమస్య అని ఆమె భావించలేదు. పెండ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో ఇటీవల ఆమె కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నది. తాను బలహీనంగా మారడానికి విటమిన్-డీ లోపమే కారణమనే విషయం తెలిసింది.

కారణాలేంటి?

సూర్యరశ్మి శరీరంలోని ఎముకలకే కాకుండా.. రోగ నిరోధక వ్యవస్థ చాలా అవసరం. అంటే విటమిన్-డీ పుష్కలంగా ఉంటే శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడంతో పాటు.. వేరే ఇతర రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు. బయటకు వెళ్లకుండా ఇళ్లలో ఉండే మహిళలు.. ఆఫీసుల్లో పనిచేసేవాళ్లు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ధరించే దుస్తులు కూడా సూర్యరశ్మిని పొందడంలో దోహదపడుతాయి. మహిళలకు సహజంగా జరిగే హార్మోన్ మార్పులు, మెనోపాజ్ వంటి కారణాల వల్ల కూడా డీ విటమిన్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే సూర్మరశ్మి ఒక్కటే కారణం కాదు. తినే ఆహారంలో రిఫైన్డ్ ఆయిల్స్ లాంటివి విపరీతంగా ఉపయోగించడం.. కొలెస్ట్రాల్ పెరగడం.. సరైన పోషక విలువలున్న ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలు కూడా ఈ సమస్యను ప్రేరేపిస్తున్నాయి.

ఎంత ఉండాలి?

మిల్లీలీటర్ రక్తంలో 75 నానోగ్రాముల విటమిన్-డి ఉంటే అది సరైనపాళ్లలో ఉన్నట్లు లెక్క. అదే 50-75 నానోగ్రాములు ఉంటే విటమిన్-డి తగినంత లేదని భావించాలి. మిల్లీలీటరుకు 50 నానోగ్రాముల కన్నా తక్కువ విటమిన్-డి ఉంటే దానిని లోపంగా పరిగణిస్తాం. భారత మహిళల్లో విటమిన్-డి మిల్లీలీటరు రక్తంలో 5-20 నానోగ్రాములు మాత్రమే ఉందనేది ఆలోచించాల్సిన విషయం.

విటమిన్-డి లోపం కేవలం మహిళల్లో మాత్ర మే కాదు, పురుషుల్లోనూ ఉంది. కాకపోతే మహిళలతో పోలిస్తే అది చాలా తక్కువన్నమాట.

సూచనలేంటి?

విటమిన్-డీ లోపం సమస్య ఉన్నవారు త్వరగా అలసిపోతారు. కీళ్ల నొప్పులతో బాధపడుతారు. తరచూ పాదాలు వాస్తుంటాయి. ఎక్కువ సేపు నిలబడలేకపోతారు. కండరాలు బలహీనంగా ఉంటాయి. అయితే వీటిని చాలామంది పట్టించుకోరు. విటమిన్-డి లోపం క్రమక్రమంగా శరీర భాగాలన్నింటినీ బలహీనపరుస్తుంది. దీంతో వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకలు, కీళ్లు, కండరాల నొప్పులు మరింత తీవ్రం అవుతాయి.

ఎలాంటి నష్టాలు?

విటమిన్-డి లోపం వల్ల శరీరంలో క్యాల్షియంను సేకరించే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా ఎముకలు, కండరాలు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. ఎముకలు విరిగిపోవచ్చు కూడా. మధుమేహ వ్యాధి రావచ్చు అని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. వృద్ధులలో డిమెన్షియా వ్యాధి వస్తుంది. సాధారణంగా అయితే విటమిన్-డీ లోపం వల్ల తీవ్రమైన అలసట వస్తుంది. ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. మానసిక స్థితిలో తేడా ఏర్పడుతుంది. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇన్ఫెక్షన్ల బారిన పడుతారు. ఇన్సులిన్ ఉత్పత్తిలో తేడాలు వస్తాయి. అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంది. హృదయ, మూత్రపిండాల వ్యాధులు వస్తాయి. శరీరం క్యాల్షియంను శోషించుకోదు. క్యాల్షియం తగ్గితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

పిల్లల్లో ఎలా ఉంటుంది?

చిన్నపిల్లల్లో విటమిన్ డీ లోపించకుండా జాగ్రత్తపడాలి. డీ విటమిన్ పుష్కలంగా ఉంటే ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా జరుగుతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచే ఉదయం.. సాయంత్రం వేళ్లలో ఎండలో ఉంచడం మంచిది. పాలు పండ్లతో పాటు, పాలకూరను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. పిల్లలను ఎండలో ఉంచడం వల్ల సూర్యరశ్మి శరీరంపై పడ్డప్పుడు చర్మం కింద ఉండే కొన్ని కణాలు విటమిన్ డీని స్వయంగా ఉత్పత్తి చేస్తాయి.

vitamin-d2

ఎలా పూరించాలి?

విటమిన్-డి భర్తీకి సప్లిమెంట్లు వేసుకునే బదులుగా ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మంచిది. సాల్మన్, ట్రాట్, ట్యూనా, మ్యాకెరల్, ఈల్ వంటి నూనె కలిగిన చేపల్లో విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. తాజా చేపలు లభించని పక్షంలో క్యాన్లలో లభించే ట్యూనా, సొర చేపలు తీసుకున్నా ఫలితం ఉంటుంది. పోర్టొబెల్లో మష్రూమ్స్, ఆయిస్టర్ మష్రూమ్స్ తీసుకోవడం వల్ల కూడా విటమిన్-డి పొందవచ్చు. పాలు, పెరుగు తీసుకోవడం వల్ల కూడా విటమిన్-డిని పొందవచ్చు. గుడ్డులోని పచ్చసొనలో విటమిన్-డి అధికంగా ఉంటుంది.

vitamin-D3

95% మహిళల సమస్య ఇది

విటవిన్ ఢీ సమస్య కేవలం మౌనిక.. స్వప్న పరిస్థితి మాత్రమే కాదు. డీ-విటమిన్ లోపంతో మనదేశంలో 95% మంది మహిళలు బాధపడుతున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. ఉత్తరభారత దేశంలో అయితే ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉందట. 69% మంది నార్త్ ఇండియన్ మహిళలు విటమిన్-డి సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. అక్కడ కేవలం 5% మంది మహిళలకు మాత్రమే తగినపాళ్లలో విటమిన్-డి అందుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఢిల్లీ ఎయిమ్స్, ఫోర్టిస్ హాస్పిటల్స్ చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇది ఇంతటితో ఆగకపోవచ్చనీ.. చేజేతులారా ఇలాంటి సమస్యలను కొనితెచ్చుకుంటున్నారనీ ఈ సర్వే చేసిన నిపుణులు అన్నారు. విటమిన్-డీ లోపం అనేది పూర్తిగా జీవనశైలి సంబంధిత సమస్య కాబట్టి దానిని నివారించడం కూడా మన చేతుల్లోనే ఉందనే విషయం గ్రహించాలంటున్నారు.
dr-kiran-kumar

157
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles