అమెరికాలో..తెలంగాణ సాహిత్య వనమాలి!


Sat,January 13, 2018 12:00 AM

తెలంగాణ మట్టి పరిమళం అద్భుతమైనది. ఇక్కడి గాలి పీల్చి.. ఇక్కడి నీళ్లు తాగి.. ఇక్కడి వేషభాషలు అలంకరించుకుంటే.. ఏ దేశమేగినా.. మాతృభూమి ధ్యాసలోనే తరిస్తారు. అలాంటివారిలో చంద్రుపట్ల తిరుపతిరెడ్డి ఒకరు. అమెరికాలో అత్యున్నత హోదాలో ఉండి అచ్చ తెలంగాణలో క్షణమొక కవితగా.. దినమొక దివ్యాక్షరంగా.. గడుపుతూ సాహితీ శ్రేయోభిలాషిగా సాగుతున్నారు! సామల సదాశివ ప్రియ శిశ్యుడిగా.. సినారె మనసు దోచిన కవిగా.. పేరున్న తిరుపతిరెడ్డి పరిచయం ఇది.
Thirupathi
తెలంగాణ సాహిత్య పూదోట అయితే.. దానికి వనమాలి లాంటి వ్యక్తి చంద్రుపట్ల తిరుపతిరెడ్డి. ఆయన చదివింది ఇంజినీరింగ్. ఉండేది అమెరికాలో. సాహిత్యం రాసే తీరిక.. తెలుగు మాట్లాడే ఓపిక ఏమాత్రం ఉండని పరిస్థితి. అయినా తెలుగు సాహిత్య సాగు చేస్తూ.. వాటి పరిమళాల్ని మనకూ అందిస్తున్నారు.

కవిత్వమే ఆరోగ్యం: చంద్రుపట్ల తిరుపతిరెడ్డి అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న ప్రతిష్టాత్మక రోవాన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ కమ్ ఫౌండింగ్ చైర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఆయన నిష్ణాతులు. అమెరికాలో వేళ్లమీద లెక్కబెట్టే మెకానికల్ ఇంజినీరింగ్ నిపుణుల్లో ఒకరు. క్షణం తీరిక లేకుండా పనిచేస్తూ బిజీగా ఉంటారాయన. వృత్తి ప్రభావమూ.. పాశ్యాత్య దేశపు సంస్కృతి ప్రభావమూ.. అక్కడి భాషా ప్రభావం చాలా ఉన్నా ఇవేవీ సమస్యగా భావించకుండా ఎంచక్కా తెలుగు కవితలు రాసుకుంటూ.. పుస్తకాలు వేసుకుంటూ కవిత్వమే నా ఆరోగ్యం అంటున్నారు.

నైపుణ్యమే ఆనందం: రోవాన్ యూనివర్సిటీలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకునే ప్యానెల్‌లో ముఖ్యులు తిరుపతిరెడ్డి. ఉన్నత హోదాలో ఉన్నప్పటికీ చాలా సాధారణంగా ఉంటారు. విద్యార్థులకు.. విభాగాలకు.. నిపుణులకు మధ్య వారధిగా నిలుస్తూ అందరు చెప్పేదీ వింటారు. అందరి సమస్యలకూ పరిష్కారం చూపుతారు. నా వృత్తి నైపుణ్యమే నా ఆనందానికి కారణం అంటారు తిరుపతిరెడ్డి.

బాల్యమే మూలం: ప్రొఫెసర్ తిరుపతిరెడ్డి బాల్యమంతా తిరుగుళ్లు.. మరుగుళ్లుతోనే సాగింది. వాళ్ల నాన్న వెంకటరెడ్డి ప్రభుత్వ సహకార సొసైటీలో అధికారి. ఆయన ఏ ప్రాంతానికి బదిలీ అయితే కుటుంబాన్ని కూడా అక్కడికి తీసుకెళ్లేవారు. ఐదో తరగతి వరకు హైదరాబాద్ పాతబస్తీలో చదివితే.. ఆరవ తరగతి ఆదిలాబాద్‌లోని బోథ్‌లో చదివారు. ఏడవ తరగతి హైదరాబాద్‌లోని మొఘల్‌పురాలో చదివితే.. ఎనిమిదవ తరగతి మళ్లీ బోథ్ వెళ్లారు. తొమ్మిది.. పదో తరగతికి లక్శెట్టిపేటకు వెళ్లాల్సి వచ్చింది. పీయూసీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో చదివారు. ఇలా తన బాల్యమంతా వేర్వేరు ప్రాంతాలు.. పట్టణాలు తిరగాల్సి రావడమే తనలో కవిత్వాసక్తికి మూలం అన్నారు.

ఆచరణే ఆయుధం: సామల సదాశివ ఈయనకు తెలుగు మాష్టారు. కవితలు రాయడం ఆయన నుంచే నేర్చుకున్నారు తిరుపతిరెడ్డి. అదే సమయంలో ఆంగ్లంపై కూడా పట్టు సాధించారు. హైజాక్ అనే ఉపాధ్యాయుడు ఆంగ్ల భాష నేర్పించగా.. నాన్న వెంకటరెడ్డి వ్యాకరణం నేర్పించారట. ఇలా ప్రతీ అంశంలో పట్టు సాధించి 1961లో వరంగల్‌లో ఇంజినీరింగ్ చేశారాయన. ఆ బ్యాచ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. ఇంజినీరింగ్ తర్వాత ముంబైలో కొంతకాలం ఉద్యోగం చేశారు. 1974లో అమెరికా వెళ్లారు. అక్కడే పీహెచ్‌డీ చేసి జనరల్ మోటార్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్లింట్ మిచిగాన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా 16 సంవత్సరాలు పేవ చేశారు. 1990లో ఇంట్రడక్షన్ టు ఫినైట్ ఎలిమెంట్స్ ఇన్ ఇంజినీరింగ్ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఇప్పటివరకు 4 ఎడిషన్లలో వచ్చింది. ప్రతీ ఇంజినీరింగ్ కాలేజీలో తిరుపతిరెడ్డి రాసిన ఈ పుస్తకం అందుబాటులో ఉంటుంది. 5 భాషలలో అనువాదం అయింది. తన ప్రతీ ఆలోచనను ఆచరణలో పెట్టడమే విజ్ఞానశాస్త్రంలో రాణించడానికి ఆయుధంగా మారిందని చెప్పారు. ఆ ఆసక్తితోనే తెలుగు.. ఆంగ్లంలో అనేక పుస్తకాలు రాశానని ఆయన చెప్పారు.

సామాజికమే కవిత్వం:ప్రతీ సామాజికాంశాన్ని తెలంగాణ భాషలో కవిత్వంగా రాసే ప్రయత్నం చేశారు తిరుపతిరెడ్డి. సతాయించకు నన్ను బనాయించకు.. పనికోసం బోతే నాకు అకల్ లేదన్నరు. చెప్రాసి పన్కిగూడ పన్కిరావన్నరు ఆరు అడుగుల నేల చాలదా.. అన్ని ఎకరాలెందుకు? కాల్చివేస్తే బూడిదైతే అంతమాత్రం ఎందుకు? చదివే తీరాలని ఫీజులు కట్టి.. చదవకపోవడం ఎందుకు? చదివే రోజులు చదువలేదని విచారించడం ఎందుకు? అంటూ ప్రతీ సామాజికాంశాన్ని స్పృశిస్తూ లోకంతీరును ప్రశ్నలతో సంధిస్తున్నారు.
Thirupathi1
సాహిత్యమే ప్రాణం: ప్రొఫెసర్ చంద్రుపట్ల తిరుపతిరెడ్డి
తెలుగు.. ఆంగ్లం రెండు భాషలలో కవిత్వం రాస్తున్నాను. పుస్తకాలు ప్రచురిస్తున్నాను. సినారెగారు నా కవిత్వాన్ని బాగా ఇష్టపడేవారు. మా ఇద్దరి మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు సాగేవి. ఆటా.. తానా ఉత్సవాల మ్యాగజైన్లలో సుదీర్ఘకాలం పోయెట్రీ ఎడిటర్‌గా పనిచేశాను. సాహిత్యమంటే నాకు అంత ప్రేమ. ఒక రకంగా ప్రాణం. అమెరికాలో ఉన్నప్పటికీ ఇంట్లో మేమంతా తెలుగులోనే మాట్లాడుతాం. మన ఆచార వ్యవహారాలనే ఆచరిస్తాం. విదేశాల్లోనూ తెలుగు గొప్పదనాన్ని చాటేందుకు కృషిచేస్తున్నా.

728
Tags

More News

VIRAL NEWS