ఆస్తమా అంటువ్యాధా?


Thu,January 17, 2019 01:55 AM

నా వయస్సు 18 సంవత్సరాలు. ఇప్పటిదాకా ఏ ఆరోగ్య సమస్యా లేదు. కానీ మా తల్లిదండ్రులు, దగ్గరి బంధువుల్లో చాలామందికి ఆస్తమా ఉంది. ఇది వంశపారంపర్యంగా వస్తుందా? దీని నివారణకు ఎలాంటి చికిత్స చేయించుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
పి. శ్రీనివాస్, వరంగల్

Councelling
శ్రీనివాస్‌గారూ.. ఆస్తమా వ్యాధి వంశపారంపర్యంగా సోకే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే శాస్త్రీయంగా ఇంకా నిర్ధారణ కాలేదు. చాలామందికి ఆస్తమా జీవనశైలిలో మార్పులు, వాతావరణ మార్పుల కారణంగానే సోకుతున్నది. ఇది జీవితకాలం వేధించే వ్యాధి. అయితే ఇప్పుడు అందుబాటులో ఉంటున్న అధునాతన చికిత్సా విధానాల వల్ల ఆస్తమాను నివారించే అవకాశాలు కొంతవరకు ఉన్నాయి. శాశ్వత నివారణ సాధ్యంకాకపోయినా వయోజనుల్లో కనీసం పది సంవత్సరాల పాటు బాధ నుంచి ఉపశమనం కలిగించే చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా ఇన్‌హేలర్ల ద్వారా ఉపయోగించే మందులను నేరుగా శ్వాసమార్గంలోకి ప్రవేశపెట్టి నివారించవచ్చు. ఇవి శ్వాసమార్గంలో పేరుకుపోయిన మృదువైన కండరాల సాంద్రతను తగ్గిస్తాయి. దీనివల్ల శ్వాసమార్గాలు తెరుచుకుంటాయి. ఇన్‌హేల్ స్టెరాయిడ్స్ శ్వాసనాళాల వాపును తగ్గిస్తాయి. 90% ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఈ చికిత్స ద్వారానే ఉపశమనం పొందుతున్నారు. బ్రాంకియల్ థర్మోప్లాస్టీ పద్ధతి ద్వారా శాశ్వత చికిత్సకు మార్గాలు సుగమం అవుతున్నాయి. వాతావరణం ఈ వ్యాధి తీవ్రతను పెంచడంలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆస్తమా బారిన పడకుండా చూసుకోవచ్చు. సులభమైన సూచనలు పాటించడం ద్వారా కూడా ఆస్తమాను అరికట్టవచ్చు. ఉదాహరణకు.. దిండ్లపై దుమ్ము, ధూళి లేకుండా చూసుకోవాలి. కనీసం పదిహేను రోజులకు ఓ సారి పక్కబట్టలను మరుగుతున్న నీళ్లతో ఉతుకాలి. పెంపుడు జంతువులను పడకగదిలోకి, ఫర్నీచర్ పైకి రాకుండా చూసుకోవాలి. పడక గదిలో కార్పెట్లు వేయొద్దు. దూది బొమ్మలను పడకగదుల్లో పెట్టొద్దు. ఇంటి వాతావరణంలో తేమ అధికంగా ఉండకుండా చూసుకోవాలి. ఫ్లోరింగ్, బాత్రూమ్‌లను శుభ్రం చేసేందుకు ఘాటైన క్లీనర్లు, యాసిడ్స్ వాడకపోవడం మంచిది.


డాక్టర్. వై గోపీకృష్ణ
సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్

900
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles