విశ్వాసానికి ప్రతీక...యోసేపు జీవితం


Fri,October 13, 2017 01:46 AM

బైబిల్ గ్రంథంలో యోసేపునకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అతని తండ్రి యాకోబుకు పన్నెండు మంది కొడుకులు. రూబేను పెద్దవాడు. కాగా బెన్యామీను చిన్నవాడు. యాకోబు యోసేపును ఎక్కువగా ప్రేమించేవాడు. తన ప్రేమకు గుర్తుగా అతనికి ఒక నిలువుటంగీ కుట్టించాడు. తన తండ్రి యోసేపును అందరి కంటే ఎక్కువ ప్రేమించడం చూసి, సహోదరులు ఈర్ష్యపడ్డారు. అతనితో ప్రేమగా మాట్లాడేవారు కాదు. ఒకరోజు యాకోబు యోసేపుతో ఇంటికి దూరంగా గొర్రెల మందను మేపుతున్న తన సహోదరులను చూసి రమ్మని చెప్పాడు. వారిని చూసేందుకు వెళ్లాడు. యోసేపు సోదరులు అతడిని చంపాలని దురాలోచన చేశారు. కాని పెద్దవాడైన రూబేను ఈ కుట్రను అడ్డుకున్నాడు. యోసేపును చంపడానికి బదులుగా అతని ప్రత్యేకమైన నిలువుటంగీని తీసుకుని ఒక గుంటలో పడవేశారు. అప్పుడే కొంతమంది వ్యాపారులు ఐగుప్తుకు వెళ్తూ ఆ మార్గం గుండా వచ్చారు. యోసేపు సోదరులు అతడిని వారికి అమ్మేశారు. ఒక దుష్ట మృగం యోసేపును చంపి తినేసిందని వారి తండ్రిని నమ్మించారు. ఇది విని ఇశ్రాయేలు బాగా దుఃఖించాడు.
genesis-joseph
ఆ వ్యాపారులు యోసేపును ఈజిప్టులో అమ్మేశారు. ఫరో రాజు వద్ద అధికారిగా ఉన్న పోతీఫరు యోసేపును కొన్నాడు. యోసేపు సమర్థుడు, మంచివాడై ఉండడం చూసిన పోతీఫరు తనకు కలిగిన దానంతటి మీద అతడిని అధికారిగా నియమించాడు. పోతీఫరు భార్య యోసేపును మోహించింది. ఆమె కోరికను అతడు తిరస్కరించడంతో భర్తకు అబద్ధం చెప్పింది. దాంతో అతడు యోసేపును చెరసాలలో వేయించాడు.

కలలను వివరించడం

యెహోవా దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు కనుక చెరసాల అధిపతికి అతడిపై దయ కలిగింది. దీంతో ఖైదీలందర్నీ యోసేపు చేతికి అప్పగించాడు. ఒకరోజు ఐగుప్తు రాజైన ఫరోకు ఒక భయంకరమైన కల వచ్చింది.దాని భావం తెలిపే వారి కోసం అతడు వెతికాడు. యోసేపు చెప్పగలడని తెలుసుకుని అతడిని పిలిపించాడు. ఫరో రాజు కలలలను విన్న యోసేపు ఇదిగో ఈజిప్టు దేశం అంతటా సమృద్ధిగా పంటలు పండే ఏడు సంవత్సరాలు వస్తున్నాయి. వాటి తరువాత కరువు గల ఏడు సంవత్సరాలు వస్తాయి. అప్పుడు ఈజిప్టు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తూ మరువబడును. ఈ కరువు దేశాన్ని పాడుచేయును (ఆదికాండము 41:29-30) అని చెప్పాడు.
పంటలు పండిన కాలంలో ధాన్యాన్ని సేకరించి నిల్వ చేస్తే, కరువు కాలంలో అవసరం అవుతాయని యోసేపు సూచించాడు. దాంతో ఫరో రాజు ఎంతో సంతోషించాడు. వెంటనే అతడిని ఈజిప్టుకు గవర్నర్‌గా నియమించాడు. ఏడేళ్ల తరువాత కరువు వచ్చింది. అన్ని ప్రాంతాల వారు కరువు బారిన పడ్డారు. వాళ్లు ఐగుప్తుకు వచ్చినప్పుడు యోసేపు ప్రజలందరికీ ధాన్యం అమ్మకాలు జరిపించాడు.

విశ్వాసంగా ఉండడం

యోసేపు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ కూడా అతడు దేవుని పట్ల విశ్వాసంగా ఉన్నాడు. తన జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడో తనకు తెలియనప్పటికీ దేవుని ఆజ్ఞల పట్ల విశ్వాసంతో ఉన్నాడు. మనం కూడా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు దేవునికి విశ్వాసంగా ఉండాలి. చాలామంది జీవితం కష్టతరంగా మారిపోగానే దేవుని నుంచి తొలగిపోతారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఎన్నడూ దేవుని నుంచి దూరం వెళ్లవద్దు. అంతమాత్రాన దేవుడు నీ కొరకు ప్రణాళికలు అమలు చేయడం లేదని కాదు. దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడని, నీకు తోడై ఉన్నాడని ఎల్లప్పుడూ నమ్మకం ఉంచాలి. నీవు ఎక్కడ ఉన్నా దేవునికి మంచి ప్రతినిధిగా ఉండాలి. తనను ప్రేమించేవారి కోసం దేవుడు మంచినే చేస్తాడు.
- జాషువా

600
Tags

More News

VIRAL NEWS

Featured Articles