సి(శ)నివారం!


Sat,November 11, 2017 01:24 AM

శుక్రవారం తర్వాత శనివారం. కానీ సినిమానే లైఫుర మామా.. లైఫంటే సినిమా మామా అంటూ సినీలోకంలో విహరించే వారికి మాత్రం అది సినివారం. శుక్రవారం నాడు విడుదలైన సినిమాలన్నీ ఆరోజే చూసేస్తారు. శనివారం మాత్రం ఎలాంటి సినిమా కార్యక్రమాలు పెట్టుకోరు. టైమ్‌కి వచ్చి రవీంద్రభారతిలో వాలిపోతారు. ఎందుకంటే పెద్ద సినిమాను తలపించే చిన్న సినిమాలు.. అదేనండీ.. షార్ట్‌ఫిలింలు ప్రదర్శించేది అక్కడే కాబట్టి. తెలంగాణ నేపథ్యంలో సినిమాలు రావాలి. మన కథను, మన చరిత్రను తెర మీద చూసుకోవాలి అనే కోరిక సినివారం పేరుతో రవీంద్రభారతిలో అలరిస్తున్నది. షార్ట్‌ఫిలిం దర్శకులను, రేపటి సినిమా దర్శకులుగా చూడాలని కలలు కంటూ ప్రోత్సాహాన్నిస్తూ దిగ్విజయంగా సాగుతున్న సినివారం ఏర్పాటై నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఈ శనివారం.. సినివారం గురించి ఈ సగర్వ మననం.
Shekarkamala
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రధాన అంశంగా సినిమాలు వస్తున్నాయి. అంకుర్, మా భూమి, దాసీ లాంటి సినిమాలు ఇప్పటికే తెలంగాణ వైభవాన్ని చాటాయి. తెలంగాణ సినిమా అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని నిరూపించాయి. ఆ తర్వాత కాలంలో తెలంగాణ సినిమా మీద కమర్షియలిజం దాడి చేసింది. ఫలితంగా వరుసగా తెలుగులో మూస సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులు కూడా సినిమా అంటే అదేనేమో అనుకున్నారు. మేం సినిమా అనే రీతిలో దర్శక, నిర్మాతలు, కథానాయకులు వ్యవహరించడంతో తెలుగు సినిమా ఒక ప్రాంతానికే పరిమితమైంది. నిజానికి తెలంగాణలో సినిమా తీయగల డైరెక్టర్లు, నిర్మాతలు, టెక్నీషియన్లు చాలామందే ఉన్నారు. హాలీవుడ్ సినిమాలను తలదన్నే రీతిలో సినిమా రూపొందించగలరు. కానీ వారికి సరైన అవకాశాలు రాలేదు. సరైన ప్రోత్సాహం దొరుకలేదు. కానీ ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతున్నది. దీనికి కారణం.. తెలంగాణ దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు. అద్భుతమైన కథా, కథనాలతో సినిమాలు తీస్తున్నారు. కానీ ఇది సరిపోదు. ఇంకా ఏదో కావాలి. మరిన్ని సినిమాలు రావాలి. మరింత కొత్తదనం కావాలి. ఆ కొత్తదనం కావాలంటే కొత్తతరాన్ని ప్రోత్సహించాలి. అందుకు ఒక వేదిక కావాలి. ఏ ప్రోత్సాహం లేకపోయినా షార్ట్‌ఫిలింస్ తీసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తూ వీడియో కింద వచ్చే కామెంట్లను చూసుకుని తమని తామే ప్రోత్సహించుకుంటున్నారు కొందరు. అలాంటి వారికి ఓ వేదిక కల్పించి, నలుగురు నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు రూపమే ఈ సినివారం.

ప్రోత్సాహమిచ్చే వేదిక..

ఒక అద్భుతం చేయాలంటే కృషి, పట్టుదల ఉండాలి. వాటితో పాటే.. నువ్వు చేయగలవు.. ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలా అద్భుతంగా ఉంది. ఇంకాస్త మెరుగు పరుచుకో.. అంటూ సలహాలతో కూడిన ప్రోత్సాహమిస్తే అద్భుతాన్ని మించిన ఫలితం కళ్లముందు ఆవిష్కృతమవుతుంది. యూట్యూబ్ వేదికగా వస్తున్న ఎన్నో షార్ట్‌ఫిలింస్ ఇందుకు ఉదాహరణ. కాకపోతే వారికి చేయాలన్న తపన మాత్రమే ఉంది. ప్రోత్సహించే వారు లేరు. ఆ లోటును పూడుస్తూ రవీంద్ర భారతిలో భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఆలోచనల్లోంచి పుట్టిన వేదికే సినివారం. ఔత్సాహిక యువ దర్శకులు తీసిన షార్ట్‌ఫిలింస్, డాక్యుమెంటరీలు ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నది సినివారం వేదిక. అనుభవజ్ఞులైన సినీ దర్శకులు, టెక్నీషియన్లు, నిర్మాతలను పిలిపించి షార్ట్‌ఫిలిమ్ దర్శకులకు ప్రోత్సహిస్తున్నది సినివారం. ఏ అండ లేకపోయినా సినిమా తెర మీద వెలుగులీనాలన్న కోరికకు అండగా నిలుస్తున్నది, ధైర్యమిస్తున్నది. ఇప్పటి వరకు దాదాపు 150 వరకు షార్ట్‌ఫిలింస్ సినివారం తెర మీద ప్రదర్శించారు. ప్రదర్శన తర్వాత అనుభవజులైన సినీ ప్రముఖులు, చూసిన ప్రేక్షకులతో దర్శకుడికి, నటులకు ముఖాముఖి నిర్వహిస్తున్నది. పరోక్షంగా వచ్చే కామెంట్లు, ప్రోత్సాహం కంటే ప్రత్యక్షంగా వచ్చే కామెంట్లు, ప్రోత్సాహమే కళాకారుడికి టానిక్ అనే మాటను నిజం చేస్తున్నది సినివారం.
Shesenivaram2

వారసత్వ కళల వారధి..

తెలంగాణ సకల కళలకు కాణాచి. వారసత్వ కళల హరివిల్లు. అలాంటి అందమైన రంగుల జానపద, వారసత్వ, సాంస్కృతిక కళలను ప్రోత్సహిస్తూ చేయూతనిస్తున్నది సినివారం. వారం వారం, ప్రత్యేక సందర్భాల్లో, పండుగలప్పుడు, బతుకమ్మ ఫిల్మోత్సవ్‌లాంటి కార్యక్రమాల్లో బుడగజంగాలు, తోలుబొమ్మలు, పేరిణి, కోలాటం ఇలా కళనే నమ్ముకున్న ఎంతోమంది కళాకారులకు అవకాశం కల్పిస్తున్నారు. కళ బతుకాలంటే ముందు కళాకారుడు బతుకాలి. అది జరుగాలంటే వారికి అవకాశం, ఆదాయం కావాలి. ఈ రెండూ కల్పిస్తూ కొనప్రాణాలతో ఉన్న మన జానపద దీపాలను రెండు చేతులు అడ్డం పెట్టి కాపాడుతున్నది భాషా సాంస్కృతిక శాఖ.

తెలంగాణ సినిమా ఎదిగేందుకు..

యూట్యూబ్‌లో షార్ట్‌ఫిలింల ద్వారా ప్రతిభ నిరూపించుకుంటున్న వారెంతో మంది ఉన్నారు. వారిలో అద్భుతమైన నైపుణ్యాలున్నాయి. ఒక చిన్న షార్ట్‌ఫిలింను తక్కువ బడ్జెట్‌లో, తక్కువ నిడివితో సినిమాను తలపించేలా రూపొందిస్తున్నారు. అవార్డులు గెలుచుకుంటున్నారు. సినిమాకు సమాంతరంగా షార్ట్‌ఫిలింను నిలబెడుతున్నారు. ఒక దశలో సూపర్‌హిట్ సినిమాతో సమానంగా ఒక షార్ట్‌ఫిలింకు కూడా లక్షల్లో వ్యూవ్స్ ఉంటున్నాయి. అలాంటి వారిని ప్రోత్సహిస్తే తెలంగాణ సినిమాను ప్రోత్సహించినట్టే. ఆ ప్రోత్సాహమిచ్చే వేదికగా ఈ సినీవారం ఏడాది పూర్తి చేసుకుని మరింత నవ్యతతో మరో ఏడాదిలోకి అడుగు పెడుతున్నది.

Hari-sir
ఒక సినిమా తీయాలంటే మూడు దశలుంటాయి. ఒకటి ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్. ఈ మూడు దశల్లో ఏదో ఒక దశలో సాయం చేస్తే వీరికి ప్రోత్సాహం ఇచ్చినవాళ్లం అవుతాం అనిపించింది. మనకు ఉన్న పరిధిలో ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించా. ఈ మూడు దశల్లో ఇన్‌వాల్వ్ కావాలంటే కుదరని పని. అందుకే ముందుగా యువకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్న యూట్యూబ్, షార్ట్‌ఫిలిం మీద దృష్టి పెట్టాం. వారు తీస్తున్న షార్ట్‌ఫిలింస్ యూట్యూబ్‌లో మాత్రమే కాకుండా.. ఒక ప్రివ్యూ థియేటర్‌లో ప్రదర్శించుకునేలా ఒక మినీ థియేటర్ ఏర్పాటు చేశాం. దానికి పైడి జయరాజ్ గారి పేరు పెట్టాం. ప్రతీ శనివారం మూడు షార్ట్‌ఫిలింల ప్రదర్శనతో పాటు, ఒక సినిమా టీంతో ముఖాముఖి కూడా నిర్వహిస్తున్నాం. సినివారం నుంచి భవిష్యత్తులో ఎంతోమంది దర్శకులు వస్తారు. ఎన్నో సినిమాలు విడుదలవుతాయి. ఈ సినిమా ఎక్కడ తీశారు? ఏ ప్రాంతం వారు తీశారు? అనే ప్రశ్న వస్తే తెలంగాణ వారు తీశారు అని గర్వంగా చెప్పుకోవాలి. అందుకే మా ఈ చిరు ప్రయత్నం. ఈ ఏడాది ప్రయత్నానికి అక్షర రూపమిస్తూ ఒక పుస్తకం కూడా తీసుకొస్తున్నాం.
మామిడి హరిక్రిష్ణ, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్
Shesenivaram3
Shesenivaram1
Shesenivaram4
Shesenivaram5

1152
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles