ఈ బామ్మ.. నిరంతర విద్యార్థి!


Wed,December 5, 2018 01:24 AM

విజయం ఎప్పుడూ వెంటనే వరించదు. తనకోసం తపించేవారి మనసును పరీక్షిస్తుంది. అడ్డంకులను సృష్టించి, కష్టాల పాల్జేస్తుంది. అవకాశాలను చేజార్చుతుంది. వాటన్నింటినీ తట్టుకొని, కష్టాల కన్నీటిని అదిమిపట్టి, ఎంత కష్టమొచ్చినా ఎదురించి నిలిచిన వారికే అది దాసోహం అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే విజయం వారి బానిస అవుతుంది. అలాంటి కష్ట, నష్టాలను అనుభవించిందీమె. తన జీవన ప్రయాణంలో ఎన్నో కన్నీటి సుడిగుండాలను చిరునవ్వుతో దాటుకుంటూ విజయతీరాలకు చేరింది. ఆదర్శవంతమైన, ఆరోగ్యకరమైన రేపటి సమాజం కోసం కృషి చేస్తూ.. నిరంత విద్యార్థినిగా మారి..ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నది శైలజ విస్సంశెట్టి.
Shailaja
కూతుళ్లు, అల్లుళ్లు ఉద్యోగాలు చేస్తున్నారు. భర్త కూడా ఎస్‌బీఐ బ్యాంక్‌లో డిప్యూటీ మేనేజర్. అప్పటికే మనవళ్లు కూడా పుట్టారు. అయినా, చదువుకోవాలనే ఆశ మాత్రం చావలేదు. ఆ వయసులోనూ సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇచ్చెయ్యాలనే ఆలోచన శైలజది. అంతే.. మనవళ్లను చంకన వేసుకొని డిగ్రీ పట్టా చేతబట్టి పీజీ అడ్మిషన్ వేసింది. వాళ్లను యూనివర్సిటీకి తీసుకెళ్తూనే సైకాలజీ పూర్తి చేసింది. డాక్టరేట్ పట్టా పుచ్చుకొని తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నది. సహజ పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి, సామాజిక, సేవా కార్యక్రమాలు చేపడుతున్నది. మెరుగైన సమాజం కోసం సైకాలజిస్ట్‌గా మారి.. ఉన్నత విలువలతో కూడిన నవతరానికి బాటలు వేస్తున్నది. విద్యార్థులకు సందేశాత్మకమైన నీతి కథలు చెబుతున్నది. కిశోర బాలికల ఆరోగ్య శుభ్రతపై అవగాహన కల్పిస్తూ.. అందరి మంచి కోరే బామ్మగా పేరు తెచ్చుకున్నది.

లజ స్నేహితురాలు సంధ్య తనలాగే చిన్నవయసులోనే పెండ్లి చేసుకున్నది. చదువు కొనసాగించలేక, అత్తమామల వేధింపులు భరించలేక, తన సమస్యను ఎవ్వరికీ చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషయం తెలిసిన శైలజ ఎంతో బాధపడింది. ఆమె పేరులోని స, తన పేరులోని జ అక్షరాలను కలిపి, మనలోని సహజంగా ఉండే దానగుణాన్ని బయటికి తియ్యాలనే ఉద్దేశంతో సహజ ఫౌండేషన్‌ను ప్రారంభించింది. ఈ ఫౌండేషన్ ద్వారా పుస్తకాలు, నోట్‌బుక్స్ పంపిణీ చేస్తున్నది. ఇప్పటి వరకు 1460 మంది విద్యార్థులకు 13 వేలకు పైగా నోట్‌బుక్స్ ఉచితంగా పంపిణీ చేసింది. దీంతోపాటుగా ఎవరైనా మంచి, సందేశాత్మకమైన పుస్తకాలు ఇస్తే.. వాటిని అవసరమున్నవారికి రీ-డొనేట్ చేస్తున్నది. ఈ ఫౌండేషన్ ద్వారా బాలికా సాధికారత కోసం కృషి చేస్తున్నది శైలజ. ఫ్యామిలీ కౌన్సెలర్‌గా మారి.. పిల్లలు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నది. అన్ని సేవలూ ఉచితంగానే.

ఎన్నో అడ్డంకులను అధిగమించి..

శైలజ విస్సంశెట్టి పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో. నలుగురు సంతానంలో మొదటిది. ఆమెకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలనే పట్టుదల. అయితే 12 యేండ్ల వయసులో ఏడో తరగతి చదువుతుండగా మేన మామకు ఇచ్చి పెండ్లి చేశారు. అతనేమో తనకంటే వయసులో 12 యేండ్లు పెద్దవాడు. అంత చిన్న వయసులోనే అత్తమామలు, భర్త బాధ్యతలు భుజాన వేసుకున్నది. చిన్నపిల్లకు పెండ్లి ఎందుకు? అని ప్రశ్నించలేని కుటుంబసభ్యులు.. పైండ్లెన తర్వాత చదువు ఎందుకు? అంటూ అడ్డు చెప్పారు. పెద్దలమాటలకు విలువిచ్చే శైలజకు భర్త శ్యాంప్రసాద్ అండగా నిలిచాడు. పదో తరగతి పాసైతే చదివిపిస్తా అని శైలజకు మాటిచ్చాడు.
ShailajaAA
ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూనే కష్టపడి పదోతరగతి పాసైంది. కేవలం మూడు మార్కుల తేడాతో ఫస్ట్‌క్లాస్ మిస్సయింది. ఆమె పట్టుదలను గమనించిన భర్త.. తన చదువుకు ఇక అడ్డు చెప్పలేకపోయాడు. ఇంటర్ సీఈసీలో చేరింది. రెండో సంవత్సరం గడుస్తుండగానే పాప పుట్టింది. దీంతో చదువుకు పుల్‌స్టాప్ పడింది. కొద్దికాలానికే రెండో పాప పుట్టింది. అప్పటి నుంచి వారి పోషణ, చదువులు, ఆలనాపాలన.. ఒకదాని వెంట మరొకటి.. అన్నీ అడ్డంకులే. అయినా ఆమెకు చదువుమీద ఆశ చావలేదు. కుటుంబాన్ని, పిల్లలను భారం అనుకోలేదు. మళ్లీ పుస్తకం పట్టి ఓపెన్‌లో డిగ్రీ సోషియాలజీ చేసింది. పిల్లలు పెద్దవారు అవడంతో మళ్లీ చదువు మానేసింది. ఈ క్రమంలో ఇంట్లోనే బ్యూటీషియన్‌గా చేసింది. భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు రావడంతో ఇక్కడే స్థిరపడ్డారు. ఈ క్రమంలో పిల్లలకు పెండ్లిండ్లు చేసింది. వాళ్లకు పిల్లలు పుట్టిన తర్వాత.. మనవళ్ల ఆలనాపాలన చూస్తూనే ఓపెన్‌లో పీజీ సైకాలజీ చేసింది. వాళ్లను వెంటతీసుకెళ్తూనే క్లాసులకు హాజరైంది. అలా సైకాలజిస్ట్‌గా స్థిరపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది.

నవ సమాజ నిర్మాణం కోసం..

ఈ కాలం పిల్లలకు మంచి చెప్పేవారు లేక చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారని అంటున్నది శైలజ. అందుకే మంచి ప్రవర్తన కలిగిన రేపటి సమాజం కోసం తనవంతుగా కృషి చేస్తున్నది. ఇందుకోసం చిన్న పిల్లలకు నీతి కథలు, సందేశాత్మక కథలు అందించేందుకు మన సహజమైన కథలు పేరుతో ఓ యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించింది. దాని ద్వారా ఎంతోమంది పిల్లలకు నీతి కథలు చెబుతున్నది. పాత కథలనే నేటి తరానికి సులభంగా అర్థమయ్యేలా.. కొత్తగా చెబుతున్నది. ఈ కథలకు విశేష ఆదరణ లభిస్తున్నది. రేడియాల్లో ఆమె కథలూ ప్రసారం అవుతున్నాయి. జువైనల్ హోమ్స్‌కు వెళ్లి.. అక్కడి చిన్నారుల్లో మార్పు తెచ్చేందుకు, వారికి భవిష్యత్‌పై ఆశ కలిగించేందుకు కృషి చేస్తున్నది శైలజ. దీంతోపాటుగా ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస తరగతులు ఉచితంగా చెబుతున్నది. తాను పడిన కష్టాలు మరొకరు పడకుండా ఉండేందుకు.. తన జీవితాన్ని ఉదాహరణగా చెబుతూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపుతున్నది.

బాలికా సాధికారత కోసం..

మారిన జీవనస్థిగతులు, పనిభారం, సమయాభావం వల్ల చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లలపై తక్కువ శ్రద్ధ చూపుతున్నారు. దీంతో వారు టీనేజ్‌కు వచ్చే నాటికి అంతర్గత పరిశుభ్రతపై అవగాహన కల్పించేవారు కరువయ్యారు.ఈ క్రమంలో బాలికలకు రుతుస్రావం, దాని సమస్యలు, పరిశుభ్రత-రోగాలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నది శైలజ. ఇందుకు ఎన్నో పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థినులకు ప్రత్యేక తరగతులు తీసుకుంటున్నది. అంతేకాకుండా నేటి సమాజంలోని పరిస్థితులు, సమస్యలు, వారి హక్కుల గురించి పూర్తిగా అవగాహన కల్పిస్తున్నది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఎంతో కొంత సాయమందిస్తున్నది. ఇలా ఏదైనా సాధించాలనే తపన, పట్టుదల, నలుగురికీ సాయం చెయ్యాలనే ఆలోచనే.. శైలజను విజయతీరాలకు నడిపించాయి.


ఒక్కరికి లైఫ్ ఇచ్చినా చాలు!

నాలాగ ఎవ్వరూ కష్టపడకూడదనే ఇదంతా చేస్తున్నాను. పిల్లలకు మంచి భవిష్యత్ కోసం నాకు చేతనైనది చేస్తున్నా. నేను చేసే పనుల వల్ల ఒక్కరి జీవితం బాగుపడినా నా సేవకు పరిపూర్ణత వచ్చినట్లే. ఇప్పుడే నన్ను నన్నులా గుర్తిస్తున్నారు. నా ప్రయాణంలో నా కుటుంబసభ్యుల సహకారం మర్చిపోలేనది. మా ఫౌండేషన్ ద్వారా పిల్లలకు ఏదైనా సహాయం చెయ్యాలనుకుంటే www.sahajafoundation.org లేదా 9908300051 నెంబర్‌ను సంప్రదించవచ్చు.
- డాక్టర్ శైలజ, సహజ ఫౌండేషన్ స్థాపకురాలు

తన పట్టుదలకు హ్యాట్సాఫ్!

శైలజను నా చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాను. బిడ్డగా, భార్యగా, తల్లిగా.. ఇప్పుడు సమాజ సేవకురాలిగా తన పాత్ర ఎనలేనిది. అమ్మమ్మ అంటూ పిలిపించుకుంటూనే పీజీ చేసింది. అంతటి పట్టుదల కలిగిన మనిషి తను. అందుకే తన నూతన జీతానికి అడ్డు చెప్పలేకపోయాను. అప్పుడు చదువెందుకు అన్నవారితోనే శెభాష్ అనిపించుకుంటున్నది. అదే మాకు గర్వకారణం. తాను చేస్తున్న కార్యక్రమాల్లో నాకు చేతనైన సాయం చేస్తున్నా.
- శ్యాంసుందర్, శైలజ భర్త, ఎస్‌బీఐ రిటైర్డ్ డిప్యూటీ మేనేజర్
-డప్పు రవి గడసంతల శ్రీనివాస్

788
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles