వింత మనుషులు!


Thu,January 17, 2019 01:49 AM

మీరు నీళ్లలో నిండా మునిగి కండ్లు తెరిచి చూడగలరా? ఎంత ఎత్తు నుంచైనా భయపడకుండా అమాంతం కింద దూకేయగలరా? చలికి వణక కుండా ఆరుబయట తిరుగగలరా? ప్రాణవాయువు తక్కువగా వున్న ఎత్తైన ప్రదేశంలో హాయిగా జీవించగలరా?.. ఏంటీ ప్రశ్నలు అనుకుంటున్నారా? అసలు మనిషనేవాడు ఎవరైనా అలా ఉండగలరా? అని తిరిగి ప్రశ్నించాలనిపిస్తుందా? కొన్ని ప్రాంతాల్లో నివసించే కొన్ని జాతుల వాళ్లు అలా నీళ్లలో కూడా చూడగలరు. ప్రాణవాయువు తక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా హాయిగా బతికేయగలరు. వారి గురించి ఇంకా చాలా విశేషాలున్నాయి.
Siming

ఆ ముచ్చట్లన్నీ.. ఈ రోజు విశేషలో మీకోసం..

ముఖం కడుక్కునేటప్పుడు కళ్లలో నీళ్లు పడుతాయేమో అని కళ్లు మూసుకొని కడుక్కుంటాం. కంటిలో ఏదైనా చిన్న వస్తువు పడినా తల్లడిల్లిపోతాం. కానీ మాకెన్ జాతి ప్రజలు అలా కాదు. సముద్రంలో నిండా మునిగి కళ్లు తెరిచి చేపలను వేటాడుతారు. అసలు మామూలు మనుషులకు నీళ్లలో మునగగానే కళ్లు సరిగ్గా కనిపించవు. అన్నీ మసక మసకగా కనిపిస్తుంటాయి. కానీ మాకెన్ జాతి వారికి ఆ సమస్య ఉండదు. బయట మనకు దృశ్యం ఎలా కనిపిస్తుందో.. నీళ్లలో కూడా వారికి స్పష్టంగా కనిపిస్తుంది. అండమాన్ తీర ప్రాంతాల్లో నివసించే మాకెన్ జాతి ప్రజల ప్రత్యేకత ఇది. మూడు తెగల కలయికతో ఈ మాకెన్ జాతి ఏర్పడింది. నీటిలో ఉండే గుర్రాలను పోలిన జంతువులను నీటి గుర్రాలు అని పిలిచినట్టు.. ఆ చుట్టుపక్కల ఇతర తెగల ప్రజలు వీరిని నీటి మనుషులు అని పిలుస్తారు. వీరు భూమ్మీద కంటే నీటిలోనే ఎక్కువగా సంచరిస్తారు. చేపలు, తిమింగలాలు, కొన్నిరకాల నీటిజీవులు మాత్రమే నీళ్లలో కూడా దూరంగా ఉన్న వస్తువులను కూడా స్పష్టంగా చూడగలవు. ఈ మాకెన్ జాతి ప్రజలు పుట్టుకతోనే ఆ లక్షణంతో పుట్టారు. 2003లో కరెంట్ అనే బయాలజీ మ్యాగజైన్ వారు జరిపిన ఓ అధ్యయనంలో వీరి గురించి చర్చ జరిగింది.

ఎత్తంటే వీరికి ఎంతో ఇష్టం..

Siming1
కొంతమంది ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి చూడాలంటే భయపడిపోతారు. మరికొంతమంది అసలు ఎత్తైన ప్రాంతానికి వెళ్లాలంటేనే వణికిపోతారు. కానీ. హిమాలయాల్లో ఉండే ఆండియన్ జాతి ప్రజలు ఇందుకు భిన్నం. సముద్రమట్టానికి ఐదువేల అడుగుల ఎత్తులో కూడా వీరు హాయిగా జీవించేస్తారు. అంత ఎత్తైన ప్రదేశంలో ప్రాణవాయువు తక్కువగా ఉంటుంది. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ వీరు మాత్రం ఆడుతూ పాడుతూ బతికేస్తారు. ఇంతకీ ఇక్కడ రహస్యమేంటో తెలుసా.. వీరిలో ఊపిరితిత్తుల సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు ఒక్కసారి శ్వాస తీసుకుంటే శరీరానికి అవసరమైన దాని కంటే ఎక్కువ ఆక్సీజన్ అందుతుంది. దీంతో ఎక్కువసేపు శ్వాస తీసుకోకుండా ఉండగలరన్నమాట. పుట్టుకతోనే పర్వత ప్రాంతాల్లో, ఎత్తైన ప్రాంతాల్లో పెరుగడం వల్ల వీరు ఈ లక్షణాలతో అతీంద్రియ శక్తులున్న మనుషుల్లా బతికేస్తున్నారు.

వీరి ఎముకలు స్టీల్ కంటే దృఢం..

Siming2
వయసు మీద పడుతున్న కొద్దీ ఎముకల్లో బలం తగ్గిపోతుంది. ఏ మాత్రం పట్టు తప్పి కిందపడినా.. కాలో, చెయ్యో విరుగడం ఖాయం. విరిగిన ఆ ఎముకను మళ్లీ అతికించడమంటే ఇసుకలోంచి నూనె తీసినంత కష్టం. కానీ.. ఆఫ్రికా ఖండానికి చెందిన ఆఫ్రికేనర్ అనే జాతి ప్రజలు దీనికి భిన్నం. వారి జన్యువుల్లో ఎస్‌ఓఎస్‌టీ అనే జన్యువు పుష్కలంగా ఉంటుంది. వయసు మీద పడుతున్న కొద్దీ మామూలు మనుషుల్లో జన్యువుల పనితీరు, ఉత్పత్తి మందగిస్తుంది. కానీ వీరిలో మాత్రం మరింత ఉత్సాహంగా జన్యువులు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల వారి శరీరాల్లో స్క్లెరాస్టిన్ అనే ప్రొటీన్ ఉత్పత్తి అవుతుంది. అది కాస్త ఎముకల దృఢత్వానికి, శరీరం భారీగా, దృఢంగా మారడానికి దారి తీస్తుంది. అందుకేనేమో.. చాలామంది ఆఫ్రికా జాతుల వారు భారీ కాయాలతో కనిపిస్తారు.

చలినే వణికిస్తారు..

Siming3
ప్రస్తుతం బయట ఎంత చలిగా ఉందో మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు పడిపోతేనే మనం ఓ.. వణికిపోతున్నాం. ఎందుకంటే మన శరీరం 35 నుంచి 37 సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుంది. అంతకన్నా ఉష్ణోగ్రత తగ్గితే శరీరం వణకడం మొదలుపెడుతుంది. అయితే.. దీనికి భిన్నంగా ఆర్కిటిక్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు గడ్డకట్టే చలికి అలవాటు పడిపోయారు. వీరిని ఇన్యూట్స్, నెనెట్స్ అంటారు. ఇతర ప్రాంతాల ప్రజల కంటే వీరి శరీర ధర్మం భిన్నంగా ఉంటుంది. వీరి చర్మంలో స్వేదగ్రంథులు తక్కువగా ఉంటాయి. వీరి చర్మం ఇతర జాతుల చర్మం కంటే వేడిగా ఉంటుంది. వీరి శరీరంలో జీవక్రియలు కూడా చాలా వేగంగా జరుగుతాయి. అందుకే వీరిని చలి ఏమీ చేయలేదు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా వీరు హాయిగా ఆడుతూ పాడుతూ గడిపేస్తారు. ఈ ఇన్యూట్స్, నెనెట్ జాతి ప్రజలకు ఈ లక్షణం జన్యుపరంగా సంక్రమించింది. వారి ప్రాంతానికి వెళ్లి వారిలా జీవించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ప్రాణాలు గడ్డకట్టుకుపోతాయి.

ప్రవీణ్‌కుమార్ సుంకరి

746
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles