అవగాహనతోనే.. HIV కి విముక్తి


Tue,May 14, 2019 01:40 AM

హెచ్‌ఐవీ.. ఈ పేరు వింటేనే కొందరికి చచ్చేంత భయం. ఆ వైరస్ అన్నా.. హెచ్‌ఐవీ రోగులన్నా వణికిపోతుంటారు. కొందరేమో చేజేతులా ఆ వ్యాధిని కొనితెచ్చుకుంటారు. జాగ్రత్తగా ఉండాల్సిన సమయంలో నిర్లక్ష్యం చేస్తారు. ఇక ఆ నిర్లక్ష్యానికి చరమగీతం పాడాల్సిందే. హెచ్‌ఐవీ వైరస్ పట్ల అవగాహన కలిగి ఉంటేనే వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు. మే 18న హెచ్‌ఐవీ వాక్సిన్ అవేర్‌నెస్ డే సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి నివారణ ఎలాగో అవగాహన పొందుదాం!
hiv_vaccine
హెచ్‌ఐవీ.. ఒకసారి సోకితే మరణించేంత వరకూ వెంటాడుతుంది. ఎయిడ్స్ బారిన పడేస్తుంది. హెచ్‌ఐవీ సోకకముందు మనిషి ఒకలాగా.. సోకిన తర్వాత మనిషి ఒకలాగా కనిపిస్తారు. తినే తిండి దగ్గర్నుంచి.. మాట్లాడే విధానం వరకు అన్నింట్లోనూ మార్పు వస్తుంది. అప్పుడు నరకం కనిపిస్తుంది. హెచ్‌ఐవీ సోకితే జీవితం ఇంత దుర్భరంగా ఉంటుందా అనిపిస్తుంది. ఇక్కడ ఎవర్నీ నిందించలేం. ఎవరికి వారు వ్యాధుల పట్ల.. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటే హెచ్‌ఐవీ లాంటి భయంకర వైరస్‌ల నుంచి దూరంగా ఉండవచ్చు.

HIV

ఈ వైరస్‌కు మందు ఉంది

ఇటీవల ఓ అద్భుతం చేశారు లండన్ పరిశోధకులు. ఓ హెచ్‌ఐవీ రోగికి మూలకణ మార్పిడి చికిత్స ద్వారా వ్యాధి లక్షణాలు లేకుండా చేశారు. భారత సంతతికి చెందిన రవీంద్రగుప్తా నేతృత్వంలో ఈ చికిత్స జరిగింది. 2003లో హెచ్‌ఐవీ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. 2012లో హెడ్జ్‌కిన్ లింఫోమా బ్లడ్ క్యాన్సర్ సోకింది. చికిత్సలో భాగంగా జన్యు పోలికలు ఉన్న వ్యక్తి నుంచి మూలకణాలు మార్పిడి చేశారు. 18 నెలలపాటు యాంటీ రెట్రో వైరల్ మందులు ఇచ్చారు. మూడేండ్ల తర్వాత పరిశీలిస్తే అసలు హెచ్‌ఐవీ లక్షణాలేవీ అతనిలో కనిపించలేదు.

అందరికీ సాధ్యమా?

రవీంద్రగుప్తా బృందం చేసినట్లు అందరికీ మూలకణ వైద్యం చేసే అవకాశం ఉందా? అనే అంశం మెడికల్ సర్కిళ్లలో చర్చనీయాంశం అయింది. చాలామంది వైద్య నిపుణుల విశ్లేషణలను బట్టి చెప్పేదేంటంటే హెచ్‌ఐవీ సోకిన వారందరినీ రక్షించలేం అంటున్నారు. అంటే మూలకణ మార్పిడి చికిత్స సాధ్యం కాకపోవచ్చు. ఎందుకు అంటారా? ఖర్చు ఎక్కువ కావడం.. అదే జన్యు పోలికలున్న వ్యక్తులు దొరకడం అంత సులభమైన పని కాదు.

నియంత్రణ ఎలా?

హెచ్‌ఐవీ సోకిన తర్వాత దాని గురించి ఆందోళన చెందడం కన్నా.. రాకముందే జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. హెచ్‌ఐవీ ముఖ్యంగా అరక్షిత శృంగారం, కలుషితమైన సూదులు-పరికరాలు, సరిగా పరీక్షించకుండా రక్తం ఎక్కించడం వంటి వాటివల్ల సోకుతుంది. కాబట్టి ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. హెచ్‌ఐవీ ఉన్న గర్భిణి నుంచి బిడ్డకు కూడా వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉంది కాబట్టి ప్రత్యేకంగా దీనిపై అవగాహన కలిగి ఉండాలి.. అప్రమత్తంగానూ ఉండాలి.

తీవ్రత ఏ స్థాయిలో ఉంది?

హెచ్‌ఐవీ వైరస్ విస్తరణ గతంలో కంటే కాస్త తగ్గిందనే చెప్పొచ్చు. 2018లో జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ గణాంకాల ప్రకారం.. ఇండియాలో 2017లో కొత్తగా 87.58 వేల హెచ్‌ఐవీ కేసులు నమోదయ్యాయి. 69.11 వేల మంది ఎయిడ్స్ వల్ల చనిపోయారు. వ్యాధిపట్ల ఇదే స్పృహ.. అవగాహన కలిగి ఉంటే 2020 నాటికి హెచ్‌ఐవీ కేసుల నమోదును 75% తగ్గించవచ్చని ఎయిడ్స్ నియంత్రణ సంస్థ అంచనా.

ఎలా వ్యాపిస్తుంది?

హెచ్‌ఐవీ 94 శాతం లైంగికంగా వ్యాపిస్తుంది. చాలా తక్కువగా అంటే.. 0.4% రక్తం, రక్త ఉత్పత్తుల మార్పిడి ద్వారా సోకుతుంది. 0.3% సూదుల ద్వారా.. 3.8% తల్లి ద్వారా.. 1.5% స్వలింగ సంపర్కం వల్ల హెచ్‌ఐవీ వ్యాపిస్తుంది.

లక్షణాలేంటి?

తరచూ జ్వరం రావడం, చర్మవ్యాధులు దీర్ఘకాలంగా వేధించడం, జననావయవాల వద్ద ఇన్ఫెక్షన్లు తగ్గకపోవడం, నోటిపూత ఎక్కువ రోజులుండడం, క్షయ బారినపడడం వంటి లక్షణాలు హెచ్‌ఐవీ వైరస్ సోకినవారిలో కనిపిస్తాయి.

hiv-test

హెచ్‌ఐవీ.. ఎయిడ్స్ ఒకటేనా?

హెచ్‌ఐవీ అనేది వైరస్. దీనివల్ల వచ్చే వ్యాధి ఎయిడ్స్. అయితే హెచ్‌ఐవీ సోకితే ఎయిడ్స్ వచ్చినట్లు కాదు. హెచ్‌ఐవీ సోకిన తర్వాత కూడా చాలామందికి, చాలా ఏండ్లపాటు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటే కొన్ని రకాల మందులు.. చికిత్సల ద్వారా హెచ్‌ఐవీ వైరస్ సంతతిని నియంత్రించవచ్చు.

ఎయిడ్స్ దశ

వైరస్ సోకినవారిలో సగటున 10 ఏండ్లలో ఎయిడ్స్ దశలోకి వెళ్తారు. హెచ్‌ఐవీ శరీరంలోకి ప్రవేశిస్తే పరిస్థితి ఎలా ఉంటుదో చెప్పలేం. కాబట్టి ఆ వైరస్ బారిన పడుకుండా జాగ్రత్తగా ఉండటమే ఉత్తమం.

హెచ్‌ఐవీ వైరస్ వృద్ధి చెంది, రక్తంలో కనిపించడానికి కొంత సమయం పడుతుంది. కనీసం 6 వారాలు దాటితే గానీ ఎలెసా పరీక్షలో బయటపడదు. అదే అధునాతన ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏ, పీసీఆర్ పద్ధతుల్లోనైతే 15 రోజుల్లో కనబడుతుంది.
-దాయి శ్రీశైలం

వైరస్‌పట్ల నిర్లక్ష్యం వద్దు

చాలామంది హెచ్‌ఐవీ సోకిందని తెలిసేవరకూ నాకెందుకు వస్తుంది? అనే ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే దానికి సంబంధించిన లక్షణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. ప్రతీదానికి అనవసరంగా ఇంజెక్షన్లు చేయించుకోవద్దు. దంత చికిత్సల్లో వాడే పరికరాలను పద్ధతి ప్రకారం శుభ్రం చేసినవే వాడేలా చూసుకోవాలి. ఆపరేషన్లు, ప్రమాదాలు.. ఇలా చాలా సమయాల్లో ఆపద నుంచి గట్టెక్కటానికి అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వస్తుంటుంది. ప్రాణ రక్షణకు ఇది కీలకం కూడా. అయితే ఇతరుల నుంచి సేకరించిన రక్తాన్ని ఎక్కించేటప్పుడు దానిలో హెచ్‌ఐవీ గానీ, హెపటైటిస్-బి, హెపటైటిస్-సి, సిఫిలిస్, మలేరియా వంటివేమైనా ఉన్నాయేమో కచ్చితంగా పరీక్షించాలి. గర్భిణికి హెచ్‌ఐవీ ఉన్నట్టు గుర్తిస్తే అది కడుపులో పెరుగుతున్న బిడ్డకు సంక్రమించకుండా చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇవన్నీ పాటించాలి.

అపోహలు వద్దు


హెచ్‌ఐవీ రోగిని తాకితే మనకూ వస్తుందా?

-రాదు. హెచ్‌ఐవీ ఇన్ఫెక్షన్ గలవారి రక్తం, వీర్యం, జననాంగ లేదా మలం వంటి శరీర ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది.

కరచాలనం, కౌగిలింతలతో వస్తుందా?

-రాదు. హెచ్‌ఐవీ వైరస్ శరీరం బయట ఎక్కువసేపు బతకలేదు. కాబట్టి వీటివల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.

చెమట, కన్నీళ్లు, మూత్రం లేదా మలం ద్వారా వ్యాపిస్తుందా? -లేదు. చెమట, కన్నీళ్లు, మూత్రం లేదా మలంలో హెచ్‌ఐవీ వైరస్ ఉండదు.

గాలి, నీరు ద్వారా వ్యాపిస్తుందా?

-లేదు. హెచ్‌ఐవీ వైరస్ గాలిలో, నీటిలో జీవించలేదు. కాబట్టి దగ్గు, తుమ్ము, ఉమ్మి, ఈత కొలనులు, తాగే నీటి ద్వారా ఇది వ్యాపించదు.

ముద్దు వల్ల అంటుకుంటుందా?

-లాలాజలంలో హెచ్‌ఐవీ వైరస్ చాలా తక్కువ. కాబట్టి ఇది ముద్దులతో వ్యాపించదు. అయితే నోట్లో పుండ్లు, చిగుళ్ల నుంచి వెలువడిన రక్తంలోని వైరస్ లాలాజలంలో కలిస్తే వ్యాపిస్తుంది.

జీవనశైలి మార్చుకోవాలి

-హెచ్‌ఐవీ బాధితులకు ఇన్ఫెక్షన్ల ముప్పు ఎక్కువ. కాబట్టి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. తరచుగా చేతులను శుభ్రంగా కడుక్కోవటం, బయటి తిండి తినకపోవడం, ఎక్కడపడితే అక్కడ నీళ్లు తాగకపోవడం ఉత్తమం. వీలైనంతవరకు ఎప్పటికప్పుడు వండిన ఆహారమే తినాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. మద్యం, సిగరెట్ల జోలికి వెళ్లకపోవడం మేలు. అపరిచితులతో శృంగారం, సురక్షితంకాని సంభోగం వంటి వాటితో వైరస్ వ్యాప్తి చెందటమే కాదు. అవతలి వ్యక్తులకు ఏవైనా సుఖవ్యాధులుంటే వెంటనే అంటుకునే అవకాశముంది. ఇవి మరింత తీవ్రంగానూ వేధించొచ్చు. కాబట్టి అక్రమ సంబంధాలకూ దూరంగా ఉండాలి.

గర్భిణులు జాగ్రత్త

గర్భిణులకు హెచ్‌ఐవీ సోకితే చాలా ప్రమాదం. ఎందుకంటే ఇది పిల్లలకు సోకే ప్రమాదం ఉంది. వీరికి యాంటీరెట్రోవైరల్ చికిత్స ఇవ్వడం ద్వారా పిల్లలకు హెచ్‌ఐవీ సంక్రమించకుండా చూసుకోవచ్చు. హెచ్‌ఐవీ గర్భిణులు చికిత్స తీసుకోకపోతే పిల్లలకు వైరస్ సంక్రమించే అవకాశం 30% ఉంటుండగా.. చికిత్స తీసుకోవడం ద్వారా దీన్ని పూర్తిగా (1%) తగ్గించుకోవచ్చు. వీరికి సిజేరియన్ కాన్పు చేయడం, అలాగే కాన్పు అనంతరం 12-24 గంటల్లోగా శిశువుకు ముందు జాగ్రత్తగా యాంటీరెట్రోవైరల్ మందుల చుక్కలను ఇవ్వడం ద్వారా వైరస్ బారి నుంచి సంపూర్ణంగా కాపాడుకోవచ్చు.
Dr-Sharada
-డాక్టర్ ఎం. శారద, సీనియర్ గైనకాలజిస్ట్

102
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles