చల్లని కాలంలో.. వెచ్చని సూప్స్!


Thu,December 7, 2017 01:56 AM

fud
ఉదయం.. సాయంత్రం.. సమయం ఏదైనా.. ఎంతటి వారైనా.. ఈ చలికి గడగడలాడుతున్నారు. చలి పులిలా వణికిస్తున్నది. అలా వణుకుతూ చల్లని పాయసాలు తినలేం కదా! అందుకే వేడి వేడి సూప్స్ అందిస్తున్నాం.. చల్లని చలిలో వెచ్చగా గడిపేందుకే ఈ సూప్స్.

మైసూర్ షోర్వా

maysoor

కావాల్సినవి :

సోయా ఆకులు : ఒక కట్ట, పచ్చి కొబ్బరి తురుము : ఒక టీస్పూన్, కొత్తిమీర : ఒక కట్ట, చింతపండు రసం : ఒక కప్పు, మిరియాల పొడి : ఒక టీస్పూన్, వెల్లుల్లి రెబ్బలు : 4, కరివేపాకు : 2 రెమ్మలు, నూనె : 2 టీస్పూన్స్, ఉప్పు : తగినంత

తయారీ :

ఒక గిన్నెలో పచ్చికొబ్బరి వేసి కొన్ని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇది పాల వలె చిక్కని ద్రవం తయారవుతుంది. దీన్ని వడకట్టి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో కొద్దిగా నూనె పోసి వెల్లుల్లి, సోయా ఆకులు, కరివేపాకు, చింతపండు రసం వేసి కాసేపు మరుగనివ్వాలి. ఆ తర్వాత ఆ కొబ్బరి పాలను పోయాలి. ఇందులో మిరియాల పొడి, ఉప్పు వేసి సన్నని మంట మీద కాసేపు మరిగించాలి. చివరగా కొత్తిమీర వేసి దించేయాలి.

చికెన్ సిల్వర్ సూప్

ci

కావాల్సినవి :

చికెన్ కీమా : 100 గ్రా., అల్లం ముక్కలు : ఒక టీస్పూన్, కీరా : చిన్న ముక్క, ఆలుగడ్డ : సగం, క్యారెట్ : 1, కార్న్‌ఫ్లోర్ : అర టీస్పూన్, పచ్చిమిర్చి : 2, నూనె : ఒక టీస్పూన్, గుడ్డు : 1, వెనిగర్ : ఒక టీస్పూన్, ఉప్పు : తగినంత

తయారీ :

కీరా, ఆలుగడ్డ, క్యారెట్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో నూనె పోసి తరిగిన అల్లం ముక్కలు, చికెన్, కీరా, క్యారెట్, ఆలుగడ్డ ముక్కలు, పచ్చిమర్చి వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తర్వాత నీళ్లు పోసి కార్న్‌ఫ్లోర్, వెనిగర్ వేసి మరుగనివ్వాలి. ఈలోపు కోడిగుడ్డు తెల్లసొనని మాత్రం ఒక గిన్నెలో తీసుకొని గిలక్కొట్టాలి. దీన్ని ఆ మరుగుతున్న సూప్‌లో పోసి, ఉప్పు వేసి కలుపాలి. అంతే.. చికెన్ సిల్వర్ సూప్ తయారైనట్లే!

మటన్ యెక్‌ని షోర్వా

mutton-yakni

కావాల్సినవి :

మటన్ : పావు కేజీ (బోన్), దాల్చిన చెక్క : 5 గ్రా., ఇలాయిచీలు : 5 గ్రా., మిరియాలు : 5 గ్రా., పుదీనా : ఒక కట్ట, కొత్తిమీర : ఒక కట్ట, క్యారెట్ ముక్కలు : ఒక టేబుల్‌స్పూన్, పసుపు : చిటికెడు, వేయించిన ఉల్లిపాయలు : ఒక కప్పు, వెల్లుల్లి : 10 రెబ్బలు, నెయ్యి : ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు : తగినంత

తయారీ :

ఒక గిన్నెలో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఇందులో మిరియాలు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు, క్యారెట్, ఇలాయిచీలు వేసి వేయించాలి. ఆ తర్వాత మటన్ నీళ్లు పోసి బాగా ఉడికించాలి. సన్నని మంట మీద కాసేపు ఉంచాలి. ఇందులో కొత్తిమీర, పుదీనా వేసి కాసేపటి తర్వాత దించేయాలి. గరం గరం షోర్వా మీ నోరూరిస్తుంది.

మింట్ మీట్ బాల్ సూప్

mint-meet

కావాల్సినవి :

మటన్ కీమా : 100 గ్రా., పుదీనా : ఒక కట్ట, వెల్లుల్లి ముక్కలు : ఒక టీస్పూన్, అల్లం : చిన్న ముక్క, కొత్తిమీర : ఒక కట్ట, వెన్న : ఒక టీస్పూన్, మిరియాల పొడి : అర టీస్పూన్, సోయా సాస్ : చిటికెడు,
ఉప్పు : తగినంత

తయారీ :

అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఒక గిన్నెలో కొద్దిగా వెన్న, అల్లం, వెల్లుల్లి, మిరియాల పొడి, ఉప్పు, మటన్ కీమా, సోయాసాస్ వేసి బాగా వేయించాలి. దీన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసి పక్కన పెట్టాలి. మరొక గిన్నెలో వెన్న వేసి వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా సరిపడినంత నీరు పోసి మరిగించాలి. మరుగుతన్న వాటిలో ముందుగా చేసుకున్న కీమా బాల్స్ వేసి దించేయాలి. దీన్ని వేడిగా లాగిస్తేనే బాగుంటుంది.
yadagiri

623
Tags

More News

VIRAL NEWS