ఏది నిత్యం? ఏది అనిత్యం?


Wed,January 9, 2019 01:51 AM

ఆత్మ అనేది శరీరాన్ని వదిలాక కూడా ప్రశాంతంగానే ఉంటుంది. శరీరంతో కలిసినప్పుడు అన్నీ ఆందోళనలేనని, పుట్టడం, చనిపోవడం అనేవి లేకుండా భగవంతుని సన్నిధిలో నిత్య సుఖాన్ని కోరుకోవడమే మంచిదని చిన జీయర్ స్వామి అన్నారు. కాబట్టి, ఆత్మకు శాంతి కలగాలనడం అనేది అంత యుక్తమైన ప్రార్థన కాదని ఆయన వివరించారు. ఆత్మ ఎల్లప్పుడూ శాంతితోనే ఉంటుందని స్వామి వారు అన్నారు. ధనుర్మాస వ్రతంలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. కార్యక్రమం చివరన హాజరైన భక్తులందరితో స్వామివారు మంగళహారతులు ఇప్పించారు. దీపకాంతుల నడుమ ప్రాంగణమంతా భక్తి తరంగాలతో నిండిపోయింది.
Chinnaswamy
హైదరాబాద్‌లో ధనుర్మాస మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. నందగిరి హిల్స్‌లోని మైహోమ్ గ్రూప్ అధినేత జూపల్లి రామేశ్వరరావు నివాసంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాలు అత్యంత భక్తి ప్రపత్తుల నడుమ కొనసాగుతున్నాయి. మంగళవారంతో ఈ ఉత్సవాలు 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిజీపి మహేందర్ రెడ్డితో పాటు జూపల్లి రామేశ్వరరావు, ఆయన సతీమణి శ్రీకుమారి, వారి కుటుంబసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచమంతా ఆరోగ్యదాయకంగా ఉంటేనే భగవంతునికి మంగళమని, ఆయనకు మంగళం పాడాలంటే చాలామంది కావాలని, ఎక్కువ మంది మంగళం పాడితేనే లోకమంతా ఆనందదాయకంగా ఉంటుందని చిన జీయర్ స్వామి తెలిపారు. ఈ ఆనందాన్నే లోకంలో ఉన్న జీవులు, వివిధ ప్రాణులన్నింటినీ కలిపి భగవత్ విభూతి అంటారని అన్నారు. విభూతి అంటే నిజానికి సంపద అని ఆయన అన్నారు. అందరం ఆనందంగా ఉండాలంటే దేవునికి అంతా కలిసి మంగళం పాడాలని స్వామి వారు పేర్కొన్నారు. లోకంలో ఉండేవన్నీ భగవంతుని సొత్తుగా చెబుతారని, భగవంతునికి చెందిన ఆత్మను నాది అనడం సరికాదని, ఆత్మ అనేది భగవంతుని సొత్తని చిన జీయర్ స్వామి సోదాహరణలతో వివరించారు.

కనిపించే ప్రపంచమంతా చాలా పవిత్రమైంది. విలువైంది. ఎందుకంటే, దేవుడు ఈ లోకంలో ఉన్న అన్ని వస్తువులలోనూ ఉన్నాడని, మనం ఈ జగత్తుకు మంచి జరిగితేనే, భగవంతుని దేహానికి మంచి జరుగుతుందని, ఉన్న ప్రపంచంలో మంచిగా బతికే ప్రయత్నం చేయాలని, దీనిని ఆచార్యులు మనకు నేర్పిస్తారని చిన జీయర్ స్వామి వివరించారు. ఈ ప్రపంచాన్ని సురక్షితంగా ఉంచడంలో అందరికీ బాధ్యత ఉన్నదని, ఇలా అందరూ కలిసి చేయాల్సిన పనిని చేయించే వాళ్లే ఆచార్యులని, అలా చేయడమే భగవంతునికి మంగళంగా చెబుతామని ఆయన అన్నారు. మంగళం అనేది మంత్రంతో చేస్తామని, భగవంతుణ్ణి మళ్ళీ మళ్ళీ తలుచుకుంటే అనుసంధానము అంటామని, మంత్రంలో ఉన్న అర్థాన్ని తెలుసుకోవడాన్ని అనుష్టానం అంటారని చిన జీయర్ స్వామి వారు చెప్పారు.

మనమంతా భగవంతునికి సాధనాల వంటి వారమని, ఆచార్యులు కూడా దేవుడికి విద్యార్థులేనని, మనమంతా కలిసి ఆ భగవంతునికి మంగళం పాడాలని సూచించారు. భ్రాంతికీ వాస్తవానికీ తేడా గమనించాలి. అనిత్యము అంటే ఏదీ శాశ్వతం కాదు, శాశ్వతం కానిది అంటే అసత్యం, ఏది అసత్యమో అది మిథ్య అని స్వామి వారు చెప్పారు. నిత్యం అంటే మూడు కాలాల్లోనూ అలాగే ఉండేది అని అర్థం. గడిచిన, గడుస్తున్న కాలంలోనూ, రాబోయే కాలంలోనూ మారకుండా అలాగే ఉంటే అది నిత్యం అని, ఆయా కాలాల్లో మార్పు చెందుతూ ఉన్నపుడు దానిని అనిత్యము అంటామని ఆయన చెప్పారు. ఒక పనికి ఉపయోగపడడాన్ని సత్యం అంటారు. దీనినే సంస్కృతంలో అర్థ క్రియా కారత్వం అంటారని చిన జీయర్ స్వామి చెప్పారు. ప్రతి రోజూ మనం నిద్రించే సమయంలో వచ్చే కలలన్నీంటిని అనిత్యంగా పేర్కొంటామని స్వామి వారు ఉదాహరణ పూర్వకంగా తెలిపారు.

సత్సంగంతోనే దేవుణి సన్నిధి!

Chinnaswamy1
ఒక వ్యక్తి మామూలుగా జీవిస్తే చాలదా? అంటే, భగవంతునికి భక్తుడుగా మారడం ద్వారానే అతని జన్మకు సార్థకత లభిస్తుందని చిన జీయర్ స్వామి అన్నారు. మంచి వాళ్లందరూ ఒక్కచోటకు చేరి మంచి మాటలు చెప్పుకోవడాన్నే సత్సంగం అంటాం. సత్సంగం చేయడానికి లక్ష్యమేమిటి? మనిషికి జ్ఞానం కలిగి, ఆ కలిగిన జ్ఞానం కృతజ్ఞతగా మారి భగవంతుణ్ణి గుర్తించినందువల్ల మనిషి ప్రయాణం ఆ దిశగా భక్తిమార్గంలో సాగుతుంది. ఇందుకు సత్సంగం ఉపయోగపడుతుందని స్వామి అన్నారు.

-పసుపులేటి వెంకటేశ్వరరావు
-చిన్న యాదగిరిగౌడ్

988
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles