జయహో మహిళ!


Wed,March 7, 2018 11:52 PM

అవనిలో సగం.. హక్కుల్లో సగం అయిన మహిళలు అగ్రభాగాన మేము అని నిరూపించుకొని సత్కరించుకుంటున్న పురస్కారాల జాతర నేడే. సాధికారత అనే ఉమ్మడి లక్ష్యం కోసం కృషి చేస్తున్న స్త్రీశక్తిని సన్మానించుకొనే పండుగ ఇది. చిన్నప్పుడు చందమామ కథలతో స్ఫూర్తి పొంది అద్భుత సాహిత్యాన్ని అందిస్తున్న బాల సాహితీవేత్త సిరిబాల.. అస్తిత్వ పోరాటానికి అద్భుత కథనాలతో మద్దతునిచ్చి మహిళల్ని తెలంగాణ ఉద్యమంలో ఏకం చేయడంలో భాగస్వామి అయిన సౌమ్య నాగపురి.. మూడో తరగతిలోనే పెండ్లి చేస్తే.. అష్టకష్టాలు పడి విద్యావేత్తగా ఎదిగిన చక్రవర్తుల లక్ష్మీ నర్సమ్మ.. అందరికీ మెరుగైన వైద్యం అందించాలని న్యాచురోపతీ చదివి సామాజిక సేవలందిస్తున్న సత్య లక్ష్మీ.. మహిళలు కూడా ఫైన్ ఆర్ట్స్‌లో రాణిస్తారని నిరూపించిన కవితా దర్యానీరావ్.. ఉపాధిహామీ పథకంలో భాగంగా రాళ్లెత్తి మట్టితవ్వి పలుగుపార పట్టిన బొగ్గం జయమ్మ.. రైళ్లో ప్రయాణించే అవకాశాలే లేకున్నా రైలును నడిపేదాకా వెళ్లిన సుప్రియ సనమ్.. వడ్డెర సామాజిక వర్గంలో పుట్టి కష్టపడి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగిన రాజ్యలక్ష్మీ.. దేశరాజధానిలో ఆర్టీసీ బస్సు నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న సరిత.. ఫోన్ సిగ్నల్ కూడా లేని ఊళ్లో ఉంటూ సాధికారతా చైతన్యం తీసుకొస్తున్న యాప భద్రమ్మ సహా అవార్డులు అందుకుంటున్న మహిళామణులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.!
womens

lakshmi-narsamma

సమాజం పట్ల బాధ్యత పెరిగింది..

మహిళా దినోత్సవం సందర్భంగా నాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నది. మహాత్మాగాంధీ చనిపోయినప్పటి నుంచి నేను పద్య కవిత్వం రాయడం మొదలుపెట్టాను. ఈ క్రమంలో ఎన్నో పుస్తకాలు, పద్యకావ్యాలు, గేయాలు, కవితలు రాశాను. ప్రస్తుతం నాకు 76 యేండ్లు. ఇప్పటివరకు 25 పుస్తకాల వరకూ రాశాను. గోల్కొండ పత్రికలో నా కవితలు, పద్యాలు, గేయాలు ఎక్కువగా ప్రచురితమయ్యేవి. నా కృషిని గుర్తించిన ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా వంతుగా స్త్రీల చైతన్యం కోసం కష్టపడుతాను. ఎందుకంటే నేను మూడో తరగతిలో ఉన్నప్పుడే నాకు పెండ్లి చేశారు. అత్తారింట్లో ఎన్నో కష్టాలు పడ్డాను. తర్వాత స్వశక్తితో చదువుకొని ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఉపాధ్యాయినిగా, లెక్చరర్‌గా పనిచేశాను. ఎంతోమంది శిష్యులను సంపాదించుకున్నా. ఇలాంటి ప్రభుత్వం రావడం ఆనందంగా ఉన్నది.

rani

సిగ్నల్ రాని ఊరి నుంచి..

వందల మంది మహిళలను ఏకం చేసి వాళ్ల సాధికారత కోసం పనిచేస్తున్నాను. ఏమీ ఆశించకుండా ఎప్పటినుంచో ఈ పని చేస్తున్న. నిజాయితీగా పనిచేస్తున్న నాకు జాతీయ, అంతర్జాతీయ వేదికలు ఎక్కే అవకాశం దక్కింది. ఇప్పుడు మరో ప్రశంస. అభినందన. సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా సరిగ్గా రాని ఊర్లో నేను చేస్తున్న సేవను గుర్తించడం ప్రభుత్వం గొప్పతనాన్ని తెలుపుతుంది. నిరక్ష్యరాస్యురాలైన నా గురించి.. ఇప్పుడు పత్రికల్లో రాస్తున్నారంటే ఆనందంగా ఎందుకు ఉండదు. అదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అవార్డుల్లో నేను ఉన్నానంటే.. ఉబ్బితబ్బిబైపోయాను. ఈరోజు రాష్ట్ర రాజధానిలో పెద్ద వేదికపై విశిష్ట అవార్డు అందుకోవడం గర్వంగా అనిపిస్తున్నది. ముందు నమ్మబుద్ధి కాలేదు. ఈ అవార్డు అందుకోవడం ఒక్కటే కాదు.. మరింత మంది మహిళల సాధికారత కోసం కృషి చేస్తా.

boggam

మా పనికి తగిన గుర్తింపు..

మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముల్కలపల్లి మండలం జగన్నా థపురం.ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పనిచేసే మాలాంటి వాళ్లను గుర్తించడం చాలా సంతోషంగా ఉన్నది. ఉపాధి హామీ పనుల్లో మా శక్తికి తగ్గట్లుగా పనిచేశాం. మా ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పిన పనులన్నీ చేశాం. ఈ క్రమంలో చెరువులను బాగు చేసుకున్నాం. ఉపాధిహామీ పథకంతో కాల్వలు, చెరువుల్లో పూడిక తీశాం. చెరువులు బాగుపడ్డాయి. పంటలు మంచిగా పండుతున్నాయి. మా మెట్ట భూములను చదును చేసి, జామాయిల్, వరి పండిస్తున్నాం. మా గ్రామస్తులందరి సహకారంతో చెరువు నిర్మించుకున్నాం. పొలాల్లో మొద్దులు తొలిగించి, భూమి చదును చేసి పంటలు పండించుకున్నాం. మారుమూలల్లో ఉన్న మాలాంటి వారిని గుర్తించిన ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.

kanika

విద్యలో నూతన పద్ధతులు..

నాకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ఈ అవార్డు రావడం నా బాధ్యతను మరింత పెంచింది. గతంలో కొన్ని అవార్డులు వచ్చాయి. ప్రస్తుతం జేఎన్‌టీయూ ఫైన్ ఆర్ట్స్‌లో వైస్‌ఛాన్సలర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. ప్రస్తుతం విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో చదువు చెప్పడం చాలా ముఖ్యం. ప్రాక్టికల్‌గా కూడా ఎంతో కష్టపడాలి. విద్యార్థులకు నాణ్యమైన, మెరుగైన విద్యను అందించేందుకు కొత్త పద్ధతులను కనుగొన్నాం. దీంతో ఫైన్‌ఆర్ట్స్ విద్యార్థులు కొత్త తరహా విద్యాబోధనలో మెరుగ్గా తయారయ్యారు. విద్యారంగంలో నా సేవలను గుర్తించిన ప్రభుత్వానికి నేను రుణపడి ఉంటాను. నా జీవిత ప్రయాణంలో కుటుంబం, సహ ఉద్యోగుల ప్రోత్సాహం మరువలేనిది.

satya-lakshmi

అందరికీ మెరుగైన వైద్యం..

అందరికీ మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో చేస్తున్న కృషిని ప్రభుత్వం గుర్తించడం చాలా సంతోషంగా ఉన్నది. ఈ అవార్డు ద్వారా న్యాచురోపతికి మరింత వన్నె తెచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి వైద్యం చేయాలని కోరికగా ఉండేది. ఆ లక్ష్యంతోనే న్యాచురోపతి చదివాను. ఆ తర్వాత నల్లగొండ టౌన్‌లో క్లినిక్‌ను ఏర్పాటు చేశాను. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత రెడ్‌క్రాస్ సంస్థ నుంచి పిలుపురావడంతో.. ఆ సంస్థకు సంబంధించిన హాస్పిటల్‌ను నిర్వహించాను. నల్లగొండలో ఉన్నప్పుడే మహిళలు, సామాజిక సమస్యలపై పోరాడాం. బాధిత మహిళలకు అవసరమైన న్యాయ సలహాలు కూడా ఇచ్చేవాళ్లం. మాది నల్లగొండ జిల్లా. 2015 నుంచి పుణెలోని జాతీయ న్యాచురోపతి సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నాను. ప్రభుత్వం నా సేవలను గుర్తించండం ఆనందంగా ఉన్నది.

siri

భావితరాలకు పునాది

భావితరాలకు సాహిత్యాన్ని అందించడం కోసం నేను చేస్తున్న కృషికి ప్రభుత్వం నన్ను గుర్తించి అవార్డుతో గౌరవించడం చాలా సంతోషంగా ఉన్నది. ఇది బాలసాహిత్యానికి దక్కిన గౌరవం. చిన్నప్పుడు చందమామ కథలు చదివి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. ఆ పంథాను ఎంచుకొని కొన్ని పాఠశాలలను సందర్శించి.. ప్రస్తుతం చిన్నారులు స్ఫూర్తిపొందే విధంగా కథలు, నవలలు, పద్యాలు రాయడం మొదలు పెట్టాను. ప్రస్తుతం 13 పుస్తకాలు రాశాను. మరికొన్ని ప్రింటింగ్‌లో ఉన్నాయి. 200లకు పైగా ఈ-బుక్స్‌ను లాలీపాప్ అనే యాప్‌కు రాశాను. గేయాలు కూడా రాస్తుంటాను. మాది నల్లగొండ జిల్లా మిర్యాలగూడ. నేను చేసే ప్రతి పనినీ నా కుటుంబసభ్యులు ప్రోత్సహిస్తుంటారు. ప్రభుత్వం మాలాంటి వాళ్లను వెలికితీయడం మరింత ఆనందాన్ని ఇస్తున్నది.

rajya-lakshmi

ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా

వడ్డెర సామాజిక వర్గంలో పుట్టి పెరిగిన నేను ఈ రోజు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నాను. ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా నా వంతుగా ప్రయత్నిస్తున్నాను. గత ప్రభుత్వాలు గుర్తించని ఎన్నో కష్టాలను, సమస్యలను ఈ ప్రభుత్వం గుర్తించి పరిష్కరిస్తున్నది. కనీస అవసరాలుంటే పట్టించుకోని ప్రభుత్వాల కన్నా ఈ ప్రభుత్వం వెయ్యి పాళ్లు నయ్యం. వడ్డెర కులంలో పుట్టిన ఆడబిడ్డలకు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నదానికి ఎంత చెప్పినా తక్కువే. కబడ్డీ క్రీడాకారిణిగా మొదలైన నా కెరీర్, కాంట్రాక్టర్‌గా ఎన్నో మలుపులు తీసుకున్నది. స్వశక్తితో ఎదుగుతున్న నాలాంటి మహిళలకు అవార్డు ఇవ్వడం వల్ల ఎంతో మందికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల మరింత మంది నాలుగు గోడల మధ్యనే ఉండకుండా వేదికలపై మాట్లాడే స్థాయికి ఎదుగుతారు.

supriya

దశ తిరిగింది.. కాలం కలిసొచ్చింది

కష్టపడితే వచ్చిన ఫలితంతో పాటు సమాజంలో గుర్తింపు వస్తుంది. అందుకు ఉదాహరణ నేను. ఎక్కడో నిజామాబాద్‌లో పుట్టి పెరిగి ఎంటెక్ చదివి మెట్రో రైలు నియామకాల్లో లోకోపైలెట్‌గా ఎంపికయ్యాను. సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్ వంటి అంశాల్లో శిక్షణ పొంది మెట్రో రైలు నడుపడానికి అర్హత సాధించాను. అంతేకాదు.. ప్రధానమంత్రి మోడీ ప్రయాణించిన తొలి రైలును నడిపే అవకాశాన్ని దక్కించుకున్నాను. అప్పుడు పట్టరానంత ఆనందం వచ్చింది. జీవితంలో ప్రధాని కూర్చున్న మెట్రో రైలు నడుపడం ఒకింత సంతోషం అయితే నన్ను తెలంగాణ ప్రభుత్వం అవార్డుతో సన్మానించడం ఇంకింత సంతోషం. కష్టపడ్డప్పుడు గుర్తింపు వచ్చిన ఫలితం మజానిస్తున్నది. ఆ మజాను అనుభవించి నప్పుడు వచ్చే అనుభూతిని మాటల్లో చెప్పలేం. అక్షరాల్లో రాయలేం. ఏది ఏమైనా కాలం కలిసొచ్చింది అనుకుంటున్నా. ఇప్పటి నుంచైనా నా దశ తిరుగుతదని భావిస్తున్నా.

saritha

సరిహద్దులు దాటినా..

రాష్ట్ర రాజధాని సరిహద్దులు దాటి దేశ రాజధానిలో బస్సుల నడుపుతున్నాను. ఈ స్థాయికి చేరుకోవడానికి ఎదుర్కొన్న కష్టాలు ఈ సందర్భలో చెప్పుకోవడం సరికాదేమో. తెలంగాణ నుంచి ఢిల్లీలో మొదటి ఆర్టీసీ మహిళా డ్రైవర్‌గా సేవలందిస్తున్న నన్ను గుర్తించి అవార్డు ఇవ్వడం ఈ ప్రభుత్వం గొప్పతనం. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను గుర్తించి వాళ్లను ప్రోత్సహించడం అందరివల్ల కానిపని. అది చేయాలంటే గొప్ప మనసుండాలి. ఈ ప్రభుత్వానికి మనసుంది కాబట్టే ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నది. గతంలో తెలంగాణ ఆర్టీసీలో పనిచేయడానికి నేను సుముఖత చూపాను. ఆ విషయంలో ప్రభుత్వం మంతనాలు జరుపుతున్నది. సరిహద్దులు దాటి నా పని ఏదో నేను చేసుకుంటున్న క్రమంలో నాకు ఈ అవార్డు ఇవ్వడం కొండంత బలానిచ్చింది. అంతేకాదు.. కష్టానికి ప్రతిఫలం.. చేసిన పనికి గుర్తించి ఎంత దూరం ఉన్నా మన దగ్గరికి వస్తుందనే నమ్మకం కలిగింది.

sowmya

బాధ్యత పెరిగింది..

సృష్టికి మూలమైన స్త్రీని గౌరవించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచే ముందున్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ విభాగంలో అవార్డు నాకు ఇవ్వడం సంతోషంగా ఉన్నది. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. 2008లో ఆంధ్రజ్యోతితో ప్రారంభమైన నా ప్రస్థానం ఇప్పటి వరకు ప్రత్యేక కథనాలు రాస్తూ సాగుతున్నది. 2011లో ఉద్యమ పత్రిక వచ్చిన నమస్తే తెలంగాణలో ఫీచర్స్ డెస్క్‌లో జాయినయ్యాను. ఈ ఆరున్నరేళ్ల ప్రయాణంలో కొన్ని వేల కథనాలు రాశాను. అప్పటి నుంచి నమస్తే తెలంగాణ యాజమాన్యం, కుటుంబ సభ్యులు ప్రోత్సహిస్తూ వస్తున్నారు. మహిళల అభ్యున్నతికి కేసీఆర్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ అవార్డు నాలో బాధ్యతను పెంచడంతో పాటు మరిన్ని కథనాలను రాసేందుకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉన్నది.

1368
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles