అలా అనుకుంటే.. కెరీర్ అక్కడే ఆగిపోతుంది..


Sun,January 20, 2019 01:25 AM

41యేండ్ల సినీ ప్రయాణం..340కి పైగా సినిమాలు.. పద్మశ్రీ పురస్కారంతో ఏడు జాతీయ అవార్డులు.. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అంతులేని అభిమానగణం... వెరసి మోహన్‌లాల్ సినీ ప్రయాణం విజయమే సోపానంగా సాగుతున్నది.ఆరు పదుల వయసుకు చేరువైనా కూడా నవతరం కథానాయకులతో పోటీ పడి సినిమాలు చేస్తూ తనకు తానే పోటీ అని నిరూపించుకుంటున్నారు మోహన్‌లాల్. జిందగీతో ఈ విలక్షణ నటుడు చెప్పిన ముచ్చట్లివి.
MOHAN-LAL

సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది? నాలుగు దశాబ్దాలుగా సక్సెస్‌ఫుల్ హీరోగా కొనసాగడం ఎలా సాధ్యమైంది?

-నేను సినిమాల్లో అడుగుపెట్టి నలభై ఒక్క ఏళ్లు పూర్తయ్యాయి. నా ప్రతిభ, సంకల్పబలానికి తోడు మంచి పాత్రలు, కథల వల్లే ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగగలుగుతున్నాను. కొత్తదనంతో కూడిన కథాంశాలతో సినిమాలు చేసిన ప్రతి సారీ ప్రేక్షకులు విజయాల్ని అందిస్తున్నారు. వారి ఆశీర్వాద బలమే నాలో నిరంతరం ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతూ ముందుకు నడిపిస్తున్నది.

యాభై ఎనిమిదేళ్ల వయసులో రిస్కీ యాక్షన్ సన్నివేశాల్లో అలవోకగా నటిస్తున్నారు?

-యాక్షన్ నాకు ఇష్టమైన జోనర్. నా నట ప్రయాణంలో యాక్షన్ కథాంశాలతో చాలా సినిమాలు చేశాను. పులి మురుగన్, ఓడియన్ లాంటి కథలకు ప్రాణం పోయాలంటే యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సిందే. నటనకు వయసు అడ్డంకి కాదని విశ్వసిస్తాను. ఇప్పటికీ యాక్షన్ సినిమాలకు న్యాయం చేయగలనన్న నమ్మకం నాలో బలంగా ఉంది. అది లేని రోజు అలాంటి సినిమాలు చేయడం మానేస్తాను.

తెలుగుతో పాటు హిందీ, తమిళంలో సినిమాలు చేస్తున్నారు. భాషాపరమైన అవరోధాల్ని ఎలా అధిగమిస్తుంటారు?

-మాతృభాషలో సినిమా చేస్తున్నప్పుడు పాత్ర తీరుతెన్నులను సులభంగా ఆకళింపు చేసుకొని అందులో అలవోకగా ఒదిగిపోగలుతాం. పరాయి భాషల్లో సినిమా చేస్తున్నప్పుడు ఆ వెసులుబాటు ఉండదు. షూటింగ్ చేస్తున్నప్పుడు శిక్షకుల, సహాయ దర్శకుల సహకారంతో భాషపై పట్టు సాధించే ప్రయత్నం చేస్తాను. నా పాత్రకు సంబంధించిన డైలాగ్‌లను మళ్లీ మళ్లీ పునశ్చరణ చేసుకుంటూ భాషా పరిజ్ఞానం పెంచుకుంటాను.

ఈ మధ్యకాలంలో చారిత్రక కథాంశాలు, పాత్రల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు?

-ఫలానా కథలతో సినిమాలు చేయాలని నేనెప్పుడు ప్లాన్ చేసుకోను. జోనర్‌లతో సంబంధం లేకుండా మంచి సినిమాలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తాను. ప్రియదర్శన్‌తో చేస్తున్న సినిమా మరక్కర్ అరబిక్కడిలింతే సింహా చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్నది. పోరాట యోధుడైన నావికాధికారిగా ఈ సినిమాలో కనిపిస్తాను.

నటనా పరంగా తీరని కోరికలు ఏమైనా ఉన్నాయా?

-నేనో పరిపూర్ణ నటుడినని, అన్నీ తెలుసుననే భావనతో ఎప్పుడూ ఉండను. అలా అనుకుంటే కెరీర్ అక్కడితోనే ఆగిపోతుంది. నటుడిగా ఇంకా నేను చేయాల్సిన పాత్రలు, కథలు చాలా ఉన్నాయి. వినూత్నమైన పాత్రలు లభించడం ఏ నటుడికైనా అదృష్టమే. అలా నా కోసం కెరీర్ తొలినాళ్ల నుంచి దర్శకులు విలక్షణ పాత్రల్ని సృష్టించారు. నాపై వారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తాను. మంచి పాత్రలు రావాలని మనం కోరుకుంటే సరిపోదు. దర్శకులు అలాంటి కథల్ని, పాత్రల్ని మనకోసం సృష్టించినప్పుడే వస్తాయి. అందుకే నేను దర్శకులు, నిర్మాతలకు ఎక్కువ గౌరవం, విలువ ఇస్తాను. వారి వల్లే నటుడిగా నేను ఈ స్థాయికి చేరుకున్నానని నమ్ముతాను.

తెలుగు ఇండస్ట్రీలో మీకు స్నేహితులు ఉన్నారా?

-తెలుగు ఇండస్ట్రీతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉంది. చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇక్కడ మంచి స్నేహితులున్నారు. మలయాళంలో నేను నటించిన చాలా సినిమాల్ని వెంకటేష్, మోహన్‌బాబు తెలుగులో రీమేక్ చేశారు. మలయాళంలో నేను నటించిన పలు సినిమాలు తెలుగులో అనువాద రూపంలో విడుదలై పెద్ద విజయాల్ని సాధించాయి. తెలుగులో మంచి కథలు దొరికితే సినిమాలు చేస్తుంటాను. ప్రస్తుతం అవకాశాలు వస్తున్నాయి.

యువతరం హీరోలతో పోటీపడి సినిమాలు చేస్తున్నారు. ఆ తపనకు స్ఫూర్తి ఏమిటి?


MOHAN-LAL1
-వృత్తిని అమితంగా ప్రేమిస్తాను. నాకు నచ్చిన సినిమాల కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడటానికి సిద్ధమే. 365 రోజుల పాటు సినిమాలు చేస్తునే ఉంటాను. ఖాళీగా ఉండడం నాకు నచ్చదు. సినిమాకు ప్యాకప్ చెప్పగానే మరో సినిమా మొదలుపెడుతాను. చేసే పనిలో ఆనందాన్ని ఆస్వాదించలేని వారు అందులో ఎక్కువ కాలం మనుగడ సాగించలేరు.

భాషాభేదాలకు అతీతంగా భారీ ఇతివృత్తాలతో సినిమాలు చేసే ధోరణి ప్రస్తుతం పెరిగింది? ఇది సినీ పరిశ్రమకు ఎంతవరకు మంచిదని అనుకుంటున్నారు.

-లార్జర్‌దేన్ లైఫ్ కథాంశాలు, భారీ సాంకేతిక హంగుల సమ్మిళితంగా ఉంటాయి కాబట్టే ప్రతిఒక్కరూ హాలీవుడ్ సినిమాల గొప్పతనాన్ని గురించి మాట్లాడుకుంటుంటారు. అలాంటి కథలతో మనం సినిమాలు చేస్తే భాషాపరమైన హద్దులను చెరిపివేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని అలరించే అవకాశం ఉంటుంది. హాలీవుడ్ సినిమాల స్థాయిలో మన చిత్రాలు వసూళ్లను సాధించగలవని బాహుబలి సినిమా నిరూపించింది. ప్రస్తుతం చేస్తున్న మరక్కర్ అరబిక్కడిలింతే సింహాని భారీ హంగులతో ప్రపంచస్థాయి సినిమాగా తీర్చిదిద్దుతున్నాం. మంచి కథ, భారీ సినిమాల్ని తెరకెక్కించే శక్తిసామర్థ్యాలు, సాంకేతిక వనరులు అందుబాటులో ఉంటే అలాంటి సినిమాలు చేయడంలో తప్పు లేదు.

మీ అబ్బాయి ప్రణవ్ గత ఏడాది ఆది సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. అతడిని తెరపై చూసినప్పుడు ఏమనిపించింది?

-ప్రణవ్‌కు నటన కొత్తేమీ కాదు. బాలనటుడిగా చాలా సినిమాలు చేశాడు. అవార్డుల్ని అందుకున్నాడు. హీరోగా తొలి ప్రయత్నంలోనే పెద్ద విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. ఆది సినిమాలో అతడి నటన బాగుంది. ప్రస్తుతం మేమిద్దరం కలిసి ఓ సినిమా చేస్తున్నాం. మరక్కర్ అరబిక్కడిలింతే సింహా సినిమాలో నా యుక్తవయసు నాటి పాత్రలో ప్రణవ్ కనిపించబోతున్నాడు.

సినిమాలకు సంబంధించి మీ తనయుడికి సలహాలు, సూచనలు ఇస్తుంటారా?

-ప్రణవ్ సినిమాల్లో కొనసాగుతాడో లేదో తెలియదు. మరో రెండు సినిమాలు చేసిన తర్వాత కెరీర్‌పై నిర్ణయానికి రావాలని అనుకుంటున్నాడు. దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఏ రంగాన్ని ఎంచుకున్నా ప్రణవ్ విజయాల్ని అందుకుంటాడనే నమ్మకం ఉంది.

- నరేష్ నెల్కి

888
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles