క్యాన్సర్‌ను జయించవచ్చు


Tue,May 22, 2018 12:47 AM

ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ 2011 లో సెమినోమా (ఊపిరితిత్తులు, గుండె మధ్య కణితి)కి గురయినపుడు అందరూ ఆందోళన చెందారు. తర్వాత ఆయన పూర్తిస్థాయిలో చికిత్స తీసుకొని పూర్తిగా కోలుకొని ది టెస్ట్ ఆఫ్ మై లైప్ అనే పుస్తకం రాశారు. ప్రస్తుతం ఎప్పటి లాగే క్రీఢా జీవితాన్ని గడుపుతున్నారు. అనేక భాషల్లో నటించి అగ్రతారగా వెలుగొందిన మనీషా కొయిరాల 2012లో అండాశయ క్యాన్సర్‌కు గురయ్యారు. సర్జరీ, ఆ తర్వాత చికిత్సలు పూర్తి చేసుకుని పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకున్నారు. ఇప్పుడు క్యాన్సర్ అవగాహనా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. నటి గౌతమి, గ్రామీ అవార్డు గెలుచుకున్న పాటల రచయిత గాతని షెరిల్ క్రౌ ఇలా ఎంతో మంది క్యాన్సర్‌ను పూర్తి స్థాయిలో జయించి ఇప్పుడు సంతోషకర జీవితాన్ని గడుపుతున్నారు. ఇది కేవలం ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల వివరాలు మాత్రమే. ఇలా క్యాన్సర్‌ను జయించిన వారు సామాన్యుల్లో కూడా కోకొల్లలు. వీరిలో కొంతరు జీన్ మ్యూటేషన్, ఇతర పరీక్షల ద్వారా ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి క్యాన్సర్ రాకుండా చికిత్స తీసుకున్న ఆంజెలినా జోలీ వంటి వారు కూడా ఉన్నారు.
Cancer


అవగాహనే ముఖ్యం

క్యాన్సర్ అని తెలియగానే కుంగిపోకుండా, మనోధైర్యంతో సమస్యను ఎదుర్కోవడం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్సలు అవసరమవుతాయి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఇలాంటి అన్ని విషయాల్లో అవగాహన పెంపొందించుకొని డాక్టర్ సలహా తప్పకుండా పాటిస్తూ ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే వారి వారి వృత్తుల్లో కొనసాగడం ముఖ్యంగా గమనించాల్సిన విషయం. క్యాన్సర్ సోకడానికి ఇదీ కారణం అని కచ్చితంగా చెప్పడం సాధ్యపడదు. ఈ జబ్బున పడిన వారిలో చక్కని ఆరోగ్యశైలి కలిగిన వారు కూడా ఉన్నారు. దురలవాట్లకు లోనైన వారు కూడా ఉన్నారు. వయసులో ఉన్నవారు, వయసు పైబడిన వారు, నడి వయసు వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే తొలిదశలో గుర్తిస్తే ఏ క్యాన్సర్‌నైనా సరే తగ్గించడం సాధ్యమే. పొగాకు ఉత్పత్తులు వినియోగించేవారు, మోతాదుకు మించి ఆల్కహాల్ తీసుకునే వారు, ఎక్కువ బరువు కలిగి ఉన్నవారు, ఎక్కువ మంది శృంగార భాగస్వాములు కలిగిన వారికి ఈ ముప్పు మరింత ఎక్కువ. ఒక్కోసారి పర్యావరణ పరిస్థితులు, వారి వృత్తి, వంశపారంపర్య లక్షణాలు, మానసిక ఒత్తిడి, అలవాట్లు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు ఇలా అనేక విషయాలు క్యాన్సర్ ప్రేరేపకాలుగా పనిచేయవచ్చు.


వైద్య పరిజ్ఞానం చాలా పెరిగింది

ఒకప్పటితో పోలిస్తే క్యాన్సర్ మీద పట్టు సాధించగలుగుతున్నారు. నయం చెయ్యడం అన్ని సందర్భాల్లో సాధ్య పడకపోయినప్పటికీ అదుపులోకి తీసుకు రావడం సాధ్యపడుతున్నది. కీమోథెరపీ చికిత్సలో కొత్త మందులు రావడం వల్ల ఇప్పుడు క్యాన్సర్ చికిత్స పెర్సనలైజ్డ్‌గా మారింది. అంటే క్యాన్సర్ సోకిన వ్యక్తులందరికీ ఒకే రకమైన చికిత్స కాకుండా రోగి స్థితిగతులను అనుసరించి మందులే కాదు చికిత్స అందించే తీరు కూడా మారుతున్నది. ఫలితంగా దుష్ప్రభావాలు చాలా తగ్గిపోయాయి. రేడియేషన్ చికిత్సలు కూడా ఇప్పుడు ఇతర భాగాల మీద ప్రభావం తక్కువగా ఉండే విధంగా అందుబాటులో ఉన్నాయి. కేవలం క్యాన్సర్ కణాల మీద మాత్రమే ప్రభావం చూపే పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. విమాట్(విఎమ్‌ఏటి), సైబర్ నైఫ్ వంటి ఆధునిక పరికరాలతో సర్జరీలు కూడా చాలా సమర్థవంతంగా చెయ్యగలుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో రొమ్ముల వంటి అవయవాలు తొలగించినప్పటికి తిరిగి రీకన్‌స్ట్రక్షన్ చికిత్సలతో వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్నారు. చిన్నకోతతో చేసే కీహోల్ సర్జరీలు కూడా క్యాన్సర్ చికిత్సలో అందుబాటులోకి వచ్చాయి. కావలసిందల్లా తొలి దశలో వ్యాధి నిర్ధారణ చేసుకోవడం, అనుభవజ్ఞులైన డాక్టర్‌ను సంప్రదించడం, మందులు, చికిత్స సరిగ్గా తీసుకోవడం, గ్రూప్ కౌన్సెలింగ్‌లకు హాజరవడం, వ్యక్తిగత కౌన్సెలింగ్ కూడా తీసుకోవడం, యోగా, ధ్యానం వంటివి సాధన చెయ్యడం, నలుగురితో కలిసి ఉండేందుకు ప్రాధాన్యతను ఇవ్వడం మంచిది. క్యాన్సర్ అని తెలియగానే కుంగి పోయే వారిలో స్త్రీల సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా మహిళా పేషెంట్లు ఆత్మైస్థెర్యాన్ని కోల్పోకుండా చికిత్స తీసుకుంటూ ఉంటే క్యాన్సర్‌ను జయించడం పెద్ద విషయం కాదు.
Mohan-Vamshi

807
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles