చిన్న ఆలోచన..పెద్ద సందేశం


Sat,May 4, 2019 10:53 PM

Ardzan
పిల్లలు అల్లరి మాత్రమే కాదు అద్భుతాలూ చేస్తారు. మరికొన్నిసార్లు అమాయకత్వంతో తమకంటే చిన్న వారిని ఆదరిస్తారు, అవసరమైతే ధైర్యం చెప్తారు. చాక్లెట్‌కి డబ్బులివ్వు అని అడిగేవారే పనిచేసి ఎదుటి వారి ఆకలి తీరుస్తారు. వీరు చేసిన పనులు కాస్త అప్‌డేట్ చేస్తే లక్షల్లో అభిమానుల్ని సంపాదించు కుంటారు. ఇలా ఎంతోమంది మనసుల్ని దోచుకున్న ఐదుగురు చిన్నారులు వీరు.

కోడిపిల్లను కాపాడండి!

hen
మిజోరాంకు చెందిన ఆరేండ్ల బాలుడు సైకిల్ నడుపుతుండగా కోడిపిల్ల అడ్డుపడి నలిగిపోయింది. అయ్యో కోడిపిల్ల ప్రాణాలు ఎలాగైనా కాపాడాలి.. ఏం చేయాలి? అని ఆ బాబు తహతహలాడాడు. ఒకరోజు అమ్మకు బాగులేకుంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు నాన్న. ఆ సంఘటన గుర్తొచ్చింది బాబుకు. ఆలస్యం చేయకూడదు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి అనుకున్నాడు బాబు. డాక్టర్‌కి డబ్బు ఇవ్వకుంటే ట్రీట్‌మెంట్ చేయడు. మరి ఎలా? దాచుకున్న 10 రూపాయలు గుర్తొచ్చాయి. ఒక చేతిలో నోటు, రెండో చేతిలో కోడిపిల్లను పట్టుకొని కాపాడండి అంటూ దవాఖానాకు పరుగు తీశాడు. అది చూసిన సంగా అనే ఫేస్‌బుక్ యూజర్ బాబు ఫోటో తీసింది. చనిపోయిన కోడిపిల్ల ప్రాణాలు కాపాడడం కోసం బాబు పడ్డ ఆవేదన, అమాయకత్వం అందరి హృదయాల్ని కదిలించింది. ఈ ఫొటో 65,000 షేర్లు, 14,000 లైకులతో బాగా వైరల్‌గా మారింది. రోడ్డు ప్రమాదంలో మనుషులు గాయపడితే పట్టించుకోని వారు ఈ బాబుని చూసి నేర్చుకోండంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. బాబుకు స్కూల్ తరపున అవార్డు కూడా దక్కింది.

పిల్లి ఆకలి తీర్చడం కోసం..

cat-milk
పట్టుమని ఏడేండ్లు కూడా ఉండవు. ఆకలి కోసం రోడ్ల మీద దొరికే చెత్త అమ్ముకొని వచ్చిన వాటితో కడుపునింపుకునేవాడు. ఒకరోజు అతనిలానే అనాథగా ఉన్న ఓ పిల్లి కనిపించింది. ఆకలితో మియామ్.. మియామ్ అని అరుస్తున్నది. నోరున్న మనుషులకే అన్నం దొరకడం కష్టంగా ఉంది. మరి మూగజీవులకి ఎలా అని ఆలోచించాడు ఈ బుడతడు. చెత్త, ఇనుము, కాగితాలు అమ్ముకొని వచ్చిన రూ. 20లతో అన్నం కొని తినేవాడు. ఆ రోజు అతని మధ్యాహ్న భోజనం వద్దనుకొని వచ్చిన డబ్బుతో పాలు కొని పిల్లికి ఆహారంగా పెట్టాడు. దీన్ని వీడియో తీసి ట్విటర్‌లో పెట్టాడు ఎవరో మహానుబావుడు. ఈ వీడియో చూసి మానవత్వం బతికే ఉందని కొందరంటే, పొగడ్తలు ఎందుకు బాబు చదువుకోవడానికి బాబుకు స్కూల్ ఫీజు, పుస్తకాలు, బట్టలు కొనివ్వండి అంటూ నెటిజన్లు అభిప్రాయాలు వెలిబుచ్చారు.

తమ్ముడిలా అనిపించాడు

hungry-boy
పిలిప్పీన్స్‌లోని మనిలాకు చెందిన ఐదేండ్ల పాప పెద్ద కుటుంబంలో పుట్టింది. గొప్పోళ్లంతా ఎందరికో పని కల్పిస్తుంటారు. కానీ రోడ్డు మీదున్న వారిని మాత్రం పట్టించుకోరు. ఒకరోజూ ఈ పాప కారులో ప్రయాణిస్తుండగా రోడ్డు మీద మూడేండ్ల బాబు బిక్కుబిక్కుమని కూర్చోనున్నాడు. కదిలిస్తే ఏడిచేలా ఉన్నాడు. రోడ్డుపై బాబుని చూడగానే ఆ పాపకి తన తమ్ముడు గుర్తొచ్చాడు. వెంటనే కారు ఆపించి ఆ బాబు దగ్గరికి వెళ్లింది. అతన్ని పలుకరిస్తే ఆకలికి ఏడుస్తున్నాడని అర్థమైంది తనకి. వెంటనే ఇంటికి వెళ్లి ఆహారం తీసుకొచ్చి ఆ బాబు ఆకలి తీర్చింది. ఈ పాపని చూసి పెద్దలు చాలా నేర్చుకోవాలి. ఈ వీడియో ట్విట్టర్‌లో హల్‌చల్ చేసింది. ఆకలితో ఉన్నవారికి కాస్త అన్నం పెడితే ఆస్తేమి కరిగిపోదు కదా అంటూ ఈ చిన్నారిని తెగ పొగిడేశారు నెటిజెన్లు.

మనమే శుభ్రపరుచాలి

lake-clean
దాల్ సరస్సు ఆసియాలోని పెద్ద సరస్సులలో ఒకటిగా పేరుగాంచింది. ఎంత పెద్దది అయినా పట్టించుకోకుంటే పాడవ్వాల్సిందే. ఇక్కడ కూడా అదే జరిగింది. సరస్సు అంతా మురికి, చెత్తతో నిండింది. దీన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అందుకే వీటి బాధ్యతని ఐదేండ్ల జన్నత్ తీసుకున్నది. శుభ్రతా పరిశుభ్రతా అంటూ రంగంలోకి దిగింది. తన వంతు ప్రయత్నం చేసింది. చేస్తున్నది. చిన్ని చేతులు అద్భుతాన్ని చేశాయి అంటూ వీడియో అప్‌లోడ్ చేశారెవరో. అది కాస్త వైరల్‌గా మారింది. జన్నత్‌కి ఇప్పుడు చాలామంది అభిమానులు ఏర్పడ్డారు.

ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి

hair-cut
ముంబైకి చెందిన నాలుగేండ్ల ఇషాన్వి గుండు చేయించుకున్నది. చిన్న వయసులో అంటే దేవుడికి ఇచ్చి ఉంటుందిలే అనుకుంటారు. అమ్మమ్మ అంటే ఈషాకి చాలా ఇష్టం. అందుకే ఈ పని చేసింది. అమ్మమ్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నది. రోగం ముదిరేకొద్దీ జుట్టు రాలడం మొదలైంది. ఆపరేషన్‌కి గాను జుట్టు తీసేశారు. మహిళలకు జుట్టంతే ఎంత ప్రాణమో చెప్పనక్కర్లేదు. మానసికంగా కృంగిపోయేది ఈషా అమ్మమ్మ. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. లేదంటే రోగం త్వరగా నయం కాదు. జుట్టు లేదని బాధపడకు నేను కూడా జుట్టు తీయించుకుంటాను అని ఈషా చెప్పింది. అన్నంత పనీ చేసింది. ఇప్పుడు చూడు ఇద్దరం ఒకేలా ఉన్నాం అని ముద్దు ముద్దుగా చెప్పిన మాటలకి అమ్మమ్మ మనసు కుదుటపడింది. ఈషా చేసిన పని సోషల్ మీడియాలో చాలామందిని కదిలించింది.

262
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles