అందరికీ ఆరోగ్యం!


Sat,January 5, 2019 01:18 AM

ప్రపంచ ఆరోగ్య సంస్థ సరికొత్త ప్రచారం
ఆరోగ్య సేవలు సామాన్యులకు అందాలి అనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉద్దేశం. కానీ సంపన్నులు మాత్రమే మెరుగైన వైద్య సేవల్ని వినియోగించుకుంటున్నారని ఆ సంస్థ అంచనా. అందులోనూ నగరవాసులకే మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటున్నది. భారతదేశంలో ఇప్పటికీ ఇంకా 70% గ్రామీణులకు కనీస ఆరోగ్య సంరక్షణ అందడం లేదనేది మరో వాదన. మురికివాడల్లో అయితే ఇంకా దారుణమైన పరిస్థితి. ఆరోగ్యం అందరి హక్కు. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం మన సొంతమవుతుంది. కానీ.. చాలా దేశాల్లో ఇప్పటికీ ఆరోగ్యం అందరి సొంతం కావడం లేదు. వైద్యరంగం విస్తారంగా అభివృద్ధి చెందినప్పటికీ అందరికీ చేరడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థేమో.. అందరికీ ఆరోగ్యం లక్ష్యం అంటున్నది. ఎలా మరి? మార్పు కావాలి. అవగాహన ఏర్పడాలి. ఆఖరుగా ఆరోగ్యం అందరి సొంతం కావాలి.

helth
ఒక అధ్యయనం: చైనా లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో ప్రతి వెయ్యి మంది రోగులకు 3.8 పడకలు అందుబాటులో ఉంటే.. ఇండియాలో 0.7 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అని ఒక అధ్యయనం చెప్తున్నది. చైనాలో ప్రతి వెయ్యి మంది రోగులకు 1.6 డాక్టర్లు ఉంటే ఇండియాలో 0.6 నిష్పత్తిలో డాక్టర్లు అందుబాటులో ఉన్నారట. ఇండియాలో శిశుమరణాల రేటు విషయానికి వస్తే ప్రతి వెయ్యి మందికి 27 మంది శిశువులు నగరంలో.. 44 మంది గ్రామాల్లో మృత్యువాత పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు చెప్తున్నాయి. మాతా శిశు మరణాలు అధిక సంఖ్యలో ఉంటున్నాయి. కీలకంగా పనిచేసే నర్స్‌లకు మిడ్‌వైఫరీ కోర్సులు అందుబాటులో లేకపోవడం కూడా దీనికి కారణం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది.

ఆరోగ్య పిలుపు: ఇండియా లాంటి దేశాల ఆరోగ్య పరిస్థితిని మార్చాలన్న ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 2018 సంవత్సరాంతంలో అందరికీ ఆరోగ్యం అని పిలుపునిచ్చి ప్రపంచవ్యాప్తంగా ఓ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నది. దీనిలో భాగంగా 16 దేశాల్లో అవగాహనా సదస్సులు, ర్యాలీలు, డిబేట్లు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపెయిన్ 2020 వరకు నడుస్తుంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్, నర్సింగ్ నౌ అనుబంధంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. వైద్యరంగంలో సాధిస్తున్న ఆరోగ్యం అందరికీ ఎందుకు అందుబాటులో ఉండటం లేదనే విషయంపై ప్రధానంగా చర్చ జరుపుతున్నారు. నర్సింగ్ సాధికారత గురించి అవగాహన కల్పిస్తున్నారు.


ఏం సందేశమిస్తున్నారు?: నర్సింగ్ సాధికారత వంటి అంశాలను తీసుకొని వివిధ పద్ధతుల్లో ప్రచారం, అవగాహన కల్గిస్తున్నారు. దీని ద్వారా ఆరోగ్యవృద్ధి స్థాయిని పెంచవచ్చనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉద్దేశం. ఇందులో ప్రభుత్వాలు, స్వచ్ఛందసంస్థల పాత్రకూడా ముఖ్యమైంది. వైద్యరంగంలో అధునాతన మార్పులు లేనప్పుడు పోషకాహార లోపం, శిశుమరణాలు, వృద్ధాప్యం, అంటు వ్యాధులు, డ్రగ్ రెసిస్టెన్స్ వంటి సమస్యలు ఉండేవి. కానీ విస్తృతంగా వైద్య ఆరోగ్య విధానాలు అభివృద్ధి చెందినప్పటికీ ఈ సమస్యలు ఎందుకుంటున్నాయి? అని అధ్యయనం చేస్తున్నారు. వీటికి పరిష్కారం లభిస్తేనే నిజమైన అభివృద్ధి సాధించినట్లు అనే సందేశాన్ని ఇస్తున్నారు. మిడ్ వైఫరీ నర్సింగ్ కోర్స్‌ను ప్రవేశపెట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

ఆరోగ్య తెలంగాణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్‌లైన్స్ అన్ని దేశాలు, అన్ని రాష్ర్టాలు పాటించాలి. ఈ ప్రకారం చూసుకున్నట్లయితే తెలంగాణ ముందుందనే చెప్పుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికీ క్రమం తప్పకుండా రోగ నిర్ధారణ పరీక్షలు చేయిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. కంటి వెలుగు వంటి పథకం ద్వారా చేసి నిరూపించింది కూడా. ఒకవేళ ఏదైనా వ్యాధి ఉన్నట్టు పరీక్షల్లో తేలితే ప్రభుత్వమే చికిత్స చేయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా సీఎం హామీ ఇచ్చారు. ప్రజలకు వైద్యసేవలు అందించడంలో ఆశ వర్కర్లను ఆరోగ్య సహాయకులుగా నియమించారు. కేసీఆర్ కిట్ల ద్వారా సాధారణ కాన్పులను ప్రోత్సస్తున్నారు.

తొలి మిడ్‌వైఫరీ ట్రైనింగ్: నర్సింగ్ ఎంపవర్‌మెంట్ సాధించాలనీ.. మాతా శిశుమరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో దేశంలోనే మొదటిసారిగా మిడ్‌వైఫరీ నర్స్ ట్రైనింగ్ కోర్సు కరీంనగర్‌లో ప్రారంభించారు. దీనిని ఎంసీహెచ్ అంటారు. రాష్ట్రవ్యాప్తంగా స్టాఫ్‌నర్స్‌గా ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలందిస్తున్న 30 మందిని ఈ కోర్సుకు ఎంపిక చేశారు. దీంట్లో భాగంగా ఒక సంవత్సరం థియరీ క్లాసులు, ఆరు నెలలు ప్రాక్టికల్స్ ఉంటాయి. వీరికి శిక్షకులుగా హైదరాబాద్‌లోని ఫెర్నాండెజ్ దవాఖాన నుంచి ముగ్గురు, ఇంగ్లండ్ నుంచి ఒకరు నిపుణులు పనిచేస్తున్నారు.

స్వీయ అవగాహన: అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతిఒక్కరూ ఎప్పటికప్పుడు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటారు. అలాంటి అవగాహన ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలి. అయితే ఆర్థికస్థోమత ఉన్నవారు మాత్రమే ఈ విధమైన పరీక్షలు చేయించుకుంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో నివసించేవారు.. ముఖ్యంగా పేదలు రోగమొచ్చినపుడు తప్ప మిగతా సమయాల్లో దవాఖానలకు వెళ్లరు. వైద్యపరీక్షలు చేయించుకోరు. దీనివల్ల చాలా వ్యాధులను ప్రాథమికస్థాయిలో గుర్తించలేకపోతున్నారు. వ్యాధిని మొదటిదశలోనే గుర్తిస్తే నయం చేయడం తేలిక అవుతుంది. ఇకపై ఆ విధమైన అలవాటుకు స్వస్తి చెప్పాలి. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

నర్సింగ్ సాధికారత అంటే?

helth1
డాక్టర్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి ఫాలో అవుతుంటారు. వారికి అంత సమయం కూడా ఉంటుంది. అయితే వైద్య సేవలు అందించడంలో కీలకమైన నర్స్‌లు.. ఒకసారి ఉద్యోగం వచ్చిందంటే ఇక వారి చదువు అక్కడే ఆగిపోతుంది. ఆ పైన చదవడానికి కూడా పెద్దగా కోర్సులు ఉండవు. 30 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసినవారు వృత్తిలో చేరిన నాటి విధానాలనే పాటిస్తుంటారు. అంతే అక్కడే ఆగిపోతున్నారు. మరి ఈ మధ్యకాలంలో వైద్య రంగంలో ఎంత శాస్త్రీయత వచ్చింది? ఎంత సాంకేతికత అభివృద్ధి చెందింది? దాన్ని అందిపుచ్చుకుంటేనే కదా.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు సక్రమంగా అందుతాయి. అందరికీ ఆరోగ్యం దక్కుతుంది. ఇదే నర్సింగ్ సాధికారత అని చెప్తున్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

క్యాంపెయిన్: హెల్త్ ఫర్ ఆల్
ఆర్గనైజింగ్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, నర్సింగ్ నౌ
ఎప్పుడు: 2018-2020
ఎక్కడ: 16 దేశాల్లో

- దాయి శ్రీశైలం

634
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles