ఇవి క్యాన్సర్ గడ్డలా?


Thu,November 8, 2018 11:29 PM

నా వయసు 37 సంవత్సరాలు. చాలాకాలంగా తొడలపై గడ్డలు అవుతున్నాయి. టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతాయి. మళ్లీ అంతలోనే అవుతుంటాయి. నేనిప్పటి వరకు దీనిని సీరియస్‌గా తీసుకోలేదు. అయితే గడ్డలు ఇలా వస్తే మంచివి కావనీ.. క్యాన్సర్‌కు సూచకాలని చాలామంది చెప్పారు. ఇది నిజమేనా? నాది గంటల తరబడి కూర్చుని చేయాల్సిన పని. ఈ సమస్య ఏంటి? దానికి పరిష్కారం తెలుపగలరు.
- సురేందర్ రెడ్డి, పెద్దపల్లి

Councelling
సురేందర్‌గారూ.. ముందు మీరు ఆందోళన నుంచి బయటపడండి. ఆరోగ్యం విషయంలో ఎప్పుడైనా గుర్తుంచుకోండి అనుమానాలకు అవకాశం ఇవ్వొద్దు. ఏదైనా సమస్యగా ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. వాళ్లకు వీళ్లకు చెప్పుకోవడం వల్ల లేనిపోని ఆందోళనలే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు. ఇక సమస్య విషయానికి వస్తే.. మీరు తెలిపిన లక్షణాలను బట్టిచూస్తే ఈ గడ్డలకు.. క్యాన్సర్‌కూ ఎలాంటి సంబంధం లేదు. అవి క్యాన్సర్ గడ్డలు ఏమాత్రం కావు. ఇలా గడ్డలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల అయుండొచ్చు. కొన్నిసార్లు బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా గడ్డలు అవుతుంటాయి. కొన్నిసార్లు స్కిన్ అలర్జీస్ గడ్డలకు కారణం అవుతుంటాయి. కొన్నిసార్లు చెమట కూడా కారణం అవుతుంటుంది. కాబట్టి మీరు రక్త పరీక్షలు చేయించుకోండి. ప్రధానంగా చేయాల్సిన ఇంకో పరీక్ష డయాబెటీస్ పరీక్ష. మధుమేహం ఉంది అని నిర్ధారణ అయితే మాత్రం వెంటనే స్పెషలిస్ట్‌ను కలువాలి. ఇవన్నీ చేస్తూనే కొన్ని మీ జీవనశైలిలో మార్పులు పాటించడం చాలా ముఖ్యం. మీ వయసు కూడా చిన్నదే. ఇప్పుడే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు అలవర్చు కోవాలి. ముందే గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగం అంటున్నారు. ఎంత బిజీ ఉద్యోగం అయినా ప్రతీ అర్ధగంటకోసారి లేచి అటూ ఇటూ తిరగాలి. సీటుకే అంటిపెట్టుకున్నట్లు కూర్చోవడం వల్ల గాలిలోపం వల్ల కూడా వేడికి ఇలాంటి గడ్డలు అవుతుంటాయి. ప్రతిరోజూ వ్యాయామం చేయండి. మీకున్న సమస్యలను పరిశీలిస్తే మీకు నడక మంచి పరిష్కారంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. నడక వల్ల రక్త ప్రసరణలో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి మీ లైఫ్‌స్టయిల్‌ను మార్చుకొని స్పెషలిస్ట్‌ను కలవడం బెటర్. అనవసర ఆందోళనతో అనవసర ఒత్తిళ్లు వస్తాయని గుర్తుంచుకోండి. ఆల్ ది బెస్ట్!

797
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles