సూపర్!


Thu,December 6, 2018 01:56 AM

vantalu
చలి పెరిగినా.. ముసురు పడినా.. గొంతు పట్టేసినా.. జ్వరంతో నాలుక చప్పబడినా.. వేడి వేడి సూప్ జుర్రుకోవాలనిపిస్తుంది.. హోటల్ వెళ్లినప్పుడు మాత్రం తినడానికి ముందు.. ఒక సిప్ అయినా గొంతులోకి జారాల్సిందే! చికెన్.. మటన్.. వెజిటేబుల్స్ చేసే.. ఆ సూపర్ సూప్ మీకోసం..

చికెన్ సిల్వర్ సూప్

chicken-silver

కావాల్సినవి :

చికెన్ : 100 గ్రా., క్యారెట్ : 1, క్యాబేజీ : 10 గ్రా., అల్లం : 10 గ్రా., పచ్చిమిరపకాయలు : 2, కోడిగుడ్డు : 1, చక్కెర : ఒక టీస్పూన్, వెనిగర్ : ఒక టీస్పూన్, కార్న్ : 10 గ్రా., ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

కోడిగుడ్లను గిలక్కొట్టి పెట్టుకోవాలి. క్యాబేజ్, క్యారెట్ కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి క్యాబేజ్, క్యారెట్ చికెన్, ఉప్పు, వెనిగర్, చక్కెర, కాస్త నూనె, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసి బాగా ఉడికించాలి. ఇవి బాగా ఉడికిన తర్వాత కార్న్ వేసి కలుపాలి. ఇప్పుడు గిలక్కొట్టి పెట్టిన కోడిగుడ్డును ఉడుకుతున్న సూప్ పోసుకోవాలి. నురుగలాగా పైకి తేలేవరకు కలుపుతుండాలి. అలా వచ్చిన తర్వాత దించేస్తే సరిపోతుంది. వేడిగా ఈ సూప్ లాగించేయాలి.

చికెన్ కొరియాండర్ సూప్

chicken-lemon

కావాల్సినవి :

చికెన్ బ్రెస్ట్ : 100 గ్రా., కొత్తిమీర : ఒక కట్ట, నిమ్మకాయ : 1, పసుపు : చిటికెడు, చక్కెర : ఒక టీస్పూన్, క్యారెట్ : 1, క్యాబేజ్ : 10 గ్రా., కార్న్ : 10 గ్రా., దాల్చిన చెక్క : 5 గ్రా.,
ఉప్పు : తగినంత

తయారీ :

ఒక గిన్నెలో నీళ్లు తీసకొని అందులో చికెన్, ఉప్పు, చక్కెర, కొత్తిమీర, క్యారెట్, క్యాబేజ్, పసుపు వేసుకొని ఉడికించాలి. కొద్దిగా కార్న్ నీళ్లలో కలుపుకొని తగినంత వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు ఉడికించి నిమ్మకాయ రసం పోసుకొని దించేయాలి. వేడిగా తాగితే సూపర్ ఉంటుంది.

మటన్ యాక్నీ సూప్

mutton-yakni

కావాల్సినవి :

మటన్ : 200 గ్రా., ఇలాయిచీలు : 4, మిరియాలు : 10 గ్రా., దాల్చిన చెక్క : 10 గ్రా., పసుపు : చిటికెడు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్, కొత్తిమీర : ఒక కట్ట, మైదా : 10 గ్రా., చక్కెర : 10 గ్రా., నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

గిన్నెలో నూనె వేసి మటన్ కాస్త వేయించాలి. దీంట్లో దాల్చిన చెక్క, ఇలాయిచీలు, మిరియాలు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, చక్కెర వేసి కొద్దిగా వేగనిచ్చి నీళ్లు పోయాలి. బాగా ఉడికేంత వరకు ఉంచాలి. చివరగా మైదా వేసి ఉండలు కట్టకుండా కలిపి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. నోరూరించే సూప్ తయారైంది.

మటన్ బాల్స్ సూప్

mutton-mint-balls

కావాల్సినవి :

మటన్ ఖీమా : 100 గ్రా.,
దాల్చిన చెక్క : 10 గ్రా.,
ఇలాయిచీలు : 4,
మిరియాలు : 10 గ్రా.,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : ఒక టీస్పూన్,
పసుపు : పావు టీస్పూన్,
కొత్తిమీర : ఒక కట్ట,
నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

ఖీమాను బాగా కడిగి కాస్త ఉప్పు వేసి ఉడికించి పెట్టుకోవాలి. వీటిని కాస్త చల్లారనిచ్చి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. వీటిని కడాయిలో నూనె పోసి కొద్దిగా వేయించుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో దాల్చిన చెక్క, ఇలాయిచీ, మిరియాలు, పసుపు, ఉప్పు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర వేసి బాగా ఉడికించాలి. దీన్ని మరో గిన్నెలోకి వడ కట్టుకోవాలి. దీంట్లో ముందుగా రెడీ చేసుకున్న మటన్ బాల్స్ వేసి కాసేపు ఉంచి మళ్లీ మరిగించి దించేయాలి. వేడిగా ఈ సూప్ జుర్రుకుంటే ఆ టేస్టే వేరు.

వెజ్ జింజర్ సూప్

veg-ginger

కావాల్సినవి :

క్యారెట్ : 1, బీన్స్ : 2, కాలీఫ్లవర్ : 4 ముక్కలు, అల్లం : పెద్ద ముక్క, తేనె : ఒక టీస్పూన్, చక్కెర : ఒక టీస్పూన్, ఉప్పు : తగినంత

తయారీ :

క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో కట్ చేసిన ముక్కలను వేయాలి. అందులో ఉప్పు, చక్కెర వేసి ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత బౌల్లో వేసి తేనె పోసి సర్వ్ చేయాలి. రుచికరమైన వెజ్ జింజర్ సూప్ తయార్!

జి.యాదగిరి
కార్పొరేట్ చెఫ్
వివాహభోజనంబు రెస్టారెంట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
పార్క్ సికింద్రాబాద్

894
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles