వినూత్న వడ్డనంబు.. వింతైన భోజనంబు!


Sat,May 18, 2019 12:50 AM

Hotells
మూగ, చెవిటి, గుడ్డి.. ఇవన్నీ శరీరానికి మాత్రమే కాని, మనసుకు కాదు. దివ్యాంగులైనప్పటికీ అన్నీ సక్రమంగా ఉన్న చాలా మంది కంటే ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నవారెందరో. ఇలాంటి వారితో ప్రారంభమైనవే.. టాకింగ్ హ్యాండ్స్, ద డైలాగ్ ఇన్ డార్క్ రెస్టారెంట్లు. నచ్చినవారితో కలిసి డిఫరెంట్‌గా భోజనం ట్రై చేయాలనుకునే వారి మనసు దోచుకుంటున్నాయి. దివ్యాంగులైనప్పటికీ అవకాశాలు కల్పిస్తే రాణించగలరని రుజువు చేస్తున్నాయి. సాధారణ వ్యక్తుల నుంచి సెలబెట్రీల వరకు
క్యూ కడుతున్న వినూత్న భోజనశాలలపై ప్రత్యేక కథనం.


మాటల్లేవు.. సంజ్ఞలతోనే అంతా

Shalini-Single
నిశ్శబ్దం ఎంత భయకరంగా ఉంటుందో. ..అని అంటుంటారు. కానీ నిశ్శబ్దం ఎంత అందంగా ఉంటుందో మేము చూపిస్తామంటున్నారు టాకింగ్ హ్యాండ్స్ రెస్టారెంట్ సిబ్బంది. మామూలుగా అయితే హోటల్ లేదా రెస్టారెంట్‌కి వెళ్లగానే ఒకరు స్వాగతం పలికితే, మరొకరు వచ్చి టేబుల్ వద్ద మెను ఇస్తారు. నచ్చినవి చెబితే తీసుకొచ్చి వడ్డిస్తారు. కాని టాకింగ్ హ్యాండ్స్‌లో అలా కాదు. రెస్టారెంట్‌లోకి అడుగు పెట్టగానే.. ప్లాస్టిక్ నవ్వుతో చెప్పే స్వాగతం బదులు గుండె నుంచి ఆప్యాయతను చూపుతూ చిరునవ్వు రూపంలో స్వాగతం పలుకుతారు. అలా స్వాగతం పలికిన వ్యక్తి పేరు చూపే బ్యాడ్జీ అతడి షర్ట్‌పై ఉంటుంది. ఇక అక్కడి నుంచి అన్నీ కేవలం సంజ్ఞల ద్వారానే మాటలుండవు. ఎందుకంటే అందులో ఉండే సిబ్బంది మొత్తం మూగ, వినికిడి లోపం వారే. హౌజ్ కీపింగ్, వెయిటర్స్, క్యాషియర్, స్టోర్ కీపర్, కెప్టెన్స్ ఇలా అందరూ అంతే. అయితే వారికి అర్థం అయ్యే విధంగా ఆర్డర్ చెప్పేందుకు, వారితో భావాలు పంచుకునేందుకు వారి భాషలోకి కొద్దిసేపు వారికి అర్థమయ్యే భాషలోకి వెళ్లాల్సి ఉంటుంది.

గోడలపై సంజ్ఞలు

వారికి అర్థమయ్యే భాషలోకి మనం వెళ్లడానికి అక్కడ గోడలపై ప్రత్యేకంగా సంజ్ఞలు ఉంటాయి.. మెనూ కార్డ్‌లోనూ, డిజిటల్ స్క్రీన్‌పైన వంటకాల ప్రత్యేకత గురించి, వాటి పక్కనే సంజ్ఞలు ఉంటాయి. వీటిని పరిశీలించి చేతుల ద్వారా చేసి చూపిస్తూ నచ్చిన ఆహారం ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. నీళ్లు అడగాల్సి వచ్చినా, బిల్ చెల్లించడం, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం, కృతజ్ఞతలు తెలపడం..ఇలా అంతా సంజ్ఞల ద్వారానే. ప్రతి టేబుల్ పైన ఒక ఎర్ర లైట్, స్విచ్‌తో ఉంటుంది. వెయిటర్‌ని పిలవాలనుకుంటే ఈ స్విచ్ నొక్కుతారు. ఇక్కడ ఉండే సిబ్బందికి పేర్లు తెలిపే విధంగా సంజ్ఞలు ఉంటాయి. ఈ రెస్టారెంట్‌లో 15 మంది చెవిటి, 10 మంది మూగవారు సిబ్బందిగా ఉన్నారు. వీరంతా డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందినవారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు వీరిలో ఉన్నారు. రెస్టారెంట్ నిర్వహణ ఎలా చేయాలో, కస్టమర్స్‌తో ఎలా ఉండాలో అనే అంశంపై ప్రత్యేక శిక్షణ పొందారు. కాబట్టి కస్టమర్ల ప్రశంసలు పొందగలుగుతున్నారు. అలా రెస్టారెంట్‌కి అడుగు పెట్టినప్పటి నుంచి అక్కడంతా నిశ్శబ్దం..ఒక ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. ఇలాంటి అద్భుత వాతావరణంలోనే భోజనం చేయాల్సి ఉంటుంది.

పార్టీలంటే.. టాకింగ్ రెస్టారెంట్‌కే...

పార్టీలంటేనే ప్రత్యేకంగా ఉండాలని అనుకుంటారు. అలా అనుకునేవారు ఎంతో మంది టాకింగ్ రెస్టారెంట్‌కి వెళ్తున్నారు. వార్షికోత్సవాలు, పుట్టిన రోజులు, పెండ్లి రోజులు, కిట్టీ పార్టీస్.. ఇలా సందర్భం ఏదైనా బంధు, మిత్రులతో కలిసి అక్కడే జరుపుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా వీకెండ్స్‌లో ఎక్కువ మంది రెస్టారెంట్‌ను సందర్శిస్తున్నారు. ఈ రెస్టారెంట్‌లో తయారైన ఫుడ్‌కి ఎంతో మంది ఫిదా అయ్యారు. జొమాటో, ఫుడ్ పాండా, స్విగ్గీ వంటి యాప్‌ల ద్వారా పెద్ద మొత్తంలో ఫుడ్ డెలివరీ జరుగుతున్నది.
Hotells1

ప్రపంచంలోనే ఏకైక రెస్టారెంట్

2009లో డెఫ్ ఎనేబుల్డ్ ఫౌండేషన్ ప్రారంభించాం. బధిర విద్యార్థులకు విద్య, కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇతర కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నాం. తెలంగాణ టూరిజం శాఖ మద్దతుతో రెండేండ్ల క్రితం రెస్టారెంట్ ప్రారంభించాం. వారి సహకారంతోనే ముందుకు వెళ్తున్నాం. బధిరుల మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిపేందుకు, అలాగే వారు కూడా సాధారణ ప్రజలతో ఏమాత్రం తీసిపోకుండా అన్ని పనులు చేయగలరని నిరూపిస్తున్నాం. ఇలాంటి రెస్టారెంట్ ప్రపంచంలో ఒకటి మాత్రమే ఉంది. అది మన హైదరాబాద్‌లోనే కావడం విశేషం. అయితే తొలిసారిగా దక్షిణాఫ్రికాలో ఓ హోటల్ ప్రారంభమైనప్పటికీ అదిప్పుడు లేదు.

డైలాగ్ ఇన్ ద డార్క్

సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. మరి అంతటి ప్రాముఖ్యం గల కండ్లు లేకపోయినా అంధులు సజావుగా జీవిస్తున్నారు. దాదాపు అన్ని పనులు చేసుకుంటున్నారు. అయితే కండ్లు లేవని ఒక్క క్షణం ఆలోచిస్తే... ఓ గంట సేపు చిమ్మ చీకటిలో ఉండి భోజనం చేస్తే.. ఎలా ఉంటుంది. థ్రిల్లింగ్‌గా ఉంది కదా.. బేగంపేట్‌లోని డైలాగ్ ఇన్ ద డార్క్ రెస్టారెంట్‌కి వెళ్తే ఇలాంటి అనుభూతిని పొందవచ్చు. వెజ్ లేదా నాన్ వెజ్ ఆర్డర్ రిసెప్షన్ కౌంట్‌ర్‌లోనే చెప్పి, ఒక్కసారి రెస్టారెంట్ లోపలికి అడుగు పెట్టామంటే ఇక అంతా చిమ్మ చీకటి. సెల్‌ఫోన్ లేదా ఇతర గ్యాడ్జెట్స్‌ని రిసెప్షన్ కౌంట్‌ర్‌లో డిపాజిట్ చేయాలి. రెస్టారెంట్ లోపల అంతా చీకటి. ఏదీ కనిపించదు. కండ్లు మినహాయించి మిగతా జ్ఞానేంద్రియాలను నమ్ముకోవాలి.. అంటే చర్మం, ముక్కు, నాలుక, చెవులు వీటిని మాత్రమే వినియోగించాలి. అలా గోడలను తడుముకుంటూ లోపలికి వెళ్లాలి.
Faryou

సిబ్బంది అంధులే

డార్క్ రెస్టారెంట్‌లో ఉండే సిబ్బంది సైతం అంధులే. రెస్టారెంట్‌లో ప్రవేశించినప్పటి నుంచి అంతా కొత్తగా ఉంటుంది. అక్కడి సిబ్బంది సూచనతో చిన్న సాహసకృత్యాలు చేయాల్సి ఉంటుంది. అలా టేబుల్ వద్దకు చేరుకోగానే ఘుమఘుమలాడే వెజ్ లేదా నాన్ వెజ్ ఫుడ్ టేబుల్ మీద ఉంటుంది. వారు ఇచ్చే ఆహారం కూడా సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. రకరకాల ఐటమ్స్ అందులో ఉంటాయి. ఏదీ కనిపించదు, స్పర్ష ద్వారా, వాసన పీల్చి, రుచి చూసి గుర్తించాల్సి ఉంటుంది. అలా దాదాపు 45 నిమిషాల పాటు చిమ్మ చీకట్లో ఉండాల్సి ఉంటుంది. చివరగా బయటికి వెళ్లే సమయంలో అంధత్వం గురించి అక్కడి సిబ్బంది వివరిస్తారు. అనంతరం ఒక్కొక్కరుగా వెలుతురు ఉన్న ప్రపంచలోకి తిరిగి అడుగుపెడుతాం. ఇలా మొత్తం థ్రిల్లింగ్ ఓ గంట పాటు ఉండటం వల్ల జ్ఞానేంద్రియాల ప్రాధాన్యం ఎంతో అర్థమవుతుంది. అందుకే ఈ థ్రిల్లింగ్‌ను ప్రతి ఒక్కరికి తెలియచేసేందుకు అక్కడికి వచ్చిన వారు వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను తీసుకువెళ్లి సర్‌ప్రైజ్ చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, సినీ, క్రీడా రంగాల నుంచి ఎంతో మంది దీనిని సందర్శించారు.

అంధత్వంపై అవగాహన

1988లో తొలిసారి జర్మనీలో డైలాగ్ ఇన్ ద డార్క్ రెస్టారెంట్ ప్రారంభమైంది. అనంతరం చాలా దేశాలకు విస్తరించింది. ఇప్పటికే ఇనార్బిట్ మాల్‌లో ప్రారంభం కాగా, మూడు నెలల క్రితం తెలంగాణ టూరిజం శాఖ సహకారంతో హోటల్ ప్లాజాలో ప్రారంభమైంది. మన దేశంలో ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల మంది ఈ రెస్టారెంట్లను సందర్శించారు. ద వీక్ బెస్ట్ రెస్టారెంట్‌గా, ఫోర్బ్స్ మ్యాగజైన్ టాప్ 50 బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ రెస్టారెంట్లలోనూ దీనికి స్థానం దక్కింది. అంధుల సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు మన దేశంలో దాదాపు 500 వర్క్‌షాప్స్ ఏర్పాటు చేశారు.

జాలి పడాల్సిన అవసరం లేదు

ప్రస్తుత కాలంలో దివ్యాంగులు అన్ని పనులూ చేస్తున్నారు. టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. ఇలాంటి వారిపై ప్రతి ఒక్కరు చూపించాల్సింది జాలి కాదు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ రెస్టారెంట్‌ను అంధులే విజయవంతంగా నడిపిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర వ్యాపార రంగంలో వారు రాణించగలరు. ఈ రెస్టారెంట్‌కి వస్తే వాళ్ల సామర్థం ఏంటో తెలుస్తుంది. వారికి ఎలాంటి మద్దతు ఇవ్వొచ్చో తెలుస్తుంది. అందుకే థ్రిల్‌తో కూడిన ఒక గొప్ప అనుభూతిని పొంది, అంధులకు మద్దతు తెలిపేందుకు మా రెస్టారెంట్‌ను సందర్శించాలని కోరుతుంటాం.
ఎస్వీ క్రిష్ణన్ ఇస్మాయిల్, డైలాగ్ ఇన్ ద డార్క్, ఫౌండర్ & సిఇఓ

-సిద్దార్థ్ బీసగోని,
-గడసంతల శ్రీనివాస్

Hotells3
Hotells2
Hotells4

357
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles