సరికొత్త హుషారు...సాద్యమే


Sat,January 13, 2018 01:48 AM

-ఒకే బ్రాండ్ షోరూములు..
-రియల్ ఎస్టేట్ మధ్యవర్తుల సేవల సంస్థలు..
-ఈ రెండింటిలో వంద శాతం
-విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం..
-రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ఈ మూడు తాజా నిర్ణయాల వల్ల రియల్ రంగంలో సరికొత్త ఉత్సాహం నెలకొంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక నుంచి నిర్మాణ రంగం పరుగులు పెడుతుందని చెబుతున్నారు. గత కొంతకాలం నుంచి అమ్మకాల్లేక కునారిల్లిన రియల్ మార్కెట్‌లో అమ్మకాలు పెరుగుతాయని అభిప్రాయపడుతున్నారు.
rera
రియల్ ఎస్టేట్ మధ్యవర్తుల సేవలు మనవద్ద నేటికీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. రెరాలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తప్పకుండా నమోదు చేయాలనే నిబంధనను విధించారు. దీంతో, ఇక నుంచి మధ్యవర్తుల సేవలను అందించే ప్రతిఒక్క కన్సల్టెంట్ జవాబుదారీతనంగా వ్యవహరించక తప్పదు. అయితే, రియల్ ఎస్టేట్ మధ్యవర్తుల సేవల్లో కేంద్రం వంద శాతం విదేశీ పెట్టుబడులను అనుమతించడంతో.. ఈ సేవల రంగం క్రమపద్ధతిలో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. రియల్ లావాదేవీల్లో పారదర్శకత కూడా నెలకొంటుంది. విదేశీ సంస్థలు నేరుగా ఇక్కడ లావాదేవీలను నిర్వహించడానికి వీలు ఏర్పడుతుంది. అయితే, ఇప్పటికి దేశవ్యాప్తంగా కేవలం పది నుంచి ఇరవై శాతం ఏజెంట్లు మాత్రం రెరా కింద నమోదు చేసుకున్నారు. మన రాష్ట్రంలో ఈ ప్రక్రియ ఆరంభం కానున్నది.

విదేశీ పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టాలన్నా.. ప్లాట్లు, ఫ్లాట్లు కొనాలన్నా.. మన రియల్ రంగం వ్యవస్థీకృతంగా ఉండాలి. లావాదేవీలు పారదర్శకంగా జరిపే వీలు ఉండాలి. ప్రస్తుతం, అలాంటి వాతావరణాన్ని రెరా ఏర్పాటు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రియల్ మధ్యవర్తుల సేవల్లో వంద శాతం ఎఫ్‌డీలను అనుమతించడం వల్ల.. పేరెన్నిక గల అంతర్జాతీయ రియల్ సంస్థలు మన దేశంలోకి అడుగుపెట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగం హైదరాబాద్ విస్తృతంగా అభివృద్ధి చెందుతుండటంతో.. పలు విదేశీ ఆహార, ఆతిథ్య, ఎఫ్‌ఎఫ్‌సీజీ సంస్థలు మన దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. మరిన్ని సంస్థలు ఈ బాటను పట్టనున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో సింగిల్ బ్రాండ్ షోరూములు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. వీటిలో విదేశీ పెట్టుబడులను అనుమతించడంతో.. మరిన్ని సంస్థలు హైదరాబాద్‌లోకి అడుగుపెట్టడానికి ఆస్కారముంది. ఇప్పటికే మొబైళ్లు, వాచీలు, దుస్తులు వంటి వాటిలో విదేశీ సంస్థలు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. తాజాగా, ఆయా సంస్థలే సొంతంగా షోరూములను పెట్టడానికి వీలు కలుగుతుంది. రానున్నవి విదేశీ సంస్థలు కావడంతో.. మౌలిక సదుపాయాలను మెరుగ్గా అభివృద్ధి చెందిన సంస్థలు ఏర్పడతాయి.

రాష్ట్ర ప్రభుత్వం రెరా అథారిటీని ఏర్పాటు చేయడాన్ని రాష్ట్ర నిర్మాణ రంగం స్వాగతిస్తోంది. దీంతో కొత్త నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభం అవ్వడానికి ఆస్కారముంది. గత కొంతకాలం నుంచి నూతన నిర్మాణాలను ఆరంభించకుండా ఎదురు చూసేవారికిది తీపి కబురు అని చెప్పొచ్చు. అయితే, ఇక నుంచి రెరా నిబంధనలను ప్రతిఒక్క డెవలపర్ కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. రెరా అథారిటీ అనుమతి లేకుండా ప్రాజెక్టుకు సంబంధించిన ఒక్క ప్రకటన కూడా విడుదల చేయకూడదు. అలా చేస్తే, శిక్షకు గురి కావడం ఖాయం. అంతా పారదర్శకంగా ఉండి, మార్కెట్లో నిలబడగలుగుతామనే ఆత్మవిశ్వాసం గల డెవలపర్లు మార్కెట్లో మిగులుతారు.

లేఅవుట్లకూ వర్తిస్తుంది!

రెరా చట్టం కేవలం అపార్టుమెంట్లు, విల్లాలకే కాదు.. లేఅవుట్లకూ వర్తిస్తుంది. ఒక స్థలాన్ని తీసుకుని.. దానిని అభివృద్ధి చేస్తామని ప్రకటనలను గుప్పించి.. ప్లాట్లను విక్రయించే ప్రతిఒక్క లేఅవుటుకు రెరా వర్తిస్తుంది. ప్లాట్లను అభివృద్ధి చేసే సంస్థల్లో సింహభాగం మాట మీద నిలబడవు. తమ వెంచర్లో బ్లాక్ టాప్ రోడ్లు వేస్తామని ప్రకటించినప్పటికీ.. అందులో ప్లాట్లు కొనేవారికి మట్టిరోడ్లే దర్శనమిస్తుంటాయి. ఇంకా, వీరిలో చాలామంది అరచేతిలో స్వర్గం చూపిస్తుంటాయి. రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటుతామని.. పచ్చికబయళ్లను అభివృద్ధి చేస్తామని ప్రకటిస్తాయి. తీరా, వాస్తవంలోకి వచ్చేసరికి, అక్కడ ఎలాంటి అభివృద్ధి పనుల్ని చేయకుండా వదిలేస్తుంటాయి. రెరా చట్టం ప్రకారం.. లేఅవుట్లను అభివృద్ధి చేసే ప్రతిఒక్క సంస్థ తప్పనిసరిగా రెరా వద్ద నమోదు చేసుకోవాలి. లేకపోతే, కొత్త వెంచర్లను ప్రకటించడానికి అవకాశముండదు.

రెరా అథారిటీని ఏర్పాటు చేయడంతో ఇక నుంచి నిర్మాణ సంస్థలు ప్రణాళికాబద్ధంగా అపార్టుమెంట్లు, విల్లాలను చేపట్టాల్సి ఉంటుంది. కొన్నవారి నుంచి వసూలు చేసిన మొత్తంలో 70 శాతం ఎస్క్రో ఖాతాలో సొమ్ము జమ చేయాల్సి ఉంటుంది.ఇది నిర్మాణ సామగ్రి సరఫరాదారులకు ప్రాణవాయువు వంటిదని చెప్పొచ్చు. హైదరాబాద్‌లో నిర్మాణాలు చేపట్టే పలు పేరెన్నిక నిర్మాణ సంస్థలూ.. సకాలంలో సొమ్ము చెల్లించిన సందర్భాల్లేవు. మార్కెట్ మెరుగ్గా ఉందంటే.. పలువురు డెవలపర్లు మూడు, నాలుగు ప్రాంతాల్లో అపార్టుమెంట్లు, విల్లాల ప్రాజెక్టులను ప్రారంభించేవారు. అంతేతప్ప, నిర్మాణ సామగ్రి కోసం సొమ్ము చెల్లించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించేవారు. ఒక ప్రాజెక్టు ఆలస్యమైతే చాలు.. దాన్ని ప్రభావం మిగతా ప్రాజెక్టులపైన పడేది. ఫలితంగా, ఆయా అపార్టుమెంట్లకు నిర్మాణ వస్తువులను సరఫరా చేసిన సంస్థలు దారుణంగా ఇబ్బందిపడేవి. అందులో నుంచి బయటికి వచ్చేందుకు నానా తంటాలు పడేవి. నేటికీ, పలు నిర్మాణ సంస్థల పుణ్యమా అంటూ ఈ సంస్థలు దారుణంగా ఇబ్బంది పడుతున్నాయి.

ఒక ప్రాజెక్టు సొమ్మును మరొక ప్రాజెక్టుకు వినియోగించడం పలువురు డెవలపర్లకు ఆనవాయితీగా మారింది. పశ్చిమ హైదరాబాద్‌లో పలు ప్రాజెక్టు డెవలపర్లు సొమ్ము చెల్లించలేక చేతులెత్తేశారు. అందుకు బదులుగా, ఆయా నిర్మాణాలలో ఫ్లాట్లను అందజేసి చేతులు దులిపేసుకున్నారు. దీంతో, వాటిని అమ్ముకోలేక అందులో నివసించలేక ఇబ్బందిపడిన వారి సంఖ్య తక్కువేం కాదు. నిర్మాణ సంస్థల తప్పిదాల వల్ల లేబర్ కాంట్రాక్టర్లు సైతం నగరంలో చేతులు కాల్చుకున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లో ఒక డెవలపర్ లేబర్, టైళ్లు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వంటి కాంట్రాక్టర్లకు సైతం సొమ్ము చెల్లించకుండా మొహం చాటేశారు. ఇప్పటికీ ఆయా కంపెనీ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. సొమ్ము అడగటానికి వచ్చేవారిని నియంత్రించడానికి ప్రత్యేకంగా బౌన్సర్లను ఏర్పాటు చేసుకున్న నిర్మాణ సంస్థలు నగరంలో ఉన్నాయి. నేటికీ, మరికొందరు బిల్డర్లు మూడు నుంచి ఆరు నెలల తర్వాత కానీ సొమ్ము చెల్లించని పరిస్థితి నెలకొంది. రెరాలో ప్రత్యేక ఎస్క్రో ఖాతా వల్ల ఇలాంటి ఇబ్బందులకు సైతం పరిష్కారం లభించనుంది.
CUTOUT

306
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS