సినిమా నా ప్యాషన్!


Sun,January 6, 2019 01:40 AM

ఓటమిని పరిగెత్తించు అది నిన్ను విజయం దాకా తీసుకెళ్తుంది అంటూ సాయిమాధవ్ బుర్రా సంభాషణలు జీవితపు సారాన్ని భోదిస్తాయి. నాయకుడంటే నమ్మించేవాడు కాదు నడిపించేవాడు, గెలిచేవాడు కాదు గెలిపించేవాడు అంటూ నాయకుడి గొప్పతనాన్ని చెబుతాయి. మనమే కాదు మనం ఉండే చోటు బతకాలా..తోటోడు బతకాలా అంటూ పరోపకాణ గుణం ఆవశ్యకతను వివరిస్తాయి. కళంటే బతుకునిచ్చేదే అనుకోకు, బతుకు నేర్పేది అంటూ కళల గొప్పతనాన్ని ఆవిష్కరిస్తాయి.. మానవ జీవితాల్లోని సంఘర్షణను చాటిచెబుతూ అద్భుతమైన సంభాషణలతో తెలుగు చిత్రసీమలో మంచి రచయితగా గుర్తింపును సొంతం చేసుకున్నారు సాయిమాధవ్ బుర్రా. కృష్ణం వందే జగద్గురుమ్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, మహానటి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు ఆయన ప్రతిభకు
తార్కాణాలుగా నిలిచాయి. రచయితగా తన ప్రయాణాన్ని గురించి సాయిమాధవ్‌బుర్రా జిందగీతో పంచుకున్న ముచ్చట్లివి...

Saimadhav

కళారంగంతో మీ పరిచయం ఎలా ప్రారంభమైంది?

-అమ్మానాన్న ఇద్దరూ రంగస్థల కళాకారులు. పౌరాణిక నాటకాలు వేసేవారు. ఊహ తెలిసినప్పటి నుంచి ఇంట్లో హార్మోనియం స్వరాలు వింటూ పెరిగాను. తల్లిదండ్రుల స్ఫూర్తితో ఆరేళ్ల వయసులో నటుడిగా మారాను. తొలిసారి సత్యహరిశ్చంద్రుడి నాటకంలో హరిశ్చంద్రుడు కొడుకైనా లోహితాస్యుడి వేషం వేశాను. నా నట ప్రయాణం కాకతాళీయంగా మొదలైంది. లోహితాస్యుడి వేషం వేసే కుర్రాడు రాకపోవడంతో నన్ను స్టేజ్ ఎక్కించారు. ఆ పాత్ర కోసం ఎలాంటి రిహార్సల్స్ చేయలేదు. అంతా ఐదు నిమిషాల్లోనే జరిగిపోయింది. అలా రంగస్థల కళాకారుడిగా నా జీవితం ప్రారంభమైంది.

మీలోని రచయితకు ఎప్పుడూ బీజం పడింది?

-లోహితాస్యుడితో మొదలైన నా నాటక ప్రయాణం చాలా యేండ్ల పాటు కొనసాగించింది. ఆ సమయంలో ప్రజానాట్యమండలితో అనుబంధం ఏర్పడింది. అభ్యుదయ కళాసమితి తరుపున సామాజిక ఇతివృత్తాలతో కూడిన పలు నాటకాలు వేశాను. ప్రజానాట్య మండలిలో చేరిన తర్వాతే సమాజంపై అవగాహన, ప్రశ్నించాలనే మనస్తత్వం అలవడ్డాయి. పండిత పరమేశ్వరశర్మ, నాగేశ్వరరావులాంటి మహానుభావులతో పరిచయం ఏర్పడింది. అక్కడే నాలోని రచయితకు బీజం పడింది. ఓ వైపు నటనను కొనసాగిస్తూనే నాటకాలు రాయడం ప్రారంభించాను. రాయడంలో ఉండే కిక్ నాలో అంతులేని సంతృప్తినిచ్చింది. నేను రాసిన నాటకాల్లో అద్దంలో చందమామ అనేక పరిషత్తుల్లో అవార్డులను సొంతం చేసుకున్నది.

సినిమాలపై ఇష్టం ఎలా మొదలైంది?

-నాటకాలపై ఉన్న ఆసక్తి క్రమంగా సినిమాలపై మరలింది. సినిమాల్లోనే బతుకాలని నిశ్చయించుకున్నాను. ఆ కోరిక ఎలా, ఎప్పుడు అంకురార్పణ పడిందో తెలియదు. చిన్నతనం నుంచి పలానా హీరో, పలానా కథ అనే భేదాలు విడుదలైన ప్రతి సినిమా చూడడం అలవాటైంది. కాలేజ్ ఎగ్గొట్టి రోజూ ఓ సినిమా చూశాను. ఆ సినిమాలు చూసి అందులోని తప్పొప్పుల్ని స్నేహితులతో విశ్లేషించేవాణ్ణి. అవన్నీ సినిమాల్లో పట్ల నాకున్న ఇష్టాన్ని మరింతగా పెంచాయి.

రచయితగా ఎవరి వద్ద శిష్యరికం చేశారు?

-పలు సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేసిన నూతలపాటి సత్యనారాయణ నా తొలి గురువు. మంచి రచనకు ఉండాల్సిన లక్షణాలేమిటో, ఏ విధంగా రాయాలో ఆయన దగ్గరే నేర్చుకున్నా ను. ఆ తర్వాత ప్రముఖ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ సహచర్యం నా ఆలోచన విధానంలో పరిణితిని తీసుకొచ్చింది.

రచయితగా అవకాశం ఇవ్వమని ఎవరైనా అడిగిన సందర్భాలున్నాయా?
సినీ కష్టాలు ఏమైనా ఎదుర్కొన్నారా?

-రైటర్‌గా అవకాశాలు రాకముందు నేను కొన్ని సినీ కష్టాలు ఎదుర్కొన్నాను. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఆర్థిక అవసరాల కోసం ఇంట్లో వాళ్లపై ఆధారపడ్డాను. వారు పంపించే డబ్బు వారం రోజుల్లో అయిపోయేది. ఆ విషయం అమ్మానాన్నలకు తెలిస్తే హైదరాబాద్‌లో కష్టాలు పడుతున్నానని బాధపడుతారని చెప్పకుండా దాచిపెట్టాను. అన్నం దొరక్క ఆకలితో అలమటించిన రోజుల్ని అడ్వెంచర్స్‌గా భావించాను. ఆకలిరాజ్యం సినిమాలో కమల్‌హాసన్ పస్తులతో ఉన్నాడు. నేను అలా ఉంటేనే గెలుస్తానని భావించాను. అలా నా జీవితంలోని ప్రతి సంఘటనను సినిమాగానే చూశాను. సినిమాలతోనే పోల్చుకున్నాను. నా స్నేహితులంతా జీవితమంటే సినిమా కాదు అని హెచ్చరించేవారు. కానీ, నాకు మాత్రం సినిమానే జీవితం అయ్యింది.
Saimadhav1

రచయితగా సమాజాన్ని ప్రభావితం చేసే సంభాషణలు రాయడానికి ఇష్టపడుతుంటారా?

-సమాజానికి మంచి చెప్పే అవకాశం వస్తే ఎప్పుడూ వదులుకోను. అలాగే నా సంభాషణల ద్వారా చెడు ప్రభావం పడకూడదని కోరుకుంటాను. అలాంటివి ఎప్పుడూ రాయను. అలాంటివి రాయమని కొందరు అడిగారు. కానీ ఆ పని నేను చేయనని చెప్పాను. అలాగే పూజనీయమైన పాత్రల్ని వ్యంగ్యంగా ఆవిష్కరించడం ఇష్టం ఉండదు. ఇతరుల నమ్మకాల్ని దెబ్బతీసే సన్నివేశాలు నా సినిమాల్లో కనిపించవు.

తెలుగు చిత్రసీమ ధోరణిలో ఎలాంటి మార్పులు వస్తున్నాయని అనుకుంటున్నారు?

-ప్రస్తుతం నవతరం దర్శకులు అద్భుతమైన కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. మూసధోరణిలో సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూడడం లేదు. కొత్తదనం ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. గతంలో వినోదసాధనంగా సినిమా ఒక్కటే ఉండేది. ఇప్పుడు అనేక మార్గాలు ఉన్నాయి. అలాంటప్పుడు సినిమాలకు రావాలంటే వైవిధ్యత ఉండాల్సిందే.

రచయితగా ఎలాంటి సినిమాలకు పనిచేయడంలో మీకు సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది?

-కమర్షియల్, బయెపిక్, ప్రేమకథలు.. ఇలా పలానా కథాంశాలకే సంభాషణలు రాయాలనే పరిమితులేవీ పెట్టుకోను. సినిమా చేయడమే నా డ్రీమ్. ఇప్పుడు ఆ డ్రీమ్‌లోనే బతుకుతున్నాను. అన్ని రకాల కథలకు నేను న్యాయం చేయగలనని నిరూపించుకోవాలి. అందరు దర్శకులతో పనిచేయాలన్నదే నా సిద్ధాంతం.

మీ సంభాషణల్లో ఎక్కువ తాత్వికత, మానవ జీవితాల్లోని సంఘర్షణ గోచరిస్తుంటాయి. ఆ సంభాషణలకు ప్రేరణ ఎక్కడ నుంచి వస్తుంది?

-పాత్ర అనుభవిస్తున్న కష్టాలు, విజయాలు, కన్నీళ్లు, ప్రేమానురాగాలు, భావోద్వేగాలతో సహానుభూతి చెందుతూ సినిమాలకు సంభాషణలు రాస్తుంటాను. సినిమాలోని పాత్రనే స్ఫూర్తిగా తీసుకుంటాను.

జంధ్యాల, ముళ్లపూడి వెంకట రమణ లాంటి రచయితలు ప్రస్తుతం కనపడటం లేదు? కారణమేమిటని అనుకుంటున్నారు?

-మంచి కథలు రాకపోవడం వల్లే జంధ్యాల, ముళ్లపూడి లాగా అద్భుతమైన సంభాషణలు రాసే రచయితలు తగ్గిపోయారు. మళ్లీ మళ్లీ రాని రోజు, గౌతమీపుత్రశాతకర్ణి లాంటి కథలు దొరికితే ఏ రచయిత అయినా గొప్పగా డైలాగ్‌లు రాయగలరని నా నమ్మకం.

నరేష్ నెల్కి
సీఎం ప్రవీణ్‌కుమార్

1887
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles