ఈ వీధిబాలలు..వరల్డ్‌కప్ విజేతలు!


Sun,May 12, 2019 01:22 AM

team-india
ఐపీఎల్ ఫైనల్ ఇవాళ జరుగనున్నది. ఈసారి ఎవరు గెలుస్తారోనని ఆసక్తి పెరిగిపోతున్నది. ఇక త్వరలోనే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ప్రపంచమంతా క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతున్న ఈ సమయంలో.. మన దేశానికి చెందిన వీధి బాలలు కూడా వరల్డ్ కప్ గెలిచారు తెలుసా? ఏడు దేశాల జట్లతో పోటీపడి వరల్డ్‌కప్ మన దేశానికి అందించారు. అదెలా సాధ్యమంటారా? ప్రతియేటా జరిగే స్ట్రీట్ చిల్డ్రన్ వరల్డ్‌కప్‌లో ఈ సారి మనోళ్లు సత్తా చాటారు.
team-india3
అవి స్ట్రీట్ చైల్డ్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ మైదానం ఆ ఫైనల్స్‌కు వేదికైంది. చుట్టూ చిన్నారుల కేరింతలు. సిక్స్ ఏ సైడ్ మ్యాచ్‌లో ఇండియా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయి. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 42 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా జట్టు.. చివరి బంతి వరకూ పోరాడింది. కేవలం ఒక్క బంతిలో విజయానికి రెండు పరుగులు కావాలి. బ్యాటింగ్ ైస్ట్రెకింగ్‌లో ముంబైకి చెందిన మణిరత్నం ఉన్నాడు. ప్రత్యర్థి సంధించిన చివరి బంతిని సిక్స్ రూపంలో పెవిలియన్‌కు తరలించి.. ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌తో వీధి బాలల్లోని అసాధారణ ప్రతిభ ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయమైంది.

కొబ్బరి మట్టలే బ్యాట్లు!

వీధి బాలలే కదా అని చులకనగా చూడకండి. వీళ్లూ మనుషులే. వాళ్లలోనూ కనిపించని ప్రతిభ ఉంటుంది. ఇప్పడది ప్రపంచమంతా తెలిసింది. మన దేశ గౌరవాన్ని నిలబెట్టింది. తాటిమట్టలు, చెక్క బ్యాట్లు, రబ్బరు బాళ్లతో వీధుల్లో ఆడిన వీళ్లే.. ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో దుమ్ము దులిపారు. వీరికి క్రికెట్ అంటే మక్కువ. బ్యాటు, బాల్ కొనిచ్చే తల్లిదండ్రులు లేకపోయినా ఆటలో అదరగొట్టారు. ఈ స్థాయికి వచ్చేవరకూ గురువు ఎవ్వరూ లేకపోయినా సొంత తప్పిదాలే కోచ్‌లయ్యాయి. రోడ్డుమీద దొరికే కొబ్బరిమట్టలు, చెక్కలే బ్యాట్లు అయ్యాయి. చెత్తకుప్పల్లో దొరికే తగరాలు, కాగితాలే బంతులయ్యాయి. వాటితో నేర్చుకున్న ఆటనే వీరికి ప్రపంచస్థాయి గుర్తింపును ఇచ్చాయి. ఇలాంటి ప్రతిభావంతులను ఆయా స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు చేరదీయకపోతే.. వీరు మరోలా ప్రపంచానికి పరిచయం అయ్యేవారేమో.
team-india1

ఆసక్తికరంగా పోటీలు

ఏప్రిల్ 30 నుంచి మే 7 వరకు ఇంగ్లాండ్‌లో ఈ క్రికెట్ పోటీలు జరిగాయి. పలు దేశాలకు చెందిన పది జట్ల వీధిబాలలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. గత మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో మన దేశ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చి కప్ గెలిచింది. ఫైనల్స్‌లో ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఈ పోటీల్లో పాల్‌రాజ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. వీరిలో మణిరత్నం, నాగలక్ష్మి, భవానీ వీరకన్ను మాయవన్, మోనిశ్, షామా సిద్ధిఖీ, మొహర్ ఇర్ఫాన్, సూర్యప్రకాశ్ జట్టు సభ్యులు. మొత్తం 14 నుంచి 17 యేండ్ల వయసున్నవారే. సిక్స్ ఏ సైడ్ టోర్నీలో కేవలం ఆరుగురు మాత్రమే ఆడాలి. మొత్తం ఎనిమిది మంది సభ్యులుంటారు. వీరిలో ఇద్దరు స్టాండ్‌బైగా ఉంటారు. అబ్బాయిలు, అమ్మాయిలు కలిసే ఆడతారు. వీరిలో నలుగురు ముంబైలోని మ్యాజిక్ బస్ ఇండియా సంస్థకు చెందినవారు. మిగిలిన నలుగురు చెన్నైకి చెందిన కారుణ్యాలయ సెంటర్ ఫర్ స్ట్రీట్ అండ్ వర్కింగ్ చిల్డ్రన్‌కు చెందినవారు. 2013 నుంచి వీధిబాలల కోసం ఇంగ్లండ్‌లోని స్ట్రీట్ చైల్డ్ యునైటెడ్ సంస్థతో, చెన్నైలో ఉన్న కారుణ్యాలతో కలిసి వరల్డ్‌కప్ నిర్వహిస్తున్నది. ఇదివరకు జరిగిన ఆరు వరల్డ్‌కప్ పోటీల్లో భారత్‌కు చెందిన క్రీడాకారులు పొల్గొన్నప్పటికీ ఎప్పుడూ గెలువలేదు. ఇదే మొదటిసారి.

క్రీడాకారుల ఎంపికే ఓ పరీక్ష!

స్ట్రీట్ చిల్డ్రన్ వరల్డ్‌కప్ పోటీలంటే మామూలు విషయం కాదు. ఈ పోటీలకు జట్టుని ఎంపిక చేసుకోవడానికి కారుణ్యాలయ ఎన్నో కసరత్తులు చేసింది. దేశవ్యాప్తంగా ఆయా ఎన్జీఓలకు వెళ్లి.. క్రీడల్లో ఆసక్తి ఉన్న వీధిబాలలను గుర్తించింది. ఇలా 150 మందిని ఎంపిక చేసింది. వీరికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. పలు టోర్నీలు నిర్వహించి.. అందులో ప్రతిభావంతులైన వీధిబాలలను తుదిజట్టుకు ఎంపిక చేశారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 కోట్లమంది వీధి బాలలు ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా. వీరిలో చాలామందిని మానవ అక్రమ రవాణా కోసం వినియోగిస్తున్నారు. ఈ పోటీల వల్ల ఆయా దేశాలకు చెందిన వీధిబాలలతో మనవారికి పరిచయాలు ఏర్పడ్డాయి. అంతా కలిసి లార్డ్స్ వేదికగా స్కూల్‌కి వెళ్తాం. పనికి కాదు అంటూ నినదించారు.
team-india2

మాకు రక్షణ కల్పించండి

మేమంతా వీధిబాలలం. ఇల్లు, వాకిలి ఉన్నవారికే ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. మరి మాలాంటి వారి పరిస్థితేంటి? వీధుల్లో జీవనం సాగించాలంటే ఎంతో కష్టం. ముఖ్యంగా మహిళలకు, పిల్లలకు రక్షణ ఉండదు. సమాజంలో అందరికీ మేమంటే చులకన. మేం చెప్పేది ఒకటే.. మీరు పట్టించుకోకుంటే మాకు ఎప్పటికీ రక్షణ ఉండదు. దయచేసి మమ్మల్ని రక్షించండి.
- మనీషా, క్రీడాకారిణి

- వనజ వనిపెంట

442
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles