ఆకుకూరలు పండించి.. ఆరోగ్యాన్ని అందించి..


Mon,May 13, 2019 11:49 PM

uttarakhand
సాంకేతికతను ఉపయోగించుకుని ఉత్తరాఖండ్‌కు చెందిన యువజంట సేంద్రియ పద్ధతిలో ఆకుకూరలను పండిస్తూ వాటిని ఆన్‌లైన్ ద్వారా వినియోగదారుల చెంతకు చేరుస్తున్నారు.

ఉత్తరాఖండ్‌కు చెందిన అనుభవ్ దాస్, సృష్టి మందార్ అనే యువ జంట సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు. అనుభవ్ దాస్ రెండు దశాబ్దాలుగా వేర్వేరు రంగాల్లో పనిచేశాడు. ఆయన చేసిన పనితో సంతృప్తి చెందక పోవడం వల్ల పట్నం నుంచి పల్లెకు వచ్చాడు. సహజవనరులపై ఆధారపడకుండా పంటలు పండించాలనుకున్నాడు. ఎలాంటి విధానం ద్వారా సేంద్రియ సాగు చేస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయనే అంశంపై పరశోధన చేశాడు. భారతదేశంలోని నేలల్లో ఎటువంటి పద్ధతిలో సాగు చేస్తే పంటలు బాగా పండుతాయనే దానిపై దృష్టి సారించాడు. ఆ తర్వాత తక్కువ నీటితో పంటలను సాగుచేయడానికి సిద్ధమయ్యాడు. అలా పలు అంశాలపై పరిశోధనలు చేసిన అనంతరం అనుభవ్ దాస్, సృష్టి మందార్ ఇద్దరూ కలిసి రెడ్ ఒట్టర్ ఫార్మ్స్‌ను ఏర్పాటు చేసి, న్యూట్రింట్ ఫిల్మ్ టెక్నిక్ (ఎన్.ఎఫ్.టి) విధానాన్ని ఉపయోగించి సాగు మొదలు పెట్టారు. 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సలాడ్‌లో ఉపయోగపడే పలురకాల ఆకుకూరలను పండించడం ప్రారంభించారు. పాలకూరలో 15 రకాలు, టమాటాలో ఎనిమిది, క్యాబేజీలో ఆరు, మిరపకాయలో ఏడురకాల వెరైటీలను పండిస్తున్నారు. వారానికి 70 కేజీలకు పైగా ఆకుకూరలను పండించి వినియోగదారులకు తాజాగా అందిస్తున్నారు. సలాడ్‌కు ఉపయోగించే ఆకుకూరలను సేంద్రియ పద్ధతిలో పండించడం వల్ల ఆరోగ్యకరంగా ఉంటాయని, అందరూ ఆర్డర్ చేయడం ప్రారంభించారు. దక్షిణ ఢిల్లీతోపాటు గుర్గావ్ వంటి ప్రాంతాల్లో నివసించేవారందరూ అనుభవ్ దాస్, సృష్టి మందార్ ఫామ్‌లో పండిన ఉత్పత్తులనే కోరుకుంటున్నారు. ప్రయోగాత్మకంగా చేస్తే మంచి ఫలితాలు వచ్చాయని, ఇటువంటి ఉత్పత్తులకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదని అనుభవ్ దాస్ చెబుతున్నాడు.

442
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles