అభాగ్యుల కోసం సన్నిహిత


Tue,May 14, 2019 01:15 AM

Usharani
ఇదొక అమ్మ ఒడి. రోడ్లపాలైన పసిపిల్లలను చేరదీస్తున్న గుడి. అన్నార్థుల ఆకలిని తీర్చే శరణాలయం. అభాగ్యులను చేరదీసి చదువు చెప్పించే విద్యాలయం.ఎందుకూ పనికిరారని వెలివేసిన వారిని.. చురకత్తుల్లా తయారు చేసి ఈ ప్రపంచానికి పరిచయం చేసే క్రమశిక్షణాలయం. దాని పేరే సన్నిహిత. ఒంటరి మహిళలకు, వీధి బాలలకు, అనాథ చిన్నారులకు అండగా నిలుస్తున్నది సన్నిహిత. ఎలాంటి లాభపేక్ష లేకుండా.. వారికి అండగా నిలుస్తూ, ఆకలి తీరుస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నది సన్నిహిత ఎన్జీఓ. ఈ స్వచ్ఛంద సంస్థలోని చిన్నారులను జిందగీ పలుకరిస్తే ఎన్నోవిషయాలు పంచుకున్నారు.
Usharani1
సమయం మధ్యాహ్నం 12.30 కావొస్తున్నది.. 20 మంది చిన్నారులు ప్లేట్లు పట్టుకొని క్యూలో నిలుచున్నారు. వేడి వేడి అన్నాన్ని, రుచికరమైన కూరలను వడ్డిస్తున్నారు కేర్ టేకర్లు. ఒక్కొక్కరుగా వెళ్లి వరుసగా కూర్చున్నారు. చివరగా క్యూలో ఉన్న పాప వచ్చేంత వరకూ అన్నాన్ని ముట్టలేదు. ఆ తర్వాత అంతా కలిసి ప్రార్థించడం మొదలుపెట్టారు. అది మామూలు ప్రార్థన కాదు.. కన్నీటి ప్రార్థన. తమకు అన్నం ప్రసాదించిన వారు.. కలకాలం చల్లగా ఉండాలంటూ కనిపించని దేవుడ్ని వేడుకున్న ప్రార్థన. ఈ భూమ్మీద ఆకలితో అలమటించే వారందరికీ కడుపునిండా అన్నం దొరకాలని చేసే ప్రార్థనది. పైపైన పెదవులతో పలికిన మాటలు కావవి.. హృదయాంతరాలలోంచి వచ్చిన నివేదన. ఆ ఘట్టం ముగిశాక చిన్నారులంతా కలిసి సంతోషంగా తినడం ప్రారంభించారు. మూడు పూటలా ఇదే పద్ధతి. తమకు ఆశ్రయమిచ్చి, అన్నం పెట్టేవారిని తలుచుకోనిదే వీరు ముద్ద ముట్టరు. ఇలా రోజూ 400 మంది అభాగ్యుల ఆకలి తీర్చుతున్నది సన్నిహిత సెంటర్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్ చిల్డ్రన్ సొసైటీ. ఇప్పటి వరకు వందలాది మందిని చేరదీసి, ఆశ్రయం కల్పించి, ఉచితంగా చదువులు చెప్పించి, ఉద్యోగ మార్గాలు చూపించింది సన్నిహిత సంస్థ. ఆ సంస్థ వ్యవస్థాపకురాలే ఒంగూరు ఉషారాణి.

ఏడుగురితో మొదలై..

సన్నిహిత సొసైటీని మొదట ఏడుగురి పిల్లలతో ప్రారంభించారు ఉషారాణి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ సొసైటీ పూర్తిగా దాతల సహాయంతోనే నడుస్తున్నది. హైదరాబాద్‌లో నాలుగు సన్నిహిత కేంద్రాలున్నాయి. వీటిల్లో మూడు అమ్మాయిలకు, ఒకటి అబ్బాయిలకు ఆశ్రయమిస్తున్నాయి. ఇక్కడ అనాథ పిల్లలు, తల్లి లేదా తండ్రి మరణించిన వారు, బాల కార్మికులు, ఇంటి నుంచి వెలివేయబడిన వారు, ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆశ్రయమిస్తున్నారు. ఈ సొసైటీ కార్యక్రమాల్లో రెయిన్‌బో హోమ్స్ సహాయం మరువలేనిది. ఈ నాలుగు కేంద్రాల్లో కలిపి దాదాపు 400 మంది ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రాల్లో పదిమంది పిల్లలకుగాను ఒక కేర్ టేకర్ ఉంటారు. ఈ సొసైటీలో ఉంటున్న పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తారు. పదో తరగతి పూర్తయిన వారు.. గురుకులాలు, నవోదయ ఎంట్రెన్స్ రాసి అటువైపు వెళ్తారు. కొంతమంది ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్, డిగ్రీ చదువుతారు. అలా ఉన్నత చదువులు చదివిన వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు ఉషారాణి.

ఇదో సంరక్షణాలయం!

సన్నిహిత సొసైటీలో ఉదయం 5 గంటలకే విద్యార్థుల దినచర్య ప్రారంభమవుతుంది. తెల్లవారుజామునే కుంగ్‌ఫూ, కరాటేల్లో శిక్షణ ఇస్తారు. 8 గంటలకు అల్పాహారం ఉంటుంది. అంతా రెడీ అయి.. యథావిధిగా స్కూలుకెళ్తారు. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ ఇస్తారు. రాత్రి పూట భోజనం ఉంటుంది. ప్రతి నెలా రెండోవారంలో హెల్త్ క్యాంప్ నిర్వహిస్తారు. ఎప్పటికప్పుడు పిల్లల ఆరోగ్యాన్ని సమీక్షిస్తుంటారు. ఒక్కో వసతి గృహంలో విద్యార్థులందరికీ సంబంధించి 45 రిజిస్టర్లు మెయింటెన్ చేస్తున్నారు.. ఇందులో పిల్లల హెల్త్, స్టడీ, అభిరుచులు, ఎడ్యుకేషన్ డెవలప్‌మెంట్, సాధించిన విజయాలు తదితరాలన్నీ నమోదు చేయిస్తుంటారు. నెలకొకసారి కౌన్సెలింగ్ కూడా ఇస్తుంటారు.

కళలకు పెద్దపీట

సన్నిహిత సొసైటీలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులు చదువుతో పాటు పలు సాంస్కృతిక రంగాల్లో రాణిస్తున్నారు. విద్యార్థులకు కుట్లు, అల్లికలు, చిత్రలేఖనం, క్రీడలు, టైలరింగ్, సంగీతం నేర్పిస్తున్నారు. వీటిని నిపుణులైన గురువులు పర్యవేక్షిస్తుంటారు. చెస్, కరాటేల్లో సన్నిహిత విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు. విద్యార్థులకు ప్రత్యేకంగా కమిటీలు వేయించి లీడర్‌షిప్ లక్షణాలను పెంపొందిస్తున్నారు. ఉషారాణి కవయిత్రి.. ఆమెకు సాహిత్యమంటే ప్రాణం. వారం వారం విద్యార్థులకు సాహిత్యాన్ని పరిచయం చేస్తున్నారామె. ఆమె చూపిన బాటలో కవిత్వం, సాహిత్యంపై విద్యార్థులు అవగాహన పెంచుకుంటున్నారు. పలు రచనలు చదువుతూ.. సొంతగా కవిత్వం రాసే స్థాయికి వచ్చారు. సన్నిహిత సొసైటీ విద్యార్థులకు విహారయాత్రలూ ఉంటాయి. సెలవు దినాల్లో నగరంలోని ప్రముఖ ప్రదేశాల్ని చూపిస్తారు నిర్వాహకులు. తరచూ పిక్నిక్‌స్పాట్‌లు, దేవాలయాల సందర్శనలు ఉంటాయి.

సన్నిహిత ప్రారంభమైందిలా..

ఒంటరి మహిళలకు, ఇల్లు లేని వారికి అండగా నిలిచేందుకు సన్నిహితను ప్రారంభించారు ఒంగూరు ఉషారాణి. తన విద్యార్థి దశ నుంచే హక్కుల కోసం పోరాటం చేశారు ఉషారాణి. మహిళల రక్షణ కోసం గర్జించారు. ఊరూవాడా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొచారు. 2000 సంవత్సరంలో ఏడుగురు స్నేహితులతో కలిసి ఒంటరి మహిళల కోసం ఈ సొసైటీని ప్రారంభించారు ఉషారాణి. అప్పటి నుంచి ఎంతోమందికి ఆశ్రయమిచ్చింది సన్నిహిత కేంద్రం. ఈ క్రమంలో స్త్రీలపై హింసకు వ్యతిరేకంగా బస్తీల్లో పంచాయితీ కమిటీలు ఏర్పాటు చేశారు ఉషారాణి. ఇందులో ఐదుగురు మహిళలు సభ్యులుగా ఉంటారు. తమ పరిధిలోని మహిళలకు ఎలాంటి సమస్యలొచ్చినా వారే ముందుండి పోరాడతారు. దాదాపు 20 బసీల్లో ఈ కమిటీలు నేటికీ విజయవంతంగా కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో భూ నిర్వాసితుల పక్షాన పోరాడారు ఉషారాణి. ఈ క్రమంలో వీధి బాలలు, అనాథలు, చిత్రవధలకు గురైన ఆడపిల్లల గురించి తెలుసుకొని వారిని కాపాడడమే విధిగా పెట్టుకున్నారు. ఇలా 2009 మే 9న సన్నిహిత కొత్తరూపు దాల్చింది. ఆనాటి నుంచి తన బృందం ద్వారా బాధిత చిన్నారుల వివరాలు సేకరించి.. వారికి సన్నిహితలో ఆశ్రయం కల్పిస్తున్నది ఉషారాణి. 6 నుంచి 18 సంవత్సరాల వయసు పిల్లలు 400 మంది ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్తవారికి అవకాశం కల్పిస్తూనే ఉంటారు.
Usharani3

ఇక్కడ ఆనందంగా ఉంది..

నేను చెస్ ప్లేయర్‌ని. నేషనల్స్ ఆడాను. తైక్వాండోలో కూడా పతకాలు సాధించా. గిటార్ కూడా బాగా వాయిస్తా. ఏ బొమ్మ చూసినా ఇట్టే వేయగలను. నేనిక్కడికి వచ్చి తొమ్మిదేండ్లు అవుతున్నది. ప్రస్తుతం నేను పదో తరగతి చదువుతున్నా. ఏదైనా మంచి ఉద్యోగం సాధించి ఎంతోమంది ఆకలితో ఉన్న వాళ్లకు భోజనం పెట్టాలనుకుంటున్నా.
- కనకం సాయిప్రియ, పదో తరగతి
Usharani2

ఆర్థిక తోడ్పాటు కావాలి..

సన్నిహిత సొసైటీ ద్వారా చాలామందికి ఆశ్రయమివ్వాలనే ఆలోచన ఉన్నది. మా లక్ష్యానికి మీ ఆర్థిక తోడ్పాటు చాలా అవసరం. పెరిగిన నిత్యావసరాల దృష్ట్యా ఒక్కో విద్యార్థికి రోజూ రూ. 50 ఖర్చు అవుతున్నది. ఎవరైనా దాతలు సహాయం చెయ్యాలనుకుంటే నా నంబర్ 8790063904 సంప్రదించగలరు. ఈ సొసైటీ ద్వారా ఇప్పటి వరకు 300 మంది ఉన్నత చదువులు చదువుతున్నారు. ప్రభుత్వం కూడా ఆర్థికంగా సహాయం చేస్తే.. ఈ సేవలను మరింత విస్తరిస్తాం.
- ఒంగూరు ఉషారాణి, సన్నిహిత వ్యవస్థాపకురాలు
Usharani4

ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తా..

నేను 2010లో ఇక్కడికి వచ్చా. ప్రస్తుతం ఇంటర్ చదువుతున్నా. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్‌లో ప్రావీణ్యం సంపాదించాను. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే నా లక్ష్యం. ఎంతోమంది ఆకలితో అలమటిస్తున్న పేదలకు నా వంతుగా సాయం చేస్తా. సామాజికాంశాలు, క్రమశిక్షణ ఇక్కడ నేర్పిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక నా కాళ్ల మీద నేను నిలబడగలననే నమ్మకం కలిగింది.
- తాళ్లపల్లి రమ్య, ఇంటర్ విద్యార్థిని

- పడమటింటి రవికుమార్ నర్రె రాజేశ్

335
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles