ఆతివలకు కావాలి..ఆర్థిక బభరోసా!


Sat,January 13, 2018 01:28 AM

అమ్మను చూస్తే ఆశ్చర్యం వేసేది. నాన్న ఇచ్చే జీతాన్ని పొదుపుగా, జాగ్రత్తగా వాడటాన్ని చాలామంది బాల్యంలోనే చూసి ఉంటాం. అయితే, గతంతో పోల్చితే నేటి మహిళలు కేవలం ఇంటికే పరిమితం కాకుండా కెరీర్ మీద దృష్టి సారిస్తున్నారు. సరికొత్త సవాళ్లను స్వీకరిస్తున్నారు. రంగం ఏదైనా.. పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. కాకపోతే, అధిక శాతం మహిళలు ఆర్థిక విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. ఈ అంశాన్ని పూర్తిగా భర్తకో లేదా తల్లిదండ్రులకో వదిలేస్తున్నారు. అలా కాకుండా, ఇప్పటికైనా మహిళలు ఆర్థిక ప్రణాళికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో నేటితరపు మహిళలు పలు అంశాలపై దృష్టి సారించాలని చెబుతున్నారు.
unnamed
అసలు మహిళలకు విడిగా ఆర్థిక ప్రణాళికలెందుకు? అని వాదించే పురుషులు లేకపోలేరు. వాస్తవానికి, అధిక సందర్భాల్లో మగవారి కంటే మహిళలే ఆర్థిక వ్యవహారాలను చాకచక్యంగా చక్కబెట్టగలరని నిరూపితమైంది. ఈ క్రమంలో తమ వ్యక్తిగత నైపుణ్యాలను పెంచుకోవడానికైనా.. పిల్లలకు ఉన్నత విద్యను అందించడానికైనా మగువలు తప్పకుండా ప్రణాళికలను రచించాల్సిన అవసరముంది. ఇంటి కొనుగోలు విషయంలోనూ క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆరు అంశాలపై ప్రధానంగా దృష్టి సారించక తప్పదు.

భవిష్యత్తు ఆర్థిక లక్ష్యాలు..

ఆర్థిక ప్రణాళిక అంటేనే భవిష్యత్తు కోసం సిద్ధం అవ్వడమనే విషయాన్ని మర్చిపోవద్దు. ప్రస్తుతం వినూత్నమైన పెట్టుబడి పథకాలు అందుబాటులోకి వచ్చాయి. కాబట్టి, తెలివైన ప్రణాళిక, క్రమశిక్షణతో కూడుకున్న మదుపు విధానాన్ని అలవర్చుకోవాలి. స్థిరమైన ఆదాయాన్ని అందుకునే దిశగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్), కేవీపీ (కిసాన్ వికాస్ పత్రం), ఎన్‌ఎస్‌సీ (నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్), ఫిక్స్‌డ్ డిపాజిట్ల వైపు దృష్టి సారించాలి. ఈక్విటీ మార్కెట్ మీద అవగాహన ఉన్నవారు ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. ఇవి అధిక ఆదాయాన్ని అందించడమే కాకుండా పన్ను ప్రయోజనాలనూ కల్పిస్తాయి. దీర్గకాలికంగా కాకుండా స్వల్పకాలిక గడువు గల ఫండ్లను ఎంచుకోవాలి. అయితే, మన ఆర్థిక లక్ష్యాలను చేరుకునే క్రమంలోనే ఫండ్లలో మదుపు చేయాలి. ప్రతి లక్ష్యానికో పోర్ట్‌ఫోలియోను ఏర్పాటు చేసుకుని అందుకు అనుగుణంగా మదుపు చేయాలి. మూడేండ్ల వ్యవధి గల డెట్ మ్యూచువల్ ఫండ్లు, ఐదేండ్ల కాలపరిమితి గల బ్యాలెన్స్ ఫండ్లను ఎంపిక చేసుకోవాలి. ఇక ఈక్విటీ ఫండ్లలో మదుపు చేసేవారు కనీసం ఐదేండ్ల పాటు వేచి చూసేలా ప్రణాళికలు రచించాలి. అప్పుడే, ఆశించిన రాబడిని అందుకోవచ్చు.

నేనే కీలకం..

కొందరు మహిళలు ఉద్యోగ జీవితంలో విరామం తీసుకుంటారు. వృత్తిపరమైన విషయాల్లో రాజీ పడుతుంటారు. ఇంట్లో చిన్నారులను చూసుకోవడానికో లేదా ఇంటిని దగ్గరుండి చక్కబెట్టుకోవడానికో ఇలా చేస్తుంటారు. అలాంటి వారంతా ముందుగా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే.. వృత్తిపరమైన జీవితానికి ఎట్టి పరిస్థితుల్లో విరామం ఇవ్వకూడదు. అవసరమైతే ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులేయాలి. ప్రశాంతంగా ఉండటమే కాకుండా స్థిరమైన ఆదాయం ఉన్నప్పుడే ఆర్థిక ప్రణాళికను సమర్థంగా అమలు చేయవచ్చు. అలా అనీ, కుటుంబ జీవితానికి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి.

అత్యవసర నిధి అవసరమే..

ఇంటికి సంబంధించిన ఆర్థిక లక్ష్యాల మీద దృష్టి పెట్టడంతో బాటు స్వీయ ఆర్థిక భద్రతకు మహిళలు పెద్దపీట వేయాలి. ఉద్యోగం కోల్పోయినా, భర్త విడాకులిచ్చినా, లేక హఠాత్తుగా దుర్మరణం చెందినా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా జాగ్రత్తపడాలి. పొరపాటున భర్తకు ప్రమాదం జరిగితే కుటుంబం చిన్నాభిన్నం కాకుండా ముందుజాగ్రత్తగా వ్యవహరించాలి. ఇందుకోసం కనీసం ఆరు నెలల పాటు కుటుంబానికి ఎలాంటి లోటు రానీయకుండా సొమ్మును భద్రపర్చుకోవాలి.

పదవీ విరమణ ప్రణాళిక..

ఉద్యోగం చేసే ప్రతి మగువ.. కెరీర్ ఆరంభం నుంచే పదవీవిరమణ ప్రణాళిక కోసం మదుపు చేయాలి. కాకపోతే, మనలో చాలామంది మహిళలు నలభై ఏండ్లు వచ్చాక కానీ దృష్టి సారించరు. ఇది ఆర్థికపరంగా తప్పిదమని చెప్పొచ్చు. కెరీర్ ప్రారంభం నుంచే పొదుపు, మదుపులపై దృష్టి సారిస్తే.. జీవితమంతా సాఫీగా సాగుతుంది. ఉదాహరణకు, పాతికేండ్ల వయసున్నప్పుడు నెలకు రూ.3,100 చొప్పున మదుపు చేస్తే.. 60 ఏండ్లు వచ్చే నాటికి ఎంతలేదన్నా రూ.2 కోట్లు కార్పస్ ఏర్పడుతుంది. వార్షికంగా పన్నెండు శాతం చొప్పున రాబడిని లెక్కిస్తే ఈ మొత్తం చివరికి చేతికి అందుతుంది. అదే, కాస్త ఆలస్యంగా కళ్లు తెరిచిన.. నెలకు రూ.40,000 చొప్పున మదుపు చేస్తే.. 15ఏండ్లలోగా దాదాపు రూ.2 కోట్లు చేతికి అందుతుంది.

నేను బెంగళూరులో ఒక ప్రముఖ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా పని చేస్తున్నాను. పొదుపు గురించి మా అమ్మానాన్నలను చూసి నేర్చుకున్నాను. అందుకే, కెరీర్ ఆరంభంలోనే కుటుంబానికి సంబంధించిన హెల్త్ పాలసీ తీసుకున్నాను. నా పేరిట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఉన్నది. జీతం పెరిగే కొద్దీ మదుపు మీద మరింత దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను.
- భాగ్యశ్రీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరు, బెంగళూరు

ఆర్థిక విశ్వాసం అవసరం..

కొందరు మహిళలు ఆర్థికపరమైన నిర్ణయాలను తీసుకోవడానికి సంశయిస్తుంటారు. అందుకోసం సమయం ఎక్కువ గడపాలి. అదో కష్టమైన ప్రక్రియగా భావిస్తారు. ఇక్కడ మగువలు ఓ విషయాన్ని గుర్తించాలి. సంపాదించినంత మాత్రాన ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్నట్లు కాదు. సొమ్మును తెలివిగా నిర్వహించడమూ ఓ కళగా భావించాలి. ఇందుకోసం ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవాలి. భర్తతో మనసు విప్పి మాట్లాడాలి. అవసరమైతే ఆర్థిక నిపుణులను సంప్రదించాలి. ముందుగా, చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తూ ఉండాలి. ఈ ప్రక్రియకు ఒక్కసారి అలవాటు పడితే.. ఆర్థిక విషయాల్లో ఎలాంటి నిరాసక్తత ఏర్పడదని గుర్తుంచుకోండి.

మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం అత్యంత కీలకం. సంపాదన ఎంత అనే అంశంతో సంబంధం లేకుండా.. ప్రతి నెల ఎంతో కొంత పొదుపు చేయాలి. ఇందుకోసం అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. నా మటుకైతే చిన్న మొత్తాల్లో పొదుపు చేయడాన్ని ముందు నుంచీ అలవర్చుకున్నాను.
- సుధారాణి, ప్రిన్సిపల్, ఇందూర్ స్కూల్, బోధన్

కావాలి.. రక్షణ కవచం

ఉద్యోగినులకు బీమా రక్షణ తప్పనిసరిగా ఉండాలి. పొరపాటున జరగరానిది ఏమైనా జరిగితే.. ఆర్థికంగా అండగా నిలిచే పాలసీలను ఎంచుకోవాలి. కాబట్టి, ప్రత్యేకంగా టెర్మ్ పాలసీని తీసుకోవాలి. సాధారణంగా ఇవి నామమాత్రపు ఖర్చుతోనే తగినంత బీమా సౌకర్యాన్ని కల్పిస్తాయి. వీటిని తీసుకునే ముందు.. వార్షిక జీతంపై సుమారు పదిహేను రెట్లు ఉండేలా బీమా పాలసీ తీసుకోవాలి. మనదేశంలో ఆరోగ్యంపై తడిసిమోపెడు అవుతున్న ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే.. మహిళలు బీమా పాలసీలను ఎట్టి పరిస్థితుల్లో విస్మరించకూడదు. క్రమం తప్పకుండా ఆరోగ్యానికి ధీమాను కల్పించే పథకాన్ని ఎంచుకోవడమే కాకుండా.. మెటర్నటీ, చిన్నారుల సంరక్షణను దృష్టిలో పెట్టుకుని పాలసీలను తీసుకోవాలి.

బీమా పాలసీ అంటేనే చాలామంది అంతగా ఆసక్తి చూపరు. కష్టకాలంలో ఇది ఎంతగానో ఆదుకుంటుంది. పాలసీ తీసుకోవటం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. మహిళలు ఈ విషయంలో కాస్త వెనకబడే ఉన్నారనిపిస్తుంది. ఇంటిని సంరక్షించడానికి జీవితాంతం కష్టపడతారు. స్వీయ రక్షణ చాలా అవసరం. ఇది కేవలం బీమాతోనే సాధ్యం. మంచి పాలసీని ఎంపిక చేసుకొని ఈ రోజే ప్రీమియం చెల్లించండి. ఈ విషయంలో ముందు నుంచి జాగ్రత్తగా ఉంటున్నాను. రెండు పాలసీలు ఇప్పటికే తీసుకున్నాను.
- జి కల్యాణి, జేఎన్‌టీయు, హైదరాబాద్

ఆస్తులే మేలు..

-ఏయే అంశాల్లో పొదుపు, మదుపు చేస్తే.. చేతికి ఆదాయం ఎలా వస్తుందనే విషయాలపై మహిళలు కాస్త అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీర్ఘకాలంలో మంచి రాబడిని అందుకోవాలంటే.. షేర్లు, ప్లాట్లు, ఫ్లాట్లలో మదుపు చేయడం ఉత్తమం.
-ఈక్విటీల్లో మదుపు చేస్తే.. డివిడెండ్ చేతికొస్తుంది. పెట్టుబడి విలువ పెరుగుతుంది.
-స్థిరాస్తి: అద్దెల ద్వారా ఆదాయం, ఆస్తి విలువ పెరుగుతుంది.
-నగదు: వడ్డీ చేతికొస్తుంది
-బాండ్లు: వడ్డీ లభిస్తుంది.

గుర్తుంచుకోండి..

-పొదుపు చేయడానికి మహిళలు తమ వద్ద సొమ్ము లేదంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. లేదా ఆర్థిక విషయాల గురించి ఆలోచించే తీరిక లేదన్నట్లుగా వ్యవహరిస్తారు.
-పదిలో తొమ్మిది మంది మహిళలు ఆర్థిక విషయాల్లో వారే బాధ్యులు
-అధిక శాతం మహిళలు పదవీ విరమణ గురించి 40 ఏండ్లు వచ్చాకే ఆలోచిస్తారు.

335
Tags

More News

VIRAL NEWS