పిల్లలకు సృజన పాఠాలు


Fri,January 18, 2019 01:43 AM

పుస్తక పఠనం మనిషికి జ్ఞానాన్ని పెంచడమేకాకుండా, ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు తోడ్పడుతుంది. చిన్ననాటి నుంచి పుస్తక పఠనాన్ని చిన్నారుల్లో పెంపొందించేందుకు డార్జిలింగ్‌కు చెందిన ఓ మహిళ ఎంతగానో కృషి చేస్తున్నది.
darjieeling-children
డార్జిలింగ్‌లోని నగరి టీ ఎస్టేట్‌కు చెందిన సృజన సుబ్బా అనే మహిళ తన గ్రామంలో సొంతంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి చిన్నారుల్లో పఠనాసక్తిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నది. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసేవాళ్లు. యూకేజీ చదువుతున్న సమయంలో ఆమె తల్లి ఓ డిక్షనరీని తీసి ఇచ్చింది. అలా చదువడం అలవాటైంది సృజనకి. ఆమె తల్లి కూడా పుస్తకాలు బాగా చదివేది. వాటిని సృజనకి పడుకొనే సమయంలో కథలుగా చెప్పేది. అలా ప్రతి రోజూ ఓ కథ చెప్పడం వల్ల సృజనకు పుస్తకాలు చదవాలనే ఆసక్తి మరింతగా పెరిగింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పెద్ద ఎత్తున పుస్తకాలను సేకరించి తన ఇంట్లోనే ద బుక్ తీఫ్ పేరుతో కార్ పార్కింగ్ స్థలంలోనే ఓ గ్రంథాలయాన్ని ప్రారంభించింది. చిన్నారులకు ఆసక్తికరంగా ఉండే 5౦౦ కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలను తన గ్రంథాలయంలో ఉంచింది. చదువుతో పాటు ఇతర పుస్తకాలను పఠించడం వల్ల కలిగే లాభాలను వారికి వివరిస్తూ పుస్తక పఠనంపై అవగాహన కల్పిస్తూ వారిలో దాగి ఉన్న సృజనాత్మకతకు పదును పెడుతున్నది. ఓ రోజు తన గ్రంథాలయానికి ఏడాదిన్నర వయసున్న పాపతో వాళ్ల అక్క వచ్చి పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ పాప కూడా పుస్తకం వైపు ఆసక్తి కనబరచడం చూసి సృజన ఎంతో సంతోషించింది. అలాగే ఒక్కొక్కరూ పుస్తక పఠనం పై ఆసక్తి పెంచుకుంటూ ఉంటే భవిష్యత్‌లో సమాజం అంత త్వరగా ముందుకు వెళుతుందనేది సృజన అభిప్రాయం. భారతదేశంలోని ప్రతి గ్రామంలో ద బుక్ తీఫ్ లాంటి గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సృజన కోరుతున్నది.

708
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles