మోకాళ్ళ నొప్పులకు ఇక సెలవు


Mon,February 19, 2018 01:31 AM

salahaT
ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడికంటే అక్కడికి కిక్కురు మనకుండా మన శరీరం, మన వెంటబడి నడుస్తూనే ఉంటుంది కదా! అయినా, దానికేదైనా ఇబ్బంది ఏర్పడితే మాత్రం చాలా కాలం దాకా అసలు పట్టించుకోము. ఇలా అలా అయితే లాభం లేదని, ఒక నొప్పి రూపంలో శరీరం తన బాధను వ్యక్తం చేస్తుంది. చాలాసార్లు అదీ పట్టించుకోము. మనిషిలో మరీ ఇంత మజ్జుతనం ఏమిటో అర్థమే కాదు. ఎప్పుడో పూర్తిగా కదల్లేని స్థితి ఏర్పడినప్పుడు గానీ, మన దృష్టి హాస్పిటల్ దాకా వెళ్ళదు. నిజానికి నొప్పి అనేది మనిషికి గొప్ప ముందస్తు హెచ్చరిక. బాబ్బాబు నా పరిస్థితి ఏమీ బాగోలేదు. నా విషయం కాస్త చూడు నాయనా! అంటూ అది అదేపనిగా వేడుకుంటుంది. కానీ, ఉద్యోగాలు, వ్యాపారాలు మనకు ఇవే ప్రధానం కదా! కాకపోతే అర్థం కాని విషయం ఒక్కటే. ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం చేయాలన్నా శరీరం సహకరించాలి కదా! సహకరించక ఏం చేస్తుందిలే అని నిర్లక్ష్యంగా ఉండిపోతే ఏదో ఒక రోజున అది చావుదెబ్బ తీస్తుంది.


మోకాళ్ళ నొప్పులంటే అసలుకే మోసం రావడం కదా! ఆ కాలు కదపడమే కష్టమైన వాడు ఉద్యోగం ఏం చేస్తాడు? వ్యాపారం ఏం చేస్తాడు? కళ్ళు, కాళ్ళు ఇవే కదా మౌలికమైన మన జీవన రహదారులు. కళ్లు బాగుంటే చాల్లే అనుకుంటే అవి నిన్ను దారెంట నడిపించలేవు కదా! ఏ వాహనం ఉన్నా, కాళ్ళతో పనిలేకుండా ఉండదు కదా! మోకాళ్ళ నొప్పుల గురించే కాదు. అవి రావడానికి గల కారణాలేమిటో కూడా తెలియాలి. ఆ కారణాల్లో మనం స్వయంగా చేస్తున్న తప్పిదాలేమిటో కూడా తెలుసుకుంటే వాటిని చక్కదిద్దుకోవడం ద్వారా సగం వ్యాధి నుంచి బయటపడవచ్చు.

అసలేం జరుగుతుంది?

శరీరంలోని కండరాలు ఒక ఎముకను మరో ఎముకతో పట్టి ఉంచి కీళ్ల కదలికలకు సహకరిస్తూ ఉంటాయి. ఎముకలను అలా కప్పి ఉంచే కండరాలే ఏ కారణంగానైనా బలహీనపడితే, ఎముకల మీద, కీళ్ళ మీద తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ఫలితంగా కీళ్ళు దెబ్బ తింటాయి. వాస్తవానికి మన శరీరంలోని ఎముకలకు టన్నుల కొద్దీ బరువు మోయగలిగే శక్తి ఉంటుంది. కానీ వాటి పోషణ సరిగా లేక ఎముకలు పెళుసుబారిపోయి కొద్దిపాటి ఒత్తిడికే విరిగి పోతున్నాయి.

కొన్ని రకాల విష జ్వరాలు, చికెన్ గున్యా, కొన్ని రకాల వైరల్ జ్వరాల వల్ల కూడా శరీరంలో వాతం పెరిగి కీళ్ళ సమస్యలు మొదలవుతాయి.
మోకాలు కీళ్లల్లో నీరు చేరి వాపు రావడం, కీళ్ళ మధ్యలో ఉండే సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవడం, కార్టిలేజ్ అరిగిపోవడం లేదా కుంచించుకుపోవడం వంటి ఏ కారణంగానైనా కీళ్ల నొప్పులు రావచ్చు.

సర్జరీలకు వెళితే ఏమవుతుంది?

ముందు పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ అంటూ కొంత కాలం గడిపి ఆధునిక వైద్యులు చివరికి సర్జరీకే సిద్ధం చేస్తారు. ప్రమాదాలు జరిగి ఎముకలు విరిగి నప్పుడు ఇక ఎలాగూ తప్పదు కానీ, ఆయుర్వేద వైద్య చికిత్సలతో తగ్గే అవకాశం ఉన్నప్పుడు సర్జరీలు ఎందుకు? వాస్తవానికి అరిగిన కీళ్ళకు పునరుత్తేజా న్నిచ్చే ఆయుర్వేద ఔషధాలెన్నో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అసలు దోషాన్ని స్పష్టంగా గుర్తించి తగిన ఔషదాలు ఇస్తే సర్జరీ లేకుండానే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

ఎంతకాలం వాడాలి?

కీళ్ళనొప్పులు రావడానికి పట్టిన కాలం చాలా ఎక్కువ. వాస్తవానికి సమస్య ఎప్పుడో ప్రారంభమై ఉంటుంది. కానీ, సమస్య ఒక తీవ్రస్థాయికి చేరుకున్నాకే కదా ఎవరైనా డాక్టర్‌ను సంప్రదిస్తారు! ఆయుర్వేద ఔషధాలు తీసుకున్న కొద్ది కాలానికే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోవచ్చు. కాస్త ఉపశమనంగా ఉంది కదా అని వెంటనే మందులు వేసుకోవడం మానేస్తారు. ఫలితంగా ఆ తరువాత కొద్ది రోజులకు మళ్ళీ నొప్పులు మొదలవుతాయి. మూలాల్లో ఉన్న లోపం నయం కాకముందే మందులు ఆపేస్తే వచ్చే కష్టనష్టాలు ఇలాగే ఉంటాయి. అందుకే ఆయుర్వేద వైద్య చికిత్సలు సంపూర్తిగా తీసుకోండి. మోకాళ్ళ నొప్పుల నుంచి సంపూర్తిగా, శాశ్వతంగా విముక్తి పొందండి.

1858
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles