మా అబ్బాయి పెండ్లి చేసుకోవచ్చా?


Sat,May 18, 2019 12:43 AM

మా అబ్బాయి వయస్సు 24 సంవత్సరాలు. 2015లో అక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యుకేమియా (ఏఎల్‌ఎల్ - బీఎఫ్‌ఎం-90) బ్లడ్‌క్యాన్సర్ ఉందని వైద్యులు చెప్పారు. సంవత్సరంపాటు అయిదు దశలలో కీమోథెరపీ చికిత్స చేశారు. రెండు సంవత్సరాలకుపైగా మందులు వాడాం. ప్రస్తుతం బాగానే ఉన్నాడు. ఇటీవలే సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. నైట్ డ్యూటీ చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఏమైనా ప్రమాదముందా? చికిత్స తర్వాత ప్రతిసారి బ్లడ్‌రిపోర్టు మంచిగానే వస్తున్నది. ఇక వ్యాధి బెంగ లేనట్టేనా? లేకపోతే మళ్లీ వస్తుందా? ఇతర శరీరభాగాలకు సోకే ప్రమాదం ఉన్నదా? పూర్తిస్థాయి నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్, టీకాలు ఉన్నాయంటున్నారు. వాటిని ముందుగానే వాడవచ్చా? పెండ్లి చేసుకోవచ్చా? సంతానం కలుగుతుందా? వివరంగా తెలపండి.
- మంజుల, హైదరాబాద్

Councelling
సకాలంలో సరైన చికిత్స ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. మందులు వాడినా కొన్నిసార్లు మళ్లీ వచ్చే ప్రమాదం ఉంది. సోకిన ఏఎల్‌ఎల్ రకం ఏంటి? తీసుకున్న చికిత్సా విధానం ఏంటి? తెల్లరక్త కణాల సంఖ్య, సైలోజెనెటిక్స్ వంటి కారకాలపై ఇది మళ్లీ వస్తుందా? లేదా అని చెప్పవచ్చు. అందుకే చికిత్స పూర్తయినా డాక్టర్ పర్యవేక్షణ అవసరం. 3-6 నెలలకు ఒకసారి సాధారణంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్స్ (సీబీపీ) రక్త పరీక్ష చేయించుకోవాలి. తరచుగా జ్వరం రావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గిపోవడం, మెడలో గడ్డలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించాలి. క్యాన్సర్ నివారణకు ప్రత్యేకమైన ఆహార నియమాలంటూ ఏమీ లేవు. చికిత్స పూర్తయ్యి వ్యాధి నయం అయిన తర్వాత డాక్టర్ సూచనల మేరకు ఉద్యోగం చేసుకోవచ్చు. పెండ్లి కూడా చేసుకోవచ్చు. సంతాన సమస్యలు ఉంటాయా అనేది మీ సందేహం కదా? సంతాన సమస్యలేమీ ఉండవు. కాకపోతే సాధారణ వ్యక్తుల కంటే కొద్దిగా తక్కువే అని చెప్పవచ్చు. ఇక హెచ్‌పీవీ టీకా గురించి చెప్పాలంటే ఇది 9-26 సంవత్సరాల వయసులో ఉన్న మగవారికి సిఫార్సు చేసింది. దీనిని తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు పూర్తిగా నివారించే అవకాశం ఉంది.


-డాక్టర్ సీహెచ్ షైనీరెడ్డి
-సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్
-యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్

316
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles