తృణ ధాన్యాల.. అహోబిలం!


Thu,October 12, 2017 01:48 AM

కొన్ని రెస్టారెంట్లు అద్దాలమేడల్లా ఉంటాయి. కానీ.. వాటిల్లో కూర్చొని తింటే కృత్రిమంగా అనిపిస్తుంటుంది. అలా కాకుండా ఎంచక్కా తడకల్లో.. వెదురు బొంగుల్లో కూర్చుని తృణధాన్యాలు తింటే ఎలా ఉంటుంది? మస్త్ మజా ఉంటుంది కదా?! అయితే ఒకసారి అహోబిలం వెళ్లాల్సిందే. వెదురుతో చేసిన తడకలు.. తృణధాన్యాలతో చేసిన ఆహారం.. పచ్చని పందిరి చాలా ఉంటాయి ఇక్కడ. ఇంటీరియర్ చూసి రెస్టారెంట్‌ను చూడాలనే కొత్త ఆలోచనకు వేదికవుతున్న అహోబిల రెస్టారెంట్ రివ్యూ ఇది.
Hotal
ఆళ్లగడ్డలోనే కాదు.. హైదరాబాద్‌లోనూ అహోబిలం ఉంది. ఎక్కడా అనుకుంటున్నారా? హైటెక్‌సిటీలో. కాకపోతే ఇదొక రెస్టారెంట్. మామూలు రెస్టారెంట్ కాదు. మనిషి మనసును మార్చేసే.. కస్టమర్ ఆరోగ్యానికి బాధ్యత వహించే రెస్టారెంట్. అహోబిలం రెస్టారెంట్లో ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన వాతావరణం కనిపిస్తుంది. పచ్చని చెట్ల పందిరి.. పరిశుభ్రమైన గాలి తాకి మనసు పులకించిపోతుంది. సహజ సిద్ధమైన ఆహారంతో పాటు వారు పండించిన ధాన్యాలూ లభిస్తాయి. కేవలం టిఫిన్స్.. లంచ్.. డిన్నర్ కాకుండా తృణధాన్యాలతో చేసిన స్వీట్లు కూడా ఆహా అనిపిస్తాయి. దీన్నిచూస్తే ఇదో తృణధాన్యాల గృహంగా కనిపిస్తున్నది.సౌత్ ఇండియన్.. నార్త్ ఇండియన్.. ఇటాలియన్.. ఆఫ్ఘానీ.. బిర్యానీ.. కబాబ్స్ ఇలా రకరకాల వెరైటీల్లో వంటలు చూసే ఉంటారు. తినే ఉంటారు కూడా. అయితే చిరుధాన్యాల వంటలు ఎప్పుడైనా తిన్నారా? అదికూడా వందశాతం సేంద్రీయ ఆహారంతో పూర్తి శాఖాహార వంటలైతే ఎలా ఉంటుంది? రెగ్యులర్‌గా పిజ్జాలు.. బర్గర్లు తినీతినీ బోర్‌కొట్టినట్లనిపించేవాళ్లకు అహోబిలం రెస్టారెంట్ ద్వారా సాంత్వన పొందవచ్చు. ఆరోగ్యం.. ఆహ్లాదం కలగలిసి చక్కని వంటకాన్ని అందిస్తూ అందరి మన్ననలనూ పొందుతున్నది అహోబిలం రెస్టారెంట్.

సేంద్రీయ స్టోర్:

అహోబిలం రెస్టారెంట్ 2013లో ప్రారంభమయింది. ఆరులక్షల పెట్టుబడితో మాదాపూర్‌లో ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. తృణధాన్యాలు ఆరోగ్యాన్నిస్తాయని తెలుసు కానీ అవి రుచికరంగా ఉండవని అనుకుంటారు. ఈ అభిప్రాయాన్ని కొట్టిపడేయాలని తూర్పు గోదావరిలో పండించిన తృణధాన్యాలు తీసుకొచ్చి, వివిధ వంటకాలను బాగాచేసే ఐదారుగురు వంటవాళ్లతో వండించడం మొదలుపెట్టారు. మొదట్లో కస్టమర్లు చాలా తక్కువ వచ్చేవారు. జనాల్లో దీనిమీద మంచి అభిప్రాయం ఏర్పడింది. వ్యాపారం చేయాలి. ప్రస్తుతం ఈ రెస్టారెంట్‌కు 35 వయసు దాటిన వారే ఎక్కువ వస్తుండడంతో యూత్‌ని కూడా రప్పించాలని కుకీస్.. బర్గర్లు కూడా ధాన్యాలతో చేయబోతున్నారు. అవి దీపావళికి లాంచ్ చేయనున్నారు. వ్యాపారాన్ని, వ్యాపకాన్ని నడిపించాలి. రెండు ఎలా సాధ్యమవుతాయి? అనే ప్రశ్నకు అహోబిలం అధినేత్రి హేమమాలిని జవాబిస్తూ ఆర్గానిక్ స్టోర్ ద్వారా వ్యాపారాన్ని మొదలుపెట్టి హోటల్ పెట్టి దాని ద్వారా వ్యాపకాన్ని భర్తీ చేసుకుంటున్నారామె.

మట్టి పాత్రలు:

మట్టి పాత్రల్లో తిని ఎన్నాళ్లయిందో గుర్తు తెచ్చుకోండి. మన పాత తరాల వాళ్లు మట్టి పాత్రల్లోనే వండుకొని తినేవాళ్లు. కాలక్రమేనా అది అంతరించిపోయింది. మన మూలాల్ని వెతుక్కుంటే ఈతరం మళ్లీ గ్రామీణ వాతావరణం కోసం పరుగులు తీస్తున్నారు. అలాంటి ఫీల్ ఇవ్వడం కోసం ఇక్కడ మట్టి పాత్రల్లోనే వండడం.. వడ్డించడం చేస్తున్నారు. అంతేకాదు తాగే నీళ్ల గ్లాసులు, కూజాలు కూడా మట్టివే పెట్టి కస్టమర్లను ఆకట్టుకుంటూ ఆనందాన్ని.. ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. పొద్దున టిఫిన్స్.. తృణ ధాన్యాలతో చేసిన ఇడ్లీలు.. దోశలు.. ఉప్మా.. పకోడీ ఉంటాయి. మధ్యాహ్నం లంచ్‌కి జొన్న రొట్టెలు.. దంపుడు బియ్యంతో చేసిన అన్నం.. సాంబర్ రైస్.. రాగి సంకటి.. బొబ్బర్ల పులుసు వంటి ఎన్నో ప్రత్యేక వంటలు సిద్ధం చేస్తారు. కాలంతో పాటు అప్‌డేట్ అవ్వాలి కదా! అందుకే స్విగ్గీ సర్వీస్ ద్వారా హోమ్ డెలివరీ కూడా చేయిస్తున్నారు. ఇవే కాకుండా కొర్రల బిర్యానీ, కొర్రల బాత్, కొర్ర పులిహోర, మినపవడలు, జొన్న సమోస, మల్టీ మిల్లెట్ రొట్టెలు, రాగులతో చేసిన మిఠాయిలు కూడా అహోబిలం రెస్టారెంట్ ప్రత్యేకతలు. 30 రకాల వంటలతో పాటు వీకెండ్స్‌లో లంచ్.. డిన్నర్‌లో బఫె ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా తృణధాన్యాలు వరుసగా మూడు నాలుగు తింటే బీపీ, డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటాయని చెప్తున్నారు హేమమాలిని.

Hotalc

ఆరోగ్య ఔషధం:

కర్నూలు జిల్లాలోని అహోబిలంలో ఉన్న పొలంలో సేంద్రీయ పద్ధతిలో చిరుధాన్యాలు పండించి హైదరాబాద్‌లో ఒక స్టోర్ పెట్టి అమ్మాలనుకున్నారు. అనుకున్నట్టే అక్కడ పండించి నేరుగా ఇక్కడికి తీసుకొచ్చి స్టోర్‌లో అమ్మడం మొదలుపెట్టారు. సామలు, వరి, రాగులు, జొన్నలు, కొర్రలు వంటి తృణ ధాన్యాలతో ఆహారాన్ని అందిస్తున్నారు.ఆ తర్వాత మాదాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్నత సాఫ్ట్‌వేర్ కంపెనీలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే కాంట్రాక్ట్ తీసుకున్నారు. మంచి స్పందన వచ్చింది. నెమ్మదిగా అహోబిలం ఆహారానికి ఆదరణ పెరుగుతూ వచ్చింది. నగరంలో ఎక్కడా దొరకని వెరైటీలు ఇక్కడ దొరకడం.. ఆరోగ్యకరమైన ఆహారం లభించడం వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. బిర్యానీ అయినా.. రాగి సంకటి అయినా.. ఉప్మా అయినా.. దోశ అయినా.. ఫ్రైడ్ రైస్ అయినా అన్నీ తృణ ధాన్యాలతోనే చేస్తున్నారు. ట్విన్ సిటీస్‌లో మిల్లెట్స్‌తో ఇన్ని రకాల వెరైటీలు ఎక్కడా దొరకవు అనొచ్చు. ఫ్యామిలీ హ్యాంగ్ అవుట్ స్పాట్‌గా చెప్పొచ్చు. ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లు కూడా చేసుకోవచ్చు. సాధారణ కస్టమర్లు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో పాటు సినీ సెలెబ్రిటీలు కూడా వస్తుంటారు. దర్శకుడు రాజమౌళి అహోబిలం రెస్టారెంట్‌ను సందర్శించి ఇక్కడి ఆహారాన్ని.. ఇంటీరియర్‌ని మెచ్చుకున్నారట.
అజహర్ షేక్ ఫొటోలు : వీరగోని రజినీకాంత్

890
Tags

More News

VIRAL NEWS

Featured Articles