నగరంలో తియ్యని వేడుక


Sat,January 12, 2019 01:38 AM

నగరం తియ్యని వేడుకకు సిద్ధమైంది. తెలంగాణలో స్థిరపడిన పలు రాష్ర్టాల మహిళలు స్వయంగా చేసిన తీపి వంటలు ఈ స్వీట్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ఉంచనున్నారు. తెలంగాణ పర్యాటక శాఖ, భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రేపటి నుంచి ఈ నెల 15 వరకు మూడురోజుల పాటు పరేడ్‌గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. 1200 తీపి వంటకాలు ఈ తియ్యటి వేడుకలో నగర ప్రజల నోరు తీపి చేయనున్నాయి. ఆ తియ్యటి వేడుకల విశేషాలు మీ కోసం..
Ladu
హైదరాబాద్ భారతదేశానికి ప్రతీక. దేశంలోని భిన్న సంస్కృతులు, సంప్రదాయలు, సకల కళలు హైదరాబాద్‌లో కనిపిస్తాయి. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు హైదరాబాద్‌లో కనిపిస్తారు. అందుకే హైదరాబాద్ మినీ భారతం అనడంలో అతిశయోక్తి లేదు. దేశం మొత్తాన్ని ఒకేచోట చూడాలనుకుంటే అది హైదరాబాద్‌లో తప్ప మరెక్కడా కనిపించదు. దేశంలోని మిగతా మెట్రోపాలిటన్ నగరాల కంటే హైదరాబాద్ ప్రత్యేకం. దేశం మొత్తాన్ని ఒకేచోట చూడాలనుకుంటే హైదరాబాద్‌లో చూడొచ్చు. 25 రాష్ర్టాల సంప్రదాయ తీపి వంటకాలతో మూడురోజుల పాటు ఈ స్వీట్ ఫెస్టివల్ జరుగనుంది. ఇందుకు గాను సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. స్టాల్స్‌లో ఉండే మహిళలు వారి రాష్ర్టాన్ని ప్రతిబింబించే వేషధారణలో ఉంటారు. హైదరాబాద్‌లో స్థిరపడిన వివిధ రాష్ర్టాల మహిళలు ఇంట్లో తయారుచేసిన సంప్రదాయ స్వీట్లు మాత్రమే ఇక్కడ ప్రదర్శిస్తారు. రకరకాల స్వీట్లతో నోరూరించడమే కాదు.. రంగురంగుల పతంగుల వేడుక కూడా దీనికి జతగా కనువిందు చేయనున్నది. హైదరాబాద్‌లో నివసించే వివిధ రాష్ర్టాలు, దేశాల ప్రజల ఆహారపు అలవాట్లను ప్రతిబింబించేలా ఈ వేడుక ఉంటుంది.

సకుటుంబ సపరివార సమేతంగా..

జనవరి 13న ప్రారంభం కానున్న ఈ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్‌లో పాల్గొనేవారి ఇండ్లలో వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలైంది. మూడురోజుల పాటు నగరవాసులకు తమ సంప్రదాయ తీపి వంటకాన్ని రుచి చూపించడానికి వారంరోజుల ముందే వంటకాలు సిద్దం చేయడంలో మునిగిపోయారు. ఇంట్లో ఉండే వాళ్లంతా సకుటుంబ సపరివార సమేతంగా వంట ఏర్పాట్లలో మునిగిపోయారు. తమది కాని రాష్ట్రంలో నివసిస్తూ తమ సంప్రదాయాన్ని, ఆహారపు అలవాట్లను, సంప్రదాయ వస్త్ర ధారణను ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉత్సాహంతో దాదాపు 1200 మంది మహిళలు స్వీట్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. కేవలం ఇంట్లోవాళ్లకే పరిమితం కాకుండా ఎంతోమందికి తమ స్వీట్లు రుచి చూపించి తద్వారా కొంత ఆదాయం కూడా పొందే అవకాశం ఉండడంతో ఎంతోమంది మహిళలు ఈ స్వీట్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు.

దేశమంతా ఇక్కడే..

గతేడాది జరిగిన ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్‌కు వచ్చిన భారీ స్పందనను గమనించిన సాంస్కృతిక శాఖ ఈసారి పటిష్ఠంగా ఏర్పాట్లు చేసింది. పోయినేడాది నిర్వహించిన స్వీట్, కైట్ ఫెస్టివల్‌కు ఎనిమిది లక్షల సందర్శకులు వచ్చారు. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే వివిధ ప్రభుత్వ శాఖల సహకారం కూడా తీసుకొని ప్రపంచానికి హైదరాబాద్ గొప్పతనాన్ని చాటిచెప్పేలా, దేశం మొత్తాన్ని ఒకేచోట చూపించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక కార్యదర్శి బుర్రా వెంకటేశం. వివిధ రాష్ర్టాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి నిర్వహణ కమిటీని ఎన్నుకున్నారు. 25 రాష్ర్టాలు, 15 దేశాల నగరాల స్వీట్ వెరైటీలు ఇక్కడ ప్రదర్శిస్తారు. ప్రతిరోజూ వివిధ రాష్ర్టాల కళారూపాలు కూడా ప్రదర్శిస్తారు. ఫుడ్‌కోర్టులు, స్నాక్స్, హస్తకళల ప్రదర్శన కూడా ఉంటాయి. ఒక్కో ఐటమ్ చాలా రకాల వెరైటీల్లో లభిస్తుంది. 70 రకాల లడ్డూలు, 80 రకాల పాయసాలు ఇలా ఒక్కో ఐటమ్ కనీసం 60,70 రకాల్లో దొరుకుతుంది.

హైదరాబాద్ మినీ భారతం..

విభిన్న రాష్ర్టాల ప్రజలను ఒక్కచోటకు చేర్చి నగరాన్ని ఒక మినీ భారతంగా ఆవిష్కరించనున్నాం. ఈ స్వీట్ ఫెస్టివల్‌లో ఏర్పాటు చేసే స్టాల్స్ అన్నీ మహిళలే స్వయంగా స్వీట్లు తయారుచేసి, నిర్వహిస్తారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా ఫెస్టివల్‌కి కావాల్సిన అన్నీ ఏర్పాట్లు చేశాం.

- బుర్రా వెంకటేశం, టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శితియ్యని కలయిక..

హైదరాబాద్ అంటే సేఫ్ సిటీ, సెక్యూర్ సిటీగా పేరు తెచ్చుకుంది. ఈ స్వీట్ ఫెస్టివల్ వల్ల స్వీట్ సిటీగా కూడా హైదరాబాద్‌ను పిలుచుకుంటాం. దేశంలోనే ఇలాంటి వేడుక నిర్వహిస్తున్న ఘనత తెలంగాణకే దక్కుతుంది..

- మామిడి హరికృష్ణ, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ప్రవీణ్‌కుమార్ సుంకరి

800
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles