కృష్ణతత్వంలోనే శాశ్వత సుఖం!


Sat,January 5, 2019 01:17 AM

గోదాదేవి తన పాశురాల ద్వారా తాత్కాలికమైన ప్రయోజనాలను కాకుండా, ఉత్తమ పురుషార్థాలను అందించే ప్రయత్నం చేసింది. తల్లి తన సంతానానికి ఎంత గొప్ప ప్రయోజనాలను అందిస్తుందో అదే విధంగా ఆమె కూడా లోకంలోని వారందరినీ తన బిడ్డలుగా భావించి, ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుందని చిన జీయర్ స్వామి తెలిపారు. తల్లి తమ పిల్లలకు శాశ్వతమైన ప్రయోజనాలను చేకూర్చాలని ఎలాగైతే భావిస్తుందో అలాగే, ఆండాళ్ తల్లి ఈ జగత్తులో అంతటి ఉత్తమ ఫలితాలను పొందేందుకు అవసరమైన
అంశాలనే తెలియజెప్పిందని స్వామి వారు వివరించారు.

Chinna
భాగ్యనగరంలో ధనుర్మాస మహోత్సవాలు అత్యంత కన్నుల పండువగా జరుగుతున్నాయి. నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు నివాసంలో జరుతున్న ఈ ఉత్సవాలు శుక్రవారంతో 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి తన ప్రవచనాల ద్వారా గోదాదేవి 30 పాశురాల్లోని పరమార్థాన్ని భక్తులకు సవివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రామేశ్వరరావుతోపాటు వారి కుటుంబ సభ్యులు, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
మానవజాతిని కూడా తన సంతానంలా భావించి అందరికీ ఉత్తమమైన సుఖజీవన సారాన్ని అందించాలని ఆండాళ్ తల్లి భావించిందని, అందులో భాగంగానే ధనుర్మాస వ్రతం ద్వారా అటువంటి ప్రయోజనాలు మనకు తెలిపిందని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. బుద్ధిమంతులుగా ఉన్న వారందరూ ఆండాళ్ తల్లినే తమ అమ్మగా భావిస్తారని, ఆనందమే ఉత్తమ పురుషార్థం అని ఆయన అన్నారు. ఏది లభిస్తే దాన్నుంచి మరొకటి పొందాలనే అవసరం ఉండదో అదే నిజమైన సుఖం, ఆనందం అని గోదాదేవి చెబుతున్నది. అలాంటి శాశ్వత సుఖం, ఆనందం కృష్ణుని ద్వారానే లభిస్తుందని, కృష్ణతత్వాన్ని మనకు అందించడానికి ఆండాళ్ తల్లి నారాయణ మంత్రాన్ని ప్రసాదించిందని స్వామి తెలిపారు.ఈ మంత్రమే ఖచ్చితమైందని, దీనిని నిర్ణయించే ఉత్తమ జ్ఞానులు, పరమ ఋషుల్లో వేదవ్యాసుడు ఒకరని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. ద్వాపర యుగంలో నివసించిన మహనీయుడు వేద వ్యాసుడని, వేద విజ్ఞానాన్ని అందించిన గొప్ప పండితుడు ఆయనేనని స్వామి వారు పేర్కొన్నారు. బంధం అనేది తెలిస్తే ఒకరి నొకరు ప్రేమించుకుంటారు. అదే విధంగా భగవంతునికీ, భక్తునికీ తొమ్మిది రకాల బంధాలున్నాయి. దేవునికీ మనకూ తండ్రీ, కొడుకుల బంధం ఉంటుందని స్వామి వారు తెలిపారు. శరీరంలో భాగమైన చేయి మనం చెప్పినట్లు చేస్తుంది. చేతిని శేషము అని, ఆ చేయి కలిగిన వ్యక్తిని శేషి అని అంటారు. చేతికీ, మనిషి శరీరానికి ఎలాగైతే శేషీ బంధం ఉన్నదో అదే విధంగా, భగవంతునికీ మనందరికీ శేష, శేషీ అనే బంధం ఉన్నదని, ఆయన మనలోని శక్తిగా ఉంటూ అందరినీ నడిపిస్తున్నాడని ఆయన చెప్పారు.


కొందరు పనులన్నీ తమ వల్లనే జరుగుతున్నాయని భావిస్తారు. కానీ, ఈ ప్రపంచమంతా భగవంతునికి శేషభూతాలే. అన్ని కార్యాలకూ ఆయన శేషి అని స్వామి వారు చెప్పారు. మనమంతా దేవుడు భరించడం వల్లే మనగలుగుతున్నాం. ఆయన దివ్యతత్వం వల్లనే జగమంతా మనుగడ సాగించగలుగుతున్నదని, భగవంతుని కృప లేకుండా ఏవీ జరగవని చిన జీయర్ స్వామి వారు పేర్కొన్నారు. సిరి సంపదలున్నా ప్రయోజనం ఉండదు. ఆపదల్లో భగవత్ జ్ఞానం ఒక్కటే రక్షించగలుగుతుంది. భగవంతుని గురించి తెలిపే జ్ఞానాన్నే అసలు జ్ఞానమంటారు. దేవుని గురించి తప్ప ఎంత జ్ఞానం తెలుసుకున్నా వృధానేనని, అది అజ్ఞానం కిందనే లెక్క అని, ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలోని 13వ అధ్యాయంలో చెప్పాడనీ ఆయన అన్నారు.


పూర్ణ హృదయుడు నారాయణుడు!

Chinna1
మనం చూసే ఈ జగత్ అంతా ఎలా వచ్చింది? ఎలా మనుగడ సాగిస్తున్నది? అంటే ఇవన్నీ ఒక్క ఓం కారం నుంచే వచ్చాయి. వేదాలు ఎంత పని చేస్తాయో అంత పనిని నారాయణ మంత్రం ఒక్కటే చేయగలదు. ఇది ఎనిమిది అక్షరాలను కలిగి ఉంటుంది. ఇది ఓం కారంతో ఆరంభమవుతుంది, నమః పదంతో సాగుతుంది. నారాయణ పదంతో వెళుతుందని స్వామి వారు తెలిపారు. ఓం కారంలో అన్నీ ఉన్నా అన్నీ కనిపించవు. లోపల బయట ఉండి వస్తువులను రక్షించగలిగే వాడు నారాయణుడని అర్థమని ఆయన ఎలా వచ్చాడనే విషయాన్ని చెప్పేందుకే ద్వయ మంత్రం వచ్చిందని చిన జీయర్ స్వామి వెల్లడించారు. విన్న తర్వాత స్పందించే వాడే భగవంతుడు. ఎంత ఇచ్చినా తరగని పూర్ణుడు ఆయన. దయ కలిగి ఉన్న వాడు శ్రీ మాన్, బుద్ధి ఉన్నవాడైతే బుద్ధిమాన్, నీతివంతుడైతే నీతిమాన్ అని నారాయణుడిలో ఇవన్నీ ఉన్నాయని ఆయన్ను శ్రీమంతుడని, ఆయన్నే శ్రీమన్నారాయణుడిగానూ భావిస్తామని స్వామి వారు వివరించారు.

పసుపులేటి వెంకటేశ్వరరావు

684
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles