కర్టెన్లతో కనువిందు..


Sat,January 13, 2018 01:38 AM

ఎంత పెద్ద ఇల్లుకు అయినా అందాన్ని మరింత పెంచాలంటే పరదాలతోనే (కర్టెన్లు) సాధ్యం.. ఇల్లు ఆకర్షణీయంగా ఉందంటే అందులో కర్టెన్ల పాత్ర కచ్చితంగా ఉంటుంది. కేవలం అందాన్ని మాత్రమే కాకుండా కాలుష్యం, వేడి, చలి నుంచి రక్షించేందుకు ప్రతి ఇంట్లో పరదాల వినియోగం తప్పనిసరి.
nonagon

వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రకరకాల కర్టెన్లు మార్కెట్‌లోకి వచ్చాయి. వస్త్రం, దారాలు, ప్లాస్టిక్‌తో తయారయ్యేవి వివిధ రూపాల్లో, డిజైన్లలో మనసు దోచుకుంటున్నాయి. అయితే కాలాన్ని, ఇంటిని, ఏర్పాటు చేసే స్థలాన్ని, గోడ రంగులను బట్టి వీటిని ఎంపిక చేసుకోవాలి. ఇంటీరియర్‌లో భాగంగా పెద్దమొత్తంలో ఖర్చు చేసినా కలగని లుక్, కేవలం సరైన కర్టెన్లను ఏర్పాటు చేయడం వల్ల సాక్షాత్కరిస్తుంది. కాస్త సృజనాత్మకంగా ఆలోచిస్తే నామమాత్రపు ఖర్చుతోనే ఇంటిని ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. అయితే పరదాల ఎంపికలో కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు.

కర్టెన్లలో పలుచని, మందమైనవి ఉంటాయి. వీటిని ప్లాస్టిక్, నైలాన్, సింథటిక్, కాటన్ వంటి వస్త్రాలతో తయారు చేస్తారు. ఒకవేళ వానాకాలం అయితే ప్లాస్టిక్ కర్టెన్లు వినియోగించడం ఉత్తమం. ఇక మందమైన వస్త్రంతో తయారు చేసే పరదాలు వాడటం వల్ల బయటి కాంతి లోపలికి రాకుండా పూర్తిగా అడ్డుకోవచ్చు. తద్వారా గది ఉష్ణోగత్రలు తగ్గించుకోవచ్చు. పలుచని పరదాలు వాడితే పారదర్శకంగా ఉండటంతో పాటు ఎక్కువ వెలుతురు ఇంట్లోకి వస్తుంది. దారాలు, తాళ్లతో తయారయ్యే థ్రెడ్ కర్టెన్లు ఇంటికి ప్రత్యేక శోభను తీసుకువస్తాయి. రకరకాల వరుసల్లో, వివిధ రంగుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ప్రింటింగ్ వర్క్ ఉన్న పరదాలు వినియోగిస్తే గదులు విశాలంగా కనిపిస్తాయి. డూప్లెక్స్, అపార్ట్‌మెంట్లలో గదులను విడదీసే విధంగా పార్టీషియన్ కర్టెన్లు అందుబాటులో ఉన్నాయి.


వివిధ ధరల్లో...

వేర్వేరు ధరల్లో కర్టెన్లను అందుబాటులో ఉన్నాయి. రెడీమెడ్ కర్టెన్స్ అందుబాటు ధరలో ఉండగా, ప్రత్యేకంగా తయారు చేయించుకోవాలంటే కాస్త ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాలి. సిల్క్, కాటన్, నైలాన్ కర్టెన్స్‌లు రెడీమేడ్‌గా అందుబాటులో ఉన్నాయి. గదులను బట్టి ఎంపిక చేయాలి. బాత్‌రూముల్లో ఉండే పరదాలు తడిచిపోకుండా ఉండేవి ఏర్పాటు చేసుకోవాలి. పాలిస్టర్, వినైల్ రకాలు నప్పుతాయి. కిచెన్లలో ఏర్పాటు చేసుకునే వాటిపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే పరదాలకు విస్తరిస్తాయి. అందుకే కిచెన్‌లో సింథటిక్, నైలాన్ తో రూపొందించినవి వాడవద్దు. నాచురల్ ఫ్యాబ్రిక్ లేదా కాటన్‌తో తయారైనవి మంచివి.

రంగు ముఖ్యమే...

కర్టెన్ల ఎంపికలో రంగులు కీలక పాత్ర పోషిస్తాయి. గదులు చిన్నగా ఉంటే లేత రంగులవి ఎంచుకోవాలి. పెద్ద గదులుంటే ముదురు రంగులవి తీసుకోవాలి. ఇంటి తూర్పు వైపు మందంపాటివి వినియోగించాలి. ఇవి సూర్యకాంతిని అడ్డుకొని గది ఉష్ణోగ్రత పెరగకుండా దోహదం చేస్తాయి. పిల్లల గదుల్లో ఏర్పాటు చేసే పరదాలపై కార్టున్లు, అక్షరాలు, నంబర్లు, జంతువులు వంటివి ఉండేలా చూసుకోవాలి. ప్రధాన పడక గదిలో, అతిథుల గదిలో మనసుకు ఆహ్లాదాన్నిచ్చే లేత రంగులు గల కర్టెన్లు ఏర్పాటు చేసుకోవాలి. కిటికీలకు పై నుంచి కింది వరకు ఉండేలా పొడవాటి పరదాలు ఎంపిక చేసుకోవాలి. అప్పుడే మీ ఇల్లు ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

డిజిటల్ ప్రింటింగ్ పరదాలు...

మీకు నచ్చిన దృశ్యాలను పరదాలపై చూసుకునేలా డిజిటల్ కర్టెన్లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. ఫొటోగ్రఫీ ఆర్ట్, డిజిటల్ ప్రింటింగ్ టెక్నాలజీ కలిసి చూడముచ్చటైన పరదాలను రూపొందిస్తున్నారు. పూలు, పండ్లు, నగరాలు, రాజభవనాలు, ఎగిరే పక్షులు, పచ్చిక బయళ్లు, సాగర తీరాలు, నెమళ్లు.... ఇలా ఒక్కటేమిటి అనేక కళారూపాలను మీకు ఇంటి పరదాలపై రోజు వీక్షించవచ్చు. ఇలాంటివి వాడటం వల్ల ప్రత్యేకంగా గోడలపై ఫోటోలు, కళాకండాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం తప్పుతుంది. తద్వారా డబ్బు అదా అవుతుంది. కేవలం ఇండ్ల వరకే కాదు కార్యాలయాల్లోనూ ఇలాంటి కిటికీలు ఏర్పాటు చేసుకుంటే ప్రశాంతత కలుగుతుంది.
flowers

456
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles