లక్ష్యశుదితోనే దైవసన్నిధి


Sun,January 13, 2019 12:52 AM

భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. ధనుర్మాస మహోత్సవాలకు మహానగరం వేదికైంది. నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు నివాసంలో ధనుర్మాసోత్సవాలు అత్యంత కోలాహలంగా జరుగుతున్నాయి. శనివారంతో ధనుర్మాస వ్రతం 28వ రోజుకు చేరుకున్నది. ఈ ఉత్సవాలు సోమవారం (రేపు)తో ముగియనుండడంతో భక్తుల సంఖ్య బాగా పెరుగుతున్నది. కార్యక్రమంలో భాగంగా త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి, ఆండాళ్ తల్లి పాశురాల్లోని అర్థ పరమార్థాలను పేర్కొంటూనే, మానవాళికి పనికివచ్చే ముఖ్యాంశాలను వివరించారు. ఈనాటి కార్యక్రమంలో జూపల్లి రామేశ్వరరావు, ఆయన కుటుంబసభ్యులతోపాటు పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు.
Swamy
ఈ రోజున ఆండాళ్ తల్లి ధనుర్మాస వ్రతానికి సాధనం ఏమిటి? అనేది నిర్ణయించింది. ఏదైనా ఒకటి సాధించాలి అంటే సాధనం ఖచ్చితంగా ఉండాలి. సాధనాన్ని నిర్ణయించడం అనేది గొప్ప కార్యం వంటిది. దీనిని ఉపాయ నిష్కర్ష అంటారు. ఉపాయం అంటే సాధనం, ఉపేయనం అంటే లక్ష్యం అని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. మానవ జీవితంలో ఉపాయ, అపాయాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉపాయ అంటే మంచి మార్గాన్ని లేదా అనుకున్న చోటుకు చేర్చేది అని అర్థం. మనల్ని ఎంచుకున్న లక్ష్యానికి చేర్చేదే ఉపాయం. అపాయం అంటే లక్ష్యం నుంచి తొలగి పోయేది అని అర్థం అని ఆయన ఉద్ఘాటించారు.


ఈ జగత్తులో సహజంగా జరిగే నిత్యకృత్యాలు చాలా ఉంటాయి. అలాంటి వాటిపట్ల సాధనం అవసరం లేకున్నా సరే కొన్ని కార్యాలు కొనసాగుతూనే ఉంటాయని స్వామి వారు తెలిపారు. భగవంతుడు మనకు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. వాటినే సాధనాలు అనుకోకూడదు. మేము చేశాము కనుకనే ఈ లక్ష్యాన్ని చేరుకున్నామనీ భావించకూడదు. మంచి లక్ష్యాన్ని ఎంచుకునేటప్పుడు లక్ష్యాలు మాత్రమే మంచిగా ఉండడం కాదు, సాధనాలు కూడా మంచివై ఉండాలని ఆయన అన్నారు. సాధనాలు, లక్ష్యాలు తప్పనిసరిగా స్వచ్ఛమై ఉండాలని గోదాదేవి సూచించిందని స్వామి వారు చెప్పారు.

లక్ష్యాలు మంచివైనప్పుడు అనుకోకుండా అన్ని సాధనాలూ సమకూరుతాయి. అప్పుడు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కూడా చాలా సులువవుతుంది. ఒక్కసారి విన్న దానిని ఆచరించగలిగితే జీవితంలో ఎన్నో సాధించవచ్చు. ఇందులో భాగంగానే దైవశక్తిని తత్వదర్శులైన జ్ఞానుల ద్వారానే మనం వినాలి. అలాంటి ఆచార్యుల వద్దకు వినయంగా చేరుకుని వారు చెప్పిన జ్ఞానాన్ని పొందాలి. తద్వారా సన్మార్గంలో భగవంతుణ్ణి చేరుకోవచ్చు. ఆత్మస్థాయిలో మానవజన్మకు లక్ష్యం తనను తాను తెలుసుకుని భగవంతుని సన్నిధికి చేరే ప్రయత్నం చేయడమే అసలైన లక్ష్యం.

ధనుర్మాస వ్రతంలో 30 రోజుల కార్యక్రమాన్ని 30 పాటలలో గోదాదేవి వివరించింది. మనం స్వతంత్రులం కాదు. జీవుల్లో దివ్యశక్తే నడిపిస్తుందని, ఆ శక్తి లోపల, బయట ఉంటూనే వాటి మనుగడకు ఆధారమై ఉంటుందని చిన జీయర్ స్వామి వివరించారు. ఈ జగత్తులో అణువు దగ్గర నుంచి జీవులు, నిర్జీవులు, జంతువులు, కదిలేవి, కదలనివి ఉంటాయి. వీటిలో చైతన్య శక్తి ఉండి ఆయా కార్యాలను ముందుకు నడిపిస్తుంది. వ్యాపించి, నిలబెట్టి, నడిపించేదే ఆత్మ. దానినే చేతనుడు లేదా జీవుడు అంటామని, అది ఉండడం వల్లనే కదలికలు ఏర్పడుతున్నాయని చిన జీయర్ స్వామి అన్నారు. అది లేకుండా, పని చేయకుండా ఉంటే వాటిని రాయి, రప్పగా గుర్తిస్తామని స్వామి వారు తెలిపారు.

వేదంలోని జ్ఞానాన్ని పరమాత్మ ఆనుపూర్వి చెడకుండా చెప్పగలుగుతాడు. ఆరంభం నుంచి చివరి వరకు చెప్పడాన్నే ఆనుపూర్వి అంటారు. అవసరమైన దానిని అందించేది, జ్ఞానాన్ని తెలిపేది వేదం. ఆంగ్లంలో వేదాన్ని సైన్సుగా వ్యవహరిస్తారని స్వామి వారు పేర్కొన్నారు. భగవంతుడు సృష్టి, ప్రళయాలు చేస్తూ ఉంటాడు. ఈ ప్రక్రియలో మానవుడికి తప్ప మిగిలిన ప్రాణులన్నింటికీ ఒక రకమైన జీవన చక్రం ఉంటుంది. దేవుడు ఇచ్చిన మేధస్సును, ఆహంకారం వల్ల దుర్వినియోగం చేయడం మానవుడి వల్లనే జరుగుతుందని చిన జీయర్ స్వామి చెప్పారు.

ఎప్పుడూ మారని జీవుడిని, ఎప్పుడూ మారుతూ ఉండే ప్రకృతిని, ఈ రెంటినీ ఒకటిగా కూర్చువాడు.. ఆయనే భగవంతుడు. ఏ రకంగా మారిస్తే బాగుంటుంది? ఏది ఎలా ఉంటే మంచిది అనేది దేవుడికి బాగా తెలుసు. కనుకనే ఆయన అనుకున్న విధంగానే ఈ సృష్టిని రూపొందిస్తాడని ఆయన అన్నారు. ఈ లోకంలో జరిగే ప్రతీ కార్యానికి కర్త భగవంతుడేనని స్వామి వారు వెల్లడించారు. తెలిసినా, తెలియక పోయినా మనల్ని నడిపించేది ఆ పరమాత్ముడే. ఎవరెన్ని విధాలుగా చెప్పినా సృష్టి కారకుడు పరమాత్మేనని ఆయన వివరించారు.

ఇదీ మానవ జన్మ గొప్పతనం!

Swamy1
సృష్టిని సృష్టించి, దానిని నడిపిస్తూ, నియంత్రించే అద్భుతమైన శక్తి దేవునికి ఉంది. ఆ శక్తినే అనేక పేర్లతో పిలుస్తున్నారని, ఆ భగవంతుణ్ణి పరమాత్మ అని, కొందరు విష్ణువు అని, మరికొందరు బ్రహ్మ అని పిలుస్తుంటారని చిన జీయర్ స్వామి చెప్పారు. ప్రకృతి, జంతుజాలం, మానవ సమాజాన్ని గురించి ఎంతో వివరంగా వేదాల ద్వారా మన పూర్వీకులు అందించారు. ఎలా ఎవరితో నడుచుకోవాలి? ఎందుకు నడుచుకోవాలి? మనిషిగా ఎటువంటి నియమాలను పాటించాలి వంటి అనేక అంశాలను వేదాలలో పేర్కొన్నారని స్వామి వారు చెప్పారు. మానవ జన్మ లభించడం చాలా అదృష్టం. దేవతలకు కూడా తాము మనిషిగా పుడితే బాగుండు అనిపిస్తుంది. మానవ దేహం ఎన్నో పుణ్యాల ఫలితమని, దీనిని మహనీయులైన ఋషులు వేదాల ద్వారానే తెలుసుకున్నారని చిన జీయర్ స్వామి తెలిపారు.
-పసుపులేటి వెంకటేశ్వరరావు
-విద్యాసాగర్

1195
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles