అమ్మకు నైవేద్యం!


Thu,October 11, 2018 12:28 AM

vantalu
నవరాత్రుల్లో.. అమ్మలనుగమ్మ అమ్మ దుర్గమ్మ.. నవరూపాల్లో దర్శనమిస్తుంది.. ఒక్కో రోజు.. ఒక్కో నైవేద్యంతో అమ్మను పూజిస్తారు.. పులిహోర.. పరమాన్నం.. చలివిడి.. పానకాలు.. ప్రతి పండుగలకు పూజలో ఉంచడం పరిపాటి.. వీటితో పాటు ఈ నైవేద్యాలను చేయండి.. అమ్మను ప్రసన్నం చేసుకొని.. కోరిన కోరికలు నెరవేర్చుకోండి..

అల్లం గారెలు


కావాల్సినవి : -
మినపపప్పు : 2 కప్పులు, పచ్చిమిరపకాయలు : 10, అల్లం : పెద్ద ముక్క, ఉప్పు, నూనె : తగినంత
garelu
తయారీ : -మినపపప్పును నీళ్లు పోసి మూడు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీళ్లు వంపేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కట్ చేయాలి. అల్లం పొట్టు తీసి చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు మినపపప్పులో, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఒక గిన్నెలోకి వేయాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బట్ట మీద వేసి తడి చేసుకుంటూ ఒత్తుకోవాలి. మధ్యలో రంధ్రం చేసి నూనెలో ఒక్కొక్కటిగా వేయించాలి. దీన్ని అల్లం, కొబ్బరి చట్నీతో తినొచ్చు. అంతకుముందు అమ్మకు నైవేద్యంగా సమర్పించడం మరువొద్దు.

కేసరి పూర్ణాలు


కావాల్సినవి : -
మినపపప్పు : ఒక కప్పు, బియ్యం : 2 కప్పులు, రవ్వ : ఒక కప్పు, చక్కెర : ఒక కప్పు, యాలకుల పొడి : ఒక టీస్పూన్, నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు : చిటికెడు, నూనె : తగినంత
kesari-poornalu
తయారీ : -మినపపప్పు, బియ్యం కలిపి కడిగి మూడు గంటల పాటు నానబెట్టాలి. వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేసి దోశ మిశ్రమంలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. దీంట్లో రవ్వ పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతుండాలి. సన్నని మంట మీద ఉంచి రెండు నిమిషాల పాటు కలుపాలి. ఇందులోనే చక్కెర వేసి మరో నిమిషం కలిపి యాలకుల పొడి, నెయ్యి వేసి దగ్గరగా అయ్యేవరకు కలుపుతుండాలి. ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. ఆ తర్వాత కేసరి మిశ్రమాన్ని మినపపప్పు మిశ్రమంలో ముంచి నూనెలో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.

పెసరపప్పు పాయసం


కావాల్సినవి : -
పెసరపప్పు : 3/4 కప్పు
పాలు : 3 కప్పులు
చక్కెర : 2 కప్పులు
జీడిపప్పు : 10
కిస్‌మిస్ : 10
యాలకులు : 4
నెయ్యి : ఒక టీస్పూన్
payasam
తయారీ : - కుక్కర్‌లో పెసరపప్పు వేసి రంగు మారేవరకు వేయించాలి. ఇందులో ఒక కప్పు పాలు, అర కప్పు నీళ్లు పోసి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. దీన్ని పప్పు గుత్తితో మెత్తగా చేయాలి. ఇందులో యాలకులను పొడి చేసి వేయాలి. ఇందులో పాలు, చక్కెర వేసి కలుపుకోవాలి. సన్నని మంట మీద కాసేపు అలాగే ఉంచాలి. ఈలోపు కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌లను వేసి వేయించాలి. వీటిని పెసరపప్పు మిశ్రమంలో వేసి కలిపి దించేయాలి. టేస్టీ పెసరపప్పు పాయసం మీ ముందుంటుంది.

కట్టె పొంగలి


కావాల్సినవి : -
బియ్యం : 3/4 కప్పు
పెసరపప్పు : పావు కప్పు
మిరియాలు : అర టీస్పూన్
అల్లం తురుము : ఒక టీస్పూన్
పచ్చిమిరపకాయలు : 4
జీలకర్ర : ఒక టీస్పూన్
జీడిపప్పులు : 10
కరివేపాకు : 2 రెమ్మలు
నెయ్యి : 5 టీస్పూన్స్
ఇంగువ : కొద్దిగా
ఉప్పు : తగినంత
katte-pongal
తయారీ : - బియ్యం, పెసరపప్పులను విడిగా కడిగి పెట్టుకోవాలి. ఈ రెండింటినీ కలిపి మూడు కప్పుల నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచాలి. ఈలోపు మిరియాలను పొడిచేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను చిన్నగా కట్ చేసుకోవాలి. కడాయిలో నెయ్యి వేసి జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి వేయించాలి. దీంట్లోనే జీడిపప్పు వేసి గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, మిరియాల పొడి, ఇంగువ వేసి రెండు సెకన్లు ఉంచి దించేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నం మిశ్రమంలో వేసి, ఉప్పు వేసి కలుపాలి. అంతే.. కట్టె పొంగలి రెడీ!

1008
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles