జనపతో.. దేవీ ఆదాయ పాఠాలు!


Wed,May 15, 2019 02:03 AM

కష్టాలు వచ్చాయి కదా అని ఆమె కన్నీళ్లు పెడుతూ కూర్చోలేదు.. ఇంటికి ఆసరా అయిన భర్త మంచాన పడితే.. ఇక నాకెవ్వరు దిక్కు.. అని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్వలేదు.. ఆమె ధైర్యమే ఆమె కుటుంబానికి దిక్కయింది.. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. జూట్ (జనప నార) బ్యాగుల తయారీ రంగంలోకి అడుగు పెట్టింది.. తనలా కష్టాల్లో ఉన్నవారికి చేదోడువాదోడు అయింది.. ఇప్పుడు లక్షల్లో సంపాదన గడిస్తూ.. ఎందరికో ఆదర్శంగా నిలిచింది కాప్రాకి చెందిన నాగదేవి.
మరి ఆమె అందిస్తున్న ఉపాధి మార్గాన్నే కాదు.. ఆమె విజయ తీరాలకు చేరుకున్న వైనాన్నీ మీరు తెలుసుకోవాలి.

KPR
ప్లాస్టిక్ భూతం ప్రపంచాన్ని కబలించేస్తున్నది. ఒక ప్లాస్టిక్ కవర్ భూమిలో కలిసిపోవడానికి పది లక్షల సంవత్సరాలు పడతుందట. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత తగ్గించాలని ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఢంకాలు కొట్టి మరీ చెబుతున్నాయి. కానీ ప్రత్యామ్నాయం ఉన్నప్పుడే కొంతలో కొంతయినా వాటి వాడకం తగ్గుతుంది. ప్లాస్టిక్ సంచులకు బదులు కాగితం, బట్ట, జనపనారతో చేసిన సంచుల శాతం పెరుగాలి. వాటిని ఉత్పత్తిని చేయడానికి ఎక్కువమంది పూనుకోవాలి. నాగదేవికి ప్లాస్టిక్ భూతం గురించి, వాటి ప్రత్యామ్నాయాల గురించి పెద్దగా తెలియవు. అయినా జనపనార సంచుల తయారీని మాత్రం చేపట్టింది. ఇంటికి ఎంతోకొంత ఆసరాగా మారేందుకు వీటి ఉత్పత్తిని చేపట్టింది. అదే ఇప్పుడు నలుగురికి ఉపాధి మార్గం అయింది.

21 రోజులు..

కృషి.. పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నతిని సాధించవచ్చనేందుకు హైదరాబాద్ కాప్రా సాయిరాంనగర్‌కు చెందిన నాగదేవి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నది. పొరుగురాష్ట్రంలో పుట్టి, పెరిగి 18 యేండ్ల క్రితం ఉపాధి కోసం భర్త సూర్యనారాయణతో కలిసి నగరానికి వచ్చింది. భర్తకు యాక్సిడెంట్ కావడంతో కుటుంబం గడవడం కష్టమైంది. అప్పటివరకు భర్త నిర్వహించే ఆటోమొబైల్ షాపుతో కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా, భర్త అనుకోకుండా మంచం పట్టడంతో ఆదాయం వచ్చే మార్గం మూసుకుపోయింది. ఏం చేయాలో తెలియలేదు. ఇలాంటి సమయంలోనే మొక్కవోనిధైర్యంతో ఉపాధికోసం మార్గాలు వెతికింది. కుటుంబం సజావుగా సాగిన రోజుల్లో సరదాగా కాలక్షేపానికి నేషనల్ జూట్‌బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూట్ బ్యాగుల తయారీ శిక్షణ ఆమెకు మార్గం చూపింది. జూట్ (జనప)తో చేసే సంచుల తయారీపై ఆమె 21 రోజుల పాటు శిక్షణ తీసుకొంది. దీంతో వాటి తయారీపై దృష్టిసారించింది.

ఆరంభం..

సాయిరాంనగర్‌లోనే ఉన్న జూటెక్స్ విలేజి సంస్థలో పని చేస్తూ కొంతకాలం వర్కర్‌గా జూట్ బ్యాగుల తయారీ చేపట్టింది. ఆ సంస్థకు సంబంధించిన కుటుంబసభ్యులు విదేశాల్లో ఉండడంతో వారు కూడా అక్కడకు వెళ్లేందుకు నిశ్చయించుకున్నారు. ఆ సంస్థ యూనిట్‌లోని మెషీన్లను, సామాను అమ్మకానికి పెట్టారు. ఆ సమయంలో నాగదేవి రూ.యాభైవేలు అప్పు చేసి వారివద్ద నుంచి మెషీన్లను, మెటీరియల్ కొన్నది. దీంతో నాగదేవి కొత్త జీవితం ప్రారంభమైంది. ఒక సహాయకురాలిని పెట్టుకొని వివిధ సైజుల్లో ఆకర్షణీయంగా బ్యాగులను తయారు చేసింది. అలా తయారు చేసిన బ్యాగులను 2010 నుంచి నేషనల్ జూట్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఎగ్జిబిషన్లలో ఉచితంగా స్టాళ్లను ఏర్పాటు చేసుకొనే అవకాశం దొరికింది. దేశంలోని ప్రధాన నగరాలైన పుణే, నాగ్‌పూర్, సూరత్, అహ్మదాబాద్, తదితర ప్రాం తాల్లో స్టాళ్లను ఏర్పాటు చేయడంతో గిరాకీ పెరిగింది. దీంతో పాటు బల్క్ ఆర్డర్‌లు కూడా లభించాయి.

రెండు వర్క్‌షాప్‌లు..

నాగదేవి మామూలుగానే మొదలుపెట్టిన ఈ వ్యాపారం అంచెలంచెలుగా ఎదుగడం మొదలైంది. దాంతో పాటు యూనిట్‌ని పెంచాల్సిన అవసరం ఏర్పడింది. దానికోసం కొంత కష్టపడాల్సి వచ్చింది. బ్యాంకు నుంచి చివరకు రుణం సంపాదించింది. సంచులను కుట్టేందుకు మెషీన్లను, కటింగ్ మేషీన్, ఇతర పరికరాలను సమకూర్చుకొని, ఉపాధిలేకుండా ఉన్న వారికి, ఇతర మహిళలకు జూట్ బ్యాగుల తయారీని నేర్పించి, పని కల్పించింది నాగదేవి. సాయిరాంనగర్‌లో, హౌజింగ్ బోర్డ్‌లోని నవోదయనగర్‌లో మొత్తం రెండు వర్క్‌షాపులను ఏర్పాటు చేసి 18 మెషీన్లతో 11 మంది వర్కర్లతో జూట్ బ్యాగుల తయారీని చేపడుతున్నది. తన కుటుంబం ఉపాధి పొందడమే కాకుండా మరో 11 మందికి కలిపిస్తున్నది. అందరి కళ్లలో కనిపించే సంతోషమే తనకు స్ఫూర్తినిస్తున్నదని అంటున్నది నాగదేవి.
KPR1

ఉచిత శిక్షణ..

నాగదేవి.. ఏమీ లేని గడ్డు పరిస్థితిని కూడా అనుభవించింది. ఆ సమయంలో బాధ వర్ణానాతీతం. ఆ బాధ ఇతరులు పడకూడదనే తపించే వారిలో ముందుంటుంది. అందుకే బస్తీల్లో నివసించే పేద మహిళల ఉపాధి కోసం ప్రభుత్వం తరఫున, జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం తరఫున ఇచ్చే ప్రత్యేక శిక్షణా తరగతుల్లో పాల్గొని ఉపాధి పొందే వారికి వృత్తినైపుణ్యాల పెంపుదలలో శిక్షణ ఇస్తూ జీవనోపాధి పొందడానికి తోడ్పాటు అందిస్తున్నది. 2014లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఆధ్వర్యంలో మూడేళ్లు వరుసగా మహిళలకు జూట్ బ్యాగుల తయారీలో ఉచితంగా శిక్షణ ఇచ్చింది. ఇప్పటివరకు వేయి మంది మహిళలకు ఈ విధంగా శిక్షణ ఇచ్చినట్టు నాగదేవి తెలిపారు.

నిరాశ వద్దు..

కష్టకాలంలో మొదలు పెట్టిన బ్యాగుల తయారీ నా జీవితాన్ని మార్చేస్తుందని ఊహించలేదు. ప్రతినెలా సుమారు రెండువేల వరకు జూట్ బ్యాగులు, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నా. స్కూళ్లు, కాలేజీలు, బిట్స్ పిలానీ కాలేజీ, దేవాలయాలు, లయన్స్ క్లబ్బుల నుంచి బల్క్ ఆర్డర్‌లు వస్తున్నాయి. త్వరలో టీటీడీ నుంచి కూడా ఆర్డర్ రానున్నది. పదకొండు మందికి ఉపాధి కల్పిస్తూనే, నెలకు రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలు నిరాశా నిస్పృహలకు గురికాకుండా ఎంచుకున్న ఈస్వయం ఉపాధి రంగంపై దృష్టి పెట్టి గట్టిగా కృషిచేస్తే తప్పకుండా ఫలితాలు సాధించవచ్చు.

-జి.నాగదేవి, సాయిరాంనగర్, కాప్రా-కొంపల్లి మోహన్
-కాప్రా, నమస్తే తెలంగాణ

402
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles