తీవ్ర ఆస్తమాకు ఏ చికిత్స అవసరం?


Tue,October 9, 2018 11:51 PM

మా నాన్న వయసు 48 సంవత్సరాలు. ఆయనకు అస్తమా ఉంది. డాక్టర్ సలహామేరకు మందులు వాడుతున్నప్పటికీ తగ్గడం లేదు. పైగా తీవ్రమవుతూ ఉంది. హాస్పిటల్‌లో చేర్పించినా, అన్ని రకాల మందులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం ఉండడం లేదు. పెద్దాసుపత్రుల్లో చూపించమని, ఆస్తమాకు అధునాతన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని తెలిసిన డాక్టర్ సలహా ఇచ్చారు. ఈ తీవ్రమైన ఆస్తమా వ్యాధి నివారణకు ఉన్న ఆధునిక చికిత్సలేంటి? ఏ సౌకర్యం లభిస్తుంది తెలియజేయగలరు.
-మంజుల, వికారాబాద్.
Councelling
తీవ్రమైన ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బ్రాంకియల్ థర్మోప్లాస్టీ, బయోలాజిక్ మెడిసిన్స్ అనే ఆధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వైద్యుల సూచనలు పాటిస్తే వ్యాధి తగ్గి మామూలుగా ఉండొచ్చు. బ్రాంకియల్ థర్మోప్లాసీ ప్రక్రియలో ఒక ప్రత్యేక పరికరాన్ని ఉపయోగించి శ్వాసనాళపు గోడలను వేడిచేస్తారు. బ్రాంకోస్కోప్ ద్వారా వెళ్లే ఈ ప్రోబ్ అందించిన వేడిమితో శ్వాసమార్గంలో చేరిన అదనపు మ్యూకస్ తొలిగిపోతుంది. దాంతో శ్వాసమార్గం విశాలంగా తెరుచుకుంటుంది. మూడు వారాల చొప్పున మూడు దఫాల చికిత్సా ప్రక్రియ పూర్తయ్యే సరికి తీవ్రమైన అస్తమా వ్యాధి లక్షణాలు బాగా తగ్గిపోతాయి. ఆశించిన స్థాయిలో ఉపశమనం లభిస్తుంది. అదే సమయంలో ఆస్తమా అటాక్స్ సంఖ్య, అకారణంగా ఆసుపత్రిలో చేరాల్సి రావడం తగ్గిపోతుంది. ఈ చికిత్సా ప్రక్రియ ఫలితం చాలాకాలం పాటు (కనీసం ఎనిమిది సంవత్సరాలు) నిలిచి ఉంటుంది.

పద్దెనిమిది సంవత్సరాలు నిండిన, ఇన్‌హేలర్ మందుల వల్ల ప్రయోజనం లభించదని అస్తమా వ్యాధిగ్రస్తులకు దీనిని సిఫార్సు చేస్తున్నారు. ఇక బయోలాజిక్ మెడిసిన్స్ విషయానికొస్తే తీవ్రమైన అస్తమా చికిత్సకు సంబంధించి అత్యాధునిక ఔషధాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి శ్వాసనాళాల వాపును అదుపుచేస్తాయి. మనదేశంలో మాత్రం ప్రస్తుతం ఒమాలిజుమాబ్ అనే మందు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ మందును అస్తమా రోగులందరికీ సిఫార్సు చేయలేం. తీవ్రమైన ఆస్తమా ఉండి, వారి రక్తంలో ఎల్జీఈ అనే అణువులు ఎక్కువగా ఉంటేనే దీనిని వాడడానికి వీలుంటుంది. ప్రతీ రెండు నుంచి నాలుగు వారాలకు ఒకసారి చొప్పున సబ్ క్యుటెనియస్ (చర్మదిగువన) ఇంజెక్షన్ రూపంలో దీనిని ఇస్తారు. దాదాపు 70% తీవ్రమైన అస్తమా వ్యాధిగ్రస్థులు దీనివల్ల ప్రయోజనం పొందగలుగుతున్నారు. మందు వాడిన తరువాత మూడు నుంచి నాలుగు నెలల్లో ఫలితాలు కనిపిస్తాయి. ఒకటి రెండు సంవత్సరాల్లోగా అస్తమా సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. స్టెరాయిడ్స్ వలె ఈ మందులవల్ల దుష్ఫలితాలు ఏవీ పెద్దగా ఉండవు. రానున్న రోజుల్లో ఒమాలిజుమాబ్ తోపాటు మరిన్ని బయోలాజికల్ మెడిసిన్స్ మనదేశంలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల తీవ్రమైన ఆస్తమా వ్యాధిగ్రస్థులకు మరింత ఉపశమనం ఇవ్వగల మందులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

1122
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles