రామప్ప: ఘనమైన శిల్పసంపద


Sat,January 19, 2019 02:04 AM

రామప్ప అద్వితీయ, అపూర్వ, అనుపమాన ఏకైక శిల్పకళాసంపద. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రపంచ శిల్పకళా విశ్వవిద్యాలయం. రామప్ప ఏనాడో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందాల్సి ఉండే. ప్రపంచంలోనే ఇంతగొప్ప సజీవ శిల్పకళ ఉన్న మరో గుడిలేదు. గుడి మీదున్న శిల్పాకృతుల ఆధారంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక నాట్యశాస్త్రం పుట్టిన దాఖలాలు లేవు ఒక్క రామప్పలో తప్ప. అట్లాగే కాకతీయుల మాదిరి లౌకిక ప్రజాస్వామిక దృక్పథం ఉన్న పాలకులు కూడా లేరంటే అతిశయోక్తికాదని అంటున్నారు ప్రొఫెసర్ చూడామని నందగోపాల్. కొద్దిగా మనసుపెట్టి, త్రికరణశుద్ధితో పనిచేస్తే రామప్ప ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు వచ్చితీరుతుదని అంటున్నారీమే.
Ramatempulul

రామప్ప అద్వితీయ శిల్పసంపద

దేశంలోనే కాదు ప్రపంచంలో అనేక దేవాలయాలున్నాయి. చరిత్ర నుంచి వర్తమానం వరకు ఇక్కడి నుంచి భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేసేవి కొన్ని మాత్రమే ఉన్నాయి. అందులో ముందువరుసలో ఉండేది రామప్ప. ఇది కేవలం ఆలయం మాత్రమే కాదు, సజీవశిల్పకళా జీవన చిత్ర ఇతిహాసం. కాకతీయుల కాలం నుంచి పరంపరగా వస్తున్న జీవన విధానానికి కొనసాగింపు రామప్ప దేవాలయం. ప్రపంచంలోనే ఇంత అద్భుతమైన శిల్ప సంపద ఉన్న దేవాలయం మరోటిలేదు. దేవాలయ శిల్పరీతి విభిన్నమైంది. గుడి నిర్మాణం, ఆ నిర్మాణానికి ఉపయుక్తమైన సాంకేతికత, స్తంభాలు, ఆ స్తంభాలపై చెక్కిన శిల్పాలు, మంటపం, శిఖరం, గుడిశిఖరానికి వినియోగించిన తేలికపాటి ఇటుకలు, గులాబీ రంగురాయి, గర్భగృహం, మహామండపం, అంతరాలయం, ముఖ ఖండం ఇలా ప్రతీ అంశంలోనూ అపురూపమైనది.

నిర్మాణ శౌష్ఠవం

ఇట్లా ప్రతీ అంశంలోనూ రామప్ప ఒక అద్భుత శిల్పవిన్యాసం. ఇంతటి మహా శిల్ప సంపద దేశంలోనే కాదు ప్రపంచంలోనే మరెక్కడా కనిపించదు. దక్షిణభారతదేశంలో దాదాపు వేయేళ్ల కాలంలో నిర్మాణమైన ఆలయాలపై నేను సమర్పించిన సిద్ధాంతగ్రంథం డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్‌లో దీనిపై సవివరంగా చర్చించాను. రామప్ప ఎందుకు యూనిక్‌గా నిలిచింది? అనేది చూస్తే కాకతీయుల లౌకిక ప్రజాస్వామిక స్ఫూర్తి మహాగొప్పది. అనేక రాజవంశాలు వారి వారి ప్రజల, జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగానే కాకుండా ఆయా రాజ వంశాలు తమను తాము వాటిల్లో ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యేందుకు ఆ ఆలయాలు లేదా కట్టడాలను అనువుగా వాడుకున్నారు, కానీ కాకతీయులు అట్లా కాదు వాళ్లు కేవలం ప్రజల సంస్కృతిని ప్రతిబింభించే విధంగా నిస్వార్థంగా అనేక నిర్మాణాలు చేపట్టారు. అది కాకతీయుల గొప్పతనం. ప్రజల అభిమతంను గౌరవించిన ఏకైక రాజవంశం కాకతీయులదని చెప్పాలి. ఇక్కడ శైవం, వీరశైవం, వైష్ణవం, జైనీజం, బుద్ధిజం ఇలా అన్ని మతాల ఆచార సంప్రదాయాలను గౌరవించారు. ఆచరించారు. అట్లా చూసినప్పుడు రామప్పలో మనకు శైవం, వీరశైవం రెండూ స్పష్టంగా కనిపిస్తాయి. ఇట్లా అనేక వైవిధ్యాల మేళవింపుగా మనం రామప్పను పరిశోధనాత్మక కోణంలో చూస్తేకానీ తెలుసుకోలేము. ఇంతటి వైవిధ్యమున్న, అద్వితీయమైన శిల్పసంపద కచ్చితంగా ప్రపంచ వారసత్వ సంపదగా ఏనాడో గుర్తించబడాలి. కానీ ఎందుకో అలా గుర్తింపునకు నోచుకోలేదు. ఉత్తరభారతదేశంలో అనేకం ఉన్నాయి. కానీ దక్షిణభారతదేశంలో కేవలం నాలుగే. రెండు తమిళనాడులో, మరో రెండు కర్నాటకలో. భవిష్యత్‌లో రామప్పకు కూడా ఆ గౌరవం దక్కేలా ప్రయత్నాలు జరగాలి.

Shilpam

యాదాద్రి అపురూపం

పూర్వం నిర్మించిన ఆలయాలకు అక్కడక్కడా వారి వారి మనోభీష్ట, అవసరాల రీత్యా మరమ్మతులు చేయడం సహజం. కానీ తెలంగాణలో అందుకు వైవిధ్యంగా పాలన సాగుతున్నది. యాదాద్రిలో శాస్త్ర, శిల్ప సంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడి ప్రభుత్వం గుడి నిర్మాణం చేయడం చాలా అరుదైన, విశిష్టమైన విషయం. నేను యాదాద్రి నిర్మాణం చూడలేదు కానీ చెప్పగా విన్న. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా, వారి ఇష్టాయిష్టాలను గౌరవించి యాదాద్రిలో గుడి నిర్మాణం చేపట్టడం గొప్పవిషయం. యాదాద్రి అప్పటికే ఉండవచ్చు కానీ అప్పటికీ ఇప్పటికీ తేడాను, ప్రాకారాలను, మహాప్రాకారాలను గోపురాలను నిర్మించడం మాత్రం సాహసమనే చెప్పాలి. అంతపెద్ద దైవకార్యానికి పూనుకోవడం అంటే తన ప్రజల సుఖసంతోషాల కోసం పాలకులు వ్యవహరించడం అన్నది అపురూపం. తెలంగాణ సాధించిన స్ఫూర్తి, యాదాద్రి నిర్మాణ స్ఫూర్తితో రాష్ట్రంలోని చారిత్రక, వారసత్వ నిర్మాణాలను భవిష్యత్‌తరాలకు తీసుకెళ్లడంఅన్నది వారికి (ముఖ్యమంత్రి కేసీఆర్‌కు) పెద్ద విషయమీ కాదు. కాకపోతే తనకున్న గైడింగ్‌ఫోర్స్ ఆ మేరకు ఉపకరించాలి.

రామప్పకే సాధ్యం

ప్రపంచంలో అనేక శాస్ర్తాలు ప్రత్యేకించి నాట్యశాస్ర్తాలున్నాయి. అవన్నీ శాస్త్రం ఆధారంగా రూపొందాయి. ఆ శాస్ర్తాల ఆధారంగానే ఆలయాల నిర్మాణాలు జరిగాయి. కానీ రామప్ప మాత్రం అందుకు భిన్నమైంది. కాకతీయ గణపతిదేవ చక్రవర్తికాలంలో గజసైన్యాధ్యక్షుడిగా ఉన్న జయాప సేనాని వెలువరించిన నృత్యరత్నావళి మాత్రం రామప్ప ఆలయమ్మీదున్న శిల్పాల ఆధారంగా దేశీమార్గంలో శాస్ర్తాన్ని రూపొందించారు. రామప్పలో ఆరు అంగుళాల నుంచి ఆరు అడుగుల వరకు 300 నాట్యశిల్పాలున్నాయి. నా గురువు ఎంఎ డానీ (ప్రొఫెసర్ ఇన్ అమెరికన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ స్టడీస్, భారతదేశ ఆలయాల మీద దాదాపు 12 సంపుటాలు వెలువరించారు. అందులో రామప్పపై ప్రత్యేకించి ఆయన రాసిన కాకతీయుల శిల్పనిర్మాణ పరిపుష్టి, పరిపక్వతను చాలా ఉన్నతంగా వర్ణించారు. కాకతీయుల ఆలయశిల్పం మరే రాజవంశాలకు అంతుపట్టనిది అని చెప్పిన తరువాత నేను అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. హంపీ, కుంభకోణం, దారాసురం, రామప్పలోని శిల్పాలు విభిన్నమైనవి మాత్రమే కాదు అద్వితీయమైనవి కూడా అని నా గురువు చెప్పింది అక్షరాలా నిజమని ఇక్కడికొచ్చి ఉండి అధ్యయనం చేసిన తరువాత తేలింది. కాకతీయుల శిల్పకళా వైభవానికి, ఉన్నతికి రామప్ప, వేయిస్తంభాల గుడి శిల్పరీతులు ప్రపంచంలోనే అరుదుగా ఉన్న శిల్పరీతులు. రామప్పలో నృత్యం, శిల్పం, నిర్మాణసౌష్టవం, ఆ కాలంలో ఉన్న వినియోగించిన నగలు, సంగీతం ఇట్లా ప్రతీ అంశం అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ మాటకు వస్తే భవిష్యత్ తరాలకు శరపరంపరగా సజీవంగా కొనసాగింపు సంప్రదాయంగా ఉంటుంది. అంతటి మహత్తర శిల్పరీతులు, ఆచార సంస్కృతి ఆదాన ప్రదానాలుగా ప్రవాహం వలె తరం నుంచి తరానికి కొనసాగింపుగా వస్తున్నవి.
Ramatempulul2

దేశీమార్గపు సౌరభం నృత్యరత్నావళి

రామప్ప గుడి నిర్మాణం తరువాత దాదాపు 50 సంవత్సరాలకు జయాప నృత్యరత్నావళి అనే నాట్యశాస్ర్తాన్ని రాశారు. ఎనిమిది అధ్యాయాలున్న నృత్యరత్నావళిలో మొదటి నాలుగు అధ్యాయాలు మార్గనృత్య వివరణాత్మకమైనవి. తక్కిన ఐదు మొదలు ఎనిమిదో అధ్యాయం వరకు దేశీనృత్యరీతులు వివరించారు. నర్తనవివేకం, అంగనిరూపణం మొదలు అన్నీ కూడా స్థానిక మండల లక్షణాలను వివరిస్తాయి. పేరిణి ప్రేక్కణం (ప్రేంకణం), రాసకం, నాట్యరాసకం, దండరాసకం, శివప్రియం, చింతు (చిందు), కంచుకం, భాండికం, ఘటిసణి, చారణం, బహురూపం, కొల్లాటం (కోలాటం) అనే దేశీ నృత్యరీతులున్న ఈ నాట్యశాస్త్రంలో పేర్కొన్న విధంగా ఇప్పటికీ ప్రజల ఆచార సంప్రదాయాల్లో కొనసాగింపుగా ఉండటం అనేది అపురూపం. మరుగునపడిన ఈ మహాకళా సంపదను పునరుజ్జీవనం చేసిన నాట్యాచారుడు నటరాజ రామకృష్ణ. దేశంలో దేశీమార్గ నృత్యరీతిని పెంచి పోషించిన రాజవంశం కాకతీయులదే. అందులో అనుమానం అక్కరలేదు. ఇంతగొప్ప అద్వితీయమైన శిల్ప, నాట్య, జీవకళ దేశంలో మనకు రామప్పలోనే కనిపిస్తుంది. రామప్ప శిల్పకళా విశ్వవిద్యాలయం. ఇంతగొప్ప చరిత్రను, వారసత్వాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాల్సిన అవసరం ఉంది. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో దాదాపు 4 వేల వరకు మ్యాన్యుమెంట్స్ ఉండొచ్చు. అందులో ఆలయాలుండొచ్చు కానీ రామప్పది మాత్రం అరురూప సజీవ సంస్కృతి. యునెస్కో రామప్పను ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఇస్తుందని భావిస్తున్నా. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ రామప్ప ప్రాముఖ్యాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు కొంతమేర ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నంలో భాగంగానే నాతో వారు కాఫీ టేబుట్ బుక్ తీయాలన్నారు తప్పకుండా తీస్తానని చెప్పిన.

ఎవరీ ప్రొఫెసర్ చూడామణి నందగోపాల్?

Ramatempulul1
బెంగళూర్‌లోని జైన్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ హ్యూమానిటీస్, అండ్ సోషల్ సైన్సెస్ డీన్‌గా పనిచేసి ఇటీవలే రిటైరయ్యారు చూడామణి నందగోపాల్. నేషనల్ మ్యూజియం ఆఫ్ ఢిల్లీ అవసరం మేరకు చూడామణి పరిశోధన చేస్తున్నారు. ఇటీవలే దేశంలో ప్రతిష్ఠాత్మక ఠాగూర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డును అందుకున్నారు. అంతేకాదు ప్రస్తుతం యునెస్కో ఫెలోగా పరిశోధనల్లో సహాయం చేస్తున్నారు. దాదాపు వేయేళ్ల కాలంనాటి ఆలయాలమీదున్న శిల్పశాస్త్రం, నాట్యశాస్త్రం మీద ఆమె డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఇన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనే సిద్ధాంతగ్రంథం ప్రచురించారు. దక్షిణభారత దేశంలోని అనేక ఆలయాల మీదున్న శిల్పరీతులపై ఆమె పరిశోధనలు చేశారు. వాటి ఆధారంగా ప్రజల జీవన విధానంపై సుదీర్ఘ వ్యాఖ్యానం చేశారు. అందులో రామప్ప శిల్ప సంపదను, కాకతీయుల శిల్పకళాపోషణ మొదలైన అంశాలను సవివరంగా ప్రస్తావించారు. అందుకోసం అనేక పర్యాయాలు రామప్పకు తన బృందంతో వచ్చి మారుమూల పాలంపేట గ్రామంలో నాలుగైదు రోజులుండీ పరిశోధనలు చేశారు. వరంగల్‌లో శాస్త్ర ప్రయోగం-నృత్య రత్నావళి అనే అంశంపై రెండు రోజుల పాటు (జనవరి 16, 17తేదీల్లో ) నిర్వహించిన జాతీయ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ ఆర్ట్స్, కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, ఇంటాక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె నమస్తే తెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడారు.

-నూర శ్రీనివాస్
-వరంగల్ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ

1098
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles