జగత్తును నడిపించేది నారాయణ మంత్రమే!


Thu,January 3, 2019 12:46 AM

భగవంతుణ్ణి గుర్తించి, ఆయన మార్గాన్ని ఆర్తులకు అందించే వాడే ఆచార్యుడు. ఆచార్యుడు భగవంతునికి తండ్రి వంటి వాడు. మంత్రం తల్లి వంటిదని చిన జీయర్ స్వామి తెలిపారు. మంత్రాలలో రెండు రకాలున్నాయి. వాటిలో వ్యాపక మంత్రాలు, అవ్యాపక మంత్రాలు. వ్యాపకములంటే భగవంతుడు అంతటా ఉంటాడని చెప్పేవి, అవ్యాపక మంత్రాలంటే దేవునిలో ఉండే ప్రత్యేక లక్షణాలను వివరించేవని స్వామి వారు పేర్కొన్నారు.
swamy
ధనుర్మాస మహోత్సవాలు భాగ్యనగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు నివాసంలో త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఈ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. బుధవారంతో ధనుర్మాసోత్సవాలు 18వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో జూపల్లి రామేశ్వరరావుతోపాటు ఆయన సతీమణి శ్రీకుమారి, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.కృష్ణలో కృష్‌అంటే చాలా లేదా గొప్ప ణ అంటే ఆనందం. గొప్ప ఆనందం కలవాడు, ఇచ్చువాడు అని కృష్ణుని అర్థాన్ని చిన జీయర్ స్వామి సవివరంగా చెప్పారు. ప్రతి మంత్రానికి ప్రత్యేకమైన వివరణ ఉంటుందని ఆయన తెలిపారు. మంత్రంలో ఉండే అక్షరాలనే అవయవాలంటారని, శాస్ర్తాల్లో వాటికి ఎంతో ప్రాధాన్యం ఉందని స్వామి వారు పేర్కొన్నారు. మంత్రాలన్నీ భగవంతుని వ్యాపకత్వాన్ని చెబుతాయి. పరమాత్ముని గురించి చెప్పే శబ్దమే మంత్రమని, అంతటా ప్రకాశించే వాడు, అంతటా ఉండేవాడు భగవంతుడు అని స్వామి పేర్కొన్నారు.


తెలుసుకోవడానికి ఉపకరించేదే మంత్రం. అవ్యాపకాలన్నింటి సంగతి పక్కన పెడితే, వ్యాపకాలుగా కీర్తించే విష్ణు, వాసుదేవ, నారాయణ అనే మూడు మంత్రాలున్నాయి. విష్ణు, వాసుదేవ అనే వ్యాపకాల్లో వ్యాచ్యంగా తెలిపే శక్తి వాటిలో లేకపోవడం వల్లనే వేద పండితులు ఉపాసన చేయతగిన మంత్రాలుగా పరిగణించలేదని స్వామి వారు వివరించారు. అన్ని రకాలుగా కలిగే జిజ్ఞాసకు, అన్ని రకాల సందేహాలకు సమాధానం ఇవ్వగలిగే శక్తి నారాయణ మంత్రంలో ఉందని, దేవుడు ఎందులో ఉంటాడో, ఎందుకుంటాడో, ఎలా ఉంటాడో, ఎప్పుడుంటాడో వంటి సందేహాలను సమగ్రంగా తీర్చేది నారాయణ మంత్రమేనని చిన్న జీయర్ స్వామి వివరించారు. ఋషులందరికీ గురువు వంటివాడు వేదవ్యాసుడు కూడా మంత్రాల్లో అత్యంత ప్రభావం చూపేది ఒక్క నారాయణ మంత్రమేనని చెప్పారని స్వామి అన్నారు. వైదీకులెవరైనా ఈ మంత్రాన్ని అంగీకరించవలసిందేనని, ఇది ఎన్నోసార్లు రుజువైందని, జగత్తునంతటినీ నడిపించే శక్తి నారాయణ మంత్రానిదేనని ఆయన అన్నారు. పూర్వ కాలంలో రాజులు గురుకులాలను, గురువులను పోషించేవాళ్ళు. గురువులు తమ శిష్యులకు ఎటువంటి రుసుము వసూలు చేయకుండానే జ్ఞానాన్ని అందించేవారు. ఆత్మ జ్ఞానం శాశ్వతమైంది. అది గురువు ఇచ్చే మంత్రం ద్వారానే లభిస్తుందని,అటువంటి మంత్రాన్ని రైతు కుమారుడికైనా, రాజుకుమారుడికైనా ఒకేలా అందించి వారిని మంచి ప్రయోజకులుగా తీర్చి దిద్దవచ్చని స్వామివారు పేర్కొన్నారు.

కాత్యాయిని వ్రత మహిమ

swamy1
పెళ్ళి కాని పడుచులు తమకు మంచి భర్తని ప్రసాదించమని పార్వతీ దేవిని వేడుకుంటూ, పాటలు పాడే ఒక సాంప్రదాయం ఉంది. దీనిని కాత్యాయినీ వ్రతం అంటారు. ఆ కోవకు చెందిందే తిరుప్పావై వ్రతం కూడా. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని భర్తగా కోరుకుంటూ గోపికా యువతులంతా ఈ వ్రతాన్ని ఆచరించారన్నది ఆండాళ్ నమ్మకం. శ్రీవైష్ణవులు ఏడాది పొడుగునా, ప్రతి దినం తమ ఇండ్లలో, దేవాలయాల్లో విధిగా గోదాదేవి పాశురాలను పఠిస్తారు. ధనుర్మాసంలో పాడే ఈ పాటలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒక్కొక్క పాశురం ఒక్కో రోజు గానం చేస్తుంటారు. గోదాదేవి రెండు ప్రబంధాలను పాడింది. వాటిలో తిరుప్పావై ప్రబంధం ఒకటి, ఇందులో 30 పాశురాలున్నాయి.తిరుప్పావై, ధనుర్మాసంలో శ్రీవైష్ణవులు ఆచరించవలసిన కొన్ని వైష్ణవ ధర్మ నియమాలను నిర్దేశిస్తుంది. దేశమంతటా శ్రీవైష్ణవులు భగవంతుని కృప, శాంతి, సౌఖ్యాలను కోరుకుంటూ గోదాదేవి పాశురాలను గానం చేస్తారు. ఆండాళ్ తన చెలులతో కలిసి, శ్రీకృష్ణుడిని భర్తగా పొందడం కోసం తిరుప్పావైని గానం చేస్తూ, ముప్పై రోజులు కఠిన వ్రతం ఆచరించింది. అయితే, తిరుప్పావైని ధనుర్మాసంలోనే కాకుండా ఎప్పుడైనా పఠించవచ్చని పండితులు చెబుతున్నారు. గోదాదేవి ఐదు పాశురాలు ఉపోద్ఘాతం, తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే సమృద్ధిగా వానలు కురుస్తాయి. తద్వారా పంటలు బాగా పండి ప్రజలంతా సుభిక్షంగా ఉంటారు. ధనుర్మాసంలో శ్రీకృష్ణుడిని పూజిస్తే, పాపాలు నశిస్తాయని గోదాదేవి నమ్మింది. తర్వాతి పది పాశురాల్లో గోదాదేవి వైష్ణవ అవతారాలను పొగుడుతూ వ్రతమాచరించేందుకు తన చెలులను మేల్కొల్పుతుంది. మరో ఐదు పాశురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. అంతే కాకుండా, భగవంతుడిని నిద్ర నుంచి మేల్కొల్పడానికి ఆండాళ్ తల్లి సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. చివరి తొమ్మిది పాశురాలు భగవదనుభూతిని వర్ణిస్తాయి. చివరి పాశురంలో గోదాదేవి ఎవరు? ముప్పై పాశురాలను భక్తితో గానం చేస్తే ఎటువంటి మేలు చేకూరుతుంది? వంటి విషయాలను సవివరంగా తెలుపుతుంది గోదాదేవి తల్లి.

పసుపులేటి వెంకటేశ్వరరావు

1490
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles